——-
(‘OF WORK’ FROM ‘ THE PROPHET’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
————–
ఒక పొలం దున్నే రైతు, ” మాకు శ్రమ గురించి చెప్పండి.” అని ఆల్ ముస్తఫాను అడిగాడు.
ఆయన ఇలా చెప్పాడు :
అవని తోనూ, అవని ఆత్మతోను
మమేకమై పనిలో ముందుకు సాగు!
సోమరిగా ఉన్నావంటే
రాబోయే ఋతువులకు నీవు
అపరిచితుడవవుతావు !
అనంత కాలంలోకి, గర్వంగా, హుందాగా సాగే
నీ జీవన యానం నుండి విడిపోబోకు!
శ్రమిస్తే,
నీవొక వేణువవుతావు!
సాగే కాలం చేసే గుసగుసలు
ఆ వేణువు హృది నుండి
మధుర సంగీతం గా వెలువడతాయి!
అందరూ కలిసి గానం చేస్తుంటే
మీలో ఎవరు
రెల్లులా మూగగా, మౌనంగా
ఉండ గలుగుతారు?
‘శ్రమ — ఒక శాపం
కాయకష్టం– దురదృష్టం‘
అని మీకు చెప్పబడింది!
కానీ నేనంటానూ–
మీరు శ్రమిస్తుంటే
భూమాత సుదూర స్వప్నాన్ని
కొంతవరకు సాకారం చేసినట్లే!
ఆ పని, ఆ స్వప్నం జనించి నపుడే
నీకు నిర్దేశిత మైంది
శ్రమతో మమేకమై తే
నీవు నిజానికి
జీవితాన్ని ప్రేమిస్తున్నావని అర్థం!
శ్రమిస్తూ, జీవితాన్ని
ప్రేమించడం అంటే
జీవన అంతర్గత రహస్యానికి
సన్నిహితుడివవడమే!
నీ దుఃఖంలో,
‘పుట్టుక– బాధాకరం
పోషణ,— ఒక శాపం
ఇది నా నొసటి రాత‘. అనుకుంటావు!
నేనంటానూ —
“శ్రమిస్తే , నీ నుదుటి రాత
నీ స్వేదంతో తడిసి చెరిగిపోతుంది. ”
“జీవితం అంధకార బంధురం ”
అని అంటుంటారు.
అలసి సొలసిన వారు చెప్పే మాటలు
అలసట లో నీవు ప్రతిధ్వనిస్తావు!
నేనంటానూ —
జీవన కాంక్ష లుప్తమైతే
జీవితం అంధకారమవుతుంది!
జ్ఞానం లేకపోతే
కాంక్ష గుడ్డిదవుతుంది.
శ్రమ లేకపోతే
జ్ఞానం వృధా!
ప్రేమ లేకపోతే
నీ శ్రమ వృధానే!
ప్రేమతో శ్రమ చేస్తే
నీకు నీతో, ఇతరులతో,
చివరకు ఆ దైవంతో బంధం బలపడుతుంది.
ప్రేమతో కృషి అంటే ఏమిటి?
మీకు ప్రియాతి ప్రియులు
ధరిస్తారనే తపనతో
నీ గుండె నుండి దారాలు తీసి
వలువ, నేత నేసినట్లు!,
నీ బాంధవులు
ఆ గృహంలో నివాసముంటారనే
ఆరాటంతో–
ప్రేమతో ఇల్లు కట్టినట్లు!
నీ ఆప్తులు తింటారన్న యోచనతో
సున్నితంగా విత్తులు నాటి,
ఆనందంగా ఫల సాయాన్ని కోసుకున్నట్లు!
ఇంకా, ప్రేమతో శ్రమించడమంటే–
నీ ఆత్మ శ్వాసతో, నీ దైన శైలిలో
అన్నింటినీ ఉత్తేజపరచడమే!
ఆశీర్వదింపబడిన విగతులైన నీ పూర్వీకులు
నీ చుట్టూ నిలబడి పర్యవేక్షిస్తున్నారని
తెలుసుకోవడమే!
నిద్రావస్థలో నీవిలా మాట్లాడుతున్నట్లు
తరచుగా వింటూ ఉంటాను.
“పాలరాతితో శిల్పాలు చేసే శిల్పి
ఆ రాయిలో తన ఆత్మ స్వరూపాన్ని దర్శిస్తాడు
ఆ శిల్పి ఒక రైతు కన్నా ఉన్నతుడు!” అని,
“ఇంద్రధనస్సును పట్టుకుని
తన నేసే వస్త్రంలో బంధించే నేతన్న
పాదరక్షలు చేసే వారి కన్నా మిన్న!” అని.
కానీ నేను మధ్యాహ్న సమయంలో
పూర్తి జాగ్రదావస్థలో ఉండి ఇలా చెబుతాను.
“గాలి మహా వృక్షాలతో తీయగానూ,
గడ్డిపరకలతో మరో రకంగానూ
మాట్లాడుతుందని నేననుకోను.”
తన ప్రేమానుభూతితో
గాలి స్వరాన్ని
సుమధుర గానంగా మలిచే
మనిషే గొప్పవాడు!
ప్రేమకు ప్రతిరూపమే — శ్రమ
మీరు ప్రేమతో శ్రమ చేయలేకపోతే,
చేసే పనిని అసహ్యించుకుంటే,
మీరా పనిని వదిలేయడం మంచిది!
గుడి ద్వారం వద్ద కూర్చుని
ఆనందంతో శ్రమించే వాళ్లు వేసే భిక్షను,
అందుకోండి!
ఎందుకంటే,
అయిష్టంగా నీవు చేసే రొట్టె
ఏ రుచీ లేక
తినేవారి క్షుద్భాదను సగమే తగ్గిస్తుంది!
ద్రాక్ష లపై పగ పెట్టుకుంటే
నీవు చేసే పానీయం విషతుల్యమవుతుంది !
నీవు గానగంధర్వుడిలా పాడినా,
ఆ గానంలో ప్రేమ నింపకపోతే–
రాత్రీ, పగలూ మనుషుల చెవుల్లో
హోరు శబ్దం తప్ప
మరేమీ వినిపించ లేవు!
Also read: రెండు కవితలు
Also read: పాత ద్రాక్ష సారా
Also read: ‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన
Also read: భోజనం, పానీయం
Also read: సన్యాసి ప్రవక్త