Thursday, November 21, 2024

వాల్మీకి మహర్షి మనోఫలకంపైన నారద మునీంద్రుడు

రామాయణం -1

(ప్రారంభం)

రామాయణం!!

ఆ పేరు చెవిన పడగానే అంతులేని శక్తి ఎక్కడినుండో వస్తుంది…… ..

మహర్షి వాల్మీకి వ్రాసిన ఒక ఉత్తమోత్తమ మానవుడి జీవనయానం ,..

ఒక ఉదాత్తమయిన చరిత్ర….

పితృవాక్యపాలనం… , సోదరప్రేమ… , ఏకపత్నీవ్రతం… , ప్రజారంజక పరిపాలన… , స్నేహధర్మం…., సేవానిరతి…., రాజనీతి…,

 ఇలా ఒక్కొక్క విషయము గూర్చి వింటుంటే అవి మన గుండె లోతుల్లో ఎక్కడో తడుతూ ఉంటాయి …….

 రామాయణం హృదయ సంబంధి…అంటే రామాయణం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఎదో ఒక మూల తెలియని కదలికలు వస్తుంటాయి.

అదే మహా భారతం చదివినట్లయితే మన మేదోవికాసానికి కావలసిన సామాగ్రి అంతా దొరుకుతుంది

 …Yes ! RAAMAAYAN TOUCHES OUR SOUL,

MAHABHAARATHA TOUCHES OUR MIND!!

ప్రతినాయకుడి పక్షంనుండి నాయకుడి ప్రశంస ఏ వాజ్మయంలో ఉంది ?…….అని అడిగితే !!!!

రామో విగ్రహవాన్ ధర్మః  ……అని మారీచుడు చెప్పిన విషయం మనకు జ్ఞప్తికి వస్తుంది !

అంటే  ధర్మాన్ని కనుక కరగించి మూస పోస్తే అది తాల్చే ఆకారం “శ్రీ రాముడు “

ఈ మాటలు మారీచుడు రావణాసురుడితో అంటాడు !

శ్రీ రాముడి గుణగణాలగురించి వర్ణన మనకు చాలా స్పష్టంగా అయోధ్యాకాండలో కనపడుతుంది ……

బుద్ధిమాన్, మధురాభాషీ, పూర్వభాషీ, ప్రియంవదః

వీర్యవాన్ న చ వీర్యేణ మహాతాస్వేన విస్మితః

ప్రశస్తమైన బుద్ది గలవాడు, మధురముగా అంటే తియ్యగా మాట్లాడేవాడు,

చక్రవర్తి తనయుడు, మహాధానుష్కుడు, సంపద లోను

శౌర్యం లోను తనతో తులతూగ గలిగే వాడు లేడు…

అయినా  కించిత్ గర్వం లేకుండా తానే అందరినీ ముందుగా పలుకరిస్తాడు,

శత్రువుల విషయంలో గూడా ప్రియవచనాలేపలుకుతాడు …..

రాముని గుణాలు ఇవి అని ఏమి చెప్పగలం? సకల సుగుణాభిరాముడు! సర్వలోక మనోహరుడు,

 లోకంలోని సద్గుణాలన్నీ ఒక చోట చేరి రూపం దాలిస్తే ఆ రూపమే శ్రీ రాముడు.

 ఏ విధమైన ఆలోచన లేకుండా మనం నిత్యం ఎన్నో తప్పులు చేస్తుంటాం,ఒక జీవనకాలంలో లెక్క వేస్తే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది . 

అదే మన పిల్లలకు రామాయణ పారాయణం అలవాటు చేసి రామకధ చెప్పవలసిన విధంగా చెపితే …..

రామకధాసుధారససారం రంగరించి వారి ఉగ్గుపాలలో పోసి పెంచితే!

జీవన గమనంలో వచ్చే ఆటు పోట్లు ఎదుర్కొనే శక్తీ లభించడమే గాకుండా, జీవితంలో తప్పులు, పొరపాట్లు దొర్లినప్పుడు దిద్దుకునే ధీశక్తి లభిస్తుంది. ……

.

Sir William Jones  అనే ఒక బ్రిటిష్ విద్యావేత్త 18వ శతాబ్దంలోనే  ఈవిధంగా అంటాడు:

” భారత దేశం నుండి ఆంగ్లేయులు తెచ్చుకోవలసిన నిజమైన సంపద రామాయణమే!

ఎందుకంటే మనిషి మనిషిగా జీవించే సరళమైన హృద్యమైన విధానం నేర్పుతుంది గనుక! “

……..

ఎవరు గుణవంతుడు?

ఎవరు గొప్పపరాక్రమము కలిగినవాడు?

ఎవరు ధర్మము తెలిసినవాడు?

ఎవరు కృతజ్ఞుడు?

ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు?

ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది?

ఎవరు మంచి నడవడి కలవాడు?

ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చే వాడు?

ఎవరు విద్వాంసుడు?

ఎవరు ఎంతటి కార్యాన్నయినా సాధించేవాడు?

ఎవరు చూసే వారికి ఎల్లప్పుడు సంతోషము కలిగించేవాడు?

ఎవరు ధైర్యము గలవాడు?

ఎవరు కోపము జయించిన వాడు?

ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణకుతారు?

ఎవరు అసూయలేనివాడు?

ఎవరు కాంతి కలవాడు?

ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి, ఆ మనిషి భూమిమీద ఎప్పుడయినా నడయాడినాడా?

అసలు అలాంటివాడు ఒకడుండటం సాధ్యమయ్యే పనేనా? అలాంటి వాడినెవరినయినా బ్రహ్మగారు సృష్టించారా?

ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా మహర్షి వాల్మీకిమనసులో ఉదయించాయి!

ఆ ప్రశ్నలకు తనకు సమాధానం కావాలి!

సమాధానం ఇవ్వగల సమర్ధుడెవ్వరు?

ఆలోచించారు మహర్షి వాల్మీకి!

ఆయన మనోఫలకం మీద అప్పుడు త్రిలోకసంచారి నారదులవారు కనపడ్డారు! అవును ఈయన అయితేనే నా ప్రశ్నలకు సమాధానమీయగలడు!

అన్నిలోకాలు తిరుగుతూ ఉంటారుకదా నారదులవారు!

నా మనస్సులో ఉన్నవ్యక్తి ఆయనకు ఎప్పుడయినా, ఎక్కడయినా తారసపడి ఉండవచ్చు!

మహర్షి వాల్మీకి నారదుల వారిని ధ్యానించారు!

నారద మహర్షి ప్రత్యక్షమయినారు. ఆయనను వాల్మీకి ముని ఇలా అడుగుతున్నారు!

తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంఙ్గవమ్

మహాతపఃశాలి ,నిరంతర వేదాధ్యయనమునందు అసక్తి కలవాడు ,వాక్కును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడయిన  వాల్మీకి మహర్షి  నారదుని ప్రశ్నించెను!

ముని ప్రశ్నకు నారదులవారు ఈవిధంగా సమాధానం చెపుతున్నారు!

……………….

N.B ‌

పైశ్లోకంలో ఒక్కక్క phrase ఒక్కొక్క Zipped File

నాకు తెలియవచ్చినంతమేర వివరించ ప్రయత్నం చేస్తాను

…………..

తపః …అనగా జ్ఞానము ! దేనిని గురించి జ్ఞానము ? బ్రహ్మమును గురించిన జ్ఞానము! బ్రహ్మము అంటే ఈ చరాచర సృష్టికి ఏది కారణమో అది! అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది అని అర్ధము!

స్వాధ్యాయము…. అనగా వేదాధ్యయనం, 

 ఆ వేదాధ్యయనం ఎలా చేస్తున్నారు మహర్షి? 

పూర్తి అర్ధ జ్ఞానం కలిగేవరకు చదువుతూ ఉండటమే!

అంటే PHILOSOPHY OF SUBJECT తెలిసేవరకు అన్నమాట!

(మన చదువులు పరీక్ష పాస్ అయ్యి డిగ్రీలు చేతికి వచ్చేవరకే ! ఆ తరువాత Subject మరచిపోతాం!

కేవలం Visiting cards లో మన పేరు ప్రక్కన వేయించుకునేందుకు తప్ప, మన డిగ్రీలుఎందుకూ పనికి రాని విధంగా మనలను మనం తీర్చిదిద్దుకుంటున్నాం).

వాగ్విదాంవర ..వాక్కు అనగా శబ్దము

 అసలు శబ్దము ఎలా పుట్టింది? దాని లక్షణమేమిటి? వాక్కును ఎలా ప్రయోగించాలి? అన్నీ తెలవాలంటే, ఒక వ్యక్తి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనే వేదాంగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి!

..(మనం చేసే లొడ లొడ శబ్దం కాదు, మనం వాక్కు యొక్క స్వరూపమేమిటో తెలియకుండా నోటికి వచ్చింది అడ్డంగా మాట్లాడతాం).

అలా అధ్యయనం చేసిన వారిలో శ్రేష్ఠుడు! వాల్మీకి మునిపుంగవుడు!

అంతటి గొప్పవ్యక్తికి కలిగిన సందేహమది!

-వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles