తండ్రిపాత్రలో సాయిచంద్
ఆయనో.. మార్గనిర్దేశనం.
ఆయనో …మరుపురాని జ్ఞాపకం
ఆయనో.. మురిపించే మంచితనం
ఆయనో ..మసకబారని మానవత్వం
ఆయనే… నాన్న…..
‘‘నాన్నంటే ఓ ధైర్యం..
నాన్నంటే ఓ బాధ్యత..
చిటికెన వేలు పట్టుకుని నడక నేర్పినా, చూపుడు వేలుతో ప్రపంచాన్ని పరిచయం చేసినా.. అది నాన్నకే సాధ్యం. తన రూపాన్ని, వారసత్వాన్ని అస్థిత్వాన్ని పంచే నాన్న.. ప్రతి బిడ్డకు కనిపించే ప్రత్యక్ష దైవం…
ప్రేమకు చిరునామాగా…
భవిష్యత్‌కు పునాదిగా…
జీవితానికి ఆలంబనగా నిలిచేది నాన్న…
ఆయనకు తన కుటుంబమే ప్రపంచం.. పిల్లలే ఆయన జీవితం…
‘‘బిడ్డను నవమాసాలు మోసేది అమ్మ అయితే.. ఆ బిడ్డ జీవితాన్ని మోసేవాడే నాన్న.. ప్రేమకు చిరునామాగా ఉంటూ.. బిడ్డ భవిష్యత్‌కు పునాదులు వేస్తూ.. ఆరుపదుల వయస్సు దాటినా.. బిడ్డ జీవితానికి ఆలంబనంగా ఉంటూ.. నిత్యం బిడ్డకోసం పరితపించే వాడే నాన్న.
ఒక గురువుగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, బాధ్యత గల పౌరుడిగా, ఓ మార్గదర్శకుడిగా అన్ని రకాల పాత్రలు ఆయన పోషిస్తాడు. తొమ్మిది నెలలు ప్రసవ వేదనను అనుభవించి తల్లి మాతృత్వాన్ని చాటితే… తల్లి ఒడిలో నుంచి తన జీవితాన్ని మలుచుకుని, ఓ ఇంట్లో ఒదిగేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ తండ్రి పితృత్వాన్ని చాటుతాడు.
నాన్నంటే కుటుంబానికి చుక్కాని. బాధ్యతలు మోసే పెద్ద దిక్కు… మార్గదర్శి… పిల్లలు ప్రయోజకులైతే అతడి ఆనందానికి అవధులు ఉండవు. ‘నాన్నా’ అని పిలిస్తే చాలు మంచులా కరిగిపోయి సంబరపడిపోతాడు. అలాంటి నాన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..
అయితే, సమాజంలో అమ్మకు ఇచ్చిన ప్రాధాన్యం నాన్నకు లేదన్నది జగమెరిగిన సత్యం. సృష్టిలో తల్లి.. బిడ్డకు జన్మనిస్తే.. నాన్న జీవితాన్నిస్తాడు. పెంపకంలో కఠినత్వమున్నా.. ఉన్నతమైన భవిష్యత్‌నిస్తాడు.
అయితే, రెక్కలొచ్చేదాక నాన్న అని పిలిచి రెక్కలొచ్చాక ఆయన్నే కాదని వెళ్లిపోతున్న ఆధునిక పోకడల ప్రపంచం నేడుంది. తమకు జీవితాన్నిచ్చిన తండ్రులను రోడ్లమీద, బస్టాండుల్లో, వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న ప్రస్తుత పరిస్థితులివి. అలాగే, ఆప్యాయతానురాగాల కోసం ఎదురు చూస్తూ.. ఈ లోకాన్ని వదిలి వెళ్లినా… కడచూపు చూసేందుకు కూడా రాని పిల్లలున్న దౌర్భాగ్యపు పరిస్థితులున్న రోజులివి. నాన్న ఆస్తులను, అతడిచ్చే ధనాన్ని చూసి వాటాలు వేసుకుని నాన్నని పట్టించుకోని పిల్లలున్న దారుణమైన పరిస్థితులివి.
తండ్రులపట్ల మరచిపోయిన మన కర్తవ్యాన్ని గుర్తుచేయడానికి పాశ్చాత్యులు ఏర్పాటుచేసుకున్న దినాలలో తండ్రుల దినోత్సవం(ఫాదర్స్ డే) ఒకటి. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మ లాలిపాట ఎలాగో నాన్న నీతి పాటలు జీవితంలో అలాగ పనికివస్తాయి. లోకంలో ఏ నాన్నకైనా కన్నబిడ్డతోడిదే లోకం. తనకన్నా మిన్నగా బిడ్డ ఎదగాలని కలలు కనేది ఒక్క నాన్నే..
జీవితంలో కష్టాలను ఈదలేని స్థితిలో ఉన్నపుడు నాన్నకు ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడినా..
నిశ్శబ్దంగా ఆయన మోమువైపు కొన్ని క్షణాలు చూసినా కొండంత ధైర్యం లభిస్తుంది….
అవును ఆయన గగనంలా ఎక్కడికెళ్లినా మనతోనే ఉంటాడు…
నిరంతరం మనల్ని కాపు కాస్తూనే ఉంటాడు…
ఆయన మన వెనుక ఉండి మనల్ని నడిపిస్తూ..మన వెనుకే ఆగిపోతున్న నిస్వార్ధ జీవి…
బొమ్మలు కావాలని మారాం చేసినప్పటి నుంచి బ్రతుకు బండిని సరిదిద్దుకునే వరకు నాన్నే ఆధారం.
నాన్న కష్టానికి ప్రతిఫలం ఇచ్చే బిడ్డలు ఉండటం గొప్ప విషయం. ఆయన్ని వంతులు వేసి పంచుకునేంత దిగజారిపోవడం అత్యంత బాధాకరం.
మన రక్తంలో నాన్న…
ఓటమిలో ఓదార్పు నాన్న..
గెలుపులో ధైర్యం నాన్న…
నాన్న ఓర్పుకు మారుపేరు…
మార్పుకి మార్గదర్శి…
నీతికి నిదర్శనం..
మన ప్రగతికి సోపానం …
అందుకే నాన్నకి మించిన దైవం లేదు…
నాన్నను అర్థం చేసుకుందాం…
అలాంటి మహోన్నత ప్రత్యక్ష దైవాన్ని ఆప్యాయతతో చూసుకుందాం…
తన ఆఖరి శ్వాస వరకు మన ఉన్నతి కోసమే పరితపించేవాడు నాన్న….
తాను బాగున్నా బాగోక పోయినా, తన కడుపు నిండినా నిండక పోయినా మన కడుపులు నింపడానికి, మన బాగోగులు చూడడానికి అనుక్షణం కరిగిపోతూ, అందులో ఆనందం వెదుక్కుంటూ తన చివరి శ్వాస వరకు పరితపించేవాడే నాన్న… అందుకే నాన్న ఎప్పటికీ హీరోనే…
అలాంటి నాన్నకు, అలాంటి ఎందరో నాన్నలకు శత సహస్ర వందనాలు…
నాన్నను గుర్తు చేసుకునే తండ్రుల దినోత్సవం (ఫాదర్స్ డే) సందర్బంగా నాన్నలు కల్గిన అందరికీ శుభాభినందనలు…
–దాసరి దుర్గా ప్రసాద్
(జూన్ 19న ఫాదర్స్ డే సందర్భంగా)