ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీత దీపికారెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ చైర్మన్ గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీపికారెడ్డి దాదాపు అయిదు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యకళకు సేవ చేస్తున్నారు. వివిధ దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతులూ, ప్రదానులూ, గవర్నర్లూ, ముఖ్యమంత్రులూ, సాంస్కృతిక శాఖామాత్యులూ అనేకమంది ఆమెను సత్కరించారు. ముఖేష్ అంబానీ వంటి వరిష్ఠ పారిశ్రామికవేత్తలు సైతం ఆమె కూచిపూడి నృత్యాన్ని తిలకించి పులకించిపోయారు. తోటి నృత్యకారులూ, కళాకారులూ ఆమెను ఎంతో అభిమానంగా గౌరవించారు.
రంగప్రవేశం 1976లో చేశారు. బెర్లిన్ లో జర్మనీ ప్రముఖులూ, భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సమక్షంలో 2013లో నృత్యప్రదర్శన చేశారు. 2011లో రష్యా అధ్యక్షుడు భారత్ ను సందర్శించినప్పుడు అశోకా హాల్ లో ప్రదర్శన ఇచ్చారు. బ్యాంగ్ కాక్ లో 12వ అంతర్జాతీయ సంగీతనృత్య ప్రదర్శనలో కూచిపూడి నృత్యం చేశారు. కొలంబో లో శ్రీలంక పార్లమెంటులో, మాస్కోలో బొల్షోయ్ థియేటర్ లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచశాంతి ప్రాముఖ్యాన్ని నొక్కివక్కాణిస్తూ జపాన్ లోని హిరోషిమాలో (రెండో ప్రపంచ యుద్ధంలో ఆటంబాంబులు కురిపించిన ప్రదేశం) గొప్ప నాట్య ప్రదర్శన చేశారు. అంతకు ముందు ఫ్రాన్స్ లో పర్యటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్నారు. దిల్లీలో ఆమెను సన్మానించారు. ఖజురాహో డాన్స్ ఫెస్టివల్ కి సెలక్షన్ కమిటీలో సభ్యురాలిగా పని చేశారు దీపికా రెడ్డి. కొరియోగ్రాఫర్ గా అనేక కార్యక్రమాలలో పని చేశారు. దీపాంజలి అనే పేరుతో నృత్యశిక్షణ సంస్థను 2000 సంవత్సరంలో నెలకొల్పారు. వారంలో ఏడు రోజులూ పిల్లలకు శిక్షణ ఉంటుంది. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలతో పాటు పేద పిల్లలకు కూడా ఆమె శిక్షణ ఇస్తారు. డాన్స్ నేర్చుకోవాలన్న అభిలాష ఉన్నవారందరికీ శిక్షణ ఇవ్వాలన్నది ఆమె ప్రయత్నం. 15 సెప్టెంబర్ 1965లొ దీపికారెడ్డి జన్మించారు.