విలిచం వర్డ్స్ వర్త్, గిడుగు రామమూర్తి
తెలుగు భాషలో ఆంగ్లం వాడడం తెలుగును కలుషితం చేయడం అన్నారు కొందరు. తెలుగులో సంస్కృత పదాలు 60% ఉన్నాయంటారు. అచ్చ తెనుగు పదాలు 15% మాత్రమె అంటారు. అంటే అదీ కలుషితం చేయబడిందేనా. నిజానికి ఆంగ్లం ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి, సంపన్నం కావడానికి ముఖ్య కారణం సంస్కృతం, తెలుగు లాంటి అనేక భాషల పదాలను తనలో కలుపుకోవడమే.
ఇంగ్లీషు వల్ల మన సాహిత్యానికి ఒరిగేదేమీ లేదన్నారు. గురజాడ, శ్రీశ్రీ, శేషేంద్ర లాంటి ఆధునిక కవులందరూ ఆంగ్ల సాహిత్యం చదివి తెలుగులో మార్పులు తెచ్చినవారే. 19వ శతాబ్దం మొదట్లో తన కవిత్వంలో ప్రజల భాషనే వాడాలనే విలియం వర్డ్స్వర్త్ వాదనను తెలుగులో వ్యవహారిక భాషావాదంగా గిడుగు రామమూర్తి పంతులు ద్వారా మనం తెచ్చుకోలేదా? ఆంగ్ల సాహిత్య విమర్శ సారాన్ని RS సుదర్శనం, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ద్వారా తెచ్చుకున్నా పాటించక వదిలేసినది మనం కాదా? మంచి ఎక్కడున్నా తెచ్చుకోవడంలో తప్పేంటి? మనకు నచ్చి, ఉపయోగ పడుతుందంటేనేగా తెచ్చుకుంటాం.
పాశ్యాత్యుల లాగా ఆలోచించడం తప్పా? వాళ్ళ ఆలోచనా విధానంతో వికసించిన సైన్స్ నే కదా మనం టెక్నాలజీ పేరుతో తెచ్చుకుంటున్నాం. భారతీయత ఆంగ్లంలో వ్యక్తం కాదన్నారు. వివేకానందుని తర్వాత రవీంద్రుని ఆంగ్ల రచనలతోనే భారతీయత ప్రపంచం అంతా తెల్సిందనే విషయాన్ని మరచిపోగలమా. ఆంగ్ల పదాల అర్థాలు తెలిసీ తెలియక వాడడంతో వక్రీకరణ జరుగుతుందన్నారు. RK నారాయణ్, రాజా రావు, కమల మర్కొందేయ, నిస్సిం ఇజకియాల్, గాంధి, నెహ్రు, రాజాజీ, జిడ్డ్డు కృష్ణముర్తి, నేటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, శాస్త్రవేత్తలు పదాలు అలాగే వాడుతున్నారా?
మన పదాలకు తత్సమాలు లేవు అన్నారు. భాష సంస్కృతిపై ఆధార పడింది. మంగళ సూత్రానికి ఆంగ్ల పదం, సప్పర్ కు తెలుగు పదం లేవని ఆ భాషలను కించపరచడం కుదరదు. ఇది ఏ భాషకైనా వర్తించే విషయం.
మనసు కిటికీలు తెరిస్తే మంచి అన్నది ఎక్కడ దొరికినా తీసుకోవచ్చు. పిలక కత్తిరించుకుని ప్యాంటు షర్టు వేసుకున్నా, దేశం వదలి పరాయి దేశంలో ఉన్నా భారతీయత వదులుకో లేదు మనవాళ్ళు. కాబట్టి మన చుట్టూ మనమే గిరి గిసుకోకుండా సీమనుండి అసీమకు ప్రయాణమే ప్రగతి అని గుర్తుంచుకుందాం.