Sunday, November 24, 2024

పీకే కాంగ్రెస్ ప్రవేశం వాయిదా

  • ఉదయపూర్ చింతన్ బైఠక్ లో చర్చ కొనసాగింపు
  • పీకే ప్రవేశాన్ని అడ్డుకుంటున్న దిగ్విజయ్, ముకుల్ వాస్నిక్
  • పీకేకి అనుకూలంగా మాట్లాడిన ప్రియాంక, అంబికా సోనీ
  • చర్చలకు దూరంగా రాహుల్ గాంధీ
  • ప్రస్తుతానికి ప్రముఖుల సంఘంలో పీకేకి సభ్యత్వం

ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పునరజ్జీవన కార్యక్రమం ప్రారంభించడానికి అవకాశాన్ని చేజిక్కిచ్చుకున్నారు. కానీ పూర్తిగా ఆయన ప్రణాళిక అమలు కావడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు నియమించిన ‘శక్తిమంతమైన కార్యాచరణ బృందం’లో సభ్యుడిగా ప్రశాంత్ కిశోర్ అనే పీకే ప్రవేశించనున్నట్టు సమాచారం. పీకే కాంగ్రెస్ లో ప్రవేశించడానికి ఇప్పటికీ అభ్యంతరాలు చెబుతున్నవారు కొందరు ఉన్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే పీకే ప్రవేశం గురించి ఖరారు నిర్ణయం సోనియాగాంధీ ప్రకటిస్తారు. కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స అవసరమేనని సోనియాగాంధీ నియమించిన ఎనిమిదిమంది సభ్యుల బృందం అంగీకరించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ చికిత్స పూర్తి కావాలి. అయితే ఆ చికత్స ఎట్లా జరగాలి, ఎవరి ఆధ్వర్యంలో జరగాలి అనే విషయంలో స్పష్టత రాలేదు.

కాంగ్రెస్ స్వరూపస్వభావాలను మార్చేయాలంటున్న పీకే

కాంగ్రెస్ పార్టీ స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేయవలసిన అవసరం ఉన్నదని పీకే చెప్పిన మంత్రానికి కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకున్నట్టే కనిపిస్తోంది. ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)తో సుదీర్ఘ మంతనాలు జరిపి తన ఐప్యాక్ టీమ్ టీఆర్ఎస్ విజయానికి పనిచేసే విధంగా ఏర్పాటు చేసుకున్న ఫలితంగా పీకేకి కాంగ్రెస్ అగ్రనాయకులతో బేరసారాలు చేయడంలో బలహీన పరిస్థితి ఎదురయింది. సోనియా నియమించిన కమిటీ అభిప్రాయం ప్రకారం టీఆర్ఎస్ కైనా, మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కైనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ సీపీకైనా పీకే పని చేయడం, ఆ పార్టీల విజయాలకు తోడ్పడటం నిషిద్ధం. అది పొంతన లేని వ్యవహారం. ఒక వైపు కాంగ్రెస్ కు పని చేస్తూ మరో  వైపు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో పని చేయడం అనేది పరస్పర విరుద్ధమైన విధానం. రాజకీయ పరిశీలకులు అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ కుమారుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కాంగ్రెస్ ను రోగగ్రస్థమైన సంస్థ అంటూ మాట్లాడారు. అటువంటి రోగభూయిష్టమైన సంస్థను పట్టుకొని వేళ్ళాడుతున్న వ్యక్తిగా పీకేనూ అభివర్ణించారు. అటు కాంగ్రెస్ కూ, ఇటు బీజేపీకీ దూరంగా ఉంటానని కేసీఆర్ ఆదివారంనాడు ప్రకటించిన విషయం విదితమే. పీకే తాజా వైఖరి కాంగ్రెస్ పార్టీకి అభిలషణీయమైన పరిణామం కాదు. అందుకని పీకే అంత జోరుగా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడలేకపోయారని సమాచారం. పీకేను కాంగ్రెస్ లోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించినవారిలో దిగ్విజయ్ సింగ్ ఒకరు. మరికొందరిలో అభద్రతాభావం నెలకొన్నది.

పీకే పై ప్రశ్నలు సంధించిన గెల్హాట్, భూపేశ్ బఘేల్

లోగడ ఒక సారి సోనియాగాంధీని పీకే కలిసినప్పుడు ఆయనను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెల్హాట్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ప్రశ్నలతో ముంచెత్తారు. వచ్చే నెల రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మూడు రోజులు చింతన శిబిరం జరగనున్నది. ఆ శిబిరం జరిగే నాటికి పీకే సరంజామాతో సిద్ధమై 2024 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఎటువంటి విధానాలు అవలంబించాలో,రణవ్యూహం ఎట్లా ఉండాలో చెప్పగలగాలి. ఈ రోజు సమావేశం తర్వాత పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతేూ, పీకే ప్రవేశంపైన నిర్ణయం తీసుకోవడానికి సోనియాగాంధీ మరికొంత సమయం తీసుకుంటారని తెలియజేశారు. అంబికా సోనీ, ప్రియాంకవద్రా పీకే ప్రవేశానికి అనుకూలంగా మాట్లాడారనీ, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సూర్జేవాలా, జైరాంరమేశ్ వ్యతిరేకించారనీ, కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోనీ అటూ, ఇటూ కాకుండా మాట్లాడి తటస్థంగా ఉండిపోయారని అభిజ్ఞవర్గాల భోగట్టా. పీకే సొంత దుకాణం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను ఆదేశించే విధంగా వ్యవహరిస్తే అది పార్టీ నాయకుల ఆత్మగౌరవానికి భంగకరమని కొంతమంది అనుభవజ్ఞులైన నాయకుల అభిప్రాయం. పీకే పథకాన్ని అమలు చేసే క్రమంలో ఆయనకు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల విజయావకాశాలు సైతం ముఖ్యమనీ, ఇది ఎట్లా పొసగుతుందనీ వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయాన్ని అపేక్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి పని చేయడం అసంగతంగా ఉంటుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీతో వ్యవహారం చేస్తూ కాంగ్రెస్ పునరుద్ధరణకు పని చేస్తాననడం కూడా సమజసంగా ఉండదు. ప్రశాంత్ కిశోర్ వ్యవహారంలోనే గందరగోళం ఉంది.

దాదాపు అన్ని పార్టీలకూ మార్గదర్శనం

ప్రశాంత్ కిశోర్ లోగడ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీకీ, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకీ, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్రసింగ్ కీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, మమతా బెనర్జీకీ, స్టాలిన్ కీ రాజకీయ సలహాదారుడిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభకు 2017లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్-ఎస్ పీ జంటకు పని చేశారు. ‘యూపీకే లడ్కే’ అని ప్రచారం చేస్తూ రాహుల్ గాంధీనీ, అఖిలేష్ యాదవ్ నీ యూపీ అంతటా పర్యటింపజేశారు. కాంగ్రెస్-ఎస్ పీ కూటమి దారుణంగా ఓడిపోగా, బీజేపీ అఖండవిజయం సాధించింది.

కాంగ్రెస్ నాయకత్వం సమస్యల కుప్ప

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సమస్యలు ఉన్నమాట వాస్తవం. ప్రజలలో ప్రాబల్యం ఉన్నవారికి అధిష్ఠానం దగ్గర ప్రవేశం లేదు. అధిష్ఠానాన్ని సేవించుకునేవారికి ప్రజలలో పలుకు బడిలేదు. ఒక ఆఫీసులో అధికారులూ, గుమాస్తాలూ పని చేసినట్టు చేసేవారే కానీ ఒక రాష్ట్రంలో లేదా ఒకానొక ప్రాంతంలో బలమైన నాయకులుగా ఎదిగినవారు కాదు. ఒక జాతీయ రాజకీయ పార్టీకి ఇటువంటి వారు అధిష్ఠానంలో భాగం కావడం శోచనీయం. వీరందరికీ ఉద్వాసన చెప్పాలనీ, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, ప్రజాక్షేత్రంలో పలుకుబడి కలవారిని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించాలనీ పీకే సూచించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో సోనియాగాంధీ కొనసాగుతూ, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడుగా రాహుల్ గాందీ వ్యవహరిస్తూ గాంధీ కుటుంబానికి చెందని ఒక వ్యక్తిని పార్టీకి ‘వర్కింగ్ ప్రెసిడెంట్’ గా నియమించాలని సలహా చెప్పారు.

కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు

కడచినవారం శని, ఆదివారాలు పీకే హైదరాబాద్ లో కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ లో మకాం పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రితో సుదీర్ఘ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. పీకే కి చెందిన ఐప్యాక్ టీఆర్ఎస్ పార్టీకి పని చేస్తుందంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పీకే, టీఆర్ఎస్ కి ఆయనకు లోగడ చెందిన సంస్థ, తన  శిష్యులు నడిపించే సంస్థ ఐపాక్ పని చేస్తుందట. ఇందులోని వైరుధ్యం పీకే కి తప్ప అందరికీ కనిపిస్తుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలనీ, బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవాలనీ పీకే ఉవాచ. ఇది ఆయనకు అనుకూలంగా ఉంటుంది. తన క్లయింట్లందరితోనూ సమష్టింగా వ్యవహారం చేయవచ్చు.కానీ కాంగ్రెస్ కు ఇది ఆత్మహత్యాసదృశమైన వ్యవహారం.

టీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పెట్టుకుంటుందా?

ఉదాహరణకి తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మద్య ఎన్నికల ఒప్పందం అంటే ఏమిటి? టీఆర్ఎస్ కి శాసనసభలో వందమంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టుమని పదిమంది లేరు. అదే నిష్పత్తిలో ఎన్నికలలో సీట్లు పంచుకుందామని కేసీఆర్ అంటారు. దానికి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా? విజయావకాశాలు ఉన్న రాష్ట్రంలో అధికారపార్టీకి జూనియర్ భాగస్వామిగా ఉండటానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా? అంతకంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉంటుందా? పీకేకి కావలసింది కాంగ్రెస్ పైన పెత్తనం చేసి దానిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించడం. తాను చెప్పినట్టు చేయకపోతే, తన సలహాలు పాటించలేదు కనుక ఓడిపోయారని అంటారు. తాను చెప్పినట్టు వినడం అంటే తాను నియమించిన యువతీయువకులు ఎవరిపేరు చెబితే వారికి సీట్లు ఇవ్వాలి. ఈ విషయంలో రాహుల్ గాంధీకి అంగీకారం లేదు. అందుకే ఆయన చర్చలలో కనిపించడం లేదు. పార్టీ యంత్రాంగం యావత్తునూ పీకే చేతుల్లో పెట్టి ఆయన చెప్పినట్టు నడుచుకునేదానికి పార్టీ అధిష్ఠానం ఎందుకు? నాయకులు ఎందుకు? ఇదే సందిగ్థంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉంది. దీనికి సోనియాగాంధీ ఎటువంటి పరిష్కారం కనుగొంటారో చూడాలి. ఇది ఆమె రాజకీయ జీవితంలో ఎదుర్కొటున్న అంత్యంత క్లిష్టమైన సవాలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles