ధర్మం అంటే బాధ్యత, న్యాయం, మతం అనే అర్థాలున్నాయి. ఉద్య్యోగ ధర్మం అన్నపుడు బాధ్యత అనే అర్థం వస్తుంది. బిక్షగాడు ధర్మం అన్నపుడు మిగాతావారిలాగా సంపాదించుకోలేని వాడిని కాబట్టి నాకు సహాయం చేయడం న్యాయం. అది సమాజంలో ఒకడిగా నీ బాద్యత అని అర్థం. అలాగే ఉత్తర భారతంలో ధర్మం అంటే మతం అనే అర్థం. ఈ ధర్మం అనేది మహాభారత పాత్రల్లో ఎలా ఉందో చూద్దాం.
శoతన మహారాజు పుత్రుడు, యువరాజు అయిన భీష్ముడు తండ్రి కోరుకున్న మత్స్యగంధితో ఆయన వివాహం జరిపిస్తాడు. ఆ సందర్భంగా తనకు రావలసిన రాజ్యాన్ని మత్స్యగంధికి పుట్టబోయే కొడుకుకు యిచ్చేస్తాడు. యోగ్యుడైన భీష్ముడిని రాజు చేయక పోవడం భీష్ముడికి, రాజ్య ప్రజలకు జరిగిన అన్యాయం. ఇది శంతనుడు చేసిన అధర్మం.
మహావీరుడు, జ్ఞాని అయిన భీష్ముడు కురుసామ్రాజ్య రక్షకుడిగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. కాని పాండవులకు జరిగిన అన్యాయాన్ని, ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకోలేదు. కారణం రాజభక్తి. హస్తినాపుర రాజైన ద్రుతరాష్ట్రుడికి విధేయుడై ఉండాలన్న రాజధర్మం. ఆచార్య ద్రోణుడు, కులగురువు కృపాచార్యుడు ఇదే బాట నడిచారు.
ధర్మరాజు ధర్మ స్వరూపం అంటారు. ఎన్నో విషయాల్లో ధర్మబద్ధంగా నడిచినా జూదానికి పిలిచినపుడు ఆడకపోవడం క్షత్రియ ధర్మం కాదంటూ రాజ్యంతోపాటు తమ్ముళ్ళను, భార్యను కూడా ఓడిపోతాడు. మాయాజూదమని తెలిసి రెండవసారి పిలిచినపుడు కూడా వెళ్లి ఆడి, ఓడి అరణ్య, అజ్ఞాత వాసాల పాలవుతాడు. కారణం క్షత్రియధర్మం.
అసూయాపరుడు, దురభిమాని అయిన దుర్యోధనుడు అర్జునుడికి సమజోడిగా కనిపించిన కర్ణుడిని చేరదీసి అంగరాజును చేస్తాడు. సూతపుత్రుడుగా భావించబడే కర్ణుడు దుర్యోధనుడిపట్ల కృతజ్ఞతతో చివరివరకు స్నేహధర్మం పాటిస్తాడు.
ధృతరాష్ట్రుడికి చూపులేని కారణంగా తమ్ముడు పాండురాజు రాజవుతాడు. ఆతను చనిపోయిన తర్వాత భీష్ముడి అండతో ధృతరాష్ట్రుడు రాజవుతాడు. వారి పిల్లలలో ధర్మరాజు అందరికంటే పెద్దవాడు కాబట్టి అతన్ని యువరాజు చేయవలసి ఉంటుంది. తన పుత్రుడు రాజు కావాలని ధృతరాష్ట్రుడు పుత్ర ధర్మం అంటూ రాజ్యాన్ని రెండుగా చీలుస్తాడు. ఇచ్చినదాన్ని తిరిగి తీసుకోవడానికి జరిగే జూదానికి, అరణ్యవాసానికి అడ్డు చెప్పడు. కృష్ణుడి రాయబారాన్ని కూడా పుత్రుడి కోసమే కాదంటాడు.
కృష్ణుడు తను ధర్మంవైపు ఉంటానంటాడు. పాండవులతో బంధుత్వంకాని, అర్జునుడితో స్నేహంకాని తాను పాండవులతో ఉండడానికి కారణాలు కావు. ఇన్ని రకాల ధర్మాలలో ఈయన ధర్మం ఏ రకం. మనుషులు మానవత్వంతో బ్రతకాలన్నది ఈయన సిద్ధాంతం. నలుగురి మంచికోరి మనం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లే చట్టం, న్యాయం, ధర్మం. భీష్ముడి రాజధర్మం, కర్ణుడి స్నేహ ధర్మం, ధర్మరాజు క్షత్రియ ధర్మం, ధృతరాష్ట్రుడి పుత్ర ధర్మం లాంటివి పరిమితమైన, వ్యక్తిగత విలువలు. వీటిలో సమస్త మానవాళికి మంచి చేసే విలువలు లేవు. కాని కృష్ణుడు అర్జునుడికి బోధించిన బంధు ధర్మం వదలి చెడుపైన యుద్ధం చేసి మంచిని నిలబెట్టాలన్న సిద్దాంతం నిజమైన ధర్మం. ఈ ధర్మాన్ని పాటించని భీష్మ, ద్రోణాదులు కూడా మట్టిలో కలిసి పోయారు. యుద్ధం మొదలయ్యేముందు ఎవరి బోదన లేకుండానే యుద్ధ భూమిలో అధర్మపరులైన కౌరవులను వదలి ధర్మపరులైన పాండవుల వైపుకు వచ్చిన యుయుత్సుడు ఆదర్శ ప్రాయుడు. సమాజంపట్ల బాధ్యతతో చెడును తుంచి, మంచిని పెంచే మానవతే ధర్మం.
Also read: బలరాముడు విష్ణు అవతారమా?
Also read: “ప్రేమ తగ్గితే”
Also read: “రక్షణ”
Also read: “నటనాలయం”