Sunday, November 24, 2024

గాంధీజీతో ప్రభావితమైన భారతీయ శాస్త్రవేత్తలు

గాంధీయే మార్గం-36

(చివరి భాగం)

        మహాత్మాగాంధీ విభిన్నశైలి, చిత్తశుద్ధి, పట్టుదల మాత్రమేకాక సాధించిన ఘనవిజయం ఆయన తరాలనూ, తర్వాతి రెండు తరాలను విశేషంగా ప్రభావితం చేశాయి. ఇటీవలికాలంలో మనలను విశేషంగా ప్రేరేపించిన ఏ.పి.జె. అబ్దుల్‌ కలాం పదేపదే గాంధీజీ పేరు ప్రస్తావించకపోయినా ఆయన దేశభక్తి, చిత్తశుద్ధి, సహనం, దార్శనికత ఇలా చాలా గుణాలు ఆయన నుంచి వచ్చినవే! కలాం రచన ‘ఇండియా 2020’ తెలుగులో అనువాదం చేసిన అనుభవంతో ఈ మాట చెబుతున్నాను. 

Also read: గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు!

గాంధీజీ గ్రామాలకు వెళ్ళమంటారు. నగరాలు అహంకారాలకు, కృత్రిమత్వానికి నెలవంటారు. మరి గ్రామాలకు వెళ్ళడం ఎలా? దీనికి కలాం సూచించిన మార్గం ‘పుర’ – ప్రొవైడింగ్‌ అర్బన్‌ ఫెసిలిటీస్‌ అట్‌ రూరల్‌ ఏరియాస్‌. నగరంలో ఉండే కనీస సదుపాయాలు పల్లెల్లో అందివ్వ గలిగితే గ్రామ సీమలకు తరలిపోవచ్చు అంటారు. ఇది గాంధీజీ ఆలోచనకు కొనసాగింపే! మిగతా వారి గురించి చెప్పేముందు నాకు బాగా తెలిసిన ఇద్దరు శాస్త్రవేత్తలు – డా. హెచ్‌.నరసింహయ్య, డా. సర్దేశాయి తిరుమలరావు గురించి ముందు చెప్పాలి. గాంధీ టోపీతో ఎల్లప్పుడు కనబడే న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ శాస్త్రవేత్త డా.హెచ్‌.నరసింహయ్య మూఢనమ్మకాల మీద తిరగబడుతూ, సైన్స్‌ పరివ్యాప్తికి తోడ్పడ్డాడు. వీరి కళాశాలలో కొంత కాలం పనిచేశాను. తైల రసాయన శాస్త్రంలో గొప్ప పరిశోధన చేసిన తిరుమలరావు 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ టోపీ, తక్లీ ధరించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవారు. వీరితో నాకు ఒక రెండేళ్ళ పాటు సన్నిహిత సంబంధం ఉంది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ బ్రహ్మచారులు కావడం విశేషం.

Also read: గాంధీజీ దృష్టిలో టెక్నాలజి

మిగతా శాస్త్రవేత్తలు గురించి గాంధీజీ ప్రభావం ఏమిటో చూద్దాం:

1) ఆచంట లక్ష్మీపతి (1880): వందమంది వైద్యులతో గ్రామాల్లో ఆరోగ్య పాదయాత్రలు చేసి ఆయుర్వేద వైద్యాన్ని, భారతీయ అలవాట్లను వ్యాప్తి చేశారు. ప్రసంగాలతోపాటు బొమ్మల ప్రదర్శనలు ఆరోగ్యగీతాల గానం కూడా ఉండేది. కన్యాకుమారి నుంచి పెషావరు వరకు రెండుసార్లు ఆరోగ్యయాత్రలు చేశారు. గాంధీజీ ఆహ్వానంపై సేవాగ్రామ్‌ నుంచి ఆరోగ్యయాత్ర చేశారు. సేవాగ్రామ్‌లో ఔషధవనం ఏర్పాటు చేశారు.

2) బి.సి.రాయ్‌ (1882): క్విట్‌ ఇండియా సమయంలో స్వాతంత్య్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్నవేళ గాంధీజీ ఆరోగ్యం దెబ్బతినింది. గాంధీజీది పిత్తప్రవృత్తి. నెత్తురు పోటువ్యాధి ఉంది. చలిజ్వరం అప్పుడు వస్తూవుండేది. ప్రకృతి చికిత్స చేసుకుంటూ, మందులు తినడానికి సుముఖంగా లేరు. దాంతో కలకత్తా నుంచి బి.సి.రాయ్‌ను ఆగాఖాన్‌ ప్యాలెస్‌కు రప్పించారు. ‘‘నలభైకోట్లమంది ప్రజలకు వైద్యం చేయగలవా?’’ అని గాంధీజీ ఎదురు ప్రశ్న. ‘‘ఆ ప్రజలందరి ప్రతినిధికి వ్యాధి నయం చేయడానికి వచ్చాను’’ అని బి.సి.రాయ్‌ అంటే మెత్తబడి అంగీకరించారు. 1925 నుంచి చాలా చురుకుగా రాజకీయాలలో పనిచేసిన బి.సి.రాయ్‌ పశ్చిమ బెంగాల్‌కు తొలి ముఖ్యమంత్రి. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన డా.రాయ్‌ జన్మదినాన్ని జూలై 1 దేశం ‘డాక్టర్స్‌ డే’ గా జరుపుకొంటుంది. డా.సుశీలా నయ్యర్‌ను గాంధీజీ పర్సనల్‌ డాక్టరుగా నియమించింది వీరే.

Also read: గాంధియన్‌ ఇంజనీరింగ్‌ 

3) జె.బి.ఎస్‌. హాల్డేన్‌ (1892): భారతీయ తత్వచింతననూ, భగవద్గీతనూ, గాంధీజీ అహింసాసూత్రాన్ని విశేషంగా ప్రేమించే బ్రిటీషు శాస్త్రవేత్త భారతీయ పౌరుడిగా మారి, భారతదేశంలోనే మరణించారు. తెలుగు సంస్కృతిని ఇష్టపడే హాల్డేన్‌ తెలుగు భాషకు చాలా కితాబులిచ్చారు. 

4) యల్లాప్రగడ సుబ్బారావు (1895): టెట్రాసైక్లిన్‌ ఆవిష్కరణతో ప్రపంచానికి ఆయుష్షు పోసిన యల్లాప్రగడ సుబ్బారావు ‘ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించు’ అన్న గాంధీజీ మాటను ఎంతో గౌరవించారు. ఆచంట లక్ష్మీపతి శిష్యుడైన సుబ్బారావు ఖాదీతో వైద్యానికి పనికివచ్చే హ్యాండ్‌ గ్లౌస్‌ను, సర్జికల్‌ సూట్‌ను రూపొందించారు. 

5) స్వామి జ్ఞానానంద (1896): తెలుగు వారైన ఈ స్వామీజీ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ శాస్త్రవేత్తగా మారిన వారు భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు.  ఇంగ్లండ్‌లో గొప్ప శాస్త్రవేత్త  జేమ్స్‌ ఛాడ్విక్‌ వద్ద పరిశోధన ప్రారంభించారు. భారతదేశంలో క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైనపుడు జ్ఞానానంద యుద్ధోన్మాదాన్ని విమర్శించారు. దాంతో భారతదేశపు బ్రిటీషు ప్రభుత్వం ధనసాయం ఆపింది. ఇంగ్లండులో ఉద్యోగం లభించినా, తిరస్కరించి అమెరికా తరలివెళ్ళారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే భారతదేశం వచ్చారు.

Also read: శ్రేయస్సు మరువని సైన్స్‌ దృష్టి 

6) జానకీ అమ్మాళ్‌ (1897): సైటాలజి, ఫైటో బయాలజి, ఎథ్నోబాటని, ఔషధమొక్కలు, క్రోమోజోముల ప్రవర్తన వంటి విషయాలపై ఎన్నో పరిశోధనలు చేసిన జానకీ అమ్మాళ్‌ పూర్తిగా గాంధీజీ జీవనశైలితో రాణించిన వ్యక్తి. 

7) కోలాచల సీతారామయ్య (1899): కెమెటాలజీ లేదా ట్రైబో కెమిస్ట్రీ విభాగానికి ఆద్యులైన సీతారామయ్య స్వభావరీత్యా తీవ్రవాది అయివుండేవారు. కానీ తండ్రి నుంచి గాంధీజీ సత్యాగ్రహ భావనను స్వీకరించారు. 

8) కె.ఎల్‌.రావు (1902): ఎప్పుడూ ఖాదీ వాడటంవల్ల డా. కె.ఎల్‌. రావును ‘ఖాదీ ఇంజనీరు’ అనేవారు. కాఫీ, టీ, మద్యం, పొగ ముట్టని కె.ఎల్‌.రావు నమ్మినదానినే ఆచరించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఇంజనీర్లు పెద్దగా పాల్గొనలేదని చింతించేవారు. డా. కె ఎల్ రావు మీద  విశేష ప్రభావం కల్గించినవారు మహాత్మాగాంధీ, ఆర్థర్‌ కాటన్‌.   

9) బి.సి. గుహ (1904): 1943 బెంగాల్‌ కరువు సమయంలో పాలు, ప్రొటీన్లు లేకపోయి సమాజం అల్లాడుతున్నప్పుడు బిరేష్‌ చంద్రగుహ తన పరిశోధనాంశం వదలి ఇటు ఆలోచించాడు. కూరగాయలతో, గింజలతో, సోయాబీన్స్ తో పాలు తయారుచేశాడు. గుహ కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీలో చేరాలని వచ్చినపుడు ఆయన మీద ఆరోపణను యాజమాన్యం ఎత్తి చూపింది. బ్రిటీషువారికి వ్యతిరేకంగా గాంధీజీ మొదలుపెట్టిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆ ఆరోపణ. పిమ్మట పి.సి.రే దగ్గర పరిశోధన చేశారు.

Also read: సైన్స్‌ ఆఫ్‌ బ్రహ్మచర్య

10) హెచ్‌.జె.భాభా (1909): బాలుడిగా భాభా తన అత్త మోహన్‌బాయి టాటా ఇంటికి వెళ్ళినపుడు గాంధీజీతో సహా చాలామంది పెద్ద నాయకులు కనబడేవారు. గొప్ప సంస్థలను నిర్మించిన వారి స్ఫూర్తి కూడా గొప్పదే. 

11) కమలా సోహానీ (1912): కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రిలో పిహెచ్‌.డి. పొందిన తొలి భారతీయ మహిళ కమలా సోహాని. సి.వి.రామన్‌ మీద గౌరవంతో, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ మీద మక్కువతో అక్కడ ఎమ్మెస్సీ చేయాలని ప్రయత్నించారు. మహిళ అనే కారణంతో అందులో ప్రవేశాన్ని తిరస్కరించారు సి వి రామన్‌. అప్పటికే రామన్‌కు నోబెల్‌ పొందిన ప్రతిష్ట ఉంది. కమలా సోహాని మౌనంగా నిరసన తెలిపారు. చివరికి రామన్‌ దిగివచ్చి ప్రవేశం కల్పించారు. కమలా సోహానీ విజయవంతంగా ఎమ్మెస్సీ పొందడంతో రామన్‌ మహిళలకు ఆ సంవత్సరం నుంచే అవకాశం కల్పించారు. 

12) అన్నమణి (1918): సౌరశక్తి రంగంలో విశేష కృషి చేసిన అన్నమణి విలక్షణమైన వ్యక్తిత్వంతో ప్రకృతిని సదా ప్రేమించిన వ్యక్తి. తొలితరం ఫెమినిస్టు అయిన వీరికి గాంధీజీ ఆదర్శాలంటే ఎంతో గౌరవం. అన్నమణి జీవితాంతం ఖాదీ వస్త్రాలే ధరించారు. నంది కొండల్లో టెలిస్కోపు రావడానికి కృషి చేసిన అన్నమణి అవివాహితగా ఉండిపోయారు.

Also read: సమగ్రాభివృద్ధియే లక్ష్యం

13) విక్రం సారాభాయి (1919): గాంధీజీని ఎంతో అభిమానించి, పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన అంబాలాల్‌ సారాభాయి కుమారుడు. విక్రం సారాభాయి మేనత్త అనసూయ సారాభాయి జౌళి మిల్లు కార్మికుల సమ్మెలో కీలకపాత్ర వహించారు. విక్రం సారాభాయి అక్క మృదులా సారాభాయి గాంధీజీకి  నౌఖాలీ పర్యటనలో తోడు వుండటమే కాక, పౌరహక్కుల కోసం పోరాడారు. టెక్నాలజీ సామాన్యుడికి దోహద పడాలని అంతరిక్ష విజ్ఞానంలో కృషిచేశారు.  

14) హరీష్‌ చంద్ర (1923): రామానుజం తర్వాత అంతటి ప్రతిభాశాలిగా ప్రపంచంలో పేరు పొందిన హరీష్‌ చంద్ర తండ్రి చంద్రకిషోర్‌ మహాశయుడు గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితమై ఇంటిపేరును త్యజించారు. అందుకే హరీష్‌ చంద్ర ఇంటిపేరు మనకు తెలియదు. 

15) సి.యన్‌.ఆర్‌. రావు (1934) : భారత ప్రధానికి శాస్త్రసాంకేతిక విషయాల సలహాదారుగా పనిచేసిన డా. చింతామణి నాగేశ రామచంద్రరావు యవ్వనంలో గాంధీ టోపి ధరించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా మైసూరు సంస్థానం ఏలుబడి కొనసాగింది. దీనికి వ్యతిరేకంగా కృషిచేసిన ధీశాలి సి.యన్‌.ఆర్‌. రావు.

– ఇలా మహాత్మాగాంధీ ఎంతో మంది శాస్త్రవేత్తలను ఎంతగానో ప్రభావితం చేశారు. అలాగే గాంధీజీ పూర్తిగా వ్యవసాయదేశంగా కొనసాగాలనే భావనను మోక్షగుండం  విశ్వేశ్వరయ్య వ్యతిరేకించారు. మేఘనాథ్‌ సాహ వంటి తర్వాతి తరం శాస్త్రవేత్తలు సైన్స్‌ పాలసీ విషయంలో గాంధీజీని సరిగా అర్థం చేసుకోలేదు. ఐన్‌స్టీన్‌ కూడా సైన్స్‌ ఆఫ్‌ పీస్‌ విషయంలో అపార్థం చేసుకున్నారు. 

Also read: గాంధీ ఆర్థిక శాస్త్రం కృత్రిమ మైంది కాదు!  

ఆల్ ఇండియా విలేజి ఇండస్ట్రీస్ అసోసియేషన్

1934 గాంధీజీ కోరికపై ఆల్‌ ఇండియా విలేజి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ను కాంగ్రెస్‌ ఏర్పరచింది. వార్థాలో ఏర్పడిన ఈ సంస్థకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న ఆర్థిక శాస్త్రవేత్త జె.సి.కుమారప్పతోపాటు అప్పటి భారతదేశపు అగ్ర శాస్త్రవేత్తలు  సి.వి.రామన్‌, జగదీశ్‌ చంద్రబోస్‌, పి.సి.రే సభ్యులు. 1938లో ఈ సంస్థ ఆధ్వర్యంలో ఖాదీ, రూరల్‌ టెక్నాలజీల గురించి మగన్‌లాల్‌ గాంధీ గుర్తుగా మగన్‌ సంగ్రహాలయాన్ని ఏర్పరిచారు. గాంధీ కాగితం తయారి గురించి, బెల్లం, కండసారి, ఎరువులు, ధాన్యం, పాడి, తేనెటీగల పెంపకం వంటి అంశాల గురించి చాలా రాశారు. గాంధీజీ విజ్ఞానం గురించి మాట్లాడినా, ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడినా వాటి పరమలక్ష్యం – సకల మానవాళి శ్రేయస్సు మాత్రమే. శంభుప్రసాద్‌ తన పరిశోధనా పత్రంలో ఒక ఆసక్తికరమైన, సిగ్గుపడాల్సిన విషయం రాశారు. ముతక బియ్యం, నాణ్యమైన బియ్యం, బెల్లం, చక్కెర వంటి ఆహారపదార్థాల రసాయన విశ్లేషణ చేసి తనకు అవగాహన కల్గించమని గాంధీ పేరు మోసిన వైద్యులకు, రసాయన శాస్త్రవేత్తలకు ప్రశ్నావళి పంపారు. ఏ ఒక్కరు తన ప్రశ్నలకు జవాబు పంపలేదంటూ గాంధీజీ – వారి దృష్టిలో గ్రామీణుడు లేకపోవడమే కారణమని పేర్కొంటారు. ఇక్కడ సైన్స్‌, ఎకనామిక్స్‌, సగటు గ్రామీణుడికి తోడ్పడాలని ఆయన ఉద్దేశ్యం. అలాగే విజ్ఞాన ప్రగతి అనేది ప్రపంచ శాంతికి, నైతిక పురోగమనానికి దారి తీయాలని బలంగా విశ్వసించారు. 

Also read: గ్రామాల సుస్థిర అభివృద్ధికి గాంధీజీ సాంఘిక, ఆర్థిక విధానాలు

1918లో ‘బెరి బెరి’ వ్యాధి ప్రబలినప్పుడు తమిళనాడు ప్రాంతం కూనూరులోని పాశ్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక గదిగా మొదలైనది 1928లో నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌గా వృద్ధిచెంది 1958లో హైదరాబాదుకు వచ్చింది. ఈ సంస్థ తొలిదశలో వ్యవస్థాపకులు రాబర్ట్‌ మాక్‌ కారిసన్‌ పారిశుధ్య, ప్రజారోగ్యం, పోషకాహారం మొదలైన విషయాలలో గాంధీజీ సలహాలు క్రమం తప్పకుండా లోతుగా చర్చించి స్వీకరించేవారు.

గాంధీ ప్రోద్బలంలో ఎం.ఐ.టి.లో తొమ్మిదిమంది చదువుకున్నారు కదా! 1925 ఫిబ్రవరి 16న దేవ్‌ చంద్‌ పారేఖ్‌ కుమార్తె చంపాబెన్‌కూ, టి.ఎం.షాకు వివాహమైంది. వధువు తండ్రి గుజరాత్‌ విద్యాపీఠ్‌లో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. ఈ పెళ్ళికి గాంధీజీ వచ్చారు. 1927లో టి.ఎం.షా అమెరికాలో ఎం.ఐ.టి.లో చేరారు. 1930లో ఎలెక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. మరి అదే టి.ఎం.షా తన మరో సహాధ్యాయితో కలసి 1932లో జాతీయోద్యమంలో భాగంగా కారాగారం పాలయ్యారు. దేవ్‌ చంద్‌ పారేఖ్‌, హీరాలాల్‌ షా వంటి వారు బ్రిటీషువారి వస్త్రాలు అమ్మేబదులు స్వదేశీ బట్టలు అమ్మడం మొదలు పెట్టారు. అది గాంధీజీ ప్రభావం! 1963లో సబర్మతి ఆశ్రమం దగ్గరలో గాంధీ స్మారక మ్యూజియం ప్రారంభించారు. దీనిని రూపొందించిన ఆర్కిటెక్టు ఛార్లెస్‌ కోరియా ఎంఐటిలో చదువుకోగా, అదే సంవత్సరం ఎంఐటిలో గాంధీజీ మనవడు కానురాందాస్‌ గాంధీ పట్టభద్రుడయ్యారు. (ఈ విషయాలను 2011 జనవరి 6న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది.)

1951లో ఒక భారతీయ యువకుడు అమెరికాలో ఐన్‌స్టీన్‌ను కలిశారు.   ఐన్‌ స్టీన్‌, గాంధీలలో ఎవరో ఒకరిని ప్రపంచం ఎంచుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని ఆ యువకుడు వ్యాఖ్యానించారు. గాంధీజీని గౌరవించే ఎంతోమందిలో ఐన్‌స్టీన్‌ ఒకరు. కానీ ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు యువకుడైన రామమనోహర్‌ లోహియా ఇలా వివరించారు – ఆటం బాంబు, సత్యాగ్రహం – ఈ రెండిరటిలో ఒకదాన్ని ప్రపంచం ఎంచుకోవాల్సిన అగత్యం ఉందని! 

Also read: గాంధీజీని అనుసరించిన మహనీయులు  

(సమాప్తం)

డా. నాగసూరి వేణుగోపాల్,

 ఆకాశవాణి పూర్వ సంచాలకులు

మొబైల్: 9440732393  

 
Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles