ప్రముఖ కవి, చిత్రకారుడు, కథకుడు, నవలారచయిత శీలావీర్రాజు బుధవారంనాడు ఆకస్మికంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన వీర్రాజు తన 83వ ఏట కన్ను మూశారు.
శీలా వీర్రాజు 23 ఏప్రిల్ 1939న రాజమండ్రిలో జన్మించారు. హైదరాబాద్ నుంచి వెలువడే కృష్ణాపత్రికలో ఉపసంపాదకుడుగా 1961లో చేరి రెండేళ్ళు పని చేశారు. తర్వాత 1963లో ఆంధ్రప్రదేశ్ పౌరసంబంధాల శాఖలో అనువాదకుడిగా చేరి 1990లో ఉద్యోగవిరమణ చేశారు. కవిగా, చిత్రకారుడిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖీనమైన ప్రతిభను ప్రదర్శించారు.
శీలావీర్రాజు అనేక కవితా సంపుటాలు ప్రచురించారు. వెలుగురేఖలు, కాంతిపూలు, మైనా, కరుణిచని దేవత పేర్లతో నాలుగు నవలలు రాశారు. పది కథాసంపుటాలు వెలువరించారు. వర్ణచిత్రాల అల్బం, కథల సంపుటి కూడా ప్రచురించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ను పాతికేళ్ళు నిర్వహించి కొత్త కవులను ప్రోత్సహించారు. తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, ప్రముఖ కవి, రచయిత, జీవశాస్త్రవేత్త దేవరాజు మహారాజు, తదితరులు శీలావీర్రాజు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు.