Sunday, November 24, 2024

కార్పొరేట్ల మాయ.. గ్రేడ్ల గారడీతో విద్యావ్యవస్థకు తుప్పు


మార్కులు కాదు… కావాలి మార్పు!

పదో తరగతి ఫలితాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనా, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ పైనా విమర్శలు చేస్తున్నవారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచి రాష్ట్రంలో జరిగే వార్షిక పరీక్షల ఫలితాలు ఇలానే ఉండనున్నాయి. గతంలో చంద్రబాబు జమానాలో మాదిరిగా 99 శాతాల ఉత్తీర్ణతలు, వందకు వంద మార్కుల సిద్ధాంతాలకు, ప్రచార హోరుకు కాలం చెల్లింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఈ దరిద్రపు పోటీతో మన పరీక్షలు ఎప్పటికీ మారనంతగా దిగజారి ఒక ప్రహసనంగా మారిపోయాయి. నాలుగు రోజుల కిందటే టీడీపీ అనధికార పత్రిక ‘ఈనాడు’లోనే ఒక పెద్ద కథనం వచ్చింది. ఎనిమిదో తరగతి విద్యార్థికి కూడికలు రావడం లేదని వాపోయింది. ఇది శతశాతం వాస్తవం. ఆక్స్ఫామ్, అసర్ లాంటి సంస్థల సర్వేలలో నిగ్గు తేల్చిన నిజమది. హైస్కూలు విద్యార్థులకు సరిగా చదవడం, రాయడం రావట్లేదని నెత్తి కొట్టుకుంటున్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యత నానాటికీ అడుగంటుతున్నదని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంలో మన ముందున్న ప్రశ్నలు రెండు. చదువులు సవ్యంగా సాగకుండా వంద శాతం ఫలితాలు ప్రకటించుకోవడమా? లేదంటే ఫలితాల శాతాలు పట్టించుకోకుండా ప్రస్తుత సమాజంలో ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకునే విద్యార్థులను తయారుచేసుకోవడమా? ఏం చేద్దాం..!

విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కారాదు

ఒక గణితం తప్ప.. ఇతర ఏ సబ్జెక్టులోనూ వంద శాతం మార్కులు సాధించడం సాధ్యం కాదనేది విద్యారంగంలో ఉన్న వారందరికీ తెలుసు. కొన్ని దశాబ్దాల కిందట పిల్లలు ప్రథమ శ్రేణిలో అంటే అరవై శాతం మార్కులతో పాసైతే చాలు. అదో పెద్ద ఘనతగా భావించేవారు. టెన్త్, ఇంటర్ వంటి పరీక్షలలో విద్యార్థులు ఫెయిలవ్వడాన్ని టీచర్లు, తల్లిదండ్రులు అవమానంగా భావించేవారు కాదు. కానీ ప్రస్తుతం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలలో దాదాపు 32 శాతం విద్యార్థులు ఫెయిలవ్వడాన్ని తెలుగుదేశంతో సహా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. దాన్ని రాజకీయం చేస్తూ పరీక్ష తప్పినవారికి వత్తాసుగా మాట్లాడడమే కాకుండా, ఏకంగా ప్రభుత్వమే ఫెయిలైనట్లుగా ఆపాదిస్తూ విమర్శిస్తున్నారు. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయని గగ్గోలు పెట్టిన పార్టీలు.. ఇప్పుడు ఫలితాలను విమర్శించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. నిజంగా ప్రశ్నపత్రాలు లీకయితే ఫలితాలు ఇంత భిన్నంగా ఉండడం విరోధాభాస.

మరోవైపు కరోనా సాకు చూపించి గత రెండేళ్ల మాదిరిగానే పరీక్షలు జరపరాదని ముందు చేసిన రాద్ధాంతాన్ని తల్లిదండ్రులే ఈసడించారు. పరీక్షలు జరపకుండా అందరినీ ఉత్తీర్ణులు చేసుంటే ఈ రోజు ఫలితాలు తగ్గాయన్న విమర్శ ప్రభుత్వం ఎదుర్కొనేది కాదు. అప్పటికే కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు సరైన చదువులకు నోచుకోక గాలిపట్టిపోయారు. ఇంకోవైపు చదువుల పట్ల నిర్లక్ష్యం. దాన్ని తొలగించి చదువువైపు దృష్టి మరల్చకపోతే నష్టపోతామన్న ఉద్దేశంతోనే పరీక్షలు నిర్వహించారు. కార్పొరేట్ మాయలో పడి, గత ప్రభుత్వాలు అనుసరించిన శతశాతం టార్గెట్లతో పరీక్షల విధానం భ్రష్టు పట్టిపోయింది. మాస్ కాపీయింగ్ జాడ్యం వేళ్లూనుకుంది. కార్పొరేట్ కళాశాలల అడ్మిషన్లు పెంచుకోవడానికి ఈ దందాను ఆరంభించాయన్నది పెద్ద విమర్శ. ముఖ్యంగా చంద్రబాబు కార్పొరేట్ విద్యాసంస్థలకు జీ హుజార్ అంటూ కొమ్ముకాయడంతో ఎల్లవేళలా ముందుండడం వలన కరోనా ముందువరకు పరీక్షలలో ఫెయిలవ్వడం గగనంగా ఉండేది. పది పాయింట్లకు పదులు, తొమ్ముదులతో విద్యార్థుల ముఖాలు కళకళలాడేవి. కార్పొరేట్ కాలేజీలు నిండుకుండల్లా ఉంటూ కాసుల వేటలో మునిగితేలేవి. ఈ అపసవ్య విధానాలకు స్వస్తి పలకడం సాధ్యం కాదని విద్యావేత్తలు నిరాశలో మునిగిపోయారు. దీనిని మార్చడం చాలా పెద్ద రిస్క్. ఈ రిన్స్ తీసుకునే రాజకీయ నేతలు మన రాష్ట్రంలో పుట్టరని బాధపడేవారు. మామూలుగా అన్ని సబ్జెక్టులలో వందలాదిగా విద్యార్థులకు వందకు వంద మార్కులు రావడం సాధ్యమేనా? కానీ అన్ని వార్షిక పరీక్షల ఫలితాలదీ అదే తంతు. సాధ్యం కానిది అలా సునాయాసంగా సాధ్యపడుతుందంటే వ్యవస్థలో ఎక్కడో జరగకూడనిది జరుగుతున్నట్టే.

టెన్ ఫలితాలపై రాజకీయ రాద్ధాంతం అర్థరహితం

కొత్త ప్రభుత్వం ఈ అవ్యవస్థను మార్చడానికి నడుం బిగించింది. పరీక్షల్లో శతశాతం ఫలితాల కంటే అధ్యయనంలో నాణ్యత పై దృష్టి పెట్టమని రెండేళ్ల కిందటే విద్యాశాఖ కార్యదర్శి బుడితి రాజ శేఖర్ దాదాపుగా ప్రతి జిల్లాలోనూ తిరుగుతూ ఉపాధ్యాయులకు నూరిపోశారు. కలెక్టర్ల నుంచి శతశాతం వత్తిళ్లు ఉండబోవని చూచాయగా భరోసానిచ్చారు. ఉత్తీర్ణత కంటే విద్యార్థులలో నైపుణ్యాల మెరుగుదలకు కృషి చేయాలని ఆ సమావేశాలలో విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు హితవు పలికారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు జరగలేదు. లేకుంటే ఈ ఉత్తీర్ణత షాక్ రెండేళ్ల కిందటే తగిలేది. ఒక మంచి రాజకీయ వ్యవస్థ మనుగడకు బలమైన ప్రతిపక్షం ఊపిరిలూదుతుంది. కాని మన రాష్ట్రంలో విద్యార్థులు పరీక్షలను లైట్ గా తీసుకుని ఫెయిలయితే, ఒకరు ప్రభుత్వానిది తప్పంటారు. మరొకరు అమ్మ ఒడి డబ్బులు ఎగ్గొట్టడం కోసం విద్యార్థులను ఫెయిల్ చేయించారంటారు. ఇంకొకరు ఇంగ్లీష్ మీడియంవల్ల ఫెయిలయ్యారంటారు. అసలు కారణం విద్యార్థుల మానసిక స్థితి. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా పిల్లలందరూ టీవీలకు, మొబైల్ ఫోన్లకు వ్యసనపరులై పోయారు. పరీక్షలను సరదాగా తీసుకున్న విద్యార్థుల ఫలితాలు తారుమారయ్యాయి.

ఈ విషవలయంలో బయట పడేందుకు సంస్కరణలు

కార్పొరేట్ కబంధ హస్తాలలో ఉన్న ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, పిజీ కళాశాలల్లో లక్షలాది సీట్లను నింపి, యాజమాన్యాలకు లబ్దిని చేకూర్చే గత ప్రభుత్వాల విధానాల వల్ల భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థను రక్షించడానికి ఇదే సరైన మార్గం. ఫలితాల శాతం తగ్గాలి. మార్కులు వందకు వంద రావడం తగ్గాలి. ఇందుకు ఇప్పటి ప్రభుత్వం మూడంచెల సంస్కరణలు చేపట్టింది. మొదటి అంచెలో నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు అనువైన వాతావరణం (ఆంబియన్స్) సమకూర్చడం, రెండో అంచెలో ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అందించడం. నూతనంగా ప్రవేశపెట్టిన ఆంగ్ల మీడియం నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ ఒకవైపు అందిస్తూనే మరోవైపు విద్యార్థులు బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలు రూపొందించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మూడో అంచెలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఖాళీల భర్తీని ఇంకా ప్రారంభించవలసి ఉంది. ఈ మూడు దశలను తల్లిదండ్రుల కమిటీలు ఎక్కడికక్కడ సరిగ్గా అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటే నాణ్యమైన విద్యను పిల్లలందరూ ఆస్వాదిస్తారు.

గత ప్రభుత్వంలో టార్గెట్లు పెట్టి మరీ ఫలితాలు పెంచేశారు

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్లకు, పాఠశాలలకు టార్గెట్లు ఇచ్చేవారు. ఈ లక్ష్యాలను ఛేదించడానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే స్వయంగా దగ్గరుండి చూసిరాతలను ప్రోత్సహించవలసి వచ్చేది. అందుకే 2015లో 91.42 శాతం, 2016లో 94.52 శాతం, 2017లో 91.92 శాతం, 2018లో 94.48 శాతం, 2019లో 94.88 శాతం ఉత్తీర్ణతలు సాధించాం. ఈ ఫలితాలతో విద్యార్థులు ఏం బావుకున్నదీ లేదు. పదిలో ఆగవలసిన చదువులు లక్షలాది రూపాయలు కార్పొరేట్లకు అర్పించుకుని ఇంజనీరింగుల తర్వాత ఆగిపోతాయి. ఉద్యోగాల వేటలో ఏళ్ల తరబడి నిరీక్షించేలా పురికొల్పుతాయి. ఇకపై వార్షిక పరీక్షల ఫలితాలు ఇలానే ఉండబోతున్న సంగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తెరగాలి. అందుకు తగిన విధంగా మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి. మెరుగైన విద్యావ్యవస్థ నిర్మాణం ఇలాగే జరగాలి. ఉత్తమ ఫలితాల సాధన కోసం అడ్డదారులు తొక్కడం వల్ల సాధించే తాత్కాలిక ప్రయోజనాలు సైతం సమాజానికి మేలు చేయవని గుర్తెరగాలి.

దుప్పల రవికుమార్

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles