మత్తకోకిల
“ఏమి కారణమయ్య పాముల
కింత యల్గితి వీవు తే
జే మయుండవు బ్రాహ్మణుండవు
సువ్రతుండవు” నావుడుం
“పాములెగ్గొనరించె మత్ప్రియ
భామ కేను రురుండ ను
ద్దామ సత్త్వుడ నిన్ను నిప్పుడు
దండితాడితు జేసెదన్”
నన్నయ భట్టారకుడు
భృగుమహర్షి వంశంలోని తొట్టతొలి నాలుగు తరాల క్రమమిది:
భృగువు, అతని పత్ని పులోమి, తొలి తరం.
వారి పుత్రుడు చ్యవనమహర్షి, క్షత్రియవంశానికి చెందిన అతని పత్ని సుకన్య, రెండవ తరం.
వారి పుత్రుడు ప్రమతి, అతని పత్ని, అప్సర కాంత యైన ఘృతాచి, మూడవ తరం.
వారి పుత్రుడు రురుడు, అతడు ప్రేమించిన గంధర్వకన్య ప్రమద్వర, నాల్గవ తరం.
పాములపై రురుడి కసి
ఒకరోజు తన చెలికత్తెలతో ఆడుకుంటూ, ప్రమద్వర పొరబాటుగా ఒక సర్పాన్ని కాలితో త్రొక్కుతుంది. పాము వేసిన కాటుకు విషం సోకి ఆమె మరణిస్తుంది. ఆకాశవాణి ఆదేశం ప్రకారం రురుడు తన జీవితంలో అర్ధభాగం ధారపోసి ఆమెను బ్రతికించుకొని, వివాహం చేసుకుంటాడు. కాకపోతే, అతనికి పాములపై కసి ఏర్పడుతుంది. అప్పటినుండి కనపడిన ప్రతి సర్పాన్ని అతడు కఱ్ఱతో బాదడం ప్రారంభిస్తాడు.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5
రురుడొకసారి అడవిలో తిరుగుతూ పుట్టల్లో పొదల్లో తిరిగే డుంఢుభమనే సర్పాన్ని చూసి దాన్ని కొట్టడానికి కఱ్ఱ నెత్తుతాడు. “హరి!హరీ” అంటూ ఆ సర్పం ఆక్రందించి, రురునితో ఇట్లా అంటున్నది:
“అయ్యా ఏ కారణంచే పాములపై నీకింతటి అలక ఏర్పడింది? నీవు తేజోమయుడవు. బ్రాహ్మణుడవు. సువ్రతుడవు!”
ఆ మాటకు రురుని సమాధానమిది: “నా ప్రియమైన భామకు సర్పాలు హాని చెసినవి. నేను రురుడనే బ్రాహ్మణుడను. ఉద్దామ సత్వుడను. నిన్ను తక్షణమే కఱ్ఱతో కొట్టి చంపుతాను”.
ఈ మాటంటూ రురుడు దండాన్ని పైకెత్తుతాడు. ఉత్తరక్షణమే ఆ సర్పం ముని రూపం ధరించి, రురుని కట్టెదుట నిలబడుతుంది. అచ్చెరువునొంది ఆ మునిని రురుడిట్లా ప్రశ్నిస్తాడు: “పామువై వుండి అకస్మాత్తుగా నీవు ముని రూపం దాల్చడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది!”
సమాధానంగా, ఆ ముని ఇట్లా జవాబు చెబుతాడు: “నేను సహస్రపాదుడనే ముని ముఖ్యుణ్ణి. నా సహాధ్యాయుడైన ఖగముడనే ముని అగ్నిహోత్ర గృహంలో వుండగా పరిహాసం కోసం అతని మెడలో గడ్డితో చేయబడిన సర్పాన్ని వేసినాను. అతడు ఉలిక్కిపడి, వెనువెంటనే కోపగించుకొని “నీవు నిర్వీర్యమైన పామువై పడియుందువు గాక” అని శపించినాడు. శాపం ఉపసంహరించు కొమ్మని అతణ్ణి నేను ప్రార్థింపగా, “నా పలుకు వ్యర్థం కాదు గనుక కొంత కాలం పామువై పడి యుండి భార్గవ కులవర్ధనుడైన రురుణ్ణి చూచినంతనే శాపవిముక్తి పొందుతావు” అన్నాడు.
Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4
తన గాథనిట్లా వివరించి, తదుపరి సహస్రపాదుడు రురునికీ క్రింది విధంగా హితబోధ చేస్తున్నాడు:
“భూనుతకీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు నుత్తమ
జ్ఞానము, సర్వభూతహిత సంహిత బుద్ధియు, చిత్తశాంతియున్,
మానమద ప్రహాణము, సమత్వము, సంతత వేదవిద్యను
ష్ఠానము, సత్యవాక్యము, దృఢవ్రతముం, కరుణాపరత్వమున్!”
ఇంకా అంటున్నాడు సహస్ర పాదుడు:
“అయ్యా! నీవు బ్రాహ్మణుడవు. భృగువంశ సముత్పన్నుడవు. సర్వగుణ సంపన్నుడవు. ఇట్టి దారుణ హింసాపరత్వం క్షత్రియులు చేయదగినది గానీ బ్రాహ్మణులు చేయదగునా? బ్రాహ్మణులు అహింసాపరులు. మరొకరు చేసే హింసలను సహింపక చేయవద్దని వారించే పరమకారుణ్య పుణ్యమూర్తులు. జనమేజయుడనే చక్రవర్తి తలపెట్టిన సర్పయాగంలో తల్లి యైన కద్రువ ఇచ్చిన శాపప్రభావంచే కలిగే నాగవంశ వినాశనాన్ని నీ తండ్రికి శిష్యుడైన ఆస్తీక మహామునియే కదా వారించింది!”
ఈ హితబోధ చేసి సర్పాలను కొట్టి చంపాలనే బుద్ధిని సహస్రపాదుడు రురుని మనస్సు నుండి తొలగిస్తాడు. కేవలం విప్రులకే ఉద్దేశింప బడినట్లు తోచినా ఈ సందేశం మానవాళికంతటికీ ఉద్దేశింపబడింది. ఉత్తమ జ్ఞానము, సర్వభూతహిత సంహిత బుద్ధి, చిత్తశాంతి, మానమద ప్రహాణము, సమత్వము, సంతత వేదవిద్యనుష్ఠానము, సత్యవాక్యము, దృఢసంకల్పము, కరుణాపరత్వము అనబడే ఉత్తమమైన లక్షణాలు సమస్త లోకానికే ఆదర్శప్రాయమైనవి.
Also read: భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం
క్రైస్తవాదర్శాలకు హైందవదేశమే మూలం
ఈ క్రమంలో పేర్కొన బడిన సమత్వము, సర్వభూత హిత సంహితబుద్ధి అనే ఉన్నతాదర్శాలు, రాబోయే కాలంలో, గౌతమబుద్ధుని బోధనల్లోను, ఆ తర్వాత క్రైస్తవమత బోధనల్లోనూ ప్రతిబింబించినవని చెప్పడంతో అతిశయోక్తి లేదు. విల్ డ్యురెంట్ ఇట్లా అన్నాడు. ” క్రైస్తవధర్మంలోని ఉన్నతాదర్శాలకు హైందవదేశమే మూలం”.
క్రీశ. పద్ధెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచి సమాజాన్ని ప్రభావితం చేసిన మూలమంత్రాలు: “స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము”. ఫ్రెంచి విప్లవపు ఈ మూడు మానవతా సూత్రాలకు సనాతన భారతావనియే పుట్టినిల్లన్న స్ఫూర్తిని సహస్రపాదుని ప్రబోధం మనలో కలిగింపక మానదు. ఉపనిషత్సారాన్ని ప్రతిఫలించే సహస్రపాదుని సందేశం సార్వకాలికమే గాక, సార్వజనీనం కూడా.
త్రోవనబోయే పాములో సహస్రపాదుడనే శాపగ్రస్తుడైన మానవుడున్నాడనీ, దాన్ని తొందరపడి హింసింపవద్దని సహస్రపాదుని గాథ బోధిస్తున్నది. అట్లే, కట్టెదుట కనపడే శిలలో శాపగ్రస్తయైన ఒక మహిళ వున్నదని అహల్య ఉదంతం తెలుపుతున్నది. ఒక మనిషిని పామువు కమ్మని లేదా రాక్షసుడవు కమ్మని శపించే ఇతిహాస పరంపరకు వెనక హైందవులకు పునర్జన్మపై గల విశ్వాసం దాగివున్నది . మహమ్మదీయధర్మం గానీ, క్రైస్తవధర్మం గానీ పునర్జన్మను అంగీకరింపవు.
Also read: మా ఊరు ఓరుగల్లు
‘ఆడ్రీ రోజ్’ సినిమా కథాసంవిధానం
నలభై యేండ్ల క్రిందట “ఆడ్రీ రోజ్” అనే హాలీవుడ్ సినిమా నొకదాన్ని నేను చూసినాను. అమెరికా దేశపు గాథ యిది, స్థూలంగా నాకు జ్ఞాపకం వున్నది. ఒక మందభాగ్యుడు, ఇల్లాలినీ, ముక్కుపచ్చలారని చిన్ని కూతురినీ పోగొట్టుకుంటాడు. ఒక పాఠశాల ఆవరణలో అతడొక పసిబిడ్డను చూస్తాడు. అచ్చం తన కూతురి వలెనే వున్న ఆ పసిబిడ్డను చూసి అతనికి తన్మయత్వం కలుగుతుంది. ప్రతిదినం ఆ బడి వద్దకు వెళ్ళి ఆ పసిబిడ్డనే తదేకంగా చూస్తూ తృప్తిని పొందుతాడు. ఇది ఆ పసిబిడ్డ తలిదండ్రుల దృష్టిలో పడుతుంది. వారా అభాగ్యుణ్ణి బెదిరించినా అతడు నిగ్రహించుకోలేక చిన్నారి కోసం వచ్చి పోతూనే వుంటాడు. ఆ అభాగ్యునిపై పోలీసు కేసు నమోదు చేయబడుతుంది. అతడు జైలు పాలవుతాడు. ఇంతలో ఒక దుర్ఘటనచే ఆ పసిబిడ్డ మృత్యువు పాలై తల్లితండ్రులకు క్లేశం మిగిలిస్తుంది. కోర్టులో కేసు విచారణకు వచ్చినపుడు ఆ అభాగ్యుడు నిర్దోషి అని న్యాయమూర్తి తీర్పునిస్తాడు. హైందవమతంలో పునర్జన్మ సిద్ధాంతం వున్నదనీ, ఈ విశ్వాసం నిరాధారమని కొట్టి పారవెయ్యడానికి వీలులేదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొంటాడు. ఒక పసిబిడ్డలో మరణించిన తన చిన్నారినే చూసుకుంటూ ఒక తండ్రి పొందే ఆనందం నిర్హేతుకం కాదనీ ఆ జడ్జి పేర్కొంటాడు. తన తీర్పులో పునర్జన్మను సమర్థిస్తూ న్యాయమూర్తి గీతనుండి, ఉపనిషత్తుల నుండి, భారతీయ పురాణాల నుండి అనేక ఉదాహరణలను ఎత్తి చూపుతాడు. కేసు పెట్టి జైలు పాలు చేసిన పిల్ల తల్లితండ్రులు తమను మన్నింపమని అగంతకుణ్ణి వేడుకుంటారు. తదనంతరం ఆ అగంతకునితో కలిసి తలితండ్రులిద్దరు ఆధ్యాత్మిక భూమి యైన భారతదేశాన్ని దర్శించి కృతార్థత చెందుతారు. వారణాసికి వెళ్ళి గంగానదిలో పసిబిడ్డ ఆత్మకు తర్పణం వదలడంతో కథ సమాప్తి చెందుతుంది.
Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3
పునర్జన్మ: వాస్తవగాథ
కొంతకాలం క్రింద కొన్ని యూ ట్యూబ్ ఛానళ్ళలో పునర్జన్మ గూర్చిన కొన్ని సంఘటనలు చూసినాను. వీటిల్లో ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన వాస్తవగాథ. ఒక హైందవ కుటుంబంలో జన్మించిన నాలుగేళ్ల పసిబాలుడొకడు ప్రతిరోజు నమాజు చేస్తుంటాడు. ఇది తల్లీ తండ్రీ గమనిస్తారు. చివరకా బాలుడు పూర్వజన్మలో మహమ్మదీయునిగా జన్మించిన వృత్తాంతం బయట పడుతుంది. అతడి సూచనలను బట్టి అతడు పుట్టిన స్థలానికి ఆ పసివాణ్ణి పిలుచుకోని పోతారు. పూర్వజన్మలో ప్రమాదవశాత్తు మరణించి పునర్జన్మించిన బాలుడు తన తల్లితండ్రులను, పరిసరాలను, స్నేహితులను, ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా గుర్తింప గలుగుతాడు. పునర్జన్మపై విశ్వాసం నిజమైతే, ఈ జన్మలో జరిగిన మతకలహాల్లో మహమ్మదీయుల చేతిలో నిహతులైన హిందువుల్లో అనేకమంది పూర్వజన్మలో మహమ్మదీయులే. అట్లే నేటి జన్మలో హిందువుల దాడిలో చనిపోయిన మహమ్మదీయుల్లో పలువురు పూర్వజన్మలో హిందువులే.
1990లో కాశ్మీరు పండితులపై జరిగిన హింసాకాండ ఎంత ఘోరమైనదో, 2002లో గుజరాత్ లో ముస్లిములపై చెలరేగిన మారణకాండ కూడా అంతే జుగుప్సాకరమైనది.
మత్త కోకిల వైశిష్ట్యం
నేటి పరిచయపద్యం ఆంధ్ర భారతంలో ప్రవేశపెట్టబడిన తొట్టతొలి “మత్తకోకిలా” వృత్తం. ఆధునిక తెలుగు సాహిత్యంలో మహాకవి గురజాడచే ప్రవేశపెట్టబడిన ముత్యాల సరాల నడక సైతం మత్తకోకిలనే పోలి వుంటుంది. రెంటిలోను మిశ్రగతియే దర్శనమిస్తుంది (3+4+3+4). నేడు పరిచయం చేసిన సహస్రాబ్దాల నాటి నన్నయ మత్తకోకిల ప్రబోధాత్మకమైనది. మత్తకోకిలను పోలిన గురజాడ ముత్యాల సరాలన్నీ ప్రబోధాత్మకములే.
వేయి యేండ్ల క్రిందట ఆదికవిచే భారతసంహితలో ఒక చిట్టి కాలువ వలె ప్రవేశపెట్టబడిన గణబద్ధ మత్తకోకిల నేటి పద్యం. ఇదే కాలక్రమంలో అంచెలంచెలుగా ఎదిగి, ఆధునిక యుగం నాటికి మాత్రాచ్ఛంద లక్షణాలు కలిగిన నిసర్గమోహన గేయఫణితిగా రూపాంతరం చెంది, అఖండ గోదావరీ ప్రవాహ వేగంతో విస్తరించి, ఆంధ్రసాహితీ కేదారాలకు కృతార్థత కల్పించింది.
నివర్తి మోహన్ కుమార్
Also read: మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి
Also