- మంత్రుల రాజీనామాల పరంపరతో ముదిరిన సంక్షోభం
- కోవిద్ ఆంక్షల మధ్య పుట్టినరోజు పండుగ
- వివాదాలలో వర్థిల్లుతూ సారీలు చెబుతూ…
వివాదాల ప్రతిరూపంగా మారిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు పదవి నుంచి దిగిపోక తప్పలేదు. జాన్సన్ కు పదవీ గండం ఉందనే కథనాలు కొన్నాళ్ళుగా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆయన పదవి దినగండం నూరేళ్ళ ఆయుష్షు చందంగానే మారిపోయింది. సొంత మంత్రుల వరుస రాజీనామాలు, సొంత పార్టీ నుంచి తీవ్రమైన వ్యతిరేకతలు, ఒత్తిళ్ల నడుమ ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఆయన శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. కొత్త ప్రధాని ఎంపిక జరిగేంత వరకూ జాన్సన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటారు. బ్రిటన్ లో ప్రధాని ఎంపిక పెద్ద ప్రహసనం. గతంలో కొందరికి రోజుల్లోనే పూర్తయింది,మరి కొందరికి నెలల సమయం పట్టింది.ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం. ఏది ఏమైనా వివాదాల ప్రధానమంత్రిగా బ్రిటన్ కు చెడ్డపేరు మూటగట్టిన వ్యక్తిగా బోరిస్ చరిత్రలో మిగిలిపోతారు.
Also read: వినాశకాలే విపరీత బుద్ధి
తప్పు చేయడం, క్షమాపణ చెప్పడం
జాన్సన్ వ్యవహారశైలి, పరిపాలనా విధానం,వివాదాల వైనం చూసి ఆయనను అమెరికా పూర్వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పోలుస్తుంటారు. 2019 జులై 24వ తేదీన తొలిసారిగా ఆ దేశ ప్రధానిగా బోరిస్ జాన్సన్ బాధ్యతలు చేపట్టారు. పట్టుమని మూడేళ్ళ కాలం పూర్తి కాకముందే ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇంకొక రెండు వారాల్లో మూడేళ్లు పూర్తవుతాయనంగా ఆయన పదవికి నూరేళ్లు నిండాయి. బోరిస్ పదవీచ్యుతుడు కావడం వెనకాల ఆయన స్వయంకృత అపరాధాలే ప్రధానమైనవని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగడానికి నిర్వహించిన ప్రక్రియ జాన్సన్ పరిపాలనా కాలంలోనే సఫలమైంది. ‘బ్రెగ్జిట్’ రెఫరండంలో ప్రజలు 2016లోనే తీర్పు చెప్పారు. అది ఆమోదం పొందడంలో పార్లమెంట్ లో తీవ్ర జాప్యం జరిగింది. బోరిస్ జాన్సన్ అతికష్టం మీద పార్లమెంట్ లో ఆమోదమయ్యేలా చక్రం తిప్పారు. దీనితో ఆయన ‘బ్రెగ్జిట్ హీరో’ అయ్యారు. నవశకానికి నాంది పలికిన వ్యక్తిగా కీర్తిని మూటగట్టుకున్నారు. ఆ సందర్భంలో కొన్ని వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా, మంచి ప్రతిష్ఠనే సంపాయించారు. ఈ పేరు, ప్రతిష్ఠ ఆయనకు ఎక్కువ కాలం నిలబడలేదు. జాన్సన్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని గమనిస్తే మొదటి నుంచీ ఎన్నో వివాదాల మధ్యనే సాగింది. తప్పు చేయడం, దొరకడం, క్షమాపణలు చెప్పడం ఆయనకు రివాజుగా మారిపోయిందనే విమర్శలు ఆయనపై పెద్దఎత్తున ఉన్నాయి. ఈ తీరే ఆయన కొంప ముంచిందని చెప్పవచ్చు. ఇప్పుడు స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకతలు చుట్టుముట్టాయి. ఆ వివాదాల చిట్టాను ఒకసారి పరికిద్దాం.
Also read: మణిపూర్ లో మరణమృదంగం
చెరగని అవినీతి ముద్ర
బోరిస్ జాన్సన్ ప్రధానిగా పదవిని చేపట్టిన ఏడాదిలోనే అవినీతి ముద్ర పడిపోయింది. తన నివాసానికి మార్పులు చేయించుకొనే క్రమంలో భారీమొత్తం ఖర్చుపెట్టడమే కాక, అందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ దేశ నిబంధనల ప్రకారం 7,500 యూరోల కంటే ఎక్కువ మొత్తంలో రాజకీయ విరాళాలు, రుణాలు తీసుకుంటే ఆ వివరాలను బహిర్గతం చెయ్యాలి. అది జరుగలేదు. జాన్సన్ ఇంటి హంగులకు 2 లక్షల యూరోలు ఖర్చయ్యాయని చెప్పుకుంటారు. జాన్సన్ తీసుకున్న విరాళాల వివరాలు అధికారికంగా బయటకు వెల్లడించని నేపథ్యంలో, ఆ అంశం వివాదాస్పదంగా మారింది. జాన్సన్ కాబినెట్ లోని మంత్రి ఓవెన్ పాటెర్సన్ కొన్ని కంపెనీలకు లాబీయింగ్ నెరపాడని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ మంత్రిని కాపాడడానికి జాన్సన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇది విమర్శల దుమారాన్ని రేపింది. ‘పార్టీ గెట్’ వివాదం మరో సంచలనం. కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ వుంటే ప్రధాని తన అధికార నివాసంలో సహచరులతో పెద్దస్థాయిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారు. అదే సమయంలో బ్రిటన్ రాణి ఎలిజెబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణించారు. దేశమంతా విషాదంలో ఉంటే జాన్సన్ మాత్రం పార్టీ చేసుకుంటూ వినోదాల్లో గడిపారు. ఈ అంశాలన్నీ తీవ్ర వివాదాలకు దారి తీయడమే కాక, పోలీసులు ఆయనకు జరిమానా కూడా వేశారు. ఆ సందర్భంలో బ్రిటన్ రాణికి జాన్సన్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ వ్యవహారంపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది.
Also read: విప్లవశిఖరం, నిలువెత్తు పౌరుషం
పించర్ ఎఫెక్ట్
ఆ తర్వాత ‘పించర్ ఎఫెక్ట్’ గా చెప్పుకొనే మరో వివాదం ఆయనను చుట్టుముట్టింది. నడవడికకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న క్రిస్ పించర్ ను డిప్యూటీ చీఫ్ విప్ గా జాన్సన్ నియమించారు. అతని నియామకం విషయంలో అనేక అభ్యంతరాలు వచ్చాయి. తాగిన మత్తులో పలువురితో అతను దురుసుగా ప్రవర్తించడంపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంలో జాన్సన్ క్షమాపణలు చెప్పాల్స వచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో జాన్సన్ పై విశ్వాసం కోల్పోయిన మంత్రులు ఒక్కరొక్కరుగా రాజీనామాలు సమర్పించారు. ముందుగా రిషి సునాక్, సాజిద్ జావిద్ రాజీనామా చేయగా, ఆ తర్వాత మంత్రుల రాజీనామాల పరంపర మొదలైంది. చేసేది లేక చివరకు జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. వీటితో పాటు జాన్సన్ పార్టీకి చెందిన అనేక మంది ఎంపీలపై లైంగిక వేదింపుల ఆరోపణలు కూడా వచ్చాయి. అవినీతి, అక్రమాలు, దుష్ప్రవర్తన, దుందుడుకుతనం, క్రమశిక్షణారాహిత్యం మొదలైన అనేక చెడ్డపేర్లు జాన్సన్ ప్రధానిగా తన పరిపాలనా కాలంలో మూటగట్టుకున్నారు. తర్వాత వచ్చే ప్రధానమంత్రి ఎదురుగా అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా బోరిస్ జాన్సన్ తెచ్చిన అప్రతిష్ఠను తొలగించాల్సి ఉంది.
Also read: జగన్నాథుని రథచక్రాల్