- అక్సర్ పటేల్ ప్రతిభతో రెండో ఓడీఐలో గెలుపు
- వరుసగా రెండు మ్యాచ్ లు స్వల్ప వ్యత్యాసంగా సొంతం చేసుకున్న భారత్
ఆల్ రౌండర్ అక్సర్ పటేల్ ప్రతిభా ప్రదర్శన కారణంగా వెస్టిండీస్ జట్టుపైన భారత క్రికెట్ జట్టు 2-0 స్కోరుతో సిరీస్ ను గెలుచుకున్నది. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో ఇంకా రెండు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయనగా, మరి రెండు వికెట్లు చేతిలో ఉన్న దశలో అక్సర్ పటేల్ భారత విజయానికి అవసరమైన పరుగులు సాధించాడు. అతడు కేవలం 35 బంతులలో 64 పరుగులు చేసి విజయం జట్టు కెప్టెన్ శిఖరథావన్ కి అందించాడు. అంతకు ముందు హోప్ సెంచరీ (115) కొట్టి వెస్టిండీస్ జట్టు స్కోరు 311 పరుగుల దాకా వెళ్లడానికి దోహదం చేశాడు. నికొలస్ పూరణ్ అతడికి అండగా నిలిచి 77 బంతులలో 74 పరుగులు చేశాడు. వీరిద్దరి ప్రయాస వృధా అయినట్టు లెక్క. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకుర్ 54 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. భారత జట్టు పేలవంగా ఆట ప్రారంభించి మొదటి పది ఓవర్లనూ చెత్తగా ఆడి శిఖర ధావన్ వికెట్టు కోల్పోయినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్ లు నిలకడగా ఆడి మంచి స్కోరు చేశారు.
భారత్ గెలిచిన రెండు మ్యాచ్ లు రోమాంచితంగానే ముగిశాయి. మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేసింది. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ హైదరబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వేశాడు. 15 పరుగులు ఆ ఓవర్ లో కనుక వెస్టిండీస్ కొట్టి ఉంటే మ్యాచ్ వాళ్ళే గెలిచేవాళ్ళు. కానీ సిరాజ్ చాకచక్యంగా బౌలింగ్ చేసి చివరి ఓవర్ లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు పరుగుల తేడాతో విజయం సమకూర్చాడు. ఇక రెండు ఇన్నింగ్స్ లో కూడా టాస్ వెస్టిండీస్ గెలిచింది.ముందుగా బ్యాట్ చేసి 311 పరుగులు 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి సాధించింది. ఇండియా 49.4 ఓవర్లలో 312 పరుగులు సాధించి విజయలక్ష్మిని సొంతం చేసుకుంది. వెస్టిండీస్ 311 పరుగులు ఆరు వికెట్ల నష్టానికి చేయగా భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. రెండో ఓడిఐ గెలుపొందడంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు గెలుచుకొని సిరీస్ ని ఇండియా 2-0 స్కోరు తో గెలిచినట్టు అయింది.