జుబిలీ హిల్స్ లో మైనర్ బాలికపైన సామూహిక అత్యాచారం కేసులో ఎన్నో మలుపులు, మరెన్నో సందేహాలు. పబ్ లో అల్లరి మూక ఇద్దరు ఆడపిల్లలను వేధించిందనీ, ఒక ఆడపిల్ల సకాలంలో క్యాబ్ ను పిలిపించుకొని వెళ్ళిపోయిందనీ, రెండో అమ్మాయి కార్పొరేటర్ కుమారుడి మాయమాటలు నమ్మి మోసబోయిందనీ పోలీసులు అంటున్నారు. బాధితురాలు ఇచ్చిన రెండో వాగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.
నిందితులలో ఎంఐఎం ఎంఎల్ఏ కొడుకు ఉన్నాడనీ, నిందితులు అయిదుగురు కాదనీ ఆరుగురనీ కొత్త వాదం వినిపిస్తోంది. కార్పొరేటర్ కొడుకు సాదుద్దీన్ మాలిక్ అనే వాడు మొత్తం కథ నడిపించాడనీ, అతడిపైన గతంలో కూడా ఆడపిల్లలను వేదించిన కేసులు ఉన్నాయనీ పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ నివేదిక పేర్కొన్నది. అమ్నీషియా, ఇన్సోమ్నియా రెండు పబ్ లలోనూ బాలికలను సాదుద్దీన్ వేధించాడని చెబుతున్నారు. బాలికపైన బెంజ్ కారులో దాడి చేసినవారిలో ఎంఎల్ఏ మనుమడు ప్రముఖంగా ఉన్నాడనీ, తర్వాత ఇన్నొవా కారు ఎక్కించి ఆ అమ్మాయిపైన దాడి చేశారని పోలీసులు తెలియజేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు ఇన్నొవాలో వచ్చాడు. నేరం చేసిన తర్వాత బేకరీకి వెళ్ళి ఆ అమ్మాయిని పబ్ దగ్గర వదిలివేసి వారు ఇళ్ళకు వెళ్ళారు. కేసు పెట్టారని తెలుసుకున్న మీదట పరారైనారు.
సంపన్న కుటుంబానికి చెందిన ఉమేర్ ఖాన్, స్థానిక టీఆర్ఎస్ నాయకుడి కొడుకు సాదుద్దీన్ మాలిక్,టీఆర్ఎస్ నాయకుడి మైనర్ కొడుకు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మైనర్ కొడుకు, సంగారెడ్డికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ కొడుకు ఈ నేరంలో పాల్గొన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. కారు కడిగివేసినప్పటికీ బాలిక జుట్టు, చెవి దిద్దు. టిష్యూ పేపర్ల వంటి అనేక సాక్ష్యాధారాలను సేకరించినట్టు పోలీసులు తెలియజేశారు.
ఇది ఇలా ఉండగా మైనర్ బాలిక ఫోటో విడుదల చేసి నేరానికి ఒడిగట్టారని బీజేపీ శాసనసభ్యుడు రఘునందనరావుపైన కేసు పెట్టాలని పోలీసులు న్యాయసలహా కోసం ప్రయత్నిస్తున్నారు. 376ఎ, 376 బి, 376 సి కింద మైనర్ బాలిక ఫొటోను ప్రచురించడం కానీ విడియోలో చూపించడం కానీ నేరం. రఘునందనరావు ఫొటోలు విడుదల చేయడమే కాకుండా పదిసెకన్ల విడియో విడుదల చేశారు.ఇందులోఎంఎల్ఏ కొడుకు ఉన్నాడు. భారత శిక్షాస్మృతి 228ఎ కింద రఘునందనరావు చేసింది నేరమని పోలీసులు భావిస్తున్నారు. ఆబిడ్స్ పోలీసు స్టేషన్లో రఘునందనరావుపైన కేసు పెట్టారు.
లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్న ఎంఎల్ఏ రఘునందన్ రావు తన చర్యను సమర్థించుకున్నారు. చట్టప్రకారం తాను చేసింది నేరమైతే శిక్ష అనుభవించడానికి సిద్ధమేనంటూ వ్యాఖ్యానించారు. ‘ఈ వ్యవహారంలో ఎంఐఎం ఎంఎల్ఏ కుమారుడి ప్రమేయం ఉన్నదని నిరూపించేందకు నేను ఈ పని చేశాను. తగిన సమయంలో న్యాయస్థానానికి సమస్త సాక్ష్యాధారాలను సమర్పిస్తాను. కేసును ఎదుర్కోడానికి నేను సిద్ధం,’అని ఎంఎల్ఏ అన్నారు. ఎంఎల్ఏ పైను కేసు పెట్టినట్లయితే అదే ఫొటోలు ప్రచురించిన పత్రికలపైనా, ప్రసారం చేసిన న్యూస్ చానళ్ళపైనా కేసులు పెట్టవలసి ఉంటుందని కొంతమంది న్యాయవాదులు వాదిస్తున్నారు. రఘునందన్ రావుపైన తొందరపడి చర్యలు తీసుకోవద్దనీ, అవి బెడిసికొడతాయనీ లాయర్లు కొందరు పోలీసులకు హితవు చెబుతున్నారు.