అన్నీ కాదు గాని
కొన్ని మకరి బాష్పాలు.
మృదువుగా విచ్చుకున్న పుష్పాల్లా
కొందరి పలకరింపులకు
రోగి లేచి కూర్చుంటాడు.
అందరికీ కాదు గాని
కొందరికి కుతూహలమెక్కువ.
వివరాల మీదే దృష్టి
ఆంతరిక వివరం పట్ల కాదు.
ముందే బిక్క చచ్చిన రోగి
సందర్భాలు చెప్పలేక చస్తాడు.
కష్టాల్లో ఉన్నవారిని చూసి
కొందరిలో శాడిజం మేల్కొంటుంది.
జాలిపడే స్థితిని
కోరుకుంటారు వారు.
మనం వెళ్తే
ఆ ఇంట్లో వెలుగు రావాలి
గాలిలో ఆత్మీయత నిండాలి
నిరాశ పలుచబడిపోవాలి.
చిరునవ్వులతో పెదవులపై
పసిడి కాంతులు పరచుకోవాలి.
మన పిలుపులు
మనల్ని మనం తడుముకున్నట్టుండాలి.
మన మాట గుండెను ముట్టుకున్నట్టుండాలి.
‘రమ్మంటారా’ అంటే
‘వద్దు లెండి’ అన్నట్టు కాదు
‘అప్పుడే వెళ్తారా’ అంటూ
చేతులు పట్టుకొని ఆపాలి.
మన పరామర్శ
మందుల కన్న బలమైంది కావాలి.
పాత పాటలు వింటుంటే
పారిపోయిన యవ్వనం
మళ్లీ తొణికస లాడినట్టు,
ముసలితనం కేవలం
ప్రకృతి ధర్మం అనిపించాలి,
క్షతగాత్రుడికి
వీర రసాన్ని గుర్తు చెయ్యాలి
యోద్ధకు
యుద్ధమే ఒక గొప్ప జ్ఞాపకం.
మన పరామర్శ
అడుగుల్ని తాకే హృదయస్పర్శ కావాలి.
అది వ్యక్తిలా కాదు
మనిషిలా వుండాలి
రేపు మన గమ్యమూ అదే కావచ్చు.
Also read: గ్రంథోపనిషత్
Also read: శీలా వీర్రాజు స్మృతిలో..
Also read: Cataract సర్జరీకి ముందు
Also read: అతీత
Also read: లత జ్ఞాపకాలు