మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. రేపు గురువారంనాడు శాసనసభలో తన మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించడంతో గత్యంతరం లేక ఉద్ధవ్ వైదొలిగారు. తనపైన తిరుగుబాటు చేసిన శాసనసభ్యులలో కొందరిని అనర్హులుగా ప్రకటించాలంటే ఉద్ధవ్ పెట్టుకున్న దరఖాస్తుపైన జులై 11న తీర్పు వెలువరిస్తానని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే, గురువారంనాటి పరీక్ష ఫలితం ఎట్లా ఉన్నప్పటికీ దానిపైన ప్రభావం 11వ తేదీ తీర్పుదే ఉంటందని కూడా కోర్టు చెప్పింది. అంటే గురువారం బలపరీక్షలో ఉద్ధవ్ ఓడిపోయినప్పటికీ కావాలనుకుంటే ఆయన 11వ తేదీ వరకూ పదవిలో కొనసాగవచ్చు. అట్లా చేయడం ఇష్టం లేని ఉద్ధవ్ ఠాక్రే పదవి నుంచి వెంటనే తప్పుకున్నారు.
నిజానికి రాజకీయ సంక్షోభం మొదలైన వెంటనే తప్పుకుంటానని ఉద్ధవ్ అన్నారు. కానీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయించిన సీనియర్ నాయకుడు శరద్ పవర్ వద్దని వారించారు. కొన్ని రోజులు ఆగుదామన్నారు. బుధవారంనాడు సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత తప్పుకోవడం అనివార్యమైంది. ఈ సంక్షోభానికి మూల కారణం ప్రస్తుత సంకీర్ణం అసహజమైనదనీ, ముప్పయ్ ఏళ్ళుగా సావాసం చేసిన బీజేబీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం విధాయకమని తిరుగుబాటు నాయకులు ఏక్ నాథ్ శిండే వాదిస్తూ వచ్చాడు. ఉద్ధవ్ ఫోన్ చేసినప్పుడు కూడా అదే సంగతి ఉద్ఘాటించాడు శిండే. ముందు సూరత్ కు ముంబయ్ నుంచి బస్సులో వెళ్ళి, అక్కడి నుంచి ప్రత్యేక విమానాలలోగువాహతి వెళ్ళిన తిరుగుబాటు ఎంఎల్ఏల సంఖ్య 22 నుంచి 39కి పెరిగింది. వీరికి తోడు ఇండిపెండెంట్ సభ్యులు సుమారు పదిమంది తిరుగుబాటుదారులతో ఉన్నారు.
‘సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవిస్తాం. ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించాలి,’ అని ఉద్ధవ్ ఠాక్రే ఫెస్ బుక్ సందేశంలో అన్నారు. ముఖ్యమంత్రి పదవికీ, శాసనమండలి సభ్యత్వానికికూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ నివాసానికి బయలుదేరి వెళ్ళారు. తిరుగుబాటు తర్వాత 56మంది శివసేన ఎంఎల్ఏలలో 15మంది మాత్రమే ఉద్ధవ్ వెంట ఉన్నారు. 41మంది దాకా తిరుగుబాటు బావుటా ఎగురవేసినవారిలో ఉన్నారు. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్ణవీస్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనను రేపోమాపో గవర్నర్ ఆహ్వానించవచ్చు.