మహాభారతంలో దృతరాష్ట్రుడు జేష్ఠపుత్రుడైనా అంధత్వం వల్ల సింహాసనాన్ని తమ్ముడు పాండురాజుకు వదులుకోవలసి వస్తుంది. ఈ కారణంగా అతనికి అంతరాంతరాల్లో ఈర్ష్య, ద్వేషం కలుగుతాయి. పాండురాజు చనిపోగానే తమ పిల్లలందరూ చిన్నవాళ్లు కాబట్టి రాజ్యాన్ని త్యాగం చేసిన భీష్ముడి అండతో సింహాసనం అధిరోహిస్తాడు. ఈ పరాధీనత తనలో ఆత్మన్యూనత కలిగిస్తుంది. పిల్లలలో పెద్దవాడైన ధర్మరాజును యువరాజు చేయవలసి వస్తుంది. కాని తన పుత్రుడు రాజు కావాలనే ఉబలాటంతో తనకు అంధత్వం వల్ల కలిగిన నష్టాన్ని తనకు జరిగిన అన్యాయంగా భావించి రాజ్యాన్ని విభజించి ధర్మరాజును ఇంద్రప్రస్థానికి రాజును చేస్తాడు. కాని తనలాగే దురాశా పరుడైన దుర్యోధనుడు మాయాజూదంలో పాండవుల రాజ్యాన్ని కాజేయడాన్ని, ద్రౌపది వస్త్రాపహరణాన్ని, ధర్మరాజు రెండవసారి కూడా జూదంలో ఓడి అరణ్య అఙ్ఞాత వాసాలకు వెళ్ళడాన్ని అరికట్టని అధర్మ ప్రభువు.
Also read: మహా భారతంలో ధర్మం
కురుక్షేత్ర యుద్ధం ఆపగలిగిన స్థానంలో ఉన్నా పుత్ర వ్యామోహంతో సర్వ నాశనానికి సిధ్ధపడతాడు. నీతి కోవిదుడైన విదురుని, భీష్మ, ద్రోణ, గాంధారిల మాటలను పెడచెవిన పెట్టి కొడుకుల, బంధువుల, ఆప్తుల మరణానికి కారకుడవుతాడు. తన పుత్రుడు కూడా తనలాగే రాజు కాలేని పరిస్ఠితిలో పుట్టిన ఉక్రోషం, క్రోధం భీముడిని తన కౌగిలిలో నలిపి చంపాలనే ప్రయత్నంతో దృతరాష్టృడి కపట నైజం బయట పడుతుంది. చివరకు పాండవుల పంచన ఉండలేక వానప్రస్థానానికి వెళ్లిపోతాడు.
అర్హత లేకపోయినా తనకు, తన పుత్రుడికి రాజ్యం దక్కాలన్న తీవ్రకాంక్షతో అధర్మాన్ని ఆలంబన చేసుకోవడం దృతరాష్టృడి పాత్రలో కనుపించే ప్రత్యేకత.
Also read: బలరాముడు విష్ణు అవతారమా?