————————–
( ‘ BUILDERS OF BRIDGES’ FROM ‘ THE WANDERER’ BY KHALIL GIBRAN)
తెలుగు అనువాదం : డా. సి. బి. చంద్ర మోహన్
23. సంచారి తత్త్వాలు
——————————
ఏంటియొక్ నగరంలో — అస్సీ నది సముద్రంలో కలిసే చోట , నగరం రెండు సగాలనీ కలుపుతూ ఒక వంతెన నిర్మించబడింది. పెద్ద పెద్ద రాళ్లు కొండలనుండి , కంచర గాడిదల వీపుల మీద మోసుకు వచ్చి ఆ వంతెనను నిర్మించారు.
వంతెన నిర్మాణం పూర్తి అయిన తరువాత అక్కడ ఒక స్తంభం మీద గ్రీకు భాషలోనూ, అరామైక్ భాషలోనూ ఇట్లా చెక్కబడింది.
” ఈ వంతెన ఏంటియొకస్ 2 — రాజుచే నిర్మించబడింది.”
ప్రజలంతా ఆ వంతెన పైన నడుస్తూ అస్సీ నదిని దాటేవారు.
ఒక రోజు సాయంత్రం — కొంత మందిచే పిచ్చి వాడుగా భావించబడే ఒక యువకుడు, మాటలు చెక్కిన ఆ స్తంభం వద్దకు వచ్చి, బొగ్గుతో ఆ మాటలకి మసి పూసి, దానిపై ఇలా రాసాడు. “ఈ వంతెన యెక్క రాళ్లు కొండల పైనుండి కంచర గాడిదలచే తీసుకు రాబడినాయి. ఈ వంతెన పై మీరు అటూ ఇటూ ప్రయాణిస్తున్నారంటే, దాని అర్ధం — ఈ వంతెన నిర్మాతలైన ఏంటియొక్ కంచర గాడిదల వీపులపై మీరు స్వారీ చేస్తున్నారన్నమాట!”
ఆ యువకుడు రాసిన మాటలు చదివి కొంతమంది నవ్వుకున్నారు. కొందరు ఆశ్చర్యపోయారు. మరి కొందరు ” అవును. ఇది ఎవరు రాసారో మాకు తెలుసు. అతనికి కొంత పిచ్చి ఉంది కదా?” అన్నారు.
కానీ , ఒక కంచర గాడిద నవ్వుతూ మరో గాడిదతో ఇలా అంది. ” ఈ రాళ్లు మనం మోసుకు రావడం నీకు గుర్తు లేదా? అయినా గానీ, ఇప్పటి దాకా, ఏంటియొకస్ రాజే దీనిని నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు!”