పుటుక్కు జరజరమే
అని ఓ పొడుపు కథ ఉంది. వికటకవి దాన్ని విప్పాడు. రాజుగారు ఆనందపడ్డారు. పూర్తి పాఠం ఏమిటంటే—‘‘పుటుక్కు జర జర డబ్బుక్కు… మే! ఇదీ పొడుపు కథ. ఓ ఇంటి మీద గుమ్మడిపాదు అల్లుకుని ఉంది. ఓ ఎలుక వచ్చి పుటుక్కున గుమ్మడికాయని కొరికింది. తీగె నించి తెగిన గుమ్మడికాయ జరజర కిందికి జారింది. ఇంటి చూరు కింద నిలబడ్డ మేక మీద డబుక్కున పడింది. అది చీకట్లో ఉలిక్కిపడి మే’’ అంటూ అరిచింది. అదీ ఈ కథ విప్పితే వచ్చే పూర్తి పాఠం. అది డిజిటలైజ్డ్ వెర్షన్. దాన్ని తెలివైన కవి డీకోడ్ చేసి, విప్పి ఆరేశాడు. మన పొడుపు కథలన్నీ నిజానికి పొదుపు కథలన్నీ ఇలా పుట్టినవే.
1947 తర్వాత బ్రిటిష్ వారు తట్ట బుట్ట సర్దుకు వెళ్లిపోయారు. తర్వాత ఏడాదికో ఏడాదిన్నరకో ఒకనాటి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ సతీసమేతంగా మన దేశ పర్యటనకి వచ్చారు. పాత మిత్రుల్ని అధికార అనధికారుల్ని పేరు పేరునా కలుస్తున్నారు. ఇదెందుకో నాటి కమ్యూనిస్ట్ పార్లమెంట్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్యకి బొత్తిగా నచ్చలేదు. ఇంకా వారికి మనదేశం మీద కాంక్షతీరలేదా, ఇన్నెళ్లయినా కుతి తీరినట్టు లేదు. పైగా రెండో హనీమూనికి విలాసంగా వచ్చారంటూ నిండు సభలో నిష్కర్షగా వ్యాఖ్యానించారు. మిగతా సభ్యులెవరూ పెదవి విప్పడం లేదు. ఇంకా రెచ్చిపోయి పిఎస్ మాట్లడుతున్నారు. చివరకు పరిష్కారం ఆలోచించారు. అయ్యా, తమరికి అసలు సంగతి తెలియదు. ఇద్దరూ కలిసి వచ్చారు. నెహ్రూ గారి కోసమే వచ్చారని చెప్పారు. కాని పాపం సుందరయ్యకి అర్థం కాలేదు. ఒకే వాదన మీద ఉండిపోయారు. చివరకు సర్వేపల్లి లాంటి పెద్దమనుషలు అతి లౌక్యంగా గుట్టు విప్పారు. సుందరయ్య షాక్ కి గురయ్యారు. సారీలు సారీలు చెప్పారు. సభ్యులకు తన నివాసంలో విందు ఇచ్చే సందర్భం నెహ్రూకి వచ్చింది. సుందరయ్యకి ఎదురొచ్చి ప్రధాని రిసీవ్ చేసుకున్నారు. ‘‘పండిట్ జీ! మన్నించండి. నిజంగా నాకు తెలియదు. మిత్రులు చెప్పారు. వెరీ సారీ’’ అంటూ మొదలుపెడితే ఆ విందువేళ నెహ్రూకి ఇదొక పెద్ద సమస్య అయింది. సరేఅన్నా వదలడు. తనకేమీ తెలియదంటాడు. నిజానికి ప్రపంచమంతా కోడైకూస్తోంది. పిఎస్ తెలియనితనంవల్ల పండిట్ జీ పదేపదే ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీన్ని పెద్దలు ఎవరికి నచ్చిన విధంగా వారు కొత్త కొత్త మడతలు విప్పి ఈ కథతో కాలక్షేపం చేయిస్తూ ఉంటారు. చాలామంది జీవితాల్లో పుటుక్కు జర జరలు ఉంటూనే ఉంటాయి. హాయిగా నవ్వుకోవడమే!