- జపాన్ మాజీ ప్రధాని షింజో అబెపై కాల్పులు జరిపిన దుండగుడు
- మృత్యువుతో 5 గంటలు పారాడి ఓడిన రాజనీతిజ్ఞుడు
తుపాకి హింస అనేది ఆ దేశంలో చాలా అరుదైనది. తుపాకుల వినియోగంపై కూడా అక్కడ ఎప్పటి నుంచో నిషేధం ఉంది. అటువంటి దేశంలో పట్టపగలే అందరూ చూస్తుండగా, రక్షకభటులు పక్కనే ఉండగా నాటు తుపాకీతో ఒక్కడే ఒకడు వచ్చి ఆ దేశపు మాజీ ప్రధానిని కాల్చి చంపేశాడు. చంపిన తర్వాత లొంగిపోయాడు. లొంగి పోవడమే కాదు, తానే చంపానని అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన జరిగింది జపాన్ లో. హత్యకు గురైనవ్యక్తి సుదీర్ఘకాలం ఆ దేశ ప్రధానిగా ప్రజల మన్ననలు పొందిన షింజో అబె. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా చెప్పుకొనే జపాన్ లో ఈ తరహా దారుణం జరగడంపై ప్రపంచ దేశాధినేతలు విస్మయం చెందుతున్నారు. ఎగువ సభకు ఎన్నికలు జరుగబోతున్న వేళ, ప్రచారంలో భాగంగా నరా నగరంలో ప్రసంగిస్తున్న ఆ దేశ పూర్వ ప్రధాని షింజో అబెపై హటాత్తుగా జరిగిన కాల్పులకు కుప్పకూలిపోయారు. వైద్యులు ఎన్ని విధాలా ప్రయత్నించినా మాజీ ప్రధానిని కాపాడుకోలేకపోయారు.
Also read: ఎట్టకేలకు గద్దె దిగిన బోరిస్ జాన్సన్
భద్రతాసిబ్బంది ఏమి చేస్తోంది?
ఈ ఘటన అనేక అనుమానాలకు తెరలేపుతోంది. ఇంతకూ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు? నిఘా విభాగం ( ఇంటలిజెన్స్) ఏమైనట్లు, తుపాకీలపై నిషేధం వున్న దేశంలో అంత పొడవాటి నాటు తుపాకీతో ఆ దుండగుడు అక్కడికి ఎలా ప్రవేశించ గలిగాడు,పర్యవేక్షణ ఎందుకు వైఫల్యం చెందింది, మాజీ ప్రధానికి అతి సమీపంలో ఒక అపరిచితుడు మారణాయుధాలతో నిల్చోడ మేమిటీ?… ఇలా అనేక ప్రశ్నలు అందరి మెదళ్ళును తొలచి వేస్తున్నాయి.ముఖ్యంగా జపాన్ ప్రజ నివ్వెరపోయింది. ఇంకా భయం నీడలోనే బిక్కుబిక్కుమంటోంది. తమ ఉనికి పట్ల, రక్షణ పట్ల బేంబేలెత్తుతోంది. మన దేశంలో ఇందిరాగాంధీని సొంత రక్షకభటులే కాల్చి చంపారు. మిగిలిన కొన్ని దేశాల్లో ఈ తరహా దుర్ఘటనలు కొన్ని జరిగాయి. పూర్వ ప్రధానమంత్రిని ఈ తీరున కాల్చి చంపడం జపాన్ లో ఇదే మొట్టమొదటిసారని చరిత్ర చెబుతోంది. షింజో అబె అనుబంధం కలిగి వున్న ఆ వర్గం నచ్చకనే ఈ పనిచేశానని దుండగుడు చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది. అతని నివాసంలో మారణాయుధాలు, పేలుడు పదార్ధాలను గమనించినట్లు పోలీసులు గుర్తించారు. అతని నివాసానికి సమీపంలో ఉన్నవారిని ఖాళీ చేసి వెళ్లిపొమ్మని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. షింజోను చంపాలని ఉద్దేశ్యంతోనే కాల్పులు జరిపానని చెప్పిన ఆ దుండగుడి పేరు యమగామి. అతని వయస్సు 41ఏళ్ళు. షింజో అబెపై అసంతృప్తి ఉందని అతను పదే పదే చెబుతున్నాడు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: వినాశకాలే విపరీత బుద్ధి
నిందితుడికి సమాచారం ఎట్లా అందింది?
నరాలో సమావేశం గురించి ముందురాజు రాత్రి మాత్రమే ధ్రువీకరించారు. నిండుతుడికి ఈ విషయం అంత తొందరగా ఎలా తెలిసింది, ఆ ప్రాంతంలో రెక్కీ ఎలా వేశాడు, తుపాకుల సంస్కృతి తక్కువగా ఉన్న ఆ దేశంలో నిందుతుడికి నాటు తుపాకీ ఎక్కడ నుంచి దొరికింది మొదలైన అనుమానాలు చుట్టుముట్టుతున్నాయి. అత్యంత సమీపం నుంచే కాల్చినట్లు తెలుస్తున్న వేళ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం ప్రశ్నార్ధకమవుతోంది.షింజో వంటిపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం జరిగింది. కానీ బుల్లెట్లు మాత్రం లభించలేదని చెబుతున్నారు. శరీరంలో నుంచి దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్న ఆ బులెట్ల ఆచూకి తెలియాల్సివుంది. తాతల వారసత్వాన్ని శక్తివంతంగా నిలబెట్టిన షింజో అబెకు ప్రపంచ దేశాల్లో మంచి పేరు, ప్రతిష్ఠలు ఉన్నాయి. షింజో తాత నొబుసు కె కిషి కూడా జపాన్ ప్రధానిగా సేవలందించారు. షింజో రెండు పర్యాయాలు ప్రధానిగా పదవిలో ఉండడమే కాక, సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా చేసిన నేతగా స్వదేశంలోనూ మంచి కీర్తి ఉంది. 52 వయస్సులోనే ప్రధాని పదవిని చేపట్టి ఆ దేశంలో చరిత్ర సృష్టించారు. జపాన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన విశేష చరిత్ర కూడా ఆయనకు ఉంది. ప్రపంచంలో బలమైన ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశాల్లో జపాన్ ఒకటి. ఆ దేశానికి ఆర్ధిక,రాజకీయ స్థిరత్వం తేవడంలో అబె తనదైన విశిష్ట ముద్ర వేసుకున్నారు.
Also read: మణిపూర్ లో మరణమృదంగం
భారత్ కు ఆత్మీయ మిత్రుడు
ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలైంది. ఈ ముప్పై ఏళ్ళలోనే అప్రతిహతంగా దూసుకెళ్లారు. ‘అబెనామెక్స్’ పేరుతో ఆయన చేపట్టిన ఆర్ధిక సంస్కరణలు జపాన్ అభివృద్ధికి రాచబాటలు వేశాయి. చైనా – జపాన్ మధ్య సంబంధాలు ఆయన పరిపాలనా కాలంలోనే మెరుగయ్యాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో జరిగిన భేటీ ఆ రెండు దేశాల బంధాల ప్రగతికి కీలకంగా నిలిచింది. అదే విధంగా, షీ జిన్ పింగ్ విధానాలను షింజో తీవ్రంగా తప్పుపట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తైవాన్ పై దాడి చేస్తామని చైనా బెదిరింపులకు దిగిన తరుణంలో జిన్ పింగ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటి పనులు చేస్తే మీ దేశ ఆర్ధికవ్యవస్థ పతనమై పోతుందని చైనాను హెచ్చరించారు. భారతదేశంతో షింజో అబెకు మంచి సంబంధాలు ఉన్నాయి. మన దేశం పట్ల గౌరవాభిమానాలు ఉన్నాయి. నేటి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వ్యక్తిగతమైన స్నేహం కూడా ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నరోజుల్లోనే వారిద్దరి మధ్య స్నేహం చిగురించినట్లు మన ప్రధాని స్వయంగా వెల్లడించిన మాటలు బట్టి తెలుస్తోంది. తనకున్న ప్రియమైన స్నేహితుల్లో అబె ఒకరని నరేంద్రమోదీ తమ జ్ఞాపకాలను ట్విట్టర్ లో పంచుకున్నారు. భారత్ – జపాన్ సంబంధాలు అంతర్జాతీయంగా వ్యూహాత్మాక స్థాయికి ఎదగడంలో అబె పాత్ర మరువలేనిది. ఇండో -పసిఫిక్ బంధానికి కూడా అబె చేసిన కృషి ప్రశంసాపాత్రం.భారత్ తో అంతటి అనుబంధాన్ని పెనవేసుకొని, అనేక దేశాలతో సత్ సంబంధాలను నెరపి,జపాన్ చరిత్రలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న 68 ఏళ్ళ షింజో అబె అంత అర్ధాంతరంగా, ఇంత ఘోరంగా కాల్పుల్లో మరణించడం అతి దారుణం, అత్యంత విషాదం.ఆయన పట్ల గౌరవ సూచకంగా జూలై 9 వ తేదీ,2022 ను ‘జాతీయ సంతాప దినం’గా పాటిస్తున్నామని మన భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. జపాన్ పూర్వ ప్రధాని షింజో అబెకు మనం అందిస్తున్న ఘనమైన నివాళి ఇదే.
Also read: విప్లవశిఖరం, నిలువెత్తు పౌరుషం