పాలడుగు శ్రీచరణ్
- కరోనాకాలంలో జూమ్ లో విజృంభించిన అవధానం
- వివిధ ఖండాలలో తెలుగువారిని కలిపిన సాహిత్య వారధి
తెలుగువారి సంతకమైన ‘అవధాన కళ’ అఖండంగా వెలిగిపోతోందని చెప్పడానికి బోలెడు తార్కాణాలు కనిపిస్తున్నాయి. చిత్రమేమిటంటే? ‘అవధానం’ కరోనా కాలంలో అంతర్జాలంలో అనంతంగా సాగి, దేశవిదేశాల్లో ఉన్న తెలుగు భాషాప్రియులకు పద్యాల విందువినోదాలను అందించింది. గత రెండేళ్లుగా వరుసగా అవధానవిద్యను ‘పద్మశ్రీ’లు వరించాయి. ఆశావాది ప్రకాశరావుకు ‘పద్మశ్రీ’ రాగానే అవధాన క్షేత్రంలో ఆశావహ వాతావరణం వెల్లివిరిసింది. ద్వితీయ విఘ్నం లేకుండా గరికపాటి నరసింహారావుకు దక్కడంతో అది మరింత గట్టిపడింది. మేడసాని మోహన్,వద్దిపర్తి పద్మాకర్ వంటి కవిశ్రేష్ఠుల నుంచి బులుసు అపర్ణ వంటి యువత వరకూ అన్ని తరాల అవధానులు కరోనా కాలంలో వీర విజృంభణ చేశారు. అష్ట,శత అవధానాలు అనంతంగా సాగాయి. కరోనా కాస్త సద్దుమణగ్గానే అవధాన సరస్వతి ప్రత్యక్ష వేదికల్లో ప్రేక్షకుల సాక్షిగా మరింత సందడి చేసింది. అ మధ్య హైదరాబాద్ లో వద్దిపర్తి పద్మాకర్ చేసిన శతావధానం ఆద్యంతం పరమాద్భుతంగా సాగింది. ధారణ, ధార గాంగఝరీ వేగంతో సాగడమే కాక, కవిత్వం పొంగి పొరలింది. అంతర్జాలంలో సప్త ఖండాలలో అఖండంగా అవధానం నిర్వహించినందుకు అనేక ప్రతిష్ఠాత్మక సంస్థల రికార్డ్ బుక్స్ లోకి పద్మాకర్ ఎక్కారు. మొన్న ఆదివారం నాడు ఏలూరులో విజయోత్సవ సభ ఘనంగా జరిగింది.
Also read: సివిల్స్ పరీక్షల్లో నిలిచి వెలిగిన తెలుగువారు
పాలడుగు శ్రీచరణ్ ‘సంస్కృతాంధ్ర’ శతావధానం
తిరుపతిలో పాలడుగు శ్రీ చరణ్ మే 31 వ తేదీ, జూన్ 1 వ తేదీ నాడు, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ‘సంస్కృతాంధ్ర శతావధానం’ నిర్వహించి, అందరినీ ఆనందపరచి, ఆశ్చర్యజలధిలో మునకలెత్తించారు. గంటలోపు వ్యవధిలోనే ధారణ పరిపూర్ణం చేసి శభాష్ అనిపించుకున్నారు. సంస్కృతం, తెలుగు రెండు భాషలలో సాగిన ఈ అవధానయవనికలో ఇద్దరు సరస్వతులు ఒక్కటై, ఒక్కరై మెరిపించి మురిపించారు. మొట్టమొదటి శతావధానంలోనే శ్రీచరణ్ విజయదుందుభి మోగించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాన్పూర్ ఐ ఐ టీ లో ఎంటెక్ విద్యను అభ్యసించి, అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న శ్రీ చరణ్ ‘ అవధానం – వేదం’ రెండింటినీ అభ్యసిస్తూ, రెండుకళ్ళుగా జీవిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. తన మొట్టమొదటి ‘సంస్కృతాంధ్ర శతావధానం’ మాతృభూమిలో చెయ్యాలనే సత్ సంకల్పంతో, అమెరికా నుంచి ప్రత్యేకంగా ఇండియా వచ్చారు. వారి స్వక్షేత్రం, సుక్షేత్రమైన తిరుపతిలో అవధానం నిర్వహించి స్ఫూర్తికీర్తిని వెలిగించారు. లలితాదిత్య అనే కుర్రాడు అమెరికాలోనే పుట్టి పెరిగాడు, ఇంకా అక్కడే చదువుకుంటూ ఉన్నాడు. ధూళిపాళ మహాదేవమణి దగ్గర ‘అవధానవిద్య’ను అభ్యసించి,అవధానాలు నిర్వహిస్తూ తెలుగుదనాన్ని చాటిచెబుతున్నాడు. 16 ఏళ్ళు కూడా నిండని మరో బాలకవి ఉప్పలదడియం భరత్ శర్మ అవధానాలు నిర్వహిస్తూ బాలురందరికీ దిక్సూచిగా నిలుస్తున్నాడు. వీరందరూ ఆధునిక విద్యలో ఆరితేరుతూ, ఇంగ్లిష్ మొదలైన విదేశీ భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాయిస్తూ, మనవైన సంస్కృత, ఆంధ్రభాషల్లో విశేషంగా కృషి చేస్తూ, మన అవధాన సరస్వతి నీడలో వెలిగిపోతున్నారు. తెలుగుపద్యాల పంటసీమల్లో పైరగాలులు పీల్చుకుంటున్నారు.
Also read: ఎన్టీఆర్ కి భారత రత్న ఇప్పుడైనా…
దేవనాగరి లిపిలోనే సంస్కృతం రాయాలి
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ ఉంటుంటే…మన తెలుగుభాషకు, హృద్యపద్యమయమైన అవధానానికి ఢోకా లేదనే విశ్వాసం వెల్లివిరిస్తోంది. సంస్కృత భాషను ‘ దేవనాగరి’ లిపిలోనే రాయాలని ప్రభుత్వాలు ఆదేశాలనివ్వాలి. ఎక్కువ మార్కులు వస్తాయని ఎక్కువమంది విద్యార్థులు తెలుగుకు బదులు సంస్కృతం తీసుకుంటున్నారు. పరీక్షల్లో సంస్కృతంలో సమాధానాలు రాయకుండా ఇంగ్లిష్, తెలుగు మొదలు అన్ని భాషల్లో రాస్తున్నారు. దాని వల్ల ఇటు సంస్కృతం – అటు తెలుగు రెండూ రాక, ఉభయభ్రష్టత్వంలోకి వెళ్లిపోతున్నారు. సంస్కృతం ‘దేవనాగరి లిపి’లో రాయించాలని సంకల్పంలో మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఉన్నప్పటికీ, అది ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ‘జనని సంస్కృతంబు సకల భాషలకు’ అన్నారు. సాహిత్యపరమైన ‘అవధాన విద్య’కు మూలం ‘వేదావధానం’. సాహిత్యరూపాన్ని సంతరించుకున్నప్పుడు తొలిగా సంస్కృతంలోనే అవధానం ఆరంభమైంది. తర్వాత తెలుగులోకి ప్రవేశించి, పరమాద్భుతంగా వికసించింది, నేటికీ విరాజిల్లుతోంది. చరిగొండ ధర్మన, భట్టుమూర్తి ( రామరాజ భూషణుడు), కోలాచల మల్లినాథ సూరి, మాడభూషి వేంకటాచార్యులు, తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవులు అవధాన కల్పవృక్షాన్ని నిలబెట్టారు. కల్పాంతం వరకూ అవధానం,తెలుగుపద్యం చిరంజీవిగా నిలుస్తాయాని విశ్వసిద్దాం. మొత్తంగా,అవధానానికి మంచిరోజులు వచ్చాయనిపిస్తోంది. ఆధునిక సాంకేతికత, రవాణా సదుపాయాలు తోడునీడగా నిలుస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ‘అవధాన కళ’ను ప్రోత్సహించడంలో మరెంతో ముందుకు సాగాల్సివుంది.
Also read: ఉన్నత విద్య సార్వజనీనం