విజయవాడ: సంచార జాతుల కళాకారులలో సురభి కళాకారులు విశ్వ విఖ్యాతి కలిగిన వారని , వీరిని పూర్వ ముఖ్యమంత్రి డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి “సురభి నాటకాల వారు కులం”గా గుర్తించి బీసీ.బి జాబితాలోకి చేర్చారని, వీరిని ఓబీసీ గా గుర్తించే విధంగా అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతామని అంధ్ర ప్రదేశ్ సంచార జాతుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న తెలిపారు. అంధ్ర సారస్వత పరిషత్, అంధ్రప్రదేశ్ సంచార జాతుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా ఈజోన్ కంపెనీ ప్రాంగణం , విజయవాడలో నిర్వహించిన “సురభి కళాకారుల కుటుంబాల జీవన స్థితిగతులు, సంక్షేమం” సదస్సులో కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్నను సురభి కుటుంబాల వారు కలసి చర్చలు జరిపారు. అంధ్ర సారస్వత పరిషత్ అద్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సురభి కళామందిరాలు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం బీచ్, తిరుపతి తిరుమలలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అద్యక్షులు సి హెచ్ వెంకటేశ్వరరావు, పరిషత్ ఉపాధ్యక్షులు మెడికొండ శ్రీనివాస్ చౌదరి ,సురభి ప్రసాద్,సురభి శేఖర్, రాయలు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.