Sunday, December 22, 2024

రుషి జగన్ ను గట్టెక్కిస్తాడా?

  • టీడీపీ పెట్టుకున్న రాబిన్ శర్మ రాణిస్తాడా?
  • జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందా?
  • టీడీపీని ప్రజలు మళ్ళీ ఆదరిస్తారా?
  • ఈ ధోరణికి విరుగుడుగా జగన్ ఏం చేస్తారు?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అప్పుడే పతాక స్థాయిలో సాగుతున్నాయి. చావో, రేవో తేల్చుకోవాలని అధికార వైఎస్ఆర్ సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ‘నువ్వా-నేనా’ అన్నట్టు పోటీ పడుతున్నాయి. తన హవా కొనసాగించాలంటే ఒకరు గెలిచి తీరాలి. తన పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే మరొకరు గెలుపొందాలి. అందువల్ల ఇటు జగన్ మోహన్ రెడ్డికీ, అటు  చంద్రబాబునాయుడికీ – ఇద్దరికీ విజయం అవసరమే. ఇద్దరికీ ఇది ప్రతిష్ఠాత్మకమే. రెండు పార్టీలు కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల ప్రవీణుడితో కలసి పని చేసిన వ్యూహకర్తలపైన ఆదారపడ్డాయి. ఎన్నికల వ్యూహకర్తలంటే ఇవ్వాళారేపూ ఒక్క ఐప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) పేరు మాత్రమే వినిపిస్తోంది. 2012లో గుజరాత్ తో మొదలు పెట్టి మొన్న పశ్చిమబెంగాల్ వరకూ ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఐప్యాక్ టీం (గుజరాత్ లో పని చేసినప్పుడు ప్రశాంత్ కిశోర్ బృందానికి వేరే పేరు ఉండేది) అన్ని చోట్లా విజయం సాధించింది – ఒక్క ఉత్తర ప్రదేశ్ లో 2017లో తప్ప. యూపీలో సైతం తాను చెప్పినట్టు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లు చేయలేదనీ, అందుకే ఓడిపోయారనీ పీకే ఉరఫ్ ప్రశాంత్ కిషోర్ అన్నారు. మొత్తం మీదికి ఐప్యాక్ టీంలో పని చేయడం ఒక అర్హతగా పరిణమించింది. ఐప్యాక్ లో పని చేసిన అనుభవం ఉన్న రాబిన్ శర్మను టీడీపీ ఇప్పటికే నియమించుకున్నది. అతడు పార్టీ లోతుపాతులను గ్రహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కష్టపడుతున్నాడు.

జగన్ మోహన్ రెడ్డితో ఐప్యాక్ టీం 2019లో పని చేసింది. పేరుకు ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ అధిపతిగా ఉన్నప్పటికీ ఆయన విధాన నిర్ణయాలు తీసుకొని వాటిపైన దృష్టి కేంద్రీకరించేవారు. ప్రజలతో సంబంధాలు, సర్వేలూ, డేటా సేకరణ, విశ్లేషణ మొదలైన కార్యక్రమాలలో తన సహచరులకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఇచ్చేవారు. వారు కూడా ఐఐటీలో చదువుకున్న తెలివి కలిగిన స్ఫురద్రూపులు. అటువంటివారిలో అగ్రశ్రేణికి చెందినవాడు రుషీ రాజ్ సింగ్ అనే యూపీ యువకుడు. 2019 ఎన్నికల సమయంలో రోజువారీ జగన్ తో మాట్లాడే బాధ్యత రుషీరాజ్ దే. అందుకే అతడు జగన్ కి బాగా దగ్గరైనాడు. అతడు నిరుడు పెళ్ళి చేసుకొని లక్నోలో రిసెప్షన్ ఇస్తే దాన్లో పాల్గొనడానికి అమరావతి నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి వెళ్లారు. వేదికపైన రుషిని జగన్ ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. సహజంగానే రుషి నాయకత్వంలో ఐప్యాక్ టీం ను జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో సహాయం చేసేందుకు వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికీ రుషి బృందం వైఎస్ఆర్ సీపీ కోసం పని చేస్తోంది.

Andhra CM YS Jagan With Wife Bharathi Attended Marriage Reception Of Rishi  Raj Singh Member Of Prashant Kishor's IPAC Team - Gallery - Social News XYZ
పెళ్ళి రిసెప్షన్ ల రుషిరాజ్ ను ఆలింగనం చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి

ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ముందస్తు ఎన్నికలు తథ్యమంటూ ప్రచారం జరగుతోంది. ఆ ఊహాగానం ఎంతవరకూ నిజం అవుతుందో తెలియదు కానీ ముందస్తుగా ఎన్నికల ప్రచారం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలు కావడమే కాదు జోరందుకున్నది. ముఖ్యంగా వైసీపీ నాయకులు స్తబ్దుగా ఉన్నట్టూ, ప్రజలతో వారికి సంబంధాలు లేనట్టూ కనిపించడం జగన్ కు ఆందోళన కలిగించే విషయం. అందుకని ఆయన స్వయంగామరోసారి అన్ని జిల్లాలూ పర్యటించాలని తలపోస్తున్నారు.

కొన్ని రోజుల కిందట రుషి ఇచ్చిన నివేదిక జగన్ ను తొందరపెడుతోంది. పార్టీ మరోసారి విజయం సాధించాలంటే చాలా మార్పులు చేయవలసి ఉంటుందని రుషి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఎంఎల్ ఏలకు ప్రజలలో వ్యతిరేకత ప్రబలిందని కూడా రుషి నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ తన ఎంఎల్ఏలకు ఒక పని చెప్పారు. ‘గడపగడపకూ ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని వైసీపీ ఎంఎల్ఏలు చేపట్టి, తమ నియోజకవర్గంలోని అన్ని ఇళ్ళకూ వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించి, ఏమైనా లోటుపాట్లు జరుగుతున్నాయేమో ప్రజలను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. కానీ ఈ కార్యక్రమం సవ్యంగా జరగలేదు. ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ప్రబలుతోందనీ, ప్రతిపక్ష టీడీపీకి ప్రజామోదం పెరుగుతోందనీ నివేదికలు జగన్ మోహన్ రెడ్డికి అందాయి. టీడీపీ వివిధ కార్యక్రమాలూ, సమావేశాలూ నిర్వహిస్తోంది. ప్రజలతో నిత్యం సంపర్కంలో ఉండే విధంగా చూసుకుంటోంది. లోకేష్ కూడా హైదరాబాద్ లో కూర్చోకుండా ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ చేస్తున్న విమర్శలకూ, దాడులనూ వైసీపీ సమాధానం చెప్పలేకపోతోంది. తిప్పికొట్టలేకపోతోంది. నష్టదాయకమైన ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలని జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు.

తెలుగు గడ్డపై మరో వ్యూహకర్త… టీడీపీని గట్టెక్కిస్తాడా..? - Mungita.com
తెలుగుదేశం నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ

ప్రతిపక్షాలు పొత్తుల పేరు మీద కొట్లాడుకుంటున్నాయి. ‘‘రెండు సార్లు (2014, 2019లో) మనం త్యాగం చేశాం, ఈ సారి వాళ్ళు (టీడీపీ) త్యాగం చేయాల’’ని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అనడం, దానిపైన తెలుగుదేశం నాయకులు విమర్శించడం తెలిసిందే. జనసేన బీజేపీతో బంధాన్ని తెంచుకొని టీడీపీతో చేతులు కలుపుతుందా? ఏ లెక్కన పొత్తు పెట్టుకుంటారు? జనసేన ఎన్నిసీట్లలో పోటీ చేస్తుంది? అటు బీజేపీనీ, ఇటు డీటీపీని కాదని పవన్ కల్యాణ్ సాహసం చేసి ఒంటరిగా పోటీలో దిగుతారా? ఇటువంటి ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి.

ఎన్నికలలో వ్యూహకర్తలు ఎంత వరకూ ఉపయోగపడతారనేది ప్రశ్న. ఓడిపోయే పార్టీని గెలిపించే సత్తా ఎన్నికల ప్రవీణులకు ఏ మాత్రం ఉండదని ప్రశాంత్ కిషోర్ స్వయంగా అనేక సందర్భాలలో వివరించారు. గెలిచే పార్టీకి కొంత పనికి వచ్చే సమాచారం సేకరించడం, అభ్యర్థుల బాగోగులను తెలుసుకొని నాయకుడికి నిస్పక్షపాతంగా నివేదించడం, ప్రజాభిప్రాయానికి సాధ్యమైనంత మేరకు అద్దం పట్టడం వంటి పనులు మాత్రం ఎన్నికల ప్రవీణులు చేయగలరు. ఎవరు ఏమి చేయగలరో, ఏ పార్టీ గెలుస్తుందో, ఏ ప్రవీణుడు రాణిస్తాడో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles