- ఎన్ ఆర్ డీఐలో నమూనా ఇళ్ళ నిర్మాణం
- రూ. 2.34 లక్షలకే ఒక ఇల్లు సిద్ధం
- మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఆకర్షణ
సొంతిల్లు ఉండాలనేది అందరి కల. దానిని ఎక్కువమంది సాకారం చేసుకోలేకపోతున్నారన్నది పచ్చినిజం. అద్దె బతుకులతోనే సర్దుకుపోతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో సొంతిల్లు ఏర్పాటుచేసుకోవడం చాలామందికి అసాధ్యమనే కాలంలోకి వచ్చి కూడా చాలా కాలమైంది. ప్రధానంగా దిగువ మధ్యతరగతి, మధ్యతరగతివారి ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొస్తున్నప్పటికీ ఆచరణలో అందరికీ అందుబాటులోకి రావడం లేదన్నది చేదునిజం. వేలంవెర్రిగా పెరుగుతున్న భూముల ధరలు, వాటితో పోటీపడుతున్న నిర్మాణ వ్యయం అందరినీ భయపెడుతున్నాయి. గ్రామసీమల్లోనూ భూముల ధరలతో పాటు నిర్మాణ వ్యయం అంచనాలు మించిపోతున్నాయి.
Also read: జగన్నాథుని రథచక్రాల్
తెలంగాణలో తాజా పరిణామం
ప్రభుత్వ స్థలాలు పొందినవారు, సొంతభూమి ఉన్నవారు ఇంటినిర్మాణం వైపు మొగ్గుచూపిస్తున్నా పెరిగిపోయిన సామాగ్రి ధరలు, నిర్మాణకార్మికుల వేతనాలను చూసి ఎందరో వెనుకడుగు వేస్తున్నారు. నిర్మాణవ్యయం పరంగా చూస్తే ఇప్పటికీ కేరళ రాష్ట్రం అతితక్కువ ఖర్చుతో ఆదర్శప్రాయంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ తరహా విధానాలను అమలుపరుచుకోడానికి కొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాయి. ఈ ఒరవడికి తెలంగాణ తాజాగా ఉదాహరణగా నిలుస్తోంది. కేవలం 2.34లక్షల రూపాయల్లోనే ఇళ్ళు కడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నమూనా ఇళ్ళను సిద్ధం చేశారు. ఖర్చు తక్కువగా కనిపించడంతో నగరవాసులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఊర్లల్లో తమ పాత ఇళ్ల స్థానంలో, తమ భూముల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో ఇటువంటి కారుచౌక ఇంటినిర్మాణం వైపు మొగ్గు చూపే వారి సంఖ్య తెలంగాణలో క్రమంగా పెరిగే పరిణామాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ – రాజేంద్రనగర్ ఎన్ ఐ ఆర్ డి లోని గ్రామీణ సాంకేతిక పార్కులో నమూనా గృహాన్ని నిర్మించారు. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ కలిసి ముందుగా పరిశోధనలు నిర్వహించాయి. తక్కువ ఖర్చుతో గట్టి ఇంటిని ఎట్లా నిర్మించాలో తెలుసుకున్నారు. హాలు, పడకగది, వంటగది, స్నానాల గది మొదలైన అన్ని సదుపాయాలు ఈ తరహా నిర్మాణంలో అందుబాటులోకి తెస్తున్నారు. ఒక పడకగదిని 342 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు.పునాదుల దశ నుంచే స్థానికంగా దొరికే నిర్మాణ సామాగ్రితో రూపకల్పన చేశారు. పునాది నిర్మాణంలో పాత పద్ధతిని అనుసరించారు.రాళ్లతో పునాదులను లేపారు. ఇటుకలు, సిమెంట్ వినియోగాన్ని తగ్గించుకొనే క్రమంలో గోడలను ర్యాట్ ట్రాప్ బాండ్ పద్ధతిలో కట్టారు.
Also read: ఉసురు తీసిన ఉగ్రవాదం
కేరళ అగ్రగామి
1970 ప్రాంతంలో కేరళలో ఆర్కిటెక్ట్ లారీ బేకర్ ఈ తరహా నిర్మాణ పద్ధతిని మొట్టమొదటిసారిగా చేపట్టారు. కేరళలో ఎక్కడ చూసినా ఇప్పటికీ ఎక్కువగాపెంకుల శ్లాబుతో కట్టిన ఇళ్ళే కనిపిస్తాయి. దీనిని లారీ బేకర్ డిజైన్ అనిపిలుస్తారు. పెంకుల శ్లాబు వేయడం వల్ల ఎండాకాలంలోనూ ఇల్లు చల్లగా ఉంటుంది. ఈ తరహా నిర్మాణంలో కాంక్రీటు, సిమెంట్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు గోడల ప్లాస్టరింగ్ ను మట్టితో చేపట్టేవారు. ప్రస్తుతం కట్టిన నమూనా ఇళ్లు అదే విధానంలో రూపొందాయి. బయటవైపు అసలు ప్లాస్టరింగ్ చేయలేదు.అవుపేడ ఆధారంగా తయారుచేసిన ప్రాకృతిక పెయింట్ వేశారు.గచ్చుకోసం తాండూరు బండలను వాడారు.దీనివల్ల ఫ్లోరింగ్ అందంగా కనిపించడమే కాక, నిర్వహణ పరంగా ఇబ్బందులు కూడా చాలా తక్కువగా ఉంటాయని సమాచారం. ఈ నమూనా ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు కేవలం 683మాత్రమే ఖర్చయిందని ఎన్ ఐ ఆర్ డి అధికారులు చెబుతున్నారు.విద్యుత్ వాడకంలో సౌర విద్యుత్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంటి అవసరాలకు కావాల్సిన కరెంటును మేడపైనే ఉత్పత్తి చేసుకొనే విధంగా నమూనా ఇళ్లపై 2 కిలో వాట్ సౌర పలకలను ఏర్పాటుచేశారు.ఇంటి ఖర్చులో సౌర విద్యుత్ కోసం అదనంగా 1.06 లక్షల రూపాయలు ఖర్చయిందని అధికారులు అంటున్నారు.మొత్తంగా చూస్తే ఈ విధానం చాలా లాభదాయకంగా, ఆరోగ్యప్రదాయకంగా,ఆసక్తికరంగా కనిపిస్తోంది.ఈ తరహా ఇంటి నిర్మాణాలు సమీప భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ప్రభుత్వాలే కాక, సామాన్య ప్రజలు, ప్రైవేటు వ్యక్తులు,సంస్థలు కూడా ఇటువంటి నిర్మాణాలను చేపడితే డబ్బు ఆదా కావడంతో పాటు కాలుష్యాన్ని అరికట్టడానికి దోహదకారులుగా నిలుస్తారు. తెలంగాణ తరహాలోనే మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని విస్తరించాలి.ఇందులో, రాజకీయాలకు అతీతంగా కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాగితేనే ప్రజలకు జరగాల్సిన మేలు జరుగుతుంది.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచిత స్థలాలను కేటాయిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి కూడా సహాయకారిగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ -రాజేందర్ నగర్ నమూనా ఇళ్లను మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు భౌతికంగా పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో మంచిచెడు, లోటుపాట్లు తెలుస్తాయి.దేశంలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఏర్పాటవ్వడం దేశ ప్రగతికి చిహ్నం.
Also read: అమరనాథ్ యాత్రికులకు పొంచి ఉన్న ముప్పు!