Thursday, November 21, 2024

కపిల మునిపై సగరుల దాడి

రామాయణమ్ 9

ఒక్కసారిగా తన కూతుళ్ళందరకూ వికృత రూపం ప్రాప్తించినా కుశనాభుడు ఆందోళన చెందకుండా వారి వివాహం గూర్చి మంత్రులతో ఆలోచన చేశాడు.

గొప్ప తపఃసంపన్నుడైన చూళికి సోమద అనే గంధర్వస్త్రీయందు జన్మించిన బ్రహ్మదత్తుడు తగిన వరుడు అని నిశ్చయించి వారిని ఆయనకిచ్చి పాణిగ్రహణము జరిపించాడు !

ఆయన కరస్పర్శ అందరు యువతుల వికృతరూపాన్ని పోగొట్టి తిరిగి నవయవ్వనసౌందర్యాన్ని ప్రసాదించింది!

Also read: మారీచ, సుబాహుల సంహారం

కన్యాదానము చేసిన పిమ్మట కుశనాభుడు పుత్రకామేష్టి చేశాడు. అప్పుడు కుశుడు, కుశనాభునితో, ‘‘పుత్రా నీకు తగినవాడు, ధార్మికుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు’’ అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అంత కుశనాభునకు గాధి అనే పేరుగల కుమారుడు జన్మించాడు! ఆ గాధి యే మా నాయనగారు అని పలికి, ‘‘రామా   ఇప్పటికే అర్థరాత్రి అయినది. చెట్లు అన్నీ కూడ నిశ్చలంగా ఉన్నాయి. పక్షుల కదలిక ఏమాత్రమూ లేదు. మింటచుక్కలు మెరుస్తున్నాయి! చంద్రుడు పూర్తిగా ఆకాశంలోకి వచ్చి చల్లని కాంతితో ప్రాణులను ఆనందింప చేస్తున్నాడు, రామా ఇక నిదురపోవయ్యా!’’ అని పలికి మహర్షి తానుకూడా విశ్రమించాడు!

తెలతెలవారింది సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని మరల నడక సాగించారు! అలా నడచి,నడచి గంగా తీరాన్ని చేరారు అందరూ! ఆ గంగా నది శాంతగంభీరంగా ప్రవహిస్తున్నది, పుణ్యజలాలతో, హంస, సారస పక్షులతో  మనస్సుకు ఆహ్లాదాన్ని జనింపచేసే ఆ నదిని చూసి రాముడు ఆశ్చర్యంతో మునిని ప్రశ్నించాడు, ‘‘గంగ మూడులోకాలను ఎట్లా ఆక్రమించింది? సముద్రంలో ఎలా ప్రవేశించింది? తెలుసుకొనగోరుతున్నాను స్వామీ’’ అని అడిగాడు!

Also read: తాటకి వధ

‘‘గంగ భూమిమీదకు ఎలా అవతరించింది మహర్షీ!’’ అంటూ చాలా ఉత్సుకతతో ప్రశ్నించాడు రాముడు.

‘రామా, చెపుతాను విను’ అంటూ మొదలు పెట్టారు విశ్వామిత్ర మహర్షి!

‘‘హిమవంతుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కొమరిత గంగ, రెండవ ఆవిడ ఉమ.

పెద్ద కూతురు గంగను  దేవతల కోరిక మీద ఆయన వారికి ఇచ్చివేయగా ఆవిడ దేవలోకం వెళ్లి పోయింది! రెండవకూతురు ఉమ శంకరుని ఇల్లాలయింది.

పూర్వం అయోధ్య ను సగరుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు! ఆతడు మీ ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాజు. ఆయన కు ఇద్దరు భార్యలు. పెద్దభార్యపేరు కేశిని,రెండవ భార్య సుమతి! సంతానార్ధియై సగరుడు భార్యలతో కూడి భృగుప్రస్రవణము అనే పర్వతం మీద ఘోరతపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై నీకు ఒక భార్యయందు వంశమును నిలిపే ఒక కుమారుడు,ఇంకొక భార్యయందు మహాబలవంతులైన అరువది వేల మంది  పుత్రులు కలుగుతారు అని దీవిస్తాడు.

Also read: విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు

‘‘అప్పుడు సగరుని పెద్దభార్య కేశిని తనకు ఒక్క కుమారుడు చాలు అనగా ఆవిడ యందు అసమంజుడు అనే మహాబలశాలి యైన పుత్రుడు జన్మించాడు. చిన్న భార్య  సుమతి యందు అరవైవేలమంది సగరులు జన్మించారు. అసమంజుడు పేరుకు తగ్గట్టుగా అసమంజసమైన, వికృతమైన చేష్టలకు పెట్టింది పేరు. అతను పసి పిల్లలను పట్టుకొని సరయూ నదిలో ముంచి వారు మునకలేస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందేవాడు!  ఈ దుశ్చర్యలు భరించలేక దేశ ప్రజలు సగరుడి వద్ద మొర పెట్టుకొన్నారు. కొడుకు అనే పక్షపాతము కూడా లేకుండా అసమంజుడికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు సగరుడు.

‘‘అయితే అప్పటికే అసమంజుడికి అంశుమంతుడు అనే వీరాధివీరుడు, బుద్ధిమంతుడు అయిన పుత్రుడు ఉన్నాడు!  ఆలుబిడ్డలను వదిలిపెట్టి కట్టుబట్టలతో దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు అసమంజుడు. ఇలా చాలా కాలం గడచిన తరువాత సగరుడికి అశ్వమేధయాగము చేయాలనే కోరిక పుట్టింది! యాగాశ్వమును స్వేచ్ఛగా వదిలాడు. దానిని దుర్బుద్ధియై ఇంద్రుడు అపహరించి పాతాళంలో కపిలముని ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు.

Also read: యాగరక్షణకు రాముని తనతో అడవులకు పంపమని దశరథుడిని కోరిన విశ్వామిత్రుడు

‘‘యాగాశ్వాన్ని వెతుక్కుంటూ అరవై వేలమంది సగరులూ బయలుదేరారు భూమి నాలుగు చెరగులా వెతికారు. అణువణువూ శోధించారు. ఎక్కడా వారికి అశ్వము జాడ కనపడలేదు. ఇక లాభంలేదు అని భూమిని అన్నివైపుల నుండి బద్దలు కొట్టి పాతాళానికి పయనమయ్యారు. పాతాళలోకంలో ఒక చోట కపిల ముని ఆశ్రమంలో గడ్డిమేస్తూ కనపడ్డది ఆ అశ్వము.

‘‘కపిలముని అపహరించాడనే అపోహతో ఆయన మీదకు వారంతా యుద్ధానికి వెళ్ళగా ఆయన ఆగ్రహజ్వాలలో మాడి మసి అయి బూడిద కుప్పలుగా మారారు సగరులు. పుత్రులు ఎంతకీ రాక పోయేసరికి చింత పట్టుకున్నది సగరుడికి. మనుమడు అంశుమంతుని వారి జాడ కనుగొనమని పంపాడు’’ అని వివరించాడు విశ్వామిత్ర మహర్షి.

Also read: శ్రీరామ జననం

.

N.B

..

  1. పాణి గ్రహణము అంటే చేతిని స్పర్శించటం! స్పర్శ కలుగజేసే స్పందనలు అనేకము! స్త్రీ, పురుష విచక్షణ లేకుండా ఎంత మందితో పాణిగ్రహణం చేస్తున్నాం మనం ! మనం గొప్పగా చెప్పుకొనే సంస్కృతి ఉన్నట్లా గంగలో కలిసినట్లా?.
  •  శిక్షలు విధించడంలో ఇక్ష్వాకులు స్వ, పర భేదాలు పాటించరు!

న్యాయం అందరికీ ఒకటే! సగరుడయినా, రాముడయినా అదే ధర్మం పాటించారు, అందుకే చిరకాలం భూమి మీద యశఃకాయులైనారు. మన ఇప్పటి తరాలకు ఈ కధలు అందించే నైతిక బలం అపారం ! ఇలాంటి కధలు విస్త్రుతంగా ప్రచారం చేద్దాం.

Also read: దశరధ కుమారుడిగా అవతరిస్తానని దేవతలకు హామీ ఇచ్చిన విష్ణు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles