Sunday, November 24, 2024

బీహార్ మోదీ కొంప ముంచుతుందా?

రెండువేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో బీజేపీ విజయం సాధింస్తుందని ఘంటాపథంగా చెప్పలేము. బిహార్ లో జరిగిన తిరుగుబాటు (కూ) బారత రాజకీయ క్షేత్రాన్ని మార్చివేసింది. భారతీయ ఎన్నికల రంగాన్ని మూడు భాగాలుగా ఊహించుకుంటే ఒకే ఒక భాగంలో బీజేపీ అధిక్యం కనిపిస్తుంది. ఎన్ డీఏ అన్నది నామమాత్రం కావడంతో బీజేపీకి 2024లో ఎన్నికలు పెనుసవాలు కాబోతున్నాయి.

బిహార్ ఒక మెరుపు, ఒక ఝలక్

నా గాంధేయ సామ్యవాద సిద్ధాంత సహచరుడు దలీప్ సింగ్ బిహార్ ల్ నితీశ్ కుమార్ బీజేపీని వదిలిపెట్టి రాష్ట్రీయ జనతా దళ్ తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారనే కబురు వినగానే ‘బిహీర్ చరిత్రే భారత చరిత్ర’ అంటూ వ్యాఖ్యానించాడు. తన ఊహాగానాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ ఆయన అన్నారు, ‘‘బుద్ధుడి కాలం నుంచి కూడా దేశంలో ప్రతి అసాధారణమైన ప్రకంపన బిహార్ లోనే ప్రారంభమైంది. ఈ రోజు నితీశ్ కుమార్ మొదలుపెట్టిన ప్రళయం మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతుంది.’’ ఆయనతో పేచీ పెట్టుకోదలుచుకోలేదు. ఈ రోజుల్లో లౌకికవాద శిబిరంలో  ఆశాభావం తక్కువ మోతాదులో ఉంది. పైగా కందిరీగ వంటి మా కామ్రేడ్ తన సిద్ధాంతీకరణలను ఇతరులు విశ్వసించాలని ఆశించడు. ఇతరులలో ఆలోచన రేకిత్తించడమే ఆయన ఉద్దేశం. అందులో మాత్రం విజయం సాధించాడు.

నిజంగానే బిహార్ పరిణామం జాతీయ రాజకీయ క్షేత్రాన్ని మార్చివేసింది. 2024లో కూడా బీజేపీ గెలుస్తుందని అందరూ నమ్ముతున్న సమయంలో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏకపక్షంగా జరిగిన తీరు చూసి  ప్రతిపక్షాలు డీలా పడిపోయిన సందర్భంలో బిహార్ తిరుగుబాటు రాజకీయ క్రీడలో అందరికీ అవకాశం ఉన్నదని చాటి చెప్పింది. 1970లలో బిహార్ ఉద్యమం దేశానికి మార్గదర్శనం చేసింది. నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 1977లో ఎన్నికల విప్లవానికి దారి తీసింది. 1990 దశకంలో భారత రాజకీయలలో మండల శకానికి బిహార్ అంకురార్పణ చేసినట్టే మరోసారి బిహార్ దేశానికి దారి చూపుతున్నట్టు కనిపిస్తోంది. బిహార్ ఉద్యమంలో నినాదం ఏమిటి? ‘అంధకార్ మే ఏక్ ప్రకాశ్ – జయప్రకాశ్, జయప్రకాశ్.’ వజ్రోత్సవ సందర్భంలో భారత రిపబ్లిక్ ను ఆవరించిన నల్లటి మేఘాలలో వెండి మెరుపులాగా బిహార్ అవతరించింది.

ఒకానొక రాష్ట్రంలో ఒక పార్టీ ఒక మిత్రపక్షాన్ని వదిలి మరో పక్షానికి చేరువై ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని అవసరానికి మించి ఎక్కువగా ఊహించుకుంటున్నానా? నా మానసిక స్థితిలోకి నన్ను జారుకోనివ్వండి. కొన్నిమౌలికమైన లెక్కలు చేయనివ్వండి.

బీజేపీకి 2024 మొదటి నుంచి కష్టభూయిష్టమైనదే

భారత ఎన్నికల రంగాన్ని మూడు ముక్కలుగా చేసి పరిశీలిద్దాం. మొదటిది పశ్చిమబెంగాల్ నుంచి కేరళ వరకూ ఉన్న కోస్తాతీరం. పంజాబ్, కశ్మీర్ ను కూడా దానికి కలిపితే బీజేపీ పెద్ద శక్తిమంతమైన పార్టీగా లేని ప్రాంతం గోచరిస్తుంది. ఈ ప్రాంతంలో 190 స్థానాలు ఉన్నాయి. పోయినసారి ఈ ప్రాంతంలో బీజేపీ గెలుచుకున్నది 36 స్థానాలే (మిత్రపక్షాలను కలిపితే 42 స్థానాలు). వీటిలో 18 బెంగాల్ నుంచి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల పరాభవం అనంతరం పశ్చిమ బెంగాల్ వాటిలో అయిదు స్థానాలు నిలబెట్టుకోవాలన్నా బీజేపీ ప్రయాసపడవలసిందే. ఒడిశాలో కొన్ని సీట్లు కోల్పోతే ఆ మేరకు తెలంగాణలో పెరగవచ్చు. చివరికి ఈ ప్రాంతంలో బీజేపీకి 25 స్థానాలకు మించి రావు. మిగిలిన 353 స్థానాలలో 250 స్థానాలను బీజేపీ గెలుచుకోవలసి ఉంటుంది. అది చాలా కష్టసాద్యమైన పని అని మీరు అంగీకరిస్తారనుకుంటా.

తనకు ఆధిక్యం ఉన్న ప్రాంతం నుంచే బీజేపీ అత్యధిక స్థానాలు లభించాయి. అది వాయవ్య ప్రాంతమైన హిందీ రాష్ట్రాలున్న ప్రాంతం ఇది. దీనిలో నుంచి బిహార్, జార్ఖండ్ లను మినహాయించాలి. గుజరాత్ ను కలపాలి. తన ప్రధాన ప్రత్యర్థి (అత్యధికంగా కాంగ్రెస్, ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ)పై నువ్వా-నేనా అన్నట్టు జరిగిన పోటీలో బీజేపీ ఈ ప్రాంతాన్ని తుడిచిపెట్టింది. 2014లోనూ, 2019లోనూ ఇదే జరిగింది. పోయినసారి (2019లో) మూడు చిన్న మిత్రపక్షాలతో కలసి మొత్తం 182 స్థానాలు గెలుచుకున్నది. మొత్తం ఉన్న స్థానాలు 203.ఈ ప్రాంతంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందనే ఉదారంగా అంచనావేద్దాం. హరియాణా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి నిర్ణాయకమైన రాష్ట్రాలలో స్వల్పనష్టాలు సంభవించవచ్చునని అనుకుందాం. కాంగ్రెస్ కొద్దిగా కోలుకున్నా ఈ అంచనా తప్పవుతుంది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో బీజేపీ 150 స్థానాలు గెలుచుకుంటుందని అనుకుందాం.

నడిమిలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్ (వీటికి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ లను కలుపుదాం) రాష్ట్రాలలో 150 స్థానాలు ఉన్నాయి. వీటిలో 100 స్థానాలను బీజేపీ గెలుచుకుంటేనే గట్టెక్కుతుంది. ఈ ప్రాంతంలో ప్రతిపక్షం అనైక్యంగా ఉంది. 2019లో ఈ ప్రాంతంలో బీజేపీ 130 స్థానాలు గెలుచుకున్నది. వీటిలో 88 స్థానాలు సొంతంగా కైవసం చేసుకున్నది. ఇక్కడే మిత్రపక్షాలు బీజేపీకి ఉపకారం చేశాయి. శివసేన 18 స్థానాలు గెలుచుకున్నది. జనతాదళ్ (యునైటెడ్ ), లోక్ జనశక్తి (రాంవిలాస్ పశ్వాన్ పార్టీ) వరుసగా 16, 6 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ సారికి ఈ ప్రాంతం బీజేపీకి బలహీనమైన ప్రదేశం అవుతుందని ఇప్పటికే తెలుస్తోంది. కర్ణాటక చేయిజారి పోవడంతో ఇదివరకటిలాగా బీజేపీ మొత్తం 28 స్థానాలలో 23 స్థానాలను గెలుచుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) ఒక అవగాహనకు వస్తే (నితీశ్ కుమార్ తిరుగుబాటును దేవెగౌడ్ స్వాగతించడం గాలిలో కొట్టుకొని వచ్చిన ఒక పరక కావచ్చు) బీజేపీ గెలిచే స్థానాలు పోయినసారి గెలుచుకున్నవాటిలో సగానికి సగం తగ్గవచ్చు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోవడంతో మహా వికాస్ అగథి 2024 ఎన్నికల నాటికి ఒక బలమైన కూటమిగా పటిష్ఠమైంది. 2019లో బీజేపీ-శివసేన సాధించిన విజయాన్ని (మొత్తం 48 స్థానాలలో 41 స్థానాలు గెలుచుకున్నది) 2024లో బీజేపీ-షిండే వర్గం కలిసి సాధించే అవకాశం బొత్తిగా లేదు. బీజేపీ అస్సాంలోనూ, ఇతర పర్వత ప్రాంతాలలోనూ 2019లో సాధించిన స్థాయిలోనే విజయాలు సాధిస్తుందని అనుకున్నా కనీసం పది సీట్లు తక్కువ పడుతున్నాయి. మిత్రపక్షాల స్థానాలను కూడా కలుపుకుంటే 25 స్థానాల దాకా తక్కువ అవుతాయి.

బిహార్ వ్యత్యాసం నిర్ణాయకం

ఇంతవరకూ మనం లోక్ సభలోని 503 స్థానాల లెక్కలు తీశాం. వాస్తవానికి దగ్గరలో ఉన్న ఇదే రకమైన అంచాలను కొనసాగిస్తే, ఈ స్థానాలలో బీజేపీ 235 కంటే ఎక్కువ గెలుచుకోజాలదు. ఇప్పుడున్న స్థాయిలోనే ఆధిక్యం కొనసాగినా సరే అంతకు మించిన సీట్లు రావు.

అందుకే బిహార్ ప్రధానం అవుతుంది. బిహార్ లోని మొత్తం 40 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంటే కానీ సామన్య ఆధిక్యం (సింపుల్ మెజారిటీ) సాధించలేదు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 40లో 37 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. నితీశ్ కుమార్ తోనూ, స్వర్గీయ రాంవిలాస్ పశ్వాన్ తోనూ కూటమి ఉండటం వల్ల పోయినసారి మిత్రపక్షాలతో కలసి దాదాపుగా అన్ని స్థానాలను గెలుచుకోగలిగింది. 17 బీజేపీకి, 16 జేడీ(యూ)కి, 6 ఎల్ జేపీకి వచ్చాయి. పోయినసారి మొత్తం 40 స్థానాలలో నేషనల్ డెమాక్రాటిక్ అలయెన్స్ ఒక్కటి మినహా తక్కిన అన్ని స్థానాలనూ (39) కైవసం చేసుకున్నది. దీన్ని పునరావృత్తం చేయడం చాలా కష్టం. నితీశ్ కుమార్ కూటమిని మార్చడంతో అది అసాధ్యంగా పరిణమించింది. బీజేపీ అన్ని సీట్లనూ గెలుచుకోవడం అటుంచి ప్రతికూల వాతావరణంలో అత్యంత బలహీనంగా దిగజారే అవకాశం లేకపోలేదు. ఆర్జేడీ-జేడీ(యూ) కూటమి వామపక్షాలతో, కాంగ్రెస్ తో కలసి ప్రభంజనం సృష్టించినా ఆశ్చర్యం లేదు.

బిహార్ ఎన్నికల చిత్రం

బిహార్ ఎన్నికల చిత్రాన్ని, లెక్కల్ని మరింత జాగ్రత్తగా పరిశీలిద్దాం. నితీశ్-తేజశ్వి కూటమి లోక్ సభ ఎన్నికల వరకూ కొనసాగే పక్షంలో, పోటీ మహాఘట్ బంధన్ కూ, ఎన్ డీఏకీ (బీజేపీ+ఎల్ జేపీ)కీ మధ్యనే ఉంటుంది. ప్రతి పార్టీ ఎన్నికల శక్తిని తెలుసుకోవాలంటే గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను, ముఖ్యంగా 2015 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే సరిపోతుంది. అత్యధిక ఓట్లు సంపాదించుకునే పార్టీగా బీజేపీ ముందుకు వచ్చింది. దానికి అసెంబ్లీ ఎన్నికలలో 20 శాతం ఓట్లూ, లోక్ సభ ఎన్నికలలో  25 ఓట్లూ వస్తాయి. ఆర్జేడీ ఓట్ల శాతం గడచిన అసెంబ్లీ ఎన్నికలలో అయితే 23 శాతం. పార్లమెంటరీ ఎన్నికలలో కొద్దిగా తగ్గినాయి. రెండు ఎన్నికలలోనూ జేడీ(యూ) ఓట్లు 15 శాతం ఉంటాయి. తక్కిన పార్టీలకు తక్కువ శాతం ఓట్లు ఉంటాయి. కాంగ్రెస్ కు 7-9 శాతం, వామపక్షాలకు 4-5 శాతం (ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ఇండియా – మార్క్సిస్ట్-లెనినిస్ట్) కాగా ఎల్ జేపీకి ఆరు శాతం ఓట్లు పడతాయి.

కనుక ఉజ్జాయింపుగా లెక్కిస్తే, మహాఘట్ బంధన్ కు సుమారు 45 శాతం ఓట్లు వస్తాయి. ఎన్ డీఏకి 35 శాతం మాత్రమే దక్కుతాయి (బీజేపీ మళ్ళీ ఎన్ జేపీతోనూ, మరికొన్ని చిన్నాచితకా పార్టీలతోనూ చేతులు కలిపి కూటమిలో చేర్చుకుంటుందని అనుకుంటే). ఈ రెండు కూటముల సామాజిక గుంపులను పరిశీలిస్తే అగ్డా కూ, పిచ్ఛడాకూ (అగ్రవర్ణాలకూ, వెనకబడినవర్గాలకూ) మధ్య పోటీ అవుతుంది. దీని ఫలితం బిహార్ లో ఒకే విధంగా ఉంటుంది. వెనుబడినవర్గాలు కలిగిన కూటమికి అత్యధిక స్థానాలు లభిస్తాయి. అప్పుడు బీజేపీకి పూర్తిగా ప్రతికూల ఫలితం వస్తుంది. గత లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ప్రత్యర్థులు ఉనికి కోసం పోరాడితే రాబోయే ఎన్నికలలో బీజేపీ ఒక చేతి వేళ్ళమీద లెక్కించే స్థానాలు సంపాదించేందుకు శక్తివంచన లేకుండా పోరాడవలసి వస్తుంది.

బీజేపీ ఎదుట అత్యంత కష్టమైన సవాలు

ఒక సారి వెనక్కి వెళ్ళి నడిమిలో ఉన్న 150 స్థానాలను గురించి పరిశీలిద్దాం. బీహార్ లో బీజేపీకీ, మిత్రపక్షాలకూ కలిపి 5 లేదా 10 సీట్లకే పరిమితమైనాయని అంచనావేస్తే, ఆ ప్రాంతంలో బీజేపీ గెలుచుకునే స్థానాల సంఖ్య పోయిన సారి గెలిచిన 88 స్థానాల నుంచి 65 స్థానాలకు తగ్గుతుంది (ఇంకా నాటకీయంగా చెప్పాలంటే, బీజేపీకీ, మిత్రపక్షాలకు గతంలో వచ్చిన 130 స్థానాల నుంచి ఈ సారి 75 స్థానాలకు తగ్గవచ్చు).

ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయి చిత్రాన్ని పరిశీలిద్దాం. ఏదో కవరు వెనక వేస్తున్న ఈ లెక్కలు అర్థవంతమైనవి అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి వచ్చే స్థానాల సంఖ్య 240కి మించడం అనూహ్యం. అది మెజారిటీకి అవసరమైన 272 స్థానాల స్థాయి కంటే బాగా తక్కువ. బిహార్ లో 30 స్థానాలు పోగొట్టుకోవడం వల్ల సంభవించే తేడా ఇది.

లోటును మిత్రపక్షాలు భర్తీ చేయగలవా?

ఎన్ డీఏ మిత్రపక్షాలు ఈ లోటును తీర్చగలవా? నిజానికి ఇప్పుడు పేరు తప్ప ఎన్ డీఏ అన్నది లేనే లేదు. అకాళీలు వెళ్ళిపోయారు. శివసేనను చీల్చి ఒక భాగాన్ని కాజేశారు. జేడీ(యూ) ఇప్పుడు నిష్క్రమించింది. ఈశాన్యంలో కొన్ని చిన్న పార్టీలూ, మిత్రపక్షాలలో మిగిలిన చీలికలూ, పేలికలూ మినహా ఎన్ డీఏ అంటూ ఏమీ మిగలలేదు. ఇవన్నీ కలిపితే  పది, పదిహేను స్థానాలు గెలుచుకోవచ్చు. కానీ మెజారిటీకి అవసరమైన స్థాయికి ఉన్న లోటును పూడ్చలేవు. మిత్రపక్షాలను స్వాహా చేసే బీజేపీ విధానం ఇప్పుడు బెడిసి కొడుతుంది.

ఈ లెక్కలు విన్న తర్వాత ‘నేను మొదటే చెప్పాను’ కదా అన్నట్టు మా కామ్రేడ్ నవ్వుతున్నాడు. నేను ఒక వివరణ తప్పని సరిగా ఇవ్వాలి. ‘‘ఎన్నికలకు 21 మాసాల ముందు జాతకాలు చెప్పడం లేదు. అది బుద్ధిలేనిపని అవుతుంది. బిహార్ లో సంభవించిన మార్పు జాతీయ సమతౌల్యాన్ని ఎట్లా దెబ్బతీస్తుందో చూశాం. బీజేపీ తన మెజారిటీని నిలబెట్టుకోవాలంటే మరో ‘బాల్ కోట్’ వంటి సంఘటన సంభవిస్తే తప్ప సాధ్యం కాదు. లేదా ప్రతిపక్షం అనైక్యత కొనసాగించి లేదా మరింత పెంచి విజయాన్ని అప్పనంగా బీజేపీకి అందిస్తే తప్ప బీజేపీకి విజయావకాశాలు కనిపించడం లేదు.

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles