Sunday, December 22, 2024

జాతీయ రాజకీయాలలో టీఆర్ఎస్ పాత్రపై ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించారు. తాను రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారుడినని అభివర్ణించుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులూ, అవమానాలూ, ప్రతికూల పరిస్థితులూ, ఛీత్కారాలూ ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. కేంద్రం నుంచీ, వివిధ సంస్థల నుంచీ వస్తున్న అవార్డులే తెలంగాణ పురోగతికి నిదర్శమని చెప్పారు. ఇకపైన మోదీ ఆటలు సాగవని కేసీఆర్ కుండబద్దలు కొట్టి చెప్పారు. మతరాజకీయాలకు ఇండియా వంటి దేశంలో తావు లేదనీ, మతద్వేషాన్ని రెచ్చగొట్టే పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందనీ కేసీఆర్ ఉద్ఘాటించారు.

కఠిన నిర్ణయాలు తసుకొని అమలు చేశామనీ, కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చామనీ, 85 శాతం మొక్కలు దక్కకపోతే సర్పంచ్,ప్రత్యేకాధికారి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించామనీ, అందుకు దేశంలోని ఆదర్శ పంచాయతీల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే మొదటి పది పంచాయతీలూ తెలంగాణకు చెందినవే ఉన్నాయని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ ఉపన్యసిస్తున్న సందర్భం

స్వాతంత్ర్య ఫలితాలు ప్రజలకు పద్ధతి ప్రకారం దక్కవలసినంతగా దక్కలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అవాంఛనీయమైన, అనవసరమైన పెడధోరణులు సమాజంలో పెరుగుతున్నాయనీ, అవి దేశం ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్నాయనీ ఆందోళన వెలిబుచ్చారు. దేశానికి ప్రత్యామ్నాయ ఫ్రంట్ అవసరం లేదనీ, సరికొత్త రాజకీయ అజెండా కావాలనీ అన్నారు. 2000లో తాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడితే తిన్నది అరగటంలేదా అని ఎద్దేవా చేశారనీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫలితాలు అనుభవిస్తున్నామనీ అన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలలో పాత్ర అంటే అదే విధంగా తేలికగా మాట్లాడుతున్నారని అన్నారు. నీటియుద్ధాలు చేసుకొనే దౌర్భాగ్యపరిస్థితి ఎందుకని ప్రశ్నించారు. దేశంలో నదీ జలాలు పుష్కలంగా ఉన్నాయనీ, నదుల్లో ఉండే నీటి లభ్యత 62 టీఎంసీల దాకా ఉండగా మనం వాడుకుంటున్నది 35 టీఎంసీలు మాత్రమేననీ చెప్పారు.

అట్టహాసంగా ప్లీనరీ

తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్లీనరీ బ్రహ్మాండంగా జరిగింది. సుమారు మూడువేలమంది ప్రతినిధులతో సభ అట్టహాసంగా జరుపుకున్నారు. పరనింద, ఆత్మస్తుతి దిగ్విజయంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలంటూ తనపైన ఒత్తిడి వస్తున్నదని కేసీఆర్ సూచించారు. జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించాలంటూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. భారత దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణను ఎనిమిదేళ్ళలో తీర్చిదిద్దినందుకు కేసీఆర్ ను వక్తలందరూ శక్తివంచన లేకుండా అభినందించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో హెచ్ఐసీసీలో బుధవారం జరిగిన ప్రతినిధుల సభలో కేసీఆర్ కి నేతలు బ్రహ్మరథం పట్టారు. 2001లో నెలకొల్పిన టీఆర్ఎస్ ఇరవై ఒకటో ఏట అడుగుపెట్టి మేజర్ అయిందనీ, దానికి సంపూర్ణ వ్యక్తిత్వం అబ్బిందనీ వక్తలు అన్నారు.

కేసీఆర్ హిస్టరీ,జియాగ్రఫీ సృష్టించారు : కేటీఆర్

కేటీఆర్ ప్రసంగిస్తున్న దృశ్యం

బీజేపీపైనా, ప్రధాని నరేంద్రమోదీ విధానాలపైనా యథావిధిగా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశాన్నికాపాడాలంటే కేసీఆర్ వంటి దీపధారి ఒకరు అత్యవసరమని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) చెప్పారు.  ఎన్ టి రామారావు పార్టీ స్థాపించి చరిత్ర సృష్టిస్తే, కేసీఆర్ పార్టీ పెట్టి హిస్టరీనీ, జియాగ్రఫీనీ సృష్టించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానం లేదు. ఎన్టీఆర్ హిస్టరీ సృష్టిస్తే, కేసీఆర్ హిస్టరీ, జియాగ్రఫీ (తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి) సృష్టించిన మాట వాస్తవమే. కాళేశ్వరం వంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో రికార్డు సమయంలో నిర్మిస్తే ప కేసీఆర్ ను అభినందించే సంస్కారం కూడా ప్రదాని ప్రదర్శించలేదని కేటీఆర్ విమర్శించారు.  దేశంలో ఇరవై నాలుగు గంటలు విద్యుచ్ఛక్తి సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేననీ, రైతు బంధు, దళితబంధు ఇస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమేననీ కేటీఆర్ అన్నారు. దేశానికి టెలివిజన్ ఉన్న నాయకుడు కాదనీ విజన్ ఉన్న నాయకుడు కావాలనీ ఆయన చెప్పారు. నోట్ల రద్దు వంటి నష్టదాయకమైన విధానాలు అవలంబించిన నరేంద్రమోదీ రైతు విరోధి అని అభివర్ణించారు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles