“ఆతత పక్షమారుత, రయ ప్రవికంపిత, ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు, బలవన్నిజ దేహ సముజ్జ్వలత్ప్రభా
ధూత పతంగ తేజు డుదితుండయి తార్క్ష్యుడు తల్లికిన్ మనః
ప్రీతి యొనర్చుచున్ నెగసె భీమ జవంబున నభ్రవీధికిన్”
–నన్నయ భట్టారకుడు
నేపథ్యం
తల్లి కద్రువ ఆజ్ఞ మేరకు, కర్కోటకుడనే పుత్రుడు ఉచ్చ్వైశ్శ్రవమనే శ్వేతాశ్వం యొక్క వాలభాగానికి వ్రేలాడు తుండగా, కద్రూవినతలిద్దరూ మరునాటి ఉదయమే వెళ్ళి గుఱ్ఱాన్ని దర్శించినారు. దాని వాలభాగం నల్లగా వుండడంతో వినత పందెంలో ఓటమిని అంగీకరించి, సవతియైన కద్రువకు దాసియై సేవలు చెయసాగింది. ఇట్లా ఐదు వందల సంవత్సరాలు నిండినవి. ఒకరోజు వినత పెట్టిన రెండవ గ్రుడ్డు పగిలింది:
నేటి పద్యభావం:
“అండవిముక్తుడై, జననమొందిన తక్షణమే, గరుత్మంతుడు, బలమైన తన రెక్కలను ఆడిస్తూ, ఉవ్వెత్తున దిగంతాలకెగిసినాడు. గగనతలంలో క్రమానుబద్ధంగా కదులుతున్న గరుత్మంతుని రెక్కల నుండి వీచే ప్రచండ వాయువులతో, పర్వత సముదాయాలు, మహాసాగరాలు సైతం, కంపించి, సంక్షోభంలో పడినవి.”
“గరుత్మంతుని బలమైన దేహం నుండి ప్రసరించే జ్వాజ్వల్య మానమైన దీప్తి ముందు సూర్యకాంతి సైతం నిస్తేజంగా గోచరించినది.’’
“ఈ అద్భుతాన్ని గరుత్మంతుని తల్లి మనఃప్రీతితో తిలకించింది.”
Also read: వంతెనపై పొద్దుపొడుపు
మహామునులు, రాజులు, దివ్యపురుషులు, దేవ దానవులతో బాటు, సరమ అనే శునకాన్ని, తక్షకుడనే సర్పాన్ని, ఉచ్చ్వైశ్శ్రవమనే తెల్లని గుఱ్ఱాన్ని, సర్పకోటితో సహా, ఇప్పటిదాకా మనముందు ప్రవేశపెట్టిన భారతసంహిత, గరుత్మంతుడనే ఖగరాజును తెర ముందుకు తీసుకొని వస్తున్నది.
హెగెల్ ను అబ్బురపరచిన కల్పనలు
అనేకానేక ఉపాఖ్యానాలతో మలచబడ్డ భారతసంహిత సుదీర్ఘ మానవజాతి చరిత్రకు ప్రతిరూపం. ఈ చరిత్రలో, మానవ సమాజానికే గాక, జంతుకోటికి కూడా స్థానమున్నది. కాకపోతే, ఈ ఇతిహాసంలో అనేక ప్రతీకలు, కల్పనలు గోచరిస్తాయి. వాటిని సత్యాన్వేషకులు ఛేదింపవలసి వున్నది. ఇట్లా భారతీయ పురాణాల్లో అనేక కల్పనలు వుండడం జర్మన్ తత్త్వవేత్త హెగెల్ ను అబ్బురపరచింది. తన రచన “ది ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ” లో ఆయన ఇట్లా అన్నాడు:
“India has always been the land of imaginative inspiration, and appears to us as a fairy region, and an enchanted world. In contrast with the Chinese state which presents only the most prosaic understanding, India is the land of phantasy and sensibility”.
