అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ (ఏ.పి.జె అబ్దుల్ కలామ్) భారత దేశపు 11వ రాష్ట్రపతి. వివాహం చేసుకోకుండా తన జీవితం మొత్తం శాస్త్రసేవకే అంకితం చేసిన మహనీయుడు. అంతకు మించి భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్తగా ఆయనకు అపారమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. జన జీవన స్రవంతిలో ప్రజలతో పాటు నిత్యం నవ్వుతూ కలిసిపోయిన అబ్దుల్ కలామ్ భారత ప్రజలు మెచ్చిన నాయకులలో మొదటి వరుసలో ఉంటారు. అతి సామాన్యమైన స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరిన ఆయన ప్రతి పనిలోనూ ఓ నిబద్ధత, నిగర్వం, క్రమశిక్షణ కనిపిస్తాయి.
Also read: నటనకే నటన నేర్పిన మహా నటుడు …ఎస్.వి.రంగారావు
న్యూస్ పేపర్ బోయ్
అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931వ సంవత్సరం అక్టోబరు 15 న జన్మించారు. తల్లిదండ్రులు జైనులబ్ధీన్ ఆషియమ్మలు. 1914 లో పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత కలాం తండ్రి వ్యాపారం బాగా నష్టాలలోకి వెళ్ళింది. కలాం చిన్న వయసులో ఉన్నప్పుడే వారి కుటుంబం చాలా పేదరికానికి గురి అయ్యింది. తన కుటుంబ పరిస్థితి చూసి తన వంతు సహాయం చేయటానికి న్యూస్ పేపర్స్ అమ్మి కుటుంబానికి సహాయపడ్డారు.
Also read: ఆయన తీసిన ప్రతీ చిత్రం… ఒక్కో కళా ఖండం…
పట్టుదలతో గంటల తరబడి చదువు
ఆయనకు స్కూలులో చదివేటప్పుడు మార్కులు అంత ఎక్కువగా వచ్చేవి కావు, కానీ కష్టపడి నేర్చుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉండేది. ఈ పట్టుదలే ఆయనను గంటల తరబడి చదివేలా చేసేది. తన స్కూలు చదువు పూర్తి చేసుకున్న తర్వాత తిరుచిరప్పల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి కాలేజీ చదువులు పూర్తిచేసారు, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి 1954 లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు. 1955 లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవటానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో చేరారు.
Also read: హాస్య రచనలతో నవ్వులు పండించిన ముళ్ళపూడి…
ఆ తర్వాత ఆయన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఓ) లో చేరారు. అక్కడ ఆయన చిన్న చిన్న హోవర్ క్రాఫ్ట్ ని నిర్మించడం మొదలు పెట్టారు. కానీ ఆయనకు అక్కడ పని చేయటం నచ్చేది కాదు. 1969 లో ఆయన ఇండియన్ స్పెస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కు బదిలీ అయ్యారు. ఆయన మొట్ట మొదటి సాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా పనిచేశారు. ఈ క్రమంలో తన నేతృత్వంలో రోహిణి సాటిలైట్ ను 1980 లో భూమి కక్ష్యలోకి పంపడం జరిగింది. అలాగే, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మరియు ఎస్‌ఎల్‌వి -3 (SLV-3) ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన చేసిన ఈ కృషి వల్ల రెండు ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి.
Also read: నాన్నంటే బాధ్యత…
ప్రాజెక్ట్ డైరెక్టర్
అలాగే, ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్ లకు కూడా ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ముఖ్య లక్ష్యం బాలిస్టిక్ మిస్సైల్ అభివృద్ధి చేయటం. యూనియన్ కాబినెట్ ఈ రెండు ప్రాజెక్ట్ లకు నో చెప్పింది కానీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రహస్యంగా ఈ ప్రాజెక్ట్ కు నిధులు జారీ చేశారు. అనంతం ఆయన ఏరోస్పేస్ ప్రాజెక్ట్స్ భారత దేశానికి ఎంత అవసరమో, దానిని దేశం ఎందుకు అభివృద్ధి చేయాలనుకుంటుందనే విషయాన్ని కేబినెట్ కు వివరించడంలో కృతకృత్యులయ్యారు. భారతదేశ మిస్సైల్ మాన్ గా పిలుచుకునే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు.
Also read: నవ్వుల పూదోట మహా దర్శకుడు.. జంధ్యాల
బీజేపీ అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నిక
1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక , రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచి రాష్ట్రపతి పదవి చేపట్టారు. కలాం తన పుస్తకం ‘ఇండియా 2020’ లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న పురస్కారాలను అందుకున్నారు.
Also read: అందానికి , అద్భుత నటనకు చిరునామా….:
ఆజన్మ బ్రహ్మచారి
ఆయన తన జీవితం మొత్తం బ్రహ్మచారిగానే ఉన్నారు, అయితే ఎల్లప్పుడూ తన బంధువులతో సన్నిహితంగా ఉండేవారు. రాష్ట్రపతి అయినప్పటికీ , చాలా సాధారణంగా జీవించారు. రాత్రి 2 గంటలకు నిద్రపోయి, ఉదయం 7 గంటల సమయంలో లేచేవారు. కలాం ఎంత సాధారణంగా ఉండేవారంటే తన వద్ద టీవీ కూడా ఉండేది కాదు. కలాం చనిపోయిన తరవాత తన వద్ద మిగిలిన ఆస్తులు కొన్ని పుస్తకాలు, వీణ, సీడీ ప్లేయర్, లాప్టాప్ మాత్రమే ఉండడం ఆయనలోని ఉత్తమ గుణాలకు నిదర్శనం. ఆయన ముస్లిం అయినప్పటికీ, ఇతర మతాలను గౌరవించేవారు. అలాంటి ఉత్తమ గుణాలతో, క్రమ శిక్షణతో, దేశభక్తితో తన తుది శ్వాస వరకు మెలిగారు. ఇలా దేశ అభివృద్ధి కోసం పరితపిస్తూనే జులై 27, 2015 న పరమపదించారు. దేశం కోసం అనుక్షణం పరితపించిన ఆ దేశ భక్తుడి లేని లోటు తీర్చలేనిది.
Also read: గానకోకిల గొంతు మూగబోయింది, అందనంత దూరాలకు అద్భుత గాయని లత వెళ్ళిపోయింది
(జూలై 27, అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా)
దాసరి దుర్గా ప్రసాద్
మొబైల్ : 77940 96169