వోలేటి దివాకర్
- ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్మిచాలనే ప్రతిపాదనకు ప్రజలు వ్యతిరేకం
- సీఎంకు ఉండవల్లి లేఖ
రాజమండ్రి సెంట్రల్ జైలులో విస్తరించి ఉన్న రెండు వందల ఎకరాల స్థలం స్టేడియం నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని రాజమండ్రి ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అదే ప్రదేశంలో స్టేడియం నిర్మాణానికి 1999లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
శిలాఫలకం వేశారని, అప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని ఉండవల్లి ఆ లేఖలో గుర్తు చేశారు. ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తంగా ఒక నిర్ణయానికి వచ్చి సెంట్రల్ జైలులోని సువిశాల స్థలంలో పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ప్రతి పాదన చేశారని, అయితే అది సాకారం అవుతున్న పరిస్థితిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయిందని ఉండవల్లి వెల్లడించారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని స్టేడియం ను
ఆర్ట్స్ కళాశాలకు ఎదురుగా ఉన్న సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. స్టేడియం నిర్మాణానికి నాడు స్థలం మంజూరు చేస్తూ జైలు శాఖ ఇచ్చిన ఉత్తర్వుల నకలు ప్రతిని కూడా ఈ లేఖకు ఉండవల్లి జతపరిచారు.
మరోవైపు ఆర్ట్స్ కళాశాల లో స్టేడియం నిర్మాణం అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎంపి మార్గాని భరత్ రామ్ స్పందించారు. కళాశాలలో గ్రీన్ మ్యాట్ క్రికెట్ పిచ్ ను మాత్రమే ఏర్పాటు చేస్తామని వివరణ ఇచ్చారు.