Also read: నీ పదములు
రామాయణంలో జటాయువు కూడా ఒక పాత్రధారి. సీతాదేవిని దౌర్జన్యంగా తీసుకొని వెళుతున్న రావణాసురుణ్ణి గగనతలాన వీరోచితంగా ఎదిరించి దుర్మరణం పాలైన పక్షిరాజు జటాయువు. ఒక రవివర్మ తైలవర్ఢ చిత్రంలో ఈ ఘట్టం కళ్లకు కట్టినట్టుగా చిత్రింపబడింది. నల్లగా, క్రూరంగా వున్న రావణాసురుడు ఆకాశమార్గంలో ఒకవైపున బుజంపై జానకిని మోసుకొని పోతుంటాడు. అతని మరొకచేతిలో రక్తసిక్తమైన ఖడ్గం వుంటుంది. ప్రక్కనే అతని కరవాలంచే నరకబడ్డ పక్షి రెక్కా, రెక్క తెగి, నిస్సహాయంగా ఆకాశం నుండి భూమిపైపుకు వ్రాలిపోతున్న జటాయువూ వుంటాయి.
అధర్మాన్ని ఎదిరించే వేళ రామాయణం లోని జటాయువు వలె పరాజయం చవిచూడని శక్తిశాలి యైన ఖగేంద్రుణ్ణి వ్యాసమహర్షి గరుత్మంతుని రూపంలో సృజించినట్లుగా గోచరిస్తుంది. ఈ సృజన నుండే గరుడో పాఖ్యానం, గరుడ పురాణం పుట్టినవి.
Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం
ఈ గరుత్మంతుని సృజనకు ఆధారం పక్షిరాజైన శ్యేనం.
ఖగకులానికే తలమానిక మైనది శ్యేనం. గరుత్మంతుని గాథను కూలంకషంగా పరిశీలించినప్పుడు, గరుత్మంతునికి, శ్యేనానికి (డేగ) అనేక పోలికలు కనిపిస్తాయి. బలిష్టమైన దేహంతో, పెద్దపెద్ద రెక్కలతో, కాళ్లతో, పదునైన ముక్కుతో, నిశితమైన కనుచూపుతో, ఇతరేతర పక్షీ దీనితో సాటి రాజాలదు. దేశదేశాల సాహిత్యాల్లో డేగకు అగ్రస్థానం ఇవ్వబడింది. రష్యన్ మహాకవి అలెగ్జాండర్ పుష్కిన్ మొదలుకొని, భారతదేశపు మహాకవి మహమ్మద్ ఇక్బాల్ దాకా ఈ పక్షిని చూసి అబ్బురపడి అద్భుత గీతాలు రచించినవారే.
మా ఊరి (నంద్యాల) ఈశాన్యపు పొలిమేరల్లో ఒక సువిశాల తటాకం వున్నది. కృష్ణరాయలు తన దేవేరి చిన్నాదేవి పేర నిర్మించినదీ విశాలమైన తటాకం. అందరూ దాన్ని “చిన్నచెరువు” అని పిలుస్తారు. దీని ప్రక్కనే మరొక చెరువు వుంది. దాన్ని అందరూ పెద్దచెరువు అని పిలుస్తారు. వాస్తవానికి ఆ చెరువు కృష్ణరాయల రెండవ పత్ని “తిరుమలదేవి” పేర నిర్మించినది.
ఒకనాటి సాయంత్రం నా బాల్యంలో, చిన్నాదేవి చెరువు గట్టున కూర్చున్నాను. ఉన్నట్లుండి ఆకాశంనుండి, ఒక డేగ, చెదరని ఏకాగ్రతతో, రెండు వైపులా విస్తరించిన సువిశాల పక్షయుగ్మంతో, వాయువేగంతో, చెరువు వైపుకు దూసుకొని వస్తున్నది. విశాలమైన తటాకపు ఉపరితలాన్ని ఒక చోట ఒడుపుగా తాకి, కడుంగడు సునాయాసంగా చేపనొక దాన్ని తన కాళ్ళ నడుమ ఇరికించుకొని, రెండు రెక్కలను బలంగా కదిలిస్తూ, శీఘ్రంగా గగనంలోకి దూసుకొని పోయింది. చెరువుగట్టున కూర్చొని నీటి వైపే దీక్షగా చూస్తున్న నా కంటికి గోచరించని చేప ఆకాశంలో ఎక్కడో గల డేగ కళ్లకు కనిపించడం నన్ను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర విహారం
వర్షగగనంలో సంచరించే పక్షి డేగ
మానవుని కంటిచూపు కన్న డేగ కంటిచూపు ఎనిమిదంతలు శక్తివంతమైనది. ఎత్తైన పర్వతాలపై, లేదా పొడవైన వృక్షాలపై డేగ తన గూటిని నిర్మించుకొంటుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులకు భీతిచెందక, గాలి వాలుతో కదులుతూ, రెక్కల శక్తిని పొదుపు చేసుకుంటూ వర్షగగనంలో సంచరించగల పక్షి ఇదొక్కటే.
హైదరాబాద్ సెక్రటేరియట్ నుండి రిజర్వ్ బాంకుకు పోతున్నప్పుడు తారసపడే కూడలి పేరు “ఇక్బాల్ మినార్”. అక్కడ ఒక స్తంభం అగ్రభాగాన రెక్కలు విచ్చి ఎగరబోతున్న డేగ శిల్పం వున్నది. ఈ మనోహరశిల్పం “సారే జహాసె ” గీతరచయిత, ఉర్దూ మహాకవి మహమ్మద్ ఇక్బాల్ జ్ఞాపకార్థం నిర్మించినది. ఇస్లామ్ మతంలో విగ్రహారాధన నిషేధం. అందుకై, ఇక్బాల్ చైతన్యానికి ప్రతీకగా ఈ డేగ విగ్రహాన్ని నిర్వాహకులు ఆవిష్కరించినట్లు కానవస్తుంది. యాభై అరవై ఏండ్ల క్రిందట మానవ విగ్రహాలు అతి కొద్ది సంఖ్యలో మాత్రమే భాగ్యనగరం కూడళ్ళలో దర్శనమిచ్చేవి.
డేగ అమెరికా దేశ జాతీయ చిహ్నం. దక్షిణభారతపు దేవాలయ ప్రాంగణాల్లో గరుడస్తంభాలు కానరావడం ఒక పక్షిరాజుకు ఈ దేశం తరతరాలుగా ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనం.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం
పద్యసౌందర్యం
నన్నయ భట్టారకుని ప్రసిద్ధ పద్యాల్లో ఒకటి నేటి ఉత్పలమాలా వృత్తం. ధ్వని ప్రాధాన్యమైన పద్యమిది.
ఈ పద్యంలోని మొదటి సమాసం: “ఆతత పత్రమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు”.
వాచ్యపరంగా ఈ వాక్యం యొక్క అర్ధం: “విశాలమైన గరుత్మంతుని రెక్కల నుండి జనించే ప్రచండ మారుతంచే పర్వతాలూ, మహాసముద్రమూ కంపించి పోతున్నవి”.
ఇక ధ్వనిపరంగా ఈ సమాసం యొక్క భావాన్ని, దానిలోని విరుపులే సూచిస్తాయి. ఒక్కమారీ విరుపులను గమనించగలరు:
“ఆతత (4 మాత్రలు)
పక్షమారుత (7 మాత్రలు)
రయప్రవికంపిత (9 మాత్రలు)
ఘూర్ణితాచలవ్రాత (11 మాత్రలు)
మహార్ణవుండు” (7 మాత్రలు)
గరుత్మంతుడు ఆకాశాన్ని అధిరోహిస్తున్నాడు. రాను రాను అతడు వేగం పుంజుకొంటున్నాడు. అతడు అధిరోహించే ఎత్తు కూడా పెరుగుతున్నది.
దీనిని సూచించడానికై పై సమాసం ఐదు భాగాలుగా విరిగి పోతున్నది. ప్రతి భాగానికీ “త” కారం అంత్యప్రాస. ఒక్కొక్క భాగానికీ పదాలను ఉచ్ఛరించే కాలప్రమాణం విస్తరిస్తున్నది. రానురాను విస్తరించే ఈ మాత్రాకాల ప్రమాణం గరుడుడు క్రమక్రమంగా పుంజుకునే వేగాన్ని, అధిగమించే పర్వతాల ఎత్తునూ సూచిస్తున్నది.
Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం
ఇక పద్యంలోని రెండవ సమాసాన్ని చూద్దాం:
“బలవన్నిజ దేహ (9 మాత్రలు)
సముజ్జ్వలత్ప్రభా(9మాత్రలు)
ధూత పతంగ తేజుడు (11 మాత్రలు)
గరుత్మంతుడు ఉన్నత పర్వతాలను ఏటవాలుగా అధిరోహించేటప్పుడు మాత్రాకాలం క్రమక్రమంగా పెరుగుతున్నది. ఒక్కసారి ఆ పర్వతాలను అధిగమించి, ఒకే ఎత్తులో భూమికి సమాంతరంగా సముద్రాలపై పయనించేటప్పుడు (after gaining the altitude), విరుపువిరుపుకూ మాత్రలు సమతుల్యంగా వెళుతున్నాయి.
మొదటి సమాసం పదాల చివర ప్రాసలతో అంచెలంచెలుగా గగనంలోకి దూసుకొని పోవడం సూచిస్తుంది. పదాల కొసల్లో ప్రాసలు లేని రెండవ సమాసం భూమికి సమాంతరంగా ఒకే ఎత్తులో ఎగరడాన్ని నిర్దేశిస్తుంది.
మొదటి విభాగంలో వేగంగా ఆరోహించే శక్తి సామర్థ్యాల వర్ణన. రెండవ విభాగంలో గరుత్మంతుని ఉజ్జ్వల ప్రకాశంతో సూర్యకాంతి నిస్తేజంగా కనిపించడం వర్ణన.
ఇక క్రియావిభాగం పద్యం చివర. వచనంలో ఐతే ఈ విభాగం మొదటే వుంటుంది:
“ఉదితుండయి” (జన్మించి)
“తార్క్ష్యుడు” (గరుత్మంతుడు)
“తల్లికిన్ మనఃప్రీతి యొనర్చుచున్”
“ఎగసె భీమజవంబున నభ్రవీధికిన్”
ఈ పద్యంలోని మొదటి సమాసంలో పదాలు/వాక్యశకలాలు విరిగిపోతూ వుంటాయి. వీటి అన్నింటా “త” కార ప్రాస కొసన వుంటుంది. దీనికి భిన్నంగా,
“వివిధోత్తుంగ తరంగ” అనే మరొక నన్నయ గారి ప్రసిద్ధ పద్యంలో వాక్యశకలాలు సరిసమానంగా వుండడమే గాక, ప్రాసాక్షరం మొదటే వుంటుంది. గమనించండి:
“లవలీలుంగ (7 మాత్రలు)
లవంగ సంగత (8 మాత్రలు)
లతాలాస్యంబు (7 మాత్రలు)
లీక్షించుచున్ (7 మాత్రలు)
నేటి పద్యమంతా కలిపి పఠించినప్పుడు, గరుత్మంతుడు ఆకాశాన్ని క్రమక్రమంగా ఆరోహించడాన్ని, సూర్యతేజం గరుడుని తేజం ముందు వెలవెలపోవడాన్ని, పాఠకులు, కేవలం, ధ్వనిమాత్రంచే, అనుభవిస్తారు.
Also read: మహాభారతం – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 6
ప్రసిద్ధ అమెరికన్ కవి ఆర్చిబాల్డ్ మాక్ లిష్ కవితా నిర్వచనం నేటి నన్నయ భట్టారకుని పద్యగుణానికి ముమ్మూర్తులా సరిపోతుంది:
“A poem should be like the speechless flight of birds;
A poem should not mean but be”.
“పద్యం గగనంలో ఎగిరే పక్షుల నిశ్శబ్దం వంటిది;
వాచ్యం పద్యం కానేరదు. అనుభవమే పద్యం!”
కృష్ణశాస్త్రిపై నన్నయ ప్రభావం
ఆధునిక కవుల్లో, కృష్ణశాస్త్రి గారిపై నన్నయ భట్టారకుని ప్రభావం అంతా ఇంతా అని చెప్పడానికి వీలులేదు. “ఆన్వేషణం” అనే ప్రసిద్ది గాంచిన కృష్ణశాస్త్రి గారి ఖండిక లోని ఈ క్రింది పద్యం చూడండి:
“శారద శర్వరీ మధుర చంద్రిక,
సూర్య సుతాస్రవంతికా
చారు విలీన వీచిక, ప్రశాంత
నిశాపవనోర్మి మాలికాచారిత
నీపశాఖిక,
కృశాంగిని గోపిక,
నేను నాడు బృందారమణీయ సీమ, వినినారము మోహన వేణుగానమున్!”
“బృందావన సీమ నుండి మోహన వేణుగానం వినపడుతున్నది. చెవి యొగ్గి ఆ గానాన్ని శరద్రాత్రి వింటున్నది; శరదిందు మధుర చంద్రిక వుంటున్నది: ఆ చంద్రిక సోకే యమునా స్రవంతిక వుంటున్నది. యమునా తరంగాలనుండి వీచే సమీర వీచిక వింటున్నది. ప్రశాంతమైన వీచికలు సోకి చలిస్తున్న నీపశాఖిక వింటున్నది. ఆ పొగడచెట్టు చెంత వున్న గోపిక వింటున్నది. నేను కూడా వింటున్నాను.”
నేటి నన్నయ గారి పద్యంలోని “త”కార వృత్యనుప్రాసలు “ధ్వని” ప్రధానమైతే, కృష్ణశాస్త్రి గారి పద్యంలోని “క”కార వృత్యనుప్రాసలు సన్నపోగారు చెక్కిన శిల్పాలంకారాలు.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5
గోమఠేశ్వరుని ధ్యానముద్ర
కర్ణాటక రాష్ట్రం లోని హసన్ పట్టణం సమీపంలోని శ్రావణబెళగోళ అనే చోట గల శిలాపర్వతంపై జైనుల ఆలయం వున్నది. ఆ గుడి ప్రాంగణంలో వన్నెండు వందల సంవత్సరాల నాటి గోమఠేశ్వరుని విగ్రహం వున్నది. దాదాపు 60 అడుగుల ఎత్తుగలది ఆ ప్రతిమ. దేవాలయ నిర్వాహకులు తరచు దానికి మస్తకాభిషేకం చెయ్యడం వల్ల కాబోలు, ఇటీవలే చెక్కబడినట్లు అది తళతళ లాడుతుంటుంది. అది గ్రానైట్ రాయిపై చెక్కబడింది. గ్రానైట్ శిల స్థూలంగా చెక్కడానికి పనికి వస్తుంది తప్ప సన్నపోగారుకు పనికి రాదు. శిల్పకళా భాషలో చెబితే గ్రానైట్ రాయి మినిమల్ స్కల్ప్చర్ కు అనుకూలమైనది. తదనుగుణంగానే, ధ్యానమగ్నుడైన గోమఠేశ్వరుని ప్రతిమలో అంగాంగ వర్ణన గోచరించదు. నిటారుగా నిలబడ్డ ధ్యానమూర్తి గోమఠేశ్వరుని ఆధ్యాత్మికానందంతో నిమీలితములై వుంటాయి. ధ్యానంలోని ఆనందం గోమఠేశ్వరుని కుసుమకోమల మందహాసంలో ప్రతిఫలిస్తుంటుంది. ఆ దిగంబరమూర్తి యొక్క బలిష్టమైన బాహువులపై లతలు అల్లుకొని వుంటాయి. ఈ మినిమల్ స్కల్ప్చర్ లో స్ఫురించే ధ్యానముద్ర, అధరాలపై విచ్చుకొనే మందహాసంలో గల ప్రశాంతత మాటల్లో వర్ఢింపలేము. “మోనలీసా” చిత్రంలోని నర్మగర్బ దరహాసం కన్న వేయిరెట్లు మనోహరమైనది గోమఠేశ్వర శిల్పంలోని చిరునవ్వు. భారతదేశపు అద్భుత శిల్పాల్లో ఇదొకటి.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4
ఇదే హసన్ పట్టణానికి సమీపంలో బేలూరు, హాలీబీడు వద్ద ఆలయ శిల్పాలు వున్నాయి. నల్లని ఇసుకరాయిపై (sandstone) పై చెక్కబడిన ఈ శిల్పాలు సూక్ష్మంగా చెక్కడానికి అనుకూలమైనవి. మధ్యయుగాల నాటి హోయసాల రాజుల కాలంలో చెక్కబడినవివి. ఇసుకరాయిపై ఒక్క అంగుళాన్నీ విడిచిపెట్టకుండా, చెక్కిన స్త్రీ మూర్తుల శిల్పాలు జీవకళతో ఉట్టిపడుతుంటాయి.
శ్రావణ బెళగోళ కడ నున్న గోమఠేశ్వరుని విగ్రహం వాగనుశాసనుని “ధ్వని ప్రాధాన్యతకు” దర్పణమైతే, హోయసాల శిల్పకళ కృష్ణశాస్త్రి గారి సన్నపోగారుకు నిలువుటద్దం.
సన్నపోగారు చెక్కడానికి చాలకాలం పడుతుంది. కృష్ణశాస్త్రి సాహిత్యం రాశి రీత్యా కడు స్వల్పం. అప్రయత్నపూర్వకమైన “ధ్వని” ప్రధానమైన ఇతిహాసం నన్నయ భట్టారకుని ప్రవృత్తికి అనుకూలమైనదే గాక, సుదీర్ఘమైన భారతరచనా ప్రణాళికకు కూడా అవసరమైనది. నన్నయ రచన అర్థాంతరంగా ఆగిపోవడం ఆంధ్రజాతి చరిత్రలో ఒక విషాదఘట్టం.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం
నివర్తి మోహన్ కుమార్