Sunday, November 24, 2024

నా మైక్రోఫోన్‌ ముచ్చట్లు

ఆకాశవాణి లో నాగసూరీయం-18

 గోవా, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, కడప, మద్రాసు, తిరుపతి, రీజినల్‌ అకాడమి హైదరాబాదు, ఆకాశవాణి హైదరాబాదు  ఇదీ ఉద్యోగపర్వంలో  మజిలీల జాబితా! రేడియా కార్యక్రమాలంటే ఆసక్తి ఉంది. అడపా దడపా వినే అవకాశం ఉండేది. అయితే, ఆకాశవాణిలో ఉద్యోగం గురించి నేను ఎప్పుడూ  ఎలాంటి కలా గనలేదు!! 1986లో యూపిఎస్సి, ఎస్సెస్సి – రెండూ ప్రకటనలు ఇచ్చాయి పెక్స్‌, టెక్స్‌ పోస్టులకు.  ఇలాంటి ప్రకటనలు అన్ని పత్రికలలో రావు. ఒకటి మనం మిస్సయ్యాం.  ఎస్సెస్సి ప్రకటన చూడటం, చూసిందే తడవుగా ప్రకటనలోని ముఖ్యవిషయాల తోపాటు అప్లికేషన్‌ కాలమ్స్‌ పుస్తకంలో రాసి అప్లై చేశాను. 

Also read: హేమావతి… రత్నగిరి… సేద్యపు సుద్దులు

విజయాబ్యాంక్ చైర్మన్ సదాశివగుప్తాలో వేణుగోపాల్

1986 డిసెంబరు 28న బెంగుళూరులో పరీక్ష. 1987 మే 5న మద్రాసులో ఇంటర్వ్యూ. 1988 ఏప్రిల్‌ 14 గోవాలో ఆకాశవాణిలో ట్రాన్స్ మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరడం. సుమారు ముఫ్పై మూడేళ్ళ సర్వీసులో 11 చోట్ల ఉద్యోగం చేయడం! ఈ ఆకాశవాణి ప్రయాణం లో  కేవలం మైక్రోఫోన్‌ వాడకం గురించిన  పరిణామం మీతో చెప్పాలనిపించింది. పాతికేళ్ళ ముందు ఢిల్లీలో అసోసియేషన్ మీటింగ్ లో ఒక సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతూ ఏ  స్థాయిలో అయినా ఆకాశవాణి ఉద్యోగి మైక్ వాడటం, టేపు మోయటం నామోషి కాదన్నారు. నేను పూర్తిగా గౌరవించి,  ఏకీభవించే విషయాలు ఇవి! 

భాష కాని ప్రాంతం గోవా

భాషకాని ప్రాంతపు గోవా ఆకాశవాణిలో మైక్రోఫోన్‌ ముట్టలేదు – అంటే నా గొంతు రికార్డు కాలేదు, ప్రసారం కాలేదు. అయితే మా అనౌన్సర్‌ మిత్రులు మైక్ ఎలా వినియోగించేవారో గమనించేవాడిని. టెక్స్‌ ఉద్యోగంలో కళాకారులను కన్నా  మైక్ విషయంలో మా సిబ్బందిని ఎక్కువగా పరిశీలించే అవకాశం ఉండింది. లైవ్‌ స్టూడియోలో ఒకే మైక్ ఉండటం వల్ల ఒకే కుర్చీలో ఇద్దరు కూర్చొని ఉత్తరాల కార్యక్రమం చేయడం నేను చూశాను. శ్రోతలకు ఈ విషయాలు తెలీవు.

Also read: ఉత్సవాలవెల్లువగా ఆకాశవాణి ఉద్యోగపథం!

1991 ఏప్రిల్‌లో అనంతపురం వచ్చాక, మొదటిసారి రేడియో రికార్డింగులో నా గొంతు చేరింది. ఇంటి వాతావరణం కారణంగా మనసులో చదువుకునే అలవాటు చిన్నప్పటినుంచి ఉంది. లెక్చరర్‌గా చేసిన అనుభవం పక్వతకు రాలేదు. ఇక్కడ దోహదపడిందని చెప్పలేను. తొలుత మాట్లాడేటపుడు వాక్యంలో రెండు , మూడు కుంట్లు పడేవి. ఒకరకమైన సంభ్రమం! దాంతో అయోమయ లోకంలా ఉండేది గొంతు. క్రమంగా అలవాటు పడ్డాను. మొదటి మూడు, నాలుగు నెలల్లోనే ఎన్నో రికార్డింగులు చేయాల్సి వచ్చింది. కనుక ఇంటర్వ్యూ చేయడంలో కాస్త స్థిమితపడ్డాను మొదటి సంవత్సరంలో. 

నిరంతర అధ్యయనం

అయితే నేటికీ,  స్క్రిప్ట్‌ చదవడంలో అంత హాయిగా ఇమిడిపోలేను. కానీ ప్రయోజనకరమైన, ఆసక్తికరమైన అంశం ఎంపిక, తగిన నిపుణుడి ఎంపిక చేసుకున్నాక – అంశం గురించిన రీసర్చి- అంటే పూర్వాపరాలు వగైరా కాస్త జాగ్రత్తగా శోధించేవాడిని. ఇపుడు నెట్‌, గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ వగైరా ఉన్నాయి. కానీ గతంలో  వ్యవహారం ఇలా కాదు కదా!  దానికి కావాల్సిన సరంజామా పట్టుకోవడంలో నైపుణ్యం సాధించాను. పెద్ద పెద్ద పత్రికల్లో ఇంటర్వ్యూలను మీడియా యాంగిల్ లో పరిశీలించి; అంశాలు, ఎక్స్పర్టుల ఎంపిక, వారి నుంచి విషయం రాబట్టడం లో మెళుకువలు,  విషయం గురించి అన్ని కోణాల్లో పరిశోధన మొదలైన వాటి గురించి ఆసక్తితో అధ్యయనం చేశాను.

Also read: బదిలీ బాదరాయణంలో జీవనమాధుర్యం!

అనంతపురంలో చాలా ఇంటర్వ్యూలు చేశాను కానీ చర్చాకార్యక్రమాలు నిర్వహించే వీలు పెద్దగా లభించలేదు. అయితే ఆ లోటు  తీరడం విజయవాడలో మొదలైంది. వస్తుపరంగా, వ్యక్తులపరంగా ఎంతో వైవిధ్యంగల పండితులను, మేధావులను, కళాకారులను విజయవాడ ఆకాశవాణిలో పని చేసేకాలంలో ఇంటర్వ్యూలు ఇంకా చర్చలు చేయగలిగాను!

సాంకేతికపరమైన సాహసాలు

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహచరుడితో వేణుగోపాల్

2002లో మళ్ళీ అనంతపురం వచ్చినపుడు సాంకేతికపరమైన కార్యక్రమ సాహసాలు చేసే సౌలభ్యం కల్గింది. ప్రతినెలా కలెక్టర్‌ లేదా ఎంఎల్‌ఎ, లేదా ఎం.పి. ఇలా ప్రముఖులు కార్యక్రమ సమయానికి స్టూడియోకు వచ్చేవారు. ఆ సమయంలో శ్రోతలు ఫోన్‌ చేసి ప్రశ్నలు అడిగేవారు. నేను లైవ్‌ స్టూడియోలో విఐపితో పాటు ఉండి కార్యక్రమం మోడరేట్‌ చేస్తూ ఉండేవాడిని — అంటే శ్రోతలకు, ఎక్స్‌పర్ట్‌కు వారధిగా. ఒకసారి ఎం.పి.కార్యక్రమానికి ఒప్పకున్నారు – రేడియోలో ప్రచారపు ప్రకటనలు చేశాం. అయితే ముందురోజు ముఖ్యమంత్రితో ఆయనకు మీటింగు నిర్ణయమైంది. ఆయన  హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది. అయితే మేము అధైర్యపడకుండా హైదరాబాదులో ఓ ల్యాండ్‌లైన్‌ దగ్గర సిద్ధంగా ఉండమని కోరాం. ఆయన అంగీకరించారు. అది రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు కార్యక్రమం. శ్రోతలు అనంతపురం నుంచి ప్రశ్నలు అడగటం, నేను స్టూడియోలో, ఎం.పి. హైదరాబాదు నుంచి జవాబులు ఇవ్వడం – అనే ప్రక్రియను విజయవంతంగా చేశాం. అప్పటికి అనంతపురం ఆకాశవాణికి, నాకు ప్రయోగం, సాహసం.ఇది మొబైల్స్‌ రాని కాలమని కూడా గుర్తుచేస్తున్నా!

Also read: పదిలంగా సాగిన ఉద్యోగ రథం!

 2004 మధ్యలో విశాఖపట్నం వెళ్ళినపుడు నేను ఆకాశవాణి క్వార్టర్స్‌లో ఉండేవాడిని. శనివారం ఉదయం ఓ అరగంట హెల్త్‌ ప్రోగ్రాం  – లైవ్‌ ఫోన్‌ ఇన్‌ వుండేది. ఆ కార్యక్రమం నిర్వహించే అధికారికి సెలవురోజు రావడం నచ్చక, నన్ను చేయమని కోరారు. అలా ప్రతి శనివారం డా ద్వివేదుల సత్యశ్రీ , సత్యనారాయణ దంపతులతో లైవ్‌ ప్రోగ్రాం కొన్ని నెలలు చేశాను. దీనికి తోడు దాదాపు రెండేళ్ళు ప్రతి ఆదివారం సాయంత్రం 6.30 గం॥లకు ఒక అరగంట పాటు ‘ఆదివాసీ అంతరంగం’ అనే గిరిజనుల కోసం ఫోన్‌ ఇన్‌ లైవ్‌లో గిరిజన్‌కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఎం.డి. డాక్టర్ అంగళకుర్తి విద్యాసాగర్‌ జవాబులు కార్యక్రమం. అలా శని  ఆదివారాల్లో ఆఫీసు పని చేసినా బావుండేది. ‘లైవ్‌ మైక్‌’లో బాగా అలవాటు పడిపోయాను. దాంతో ఇంటర్వ్యూలు, డిస్కషన్స్‌, ఎలా హాయిగా ఉన్నాయో, లైవ్‌ కార్యక్రమాలు కూడా ఆహ్లాదంగా మారిపోయాయి.

ఆదివాసీ అంతరంగం

‘ఆదివాసీ అంతరంగం’ కార్యక్రమాన్ని అన్ని ముఖ్య తెలుగు కేంద్రాలు సహా ప్రసారం (రిలే) చేసేవి కనుక నా గొంతు కూడా చాలా మందికి పరిచయమై పోయింది. ఇక హైదరాబాదులో ఆకాశవాణి అరవై ఏళ్ళ సందర్భంగా ప్రతినెలా ‘వజ్ర వారధి’ అని నాలుగు కేంద్రాలలో ఎక్స్‌పర్టులు పాల్గొనే కార్యక్రమం ఒక సంవత్సరం పాటు చేశాను. మద్రాసులో ఎఫ్‌.ఎం. గోల్డ్‌లో ఉత్తరాలు లైవ్‌గా చదివే కార్యక్రమంలో పాల్గొనేవాడిని. తిరుపతిలో ‘రండి చూసొద్దాం తారా మండలం’ అంటూ నెలవారి సైన్స్‌ సెంటర్‌ నుంచి ఆకాశ వీక్షణం కార్యక్రమాన్ని ‘లైవ్‌’గా రూపొందించేవాళ్ళం. అది కొద్ది నెలలపాటు సాగింది.

Also read: లేచి వచ్చిన లేపాక్షి బసవడు!

నటి ఊర్వశి శారదను ఇ:టర్వ్యూ చేస్తున్న నాగసూరి వేణుగోపాల్

వీటన్నిటికీ పరాకాష్ఠ వంటి సంఘటన 1 ఫిబ్రవరి 2018 సం॥లో జరిగింది. ఆ రోజు తిరుపతి ఆకాశవాణి వ్యవస్థాపక సందర్భం. 1991 ఫిబ్రవరి 1న తిరుపతి ఆకాశవాణి కేంద్రం మొదలైంది. ప్రజోపయోగమైన పని చేయాలని (స్విమ్స్‌ బ్లడ్‌బాంక్‌ వారి సహకారంతో పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌ , తిరుపతి లో) బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశాం. పబ్లిసిటీ యిచ్చి ఆసక్తి గలవారిని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు రమ్మని కోరాం. డా॥ కె.వి. శ్రీధర్‌ (స్విమ్స్‌ బ్లడ్‌బాంక్‌) యిచ్చిన ప్రోత్సాహం విశేషమైంది. అలాగే పి.టి.సి. అధికారుల తోడ్పాటు కూడా! అయితే ఇందులో మరో విశేషం ఉంది. బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ నడుస్తుండగా, ఆకాశవాణి రిక్వేస్టుతో, రక్తం ఇవ్వాలని వచ్చినవారితో, యిచ్చినవారితో, ఇస్తున్నవారితో సంభాషణలను లైవ్‌గా ప్రసారం చేసి రక్తదానం సంబంధించి అపోహలు పోగొట్టి, అవగాహన కల్గించాం. 

ఈ కార్యక్రమంలో సుమారు రెండు గంటలు లైవ్‌ (మధ్యలో ఇరవై నిమిషాల వ్యవధిలో వార్తలున్నాయి) నేనే నిర్వహించాను. ఈ కార్యక్రమంలో మా ఇంజనీరింగ్ మిత్రులు నిరంజన్ రెడ్డి సహకారం విలువైనది. దాన్ని ఎంతోమంది శ్రోతల తోపాటు మా తిరుపతి ఆకాశవాణి సహోద్యోగులు గొల్లపల్లి మంజులాదేవి, సుధాకర్ మోహన్ అభినందించడం గుర్తుంది. 

Also read: విజయదశమి కనకదుర్గ తెప్పోత్సవం

డాక్టర్ నాగసూరి వేణుగోపాల్,

మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles