Saturday, November 23, 2024

ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ సరే…. ఇదంతా నడిపించింది ఎవ్వరు?

`బాలీవుడ్ బాదుషా’ గా పేరొందిన షారుఖ్ ఖాన్ కుమారుడు గత ఏడాది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు దేశంలోనే కాకుండా, విదేశాలలో కూడా సంచలనం కలిగించింది. సంపన్నుల పిల్లలకు ఇటువంటి అలవాట్లు సాధారణమే అని కూడా చాలామంది భావించారు. అయితే అరెస్ట్ జరిగిన తీరు గమనించిన వారికి ఎందుకో అతనిని ఇరికించాలని, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అనుమానాలు వచ్చాయి. 

చివరకు గత వారం  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) తన ఛార్జ్ షీట్ లో ఆర్యన్ ఖాన్ పేరు లేకపోవడంతో అతనికి `క్లీన్ చిట్’ ఇచ్చిన్నట్లు అయింది. అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదని ఈ కేంద్ర ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ పాపం అంతా ఆ సమయంలో అరెస్ట్ చేసిన సమీర్ వాంఖడే అసలు దోషి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అతనిని సైన్యంలో `మార్షల్ కోర్ట్’ వలే విచారణ జరిపి, దాదాపు ఉద్యోగం నుండి తీసేయవచ్చనే లీక్ లు ఇస్తున్నారు. 

ఇదే అధికారి, అంతకు ముందు సంవత్సరం నటి రియా చక్రవర్తిని  తన ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించి డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసి ఒక నెల జైలు జీవితం గడిపేటట్లు చేశారు. 

ఆ సమయంలో కేవలం రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, సుశాంత్ సామాజిక వర్గం నుండి రాజకీయ ప్రయోజనం పొందేందుకు, రాజకీయ వత్తిడులతోనే ఈ అరెస్ట్ జరిగిన్నట్లు కధనాలు వెలువడ్డాయి. బీహార్ ఎన్నికల తర్వాత ఈ కేసు గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అందుకనే సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్ విషయంలో కూడా రాజకీయ ప్రాపకం కోసమే అత్యుత్సాహం చూపినట్లు భావించవలసి వస్తుంది. 

ప్రధాని నరేంద్ర మోదీ  సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో పట్టుబడిన 3,000 కిలోల హెరాయిన్‌ కలకలం నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ డ్రగ్ కేసును సృష్టించారని కధనాలు కూడా అప్పట్లో వచ్చాయి.  

స్థానిక బిజెపి నాయకుడు ఒకరు  కిరణ్ గోసావి అనే ప్రైవేట్ డిటెక్టివ్‌తో కుమ్మక్కై ఇచ్చిన సమాచారంతో ఈ దాడి జరగడం గమనార్హం. పైగా ఆర్యన్ ఖాన్ తో పాటు అరెస్ట్ అయిన వారిలో ఓ బిజెపి నేత కుమారుడు కూడా ఉంటె, అతడిని ఆ రాత్రే బిజెపి నేతలు వచ్చి విడిపించుకు పోయారని మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అసలు డ్రగ్స్ తో పార్టీ నిర్వహించిన క్రూయిజ్ షిప్‌ యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకొనక పోవడం గమనార్హం. 

కేవలం డ్రగ్ సేవించినందుకు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఉంటె పెద్దగా సంచలనం కలిగించేది కాదు. అతని వద్ద డ్రగ్స్ ఉండడమే కాకుండా, అతనికి  అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయి వంటి  భారీ ఆరోపణలను మోపారు. ఇప్పుడేమో ఛార్జ్ షీట్ లోనే అతని పేరు తీసేసారు. కోర్ట్ వరకు వెడితే చీవాట్లకు గురికావలసి వస్తుందని వెనుకడుగు వేసారా? లేదా అరెస్ట్ చేసిన ఉద్దేశం నెరవేరిందని అనుకొంటున్నారా? … రాబోయే రోజులలో గాని తెలియదు. 

దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత సినిమా రంగంలో అతిపెద్ద సూపర్ స్టార్ గా “కింగ్ ఖాన్” అని పిలువబడే షారుఖ్ ఖాన్ ఎదిగారు. దేశ, విదేశాలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. 

బాలీవుడ్ లో సూపర్‌స్టార్లు గా ఎదిగిన ముగ్గురు కూడా యాదృచ్చికంగా ఖాన్ లు కావడం గమనార్హం. వారు సల్మాన్, అమీర్, షారూఖ్. షారూఖ్ ఖాన్. ఇప్పుడిప్పుడే ఇతరులు కూడా ఎదుగుతున్నారు. ఈ డ్రగ్ కేసు మొత్తం షారుఖ్ ఖాన్ లక్ష్యంగానే సృష్టించి ఉండాలని సర్వత్రా అనుమానాలు చెలరేగుతున్నాయి. 

సూపర్ స్టార్ ఖాన్ కొడుకు అయినందుకు ఆర్యన్ తెలియకుండానే మూల్యం చెల్లించుకుంటున్నాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే షారుఖ్ ఖాన్ ఎప్పుడు తాను ఓ `ముస్లిం’ అనే విధంగా వ్యవహరించలేదు. పుట్టుకతో హిందువు అయిన గౌరీని వివాహం చేసుకున్న ఖాన్ ఎప్పుడూ ముస్లిం నటుడిగా గుర్తింపు పొందలేదు. 

అతను నటించిన ప్రేమగల రాజ్ నుండి మాఫియా డాన్ రయీస్ ఆలం వరకు తెరపై అనేక రకాల పాత్రలను పోషించాడు. అతను 2010లో వచ్చిన “మై నేమ్ ఈజ్ ఖాన్” అనే ట్యాగ్‌లైన్‌లో “మరియు నేను టెర్రరిస్ట్ కాదు” అనే ట్యాగ్‌లైన్‌లో ఇస్లామోఫోబియాను ఉద్దేశించి సాహసం ప్రదర్శించాడు. 


2019 ఎన్నికల ముందు ప్రచారం కోసం కావచ్చు ప్రధాని మోదీ అధికార గృహంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. వారిలో షారుఖ్ ఖాన్ లేకపోవడంతో బిజెపి వారు ఆగ్రహంగా ఉన్నారనే ఓ అభిప్రాయం ఉంది. 

అయితే అదే సంవత్సరం అక్టోబర్‌లో, మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రితో వేదిక, సెల్ఫీని పంచుకున్నాడు.

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై చాలామంది, చాలా రకాలుగా వాఖ్యానాలు చేసినా షారుఖ్ ఖాన్ మాత్రం మౌనంగా ఉంటూ, కేవలం పేరొందిన న్యాయవాదులను నియమించుకొని, తన కొడుకును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలలో నిమగ్నమై ఉండిపోయారు. కొడుకు జైలులో ఉన్నప్పుడు సహితం ఒకసారి వెళ్లి కలిశారు. 

పుణేలో హర్షవర్ధన్ పటేల్ అనే ఓ మాజీ కాంగ్రెస్ నాయకుడు తాను బీజేపీలో చేరిన తర్వాత బాగా నిద్ర పోగలుగుతున్నానని, తనపై దర్యాప్తు ఏజెన్సీలో దాడులు చేస్తాయనే భయం ఇప్పుడు లేదని గత ఏడాది చెప్పడం గమనార్హం. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రతిపక్ష నేతలపై ప్రయోగించి, బిజెపి దుర్వినియోగం చేస్తున్నట్లు శరద్ పవర్ ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వాఖ్య చేశారు. 

అనేకమంది ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్త ఏజెన్సీలు బీజేపీలో చేరితే అటువంటి దర్యాప్తులు చేయక పోవడం గమనార్హం. ఉదాహరణకు,  పశ్చిమ బెంగాల్ ను కుదిపేసిన శారదా చిట్ కుంభకోణంలో అస్సాంలో కాంగ్రెస్ మంత్రిగా ఉండగా నెలకు రూ 18 లక్షలు చొప్పున ముడుపులు అందుకొనేవారని సిబిఐ ఆధారాలు సేకరించింది. కానీ ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఆ అభియోగాలు కనిపించడం లేదు. ఆయనను ముఖ్యమంత్రిగా కూడా చేశారు. 

బెంగాల్ మంత్రులను గవర్నర్ అనుమతితో అరెస్ట్ చేస్తున్న సీబీఐ, అదే కేసులో ఉన్న బిజెపి ఎంపీల జోలికి మాత్రం వెళ్లడం లేదు. అదే విధంగా షారుఖ్ ఖాన్ తో ఏదైనా `డీల్’ కుదిరి ఆర్యన్ ఖాన్ కు `క్లీన్ చిట్’ ఇచ్చారా? అనే అనుమానాలు సహితం కొన్ని వర్గాల్లో కలుగుతున్నాయి. 

చలసాని నరేంద్ర 

Narendra Chalasani
Narendra Chalasani
రచయిత సీనియర్ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యక్రమాలలో క్రియాశీలక భాగస్వామి. ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలవారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles