Sunday, November 24, 2024

‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన

రచయిత– నందిగం కృష్ణా రావు

పుస్తక సమీక్ష

 ‘వెనక దగా, ముందు దగా

 కుడి ఎడమల  దగా, దగా.

  ..జీవ ఫలం చేదు, విషం.’…శ్రీ శ్రీ

 “Behind every great fortune, there is a crime”—Balzac.

దోపిడీకి  హద్దులు, పరిమితులూ లేవు. అది విశ్వ వ్యాప్తం. కుల, మత, జాతి, వర్గ, వర్ణాల కతీతం.

డబ్బు…డబ్బు – సంపాదించడమనేది లోకంలో అతి పెద్ద మందు లేని జబ్బు. ప్రజలు ‘ దోపిడి చేయటానికి’, ‘దోపిడీ చేయించుకోబడటానికి’ అను  రెండే options ఉన్న  వాళ్లుగా  మిగిలి పోతారు. ఈ నిస్సహాయతకు  మూలాలెక్కడ ఉన్నాయ్ ??

ప్రజాస్వామ్యంలో  న్యాయాన్ని, చట్టాన్ని నిలబెట్టేవి – న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ.

ఆ వ్యవస్థలే కుళ్ళి పోతే ?? వాటికి కారణం ఏమవుతుంది? ఎవరవుతారు ? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా,  లంచగొండితనంలో ఆసియాలో  తన ప్రధమ స్థానాన్ని  పదిలంగా నిలబెట్టు కుంటోంది. ఇంత  గొప్ప చరిత్ర ఎలా సాధించగలిగాం! వీటికి  పరిష్కారాలేమిటి ?

 ….. ఇది పెద్ద కథా ? నవలా ? ఏమో ! విజ్ఞులు తేల్చాలి. కథైతే –ఇది ఓ పంచతంత్రం లాంటిది. ఓ కాశీ మజిలీ కథ లాంటిది. నవలైతే  జీవిత దర్పణం.

కథైతే — ఇది అంతు లేని కథ! నవలైతే — ఈ నిర్జీవ జీవితాలు  సజీవంగా సాగుతూనే ఉంటాయ్.

‘Art lies in concealing art.’–Oscar Wilde. ఇది కళాత్మకంగా చెప్పిన కథ.

పాత్రల  ఔచిత్యాలు, శిల్ప సౌందర్యాలు విడిగా విడమర్చి చెప్పాల్సిన పని లేదు. రచయిత  మెదడు  నుంచీ వెలువడే అలలు, పాఠకుల మనసుల్లో, ఏపాటి అల(ల)జడి సృష్టిస్తాయో – – అనే దాని మీద రచయిత రచన ఫలవంతమైనదా, లేదా అనేది తెలుస్తుంది.

ఓకే ఒక్క సంఘటన

ఒక మరణం

మరణించిన జీవి ఆత్మ — తన కథ చెప్పుకుంటుంది. చందమామ లోని బేతాళ కథలోలా తెలిసీ జవాబు చెప్పలేక పోతే, విక్రమార్కుడి తల వేయి వ్రక్కలౌతుందన్నట్లు, ఈ కథ చదివిన పాఠకుల మెదడూ–నిజాలు తెలిసీ భరించ లేక వేయి వ్రక్క లౌతుంది.

చిన చేపను పెద చేప, పెద చేపను తిమింగలం మింగేసే  ఈ వ్యవస్థలో  మార్పు ఎప్పుడు? దోపిడీ ఆగే దెప్పుడు?

 “I am ready to be exploited” అనే బోర్డులు మెడలో తగిలించుకొని తిరిగే  అవస్థలు, వ్యవస్థలు మారే రోజెప్పుడు? అని రచయిత పరోక్షంగా  ప్రశ్న లేని జవాబు సూచిస్తున్నాడు.

ఈ నవల పాలపిట్టలో  సీరియల్ గా వచ్చినంత కాలం, ఈ రచయిత స్వకులం నుంచీ విన్న ఆర్తనాదాలు , సనాతన వాదులచే  తిట్టించుకున్న  బండ బూతులు , శాపనార్ధాలు ఎన్నో, ఎన్నెన్నో! తిట్లు, శాపనార్ధాలు తగిలాయంటే రచయిత  తన పనిలో  సఫలీకృతుడైనట్లే  లెక్క. అదే ఈ పుస్తకం విశిష్టత.

“ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు  కదలిక” అన్నాడు  కాళోజీ. అవసరం లేదు. పది మంది ఆలోచనా స్రవంతిని ఆకట్టుకున్నా చాలు! ఆ మానసిక పరివర్తన ఈ జనంలో రాదా! చూద్దాం!!

 “A lawyer with a brief case is more powerful than a thousand army with guns “. ఇది Mario Puzo (God Father) టైంలో నిజమేమో. మతం, మాఫియా, రాజకీయం మాఫియా, న్యాయం, చట్టం మాఫియా అయిన ఈ రోజుల్లో  సమస్యలకు వేరే పరిష్కారాలు కావాలి.

ఈ పుస్తకంలో ఎక్కడా హత్యలు అనేవి లేవు. కనపడే  హంతకులు లేరు. లేకుండా  ప్రజా జీవితం అంతా  క్రిమినాలిటీ  మరో రూపంలో  ఎంత విస్తరించి ఉందో తెలుస్తుంది. మనం  పైకి వెళ్లాలంటే ఎదుటి వాడిని చంపనక్కర లేదు. వాడి  ఆర్థిక మూలాలు దెబ్బ తీసి, వాటిని మనం కలుపుకుంటే చాలు!

చట్టమైన  ప్రతీది  న్యాయం కాదు. ఈ లొసుగుతో  – చట్టప్రకారమే  నిర్లజ్జగా  అన్యాయం  కరాళ నృత్యం చేస్తూ ఉంటుంది.

 ఇంకా మనం మానవ హక్కుల పరిధి  లోనే పోరాటాలు సాగిస్తున్నాం! వాటిని  రివ్యూ చేసుకోవాల్సిన అవసరాన్ని  విజ్ఞులు  గుర్తించాలి. రాజ్యాంగం  మనకు ప్రసాదించిన మేధావుల ఆత్మలను మనం అవలోకనం చేసుకొని  ముందడుగు వేయాలేమో.

ఒక రకంగా ఈ కాలంలో  జైలు జీవితం, బయటి జీవితం కన్నా మెరుగేమో! రేపటి తిండి గురించి చింత లేదు, బట్ట గురించి చింత లేదు. ఆచరణలో పెట్టనంత వరకు మన ఆలోచనలకు హద్దులు పెట్టరు. అంత కన్నా నికృష్ట జీవితం గడిపే వాళ్ళు బయట మన చుట్టూనే ఉన్నారు కదా!

ఈ నవల/కథ లో  లాయర్లు చట్ట ప్రకారమే నడుచు కుంటారు. ఎక్కడా చట్ట విరుధ్ధంగా వ్యవహరించరు. చట్టానికి కావాల్సిన సాక్ష్యాధారాలు బహు జాగ్రత్తగా అల్లుతారు. రచయిత అన్నట్లు “కోర్టులు కూడా ధర్మాన్ని, న్యాయాన్ని చూడవు. మనుషుల కష్టాన్ని చూడవు. లిటిగేషన్లో ఇరుక్కుని గిల గిల లాడుతున్న వాళ్ళ పరిస్థితిని గమనించవు. చట్టం అలా ఉంది కనుక  మేం ఏమీ చేయలేము అన్నట్టుగా కర్మకి ప్రతినిధులుగా  నడుచు కుంటాయ్. మనుషులు చేసిన చట్టం కొందరు స్వార్థ పరుల చేతిలో  ఆయుధంగా మారిన సంగతి వాళ్లకు పట్టింది.”(176 పేజి)

రచయిత చెప్పిన కథ రెండు ముక్కల్లో– ఒక సురేంద్ర రెడ్డి అనే ఫోర్త్ క్లాస్ ఉద్యోగి, ఆక్సిడెంట్ లో చనిపోతే, అతనికి వచ్చే నష్ట పరిహారాలు, ఇన్సూరెన్స్ డబ్బులు , అతని భార్యా, పిల్లలకు రాకుండా — ఎప్పుడో సంబంధాలు తెగి పోయిన సురేంద్ర రెడ్డి తల్లి దండ్రులు  అడ్డం తిరగడం, ఒంటరి ఆడదైన స్వప్న(సురేంద్ర రెడ్డి భార్య) చాక చక్యంగా వాళ్ళని తప్పించి నెగ్గుకు రావడం– టూకీగా ఇదీ కథ.

దీన్లో  భాగంగా  డాక్టర్లు తినే అవినీతి గడ్డి మెతుకులు, పోలీసులు  ‘ధర్మంగా’ , ఆనవాయితీగా  పోగేసుకునే  రక్తపు కూడు,  లిటిగేషన్ లాయర్ల కుమ్ములాటలూ, ఎత్తుకు పై ఎత్తులూ, శవాన్ని తగల బెట్టించి సంప్రదాయం ముసుగు చాటున పురోహితులు చేసే నీతి మాలిన చర్యలూ — ఇంత  సీరియస్ కథనీ వ్యంగంతో, హాస్యంతో నింపి చివర వరకు పుస్తకం కింద పెట్టకుండా చదివిస్తారు రచయిత కృష్ణా రావు గారు.

మనందరం  చట్టం చేతిలో , వ్యవస్థ చేతిలో ఇంత దారుణాలకు  గురవుతున్నామా! నిజమా! అని ఆశ్చర్య పోతాం. రచయిత ప్రజలను ప్రేమించే మనిషి కాబట్టి  ఆయన అనుభవాలు నమ్ముదాం.

ఒక రావి శాస్త్రి, ఒక బీనా దేవి, ఒక పతంజలి  ఏ న్యాయం కోసం తపించారో, ఏ దుర్మార్గాలని, దోపిడీలని  ఖండించారో– రచయిత కూడా అదే పనికి పూనుకున్నట్లు  మనకు ప్రతీ పేజీ లోనూ స్పష్టం అవుతుంది.

ఈ  పుస్తకం ఒక సారి చదివి పారేసుకునేది కాదు. రెండు రోజు లాగి , మళ్ళీ చదవండి. రెండు నెలలు ఆగి మరలా చదవండి. కొత్త నిజాలు మన మనసుల్లో దూరి  తొలుస్తూ ఉంటాయి! కిందటి దశాబ్దంలో  వచ్చిన ప్రజా సాహిత్యంలో  ఈ పుస్తకం స్థానం ప్రత్యేకం. ముగింపు లేని ఈ  పరిశీలనను అయిష్టంగా ముగిస్తున్నాను.

(ఈ పుస్తకం నవోదయ బుక్ హౌస్ లో దొరకవచ్చు.)

-డా. సి. బి. చంద్ర మోహన్

Moblile Number: 9440108149

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles