Sunday, November 24, 2024

ఇదేమి ఆగ్రహం?

  • సత్యాగ్రహమా, ధర్మాగ్రహమా, దురాగ్రహమా?
  • గాంధీలకు సమన్లు పంపడం ప్రజాసమస్యా?
  • సత్యాగ్రహం చేయాలంటే ప్రజాసమస్యలే లేవా?

ఏది పుణ్యం -ఏది పాపం-

ఏది సత్యం -ఏదసత్యం

ఏది కారణమేది కార్యం –

ఓ మహాత్మా! ఓ మహర్షీ! “

అనే శ్రీ శ్రీ కవితా పంక్తులు గుర్తుకొస్తున్నాయి నేటి కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’ నినాదం వింటుంటే. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు రకరకాల మలుపులు తీసుకుంటూ నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల బాట పట్టారు. బిజెపి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని హింసిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల ఆరోపణ. నేషనల్ హెరాల్డ్ పత్రికను మూయించాలన్నది బిజెపి కుట్రగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కోవిడ్ తో సోనియాగాంధీ ఆస్పత్రికే పరిమితమై ఉన్నారు. రాహుల్ గాంధీ గత మూడు రోజులుగా వరుసగా ఈడీ విచారణకు వెళ్లి వస్తున్నారు. ఈ విచారణ ఇప్పటికే కొన్ని గంటలపాటు సాగింది. మరిన్ని రోజులు లేదా మరిన్ని విడతల్లో సాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాహుల్ గాంధీని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొంత వినపడుతోంది. కోవిడ్ నుంచి బయటపడ్డ తర్వాత సోనియాగాంధీ కూడా విచారణకు హాజరు కావాల్సిఉంది. తల్లికొడుకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటారా  అన్నది ప్రశ్న. నిజంగా అదే జరిగితే పెద్ద సంచలనమే అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.

Also read: కేసీఆర్ కలలు సాకారం అవుతాయా?

కేసు తేలాల్సింది న్యాయస్థానంలో, వీధులలో కాదు

అరెస్టుల అంశాన్ని అలా ఉంచగా, కాంగ్రెస్ అగ్రనేతలను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ చూపించే ‘సత్యాగ్రహం’లో సత్యముందా? ధర్మముందా? దీనిని ధర్మాగ్రహం అనాలా అన్నది చర్చనీయాంశం. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఈ విన్యాసాలకు ఎటువంటి విలువలేదన్నది ఎక్కువమంది అభిప్రాయం. అధికారపక్షంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ‘నేషనల్ హెరాల్డ్’ కేసు అంశాన్ని ఎంచుకోవడం ఏమాత్రం సహేతుకం కాదని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘సత్యాగ్రహం’ అనేది గొప్ప మాట, అది గొప్ప ఆచరణాశీలమైన మార్గం. ప్రస్తుత రాజకీయ యుగంలో అంత ఉదాత్తమైన మార్గానికి ఆచరణలో తావే లేదని అనుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్’ అని బిజెపి బడా నేతలు విమర్శించేవారు. ఇప్పుడు బిజెపి అధికారంలో ఉన్న వేళ, ప్రభుత్వ ఏజెన్సీలన్నింటినీ రాజకీయ కక్షలను తీర్చుకోడానికి అధికార పార్టీ ఉపయోగిస్తోందని కాంగ్రెస్ వగైరా ప్రతిపక్షాలు అంటున్నాయి. రాజకీయ, అధికార కాలచక్రంలో ఇటువంటివి షరా మామూలైపోయాయని రాజనీతిశాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసుల అంశం సుప్రీంకోర్టు, ఈడీ, ఇన్ కమ్ టాక్స్ వంటి వ్యవస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇటువంటి పెద్దకేసులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, పార్టీలకు సంబంధించిన కేసులు తేలేసరికి ఏళ్ళుపూళ్లు పడతాయని గడచిన చరిత్ర చెబుతోంది. అధికారపక్షంపై యుద్ధం చేయడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రజాపక్షం వహిస్తూ పాలకపార్టీలపై పోరాటం చేయడం, సత్యాగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రతిపక్షాల నైతిక హక్కు. బిజెపి ప్రభుత్వం పాలనలోకి వచ్చి ఇప్పటికి ఎనిమిదేళ్లయ్యింది. ఈ ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన గొప్ప పోరాటాలు పెద్దగా ఏమీలేవనే అనుకోవాలి. ఉభయ సభల్లోనూ, ప్రజాదర్బారులలోనూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వైఫల్యం చెందిందనే ఎక్కువమంది భావిస్తున్నారు. నేడు రాష్ట్రపతి ఎన్నికల అంశం రగులుతున్న వేళ కూడా  కాంగ్రెస్ కంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎనిమిదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లోనూ అధికార బిజెపిని ఎండగట్టి గెలిచిన దాఖలాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో లేవు. బిజెపినే కాదు, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల వైఫల్యాలను అడ్డుకొని, ప్రజలకు వివరించి విజయం సాధించిన ఉదాహరణలు కూడా లేవు. ఈ ఎనిమిదేళ్లలో ఇంతటి విఫల చరిత్రను మూటకట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు సత్యాగ్రహం… అంటూ బయలుదేరితే.. అటు రాజకీయ క్షేత్రంలోనూ -ఇటు ప్రజాభూమిలోనూ ఎటువంటి విలువ, గౌరవం, ప్రయోజనాలు దక్కవని మెజారిటీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also read: ఉత్కృష్టమైన సాహిత్యోత్సవం ‘ఉన్మేష’

తెలుగు ప్రముఖుల సంపాదకత్వం

నేషనల్ హెరాల్డ్ ఘన చరిత్ర కలిగిన పత్రిక. దేశ స్వాతంత్ర్య పోరాటయుగంలో, బ్రిటిష్ వారి ఆగడాలను రచ్చకీడ్చడానికి,  ప్రజలకు ధైర్యసాహసాలను నింపడానికి, చైతన్యం రగిలించడానికి, కర్తవ్యోముఖులను చేయడానికి గొప్పసంకల్పంతో పుట్టిన గొప్ప పత్రిక. గొప్ప దేశభక్తులు భాగస్వామ్యులుగా నిర్మాణమైన గొప్ప చరిత దానిది.  ‘అహింసో పరమో ధర్మః’ అనే సిద్ధాంతం, సత్యనిష్ఠ అనే ధర్మసూత్రం ఆలంబనగా ఆ పత్రిక ఆరంభమైంది. ప్రారంభంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రు సంపాదకుడుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ కరెస్పాండంట్ గానూ కొంతకాలం ఆయన ఉన్నారు. కానీ,ఆ తర్వాత నేషనల్ హెరాల్డ్ ను సంపాదకుల హోదాలో అద్భుతంగా నడిపిన చరిత్ర మన తెలుగువారిదే. వారిలో మొదటివారు కోటంరాజు రామారావు, రెండోవారు మానికొండ చలపతిరావు.వీరిద్దరికీ దక్కిన గౌరవం,స్వతంత్రత,స్వేచ్ఛలు చరిత్రాత్మకం. తదనంతర కాలంలో వేరే సంపాదకులు ఆ బాధ్యతలను వహించినా కోటంరాజు రామారావు, మానికొండ చలపతిరావు వేసిన ముద్రలు చాలా గొప్పవి. తెలుగువారందరికీ ఈ ఘనచరిత గర్వకారణం. ఇంతటి నేపథ్యం కలిగిన నేషనల్ హెరాల్డ్ పత్రిక చుట్టూ నేడు ఇంతటి వివాదం అలముకోవడం విషాదం. ఆధునిక,ప్రజాస్వామ్యయుత, అర్హమైన,సమభావనా సంహితమైన ఉదారవాద,సామాజిక సామరస్య విధానాలు,ధోరణుల మధ్య పత్రికలను నడుపుతామని, దాతృసంస్థగా చెప్పుకొనే ‘యంగ్ ఇండియా’ యాజమాన్యం  ఆ మధ్య ఒట్టేసి చెప్పింది. వినడానికి ఈ మాటలన్నీ చాలా బాగుంటాయి. నేటి కాలంలో, నేటి నేతలు ఏ మేరకు ఆచరణాశీలంగా ఉంటారన్నదే పెద్ద ప్రశ్న. మళ్ళీ నేషనల్ హెరాల్డ్ ఏ రూపంలో పైకి లేస్తుంది? దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? గాంధీలపై పెట్టిన కేసుల పర్యవసానం ఎలా ఉండబోతుంది? అన్నది అలా ఉంచుదాం. ఈ అంశంలో, సత్యాగ్రహం పేరుతో ఆందోళనలు చేయడం ఏ మాత్రం సరియైనది కాదని అనుకోవాలి. ఈ సందర్భంలో, నాగపూర్ కు చెందిన కాంగ్రెస్ నేత షేక్ హుసేన్ చేసిన వ్యాఖ్యలు,  కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి హైదరాబాద్ లో పోలీసుపై ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ కక్షలతో సత్యంకాని అంశాలపై కేసులు పెట్టడం, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం ఏ అధికార పార్టీ చేసినా క్షమార్హం కాదని విజ్ఞులు, రాజనీతిజ్నులు భావిస్తున్నారు.

Also read: సర్వమత సహనం, సమభావం మన జీవనాడి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles