Thursday, November 28, 2024

నూతన రాష్ట్రపతి ఎవరో?

  • రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో పరిశీలించవలసిన అంశాలు అనేకం
  • ఉత్తర, దక్షిణాది సమతౌల్యం చూసుకోవాలి
  • ఓటు బ్యాంకులను గమనంలో పెట్టుకోవాలి
  • వివాదాలకు అతీతులై ఉండాలి

రాష్ట్రపతి ఎన్నికకు భేరి మోగింది. జులై 18వ తేదీ నాడు ఎన్నిక జరుగనుంది. జూలై 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జులై 24 వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. వీరు భారతదేశపు 16వ రాష్ట్రపతి. మళ్ళీ వీరినే కొనసాగించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. రాష్ట్రపతి ఎంపికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 15 వ తేదీ ప్రారంభమై 30వ తేదీకి ముగియనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 776మంది ఎంపీలు, 4033మంది ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలో పాల్గొననున్నారు. అందులో 543 లోక్ సభ,233 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఓటు విలువను నిర్ణయిస్తారు. ఆ లెక్కన అత్యధిక విలువ ఉత్తరప్రదేశ్ కు, అతి తక్కువ విలువ సిక్కింకు దక్కాయి. 776మంది ఎంపీల ఓట్ల విలువ 5,43,200 ఉంది. 4033 మంది ఎమ్మెల్యేల విలువ 5,43,231 ఉంది. మొత్తంగా వీరందరి ఓటు విలువ 10,86,431గా కనిపిస్తోంది. ఈ గణాంకాలన్నింటినీ బేరీజు వేసుకొని, స్వయంగా పార్టీ బలం, మిత్రపక్షాల బలిమి, అధికారికంగా భాగస్వామ్యులు కాకపోయినా సహకరించే పార్టీల బలాలను కలుపుకుంటే అధికార ఎన్ డి ఏ కూటమి తరపున నిలబెట్టే అభ్యర్థి గెలుపుకు ఢోకా ఉండదని చెప్పవచ్చు.

Also read: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కసరత్తు ప్రారంభం

మోదీ ఇష్టం

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా ఎవరిని కూర్చోపెట్టాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మదిలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయే ఉంటుంది. బహుశా ఆ రహస్యం తెలిసిన రెండో వ్యక్తి హోం మంత్రి అమిత్ షా అని అర్ధం చేసుకోవచ్చు. వీరిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశమే లేదని అందరూ అనుకుంటున్నారు. ఎంపికలో అధికార ఎన్ డి ఏ కూటమికి సహకరించి, తమ ఓట్లను అందించే వైసిపీ వంటి పార్టీ అధినేతలకు కూడా తెలిసే ఉంటుందని అంచనా వేయవచ్చు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వై సీ పీ అధిపతి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ రాజధానికి వెళ్లివచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా ను కలిసే వచ్చారు. వారి మధ్య రాష్ట్రపతి ఎంపిక అంశం తప్పకుండా చర్చకు వచ్చి ఉంటుంది. చూచాయగా అభ్యర్థి /అభ్యర్థుల పేర్లు వినవచ్చే ఉంటాయి. అధికారికంగా పేర్లను ప్రకటించేంత వరకూ రహస్యంగా ఉంచడం ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడి వై ఎస్ జగన్ వంటి నేతలు పేర్లను బయటపెట్టడం లేదని అర్ధం చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మంచి అనుబంధాలే ఉన్నాయి. ప్రధాని ఏ అభ్యర్థిని ఎంపిక చేసినా దానికి వై సీ పీ మద్దతు తప్పక ఉంటుందన్న విషయం బహిరంగ రహస్యం. అన్నా డి ఎం కె వంటి పార్టీలది కూడా అదే పరిస్థితి. మొత్తంగా ఈసారి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ఆంధ్రప్రదేశ్ సహకారం తప్పనిసరిగా మారింది. మంచిదే, ఆ కృతజ్ఞతతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తులోనైనా మంచి సహకారాన్ని అందిస్తారని ఆకాంక్షిద్దాం. ఇక రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి అనేక పేర్లు వినపడుతున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా పదోన్నతి లభించే అవకాశం ఉందని, లేనిపక్షంలో ఉపరాష్ట్రపతిగానే కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదని ఒక వర్గంలో వినపడుతోంది. నిజానిజాలు ఎలాగూ కొన్ని రోజుల్లోనే తేలిపోతాయి. తెలుగువ్యక్తి రాష్ట్రపతి కావడం తెలుగువారందరికీ ఆనందకరమైన అంశమే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎంపికలో ఉత్తరాది -దక్షిణాది మధ్య సమతుల్యతను సాధించడం కూడా అంతే ముఖ్యం. సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయులైన తెలుగువారు/దక్షిణాత్యులు రాష్ట్రపతిగా మన ఖ్యాతిని ఖండాంతరాలు చాటిచెప్పారు. ఇటీవల కాలంలో అబ్దుల్ కలామ్ కు వచ్చిన సుకీర్తి ఎవరికీ దక్కలేదంటే అతిశయోక్తి కాదు. పూర్వ మహానేతలను మరపించేలా అబ్దుల్ కలామ్ అందరి మనసులను గెలుచుకున్నారు. ప్రతిభ, వ్యక్తిత్వం, సమర్ధత కలిగిఉండే వ్యక్తులకు దేశంలో లోటు ఎప్పుడూ ఉండదని చెప్పడానికి అబ్దుల్ కలామ్ గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. అధికార ఎన్ డి ఏ  నుంచి కానీ, ప్రతిపక్షాలైన కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కానీ ఇంతవరకూ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించ లేదు. అన్నీ ఊహాగానాలే. ఊహల మధ్య వాస్తవాలు తెలియరావన్నది వాస్తవం. ఒక్కటిమాత్రం నిజం! ప్రతిపక్షాలన్నీ ఏకమైనా ఏమీ చేయలేవు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపిక చేసిన అభ్యర్థి రాష్ట్రపతిగా గెలిచితీరుతారన్నది వాస్తవం.

Also read: కశ్మీర్ లో ఘోరకలి

సామాజిక సమీకరణాలు ప్రధానం

అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసే సంస్కృతి పెరిగి కూడా చాలాకాలమైంది. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఏ వర్గానికి ఓట్లు ఎక్కువ ఉంటే వారి వెనకాల రాజకీయ పార్టీలు పడడం అత్యంత సహజమైన ప్రక్రియగా మారిపోయింది. ఇది పచ్చినిజం. అదే సమయంలో ప్రాంతీయ, భౌగోళిక న్యాయం కూడా జరగాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నతమైన పదవుల్లో కూర్చోవలసినవారికి తత్ తుల్యమైన వ్యక్తిత్వం, అర్హతలు కూడా ఉండాలి. వారు రబ్బరు స్టాంపులుగా మారిపోతున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్దఎత్తున వస్తున్నాయి. ఇటువంటి పదవులు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఈ చెడ్డపేరును పోగొట్టుకోవాలి. సర్వ లేదా అధిక ఆమోదయోగ్యమైన వ్యక్తులను మాత్రమే అందలమెక్కించాలి. దేశాన్ని తత్త్వవేత్తలు పాలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గతంలో ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ అనేవారు. రాష్ట్రపతి పదవికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వన్నె తెచ్చిన గురుదేవుడు ఆయన. అటువంటి మహనీయులు, దార్శనికులు అధిరోహించిన సింహాసనంలో అర్హులు మాత్రమే కూర్చోవలన్నది పలువురి ఆకాంక్ష. రాజనీతిజ్ఞత కలిగి, రాజకీయాలు ఎరిగి, పాలన తెలిసిన ప్రాజ్ఞుడు రాష్ట్రపతిగా ఉంటే ప్రధానమంత్రికి, ప్రధాన వ్యవస్థలకు చక్కని సలహాలను ఇవ్వగలుగుతారు. సలహాలను ఐచ్చే స్థాయి వారి వ్యక్తిత్వం ద్వారా కూడా వారికి కలిగి ఉంటుంది. రాజ్యాంగం దృష్ట్యా రాష్ట్రపతి స్థానం దేశంలో అత్యున్నతమైంది. అది ఎప్పటికీ అత్యుత్తమంగా ఉండాలన్నది విజ్ఞుల ఆశ. పాలకులకు మార్గనిర్దేశం చేస్తూ, దేశాన్ని వైభవం వైపు నడిపించే మహోన్నతవ్యక్తులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు వరించాలని కోరుకుందాం. పదవిలో ఎవరున్నారన్నది కాదు విషయం.. ఎటువంటివారున్నారన్నది ముఖ్యం.

Also read: అఖండంగా అవధాన పరంపర

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles