అల్ జవహరి, బిన్ లాడెన్
- కాబూల్ లో అమెరికా డ్రోన్ దాడి
- ఇంటిపై బాంబుపడి అల్ – జవహరీ ఒక్కరే హతం
- అల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ ను సంహరించిన పదేళ్ళకు జవహరీ
- ఘనకార్యం సాధించినట్టు సంతోషిస్తున్న అమెరికా
- ప్రెసిడెంట్ జో బైడెన్ కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందనలు
ఉగ్రవాద ప్రపంచంలో సంచలన సంఘటన జరిగింది.అల్ ఖైదా అధిపతి అల్ -జవహరీని అమెరికా అంతం చేసింది. ఇదొక కీలక పరిణామం. అమెరికాకు చెందిన మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆ తర్వాత కొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. కాబూల్ లోని షేర్పూర్ ప్రాంతంలోని ఒక నివాసంపై వైమానిక దాడి జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. దీనిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఖండన ప్రకటన చేశారు. 2001 సెప్టెంబర్ 11 వ తేదీన అమెరికాపై అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో 3వేలమంది మరణించిన సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ దాడికి కుట్రపన్నిన ముఖ్యులలో అల్ -జవహరీ ఒకరని అమెరికా ఆనాడే గుర్తించింది. అప్పటి నుంచి ‘మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్’ జాబితాలో జవహరీ ఉన్నాడు. ఎన్నో ఏళ్ళుగా పరారీలో ఉన్నాడు. ఆ ఘాతకం జరిగిన పదేళ్ల తర్వాత అల్ ఖైదా అగ్రాసనాధిపతి ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా మట్టుపెట్టింది. ఈ నేపథ్యంలో, లాడెన్ పగ్గాలను జవహరీ అందుకున్నాడు.
Also read: పింగళిది ‘పతాక’స్థాయి
అతడి తల వెల 25 మిలియన్ డాలర్లు
జవహరీపై 25మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ఆనాడే ప్రకటించింది. ఎట్టకేలకు దాడి జరిగిన 20ఏళ్ళ తర్వాత, బిన్ లాడెన్ ను అంతమొందించిన పదేళ్ల తర్వాత అల్ ఖైదాకు చెందిన అగ్రనాయకుడు జవహరీని అమెరికా హతం చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలో దీనిని గొప్ప ఘట్టంగా అమెరికా భావిస్తోంది. దీనిని ప్రతీకార చర్యలో పతాకశ్రేణిలో ఒకటిగా అభివర్ణించుకుంటోంది. ఎటువంటి యుద్ధం లేకుండా, ఒక్క పౌరుడి ప్రాణం పోకుండా జవహరీ వంటి అగ్రస్థాయి ఉగ్రనేతను అంతమొందించిన తీరుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అందునా అఫ్ఘానిస్థాన్ లో ఈ ఆపరేషన్ విజయవంతంగా జరగడం పట్ల జోబైడెన్ ప్రభుత్వంపై అనేక దిక్కుల నుంచి హర్షం వర్షిస్తోంది. అఫ్ఘాన్ రాజధాని కాబూల్ లో అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఇందులో జవహరీ హతుడయ్యాడు. అఫ్ఘానిస్థాన్ వేదికగా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనివ్వబోమని, ఆ దేశాన్ని ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మారే వాతావరణాన్ని ప్రతిక్షణం అడ్డుకొని తీరుతామన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. ఉగ్రవాదులెవరూ మిగలకుండా కచ్చితంగా ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. నిజంగా అలా జరిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? రష్యా వ్యతిరేక వాతావరణంలో, పాకిస్థాన్ ద్వారా తాలిబన్ ను ఒకప్పుడు పెంచి పోషించినది అమెరికాయేనని ప్రపంచ దేశాలకు తెలుసు. అల్ ఖైదా అగ్రనేత బిన్ లాడెన్ ను అంతమొందించడంలోనూ పాకిస్థాన్ హస్తాన్ని అమెరికా పూర్తిగా వాడుకున్నదని లోకానికి ఎరుకే. నేడు అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ రాజ్యం మళ్ళీ రావడానికి ప్రధాన దోహదకారి అమెరికాయేనని అంతర్జాతీయ సమాజంలో వినపడుతూనే ఉంది. అల్ ఖైదాపై ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సంపూర్ణమైపోయిందని చెబుతూ అక్కడ తమ సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకుంది. దీనితో తాలిబన్ రాజ్యస్థాపనకు మార్గం సుగమమైంది. నేడు అఫ్ఘాన్ కేంద్రంగా తాలిబన్ రెట్టింపు బలగర్వంతో ఏలుబడిలో ఉంది. పాకిస్థాన్ వంటి దేశాలతో స్నేహబంధం బలంగా కొనసాగుతూ ఉంది. చైనాతోనూ చెలిమి నెలకొనే ఉంది. రష్యాతోనూ కరచాలనం చేస్తోంది. ఈ తరహా తాలిబాన్ వైఖరులు ఏదో ఒకరోజు మిగిలిన దేశాలతో పాటు అమెరికా కొంప కూడా ముంచుతాయని కొందరు నిపుణులు చేస్తున్న భావనలలో నిజం లేకపోలేదు.
Also read: భస్మాసురుడిని తలపిస్తున్న మనిషి
అంతం కాదిది ఆరంభం!
బిన్ లాడెన్,జవహరీ వంటి అగ్రనాయకులు హతమొందినంత మాత్రాన అల్ ఖైదా పూర్తిగా అంతమొందిందని చెప్పలేం. శత్రుశేషం ఇంకా తప్పక ఉంటుంది. అఫ్ఘాన్, పాకిస్థాన్ వంటి దేశాల కేంద్రంగా ఇంకా అనేక కొత్త ఉగ్రవాద సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయని వింటూనే ఉన్నాం. జమ్మూ-కశ్మీర్ ప్రాంతాలలో రగులుతున్న ఉగ్రవాదం ఈ పరిణామాలకు అద్దం పడుతోంది. ఉగ్రవాదంతో ఎప్పటికైనా, ఎవరికైనా ప్రమాదమే. నివురుగప్పిన నిప్పులా, సైలెంట్ కిల్లర్ గా దాని ప్రభావం తప్పక ఉంటుంది. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అంతమొందించడాన్ని అగ్రరాజ్యం లక్ష్యంగా తీసుకోవాలి. మొత్తంగా ముగించడం సాధ్యమయ్యే పని కూడా కాదు. తనదాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే.. అనుకుంటే 2001 తరహా దాడులు అమెరికాకు పునరావృతం కాక మానవు. ఆర్ధిక,వాణిజ్య,వ్యాపార లక్ష్యాలే కాక,ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతి స్థాపనపైనా ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలి. ‘ఆపరేషన్ అల్ -జవహరీ’ని అగ్రరాజ్యం బాగానే నిర్వహించింది. నిఘాతో పాటు దానికి కావాల్సిన అన్ని వ్యూహప్రతివ్యూహాలను చక్కగా రచించుకుంది. అల్ ఖైదాకు చెందిన ఇద్దరు అగ్రనేతలను హతమార్చిన విజయగర్వాన్ని అమెరికా అనుభవిస్తోంది. జవహరీ కుటుంబం నివసిస్తున్న ఆ ఇల్లు హక్కానీ నెట్ వర్క్ కీలకనేత సిరాజుద్దీన్ హక్కానీదిగా చెప్పుకుంటున్నారు. అఫ్ఘానిస్థాన్ లో భారత్, అమెరికన్లపై దాడుల్లో హక్కానీ నెట్ వర్క్ పాత్ర కీలకమని సమాచారం. ప్రస్తుతం సిరాజుద్దీన్ ‘తాలిబన్ ఇంటీరియర్ మినిస్టర్’ గా ఉన్నారు. అమెరికా చేసిన తాజా దాడి నేపథ్యంలో ఈ ఇంటి నుంచి జవహరీ కుటుంబ సభ్యులను మరో ప్రాంతానికి తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని సీల్ చేశారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోనే తాలిబన్ కీలక నేతలు నివసిస్తూ ఉంటారని సమాచారం. దీనిని బట్టి తాలిబాన్ – అల్ ఖైదా బంధాలను అర్ధం చేసుకోవచ్చు. ఉగ్రవాదయుద్ధంలో ఇది అంతం కాదు… ఆరంభ శూరత్వాలే.
Also read: కార్గిల్ విజయస్ఫూర్తి