Friday, October 25, 2024

నడిచే దారి ….!?

కథ

లివింగ్ రూమ్ లో బాయ్స్ స్కౌట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. సుమతి తన కొడుకు సూర్య అమెరికన్ ఫ్లాగ్ పట్టుకుని మిగతా స్కౌట్ పిల్లలతో పరేడ్ చేస్తుండగా ఫొటోస్ తీసుకుంటున్నది. ఇంతలో తన నడుముపై ఒక చల్లని స్పర్శ తగిలింది సుమతికి. ఉలిక్కిపడి సుమతి వెనక్కి తిరిగేసరికి ఎవరూ లేరు అక్కడ! సుమతికి తన వెనక ఎవరూ లేకపోవడంతో ఆ స్పర్శను తలచుకుని ఆశ్చర్యపోతోంది.

‘‘పిల్లలూ రండి డైనింగ్ దగ్గరకు’’ అని ట్రూప్ లీడర్ హామ్స్ చెప్పడంతో పిల్లలు అందరూ అక్కడకు వెళ్ళారు. ట్రూప్ పిల్లలు అందరూ ఎవరికి ఇష్టమైన ఫుడ్ ని తమ తమ ప్లేట్ ల లోకి తీసుకుంటున్నారు .. సుమతి కూడా మిగతా పిల్లల తల్లిదండ్రులకు వడ్డించడంలో జెస్సికాకు సహాయపడ సాగింది. హామ్స్ వచ్చేవారం బాయ్స్ స్కౌట్స్ విహార యాత్ర గురించి  వివరాలు చెబుతున్నాడు. తల్లి దండ్రులు అందరూ తమ పిల్లలలతో ఏమేమి తీసుకువెళ్లాలి అనే ప్రణాళికలు వేస్తూ చెబుతున్నారు. సుమతి ‘నేను బాగా వండుతాను మీ అందరికి కమ్మని రుచి చూపిస్తాను’ అంటోంది. ‘వావ్, నాకు భారతీయ వంటలు అంటే చాల ఇష్టం సుమతి’ అని జెస్సికా అంటోంది. మీ వారు కూడా ఇష్టపడతారా అన్న సుమతి ప్రశ్నకు ‘నాకు ఇష్టం. వారూ ప్రయత్నిస్తారులే’ అంటూ పక పక నవ్వేస్తుంది. ‘ఎక్కడ మీ శ్రీవారు కనిపించలేదు’ అని సుమతి అడుగుతుంది జెస్సికాని. ‘ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. వారు ఉంటే ఎంతో సాయంగా ఉండేది. మా ఇంట్లో జరిగిన ట్రూప్ మీటింగ్ కోసం అన్ని పనులలో మీరు సహాయం చేశారంటూ సుమతి కి ధన్యవాదాలు’ అన్నది జెస్సిక. ఈ సంభాషణ వింటూ ఉన్న మరో పేరెంట్ టియానా కూడా మాట కలుపుతూ పిల్లలతో కలిసి చేసే ఈ పర్యటన చాలా బాగుంటుంది అంది. ‘అవును గత సంవత్సరం నేను చాల ఆనందించాను’ అక్కడ పిల్లలతో చలిమంటలు కాచుకుంటూ అంది జెస్సిక.

సుమతి పొద్దుటి లేచి అక్కడ తినడానికి చపాతీలు, సాంబారు, పులిహోర, ఆలూ కూర వేడివేడిగా వండి క్యారేజీలలో సర్దింది. సుమతి తన కొడుకు సూర్యకు అక్కడ ట్రెకింగ్ చేయడానికి కావలసిన హెడ్ టార్చ్, పెన్ను హాండీ పుస్తకం వంటివి సర్దుకోమని గుర్తుచేసింది. బగ్ స్ప్రేయర్ మర్చిపోయావమ్మా అన్నతన కూతురు అనుష్క మాటలకూ సుమతి ‘అక్కగా ఆ బాధ్యత నీది . నువ్వు అవి అన్ని సర్దు’ అని అనుష్కకు సర్దవలసిన వస్తవుల వివరాలు రాసివున్న కాగితం అందచేస్తుంది. ‘మరి నాబాధ్యత ఏమిటో’ అంటూ వచ్చిన సుమతి తన భర్త శ్రీకర్ కేసి చూస్తూ .. ‘నేను వండిన ఈ వంటలను, మమ్ములను కారులో అక్కడకు తీసుకెళ్లే రథ సారథ్యము వహించాలి కృష్ణా’ అంటూ నవ్వింది. ‘అలాగే దేవేరి’ అంటూ ‘అందరూ తెమలండి మరి జాకెట్లు ఎవరివి వారు వేసుకొండి’ అంటూ పిల్లలకు శ్రీకర్ గుర్తు చేస్తాడు. మరి ఎక్కడికైనా వెళ్లే ముందుగా ప్రయాణం బాగా సాగాలని దేముడికి దణ్ణం పెట్టుకొండి అంటుంది సుమతి. కారు రెండు గంటల పాటు నల్లగా కమ్ముకుని ఉన్న మంచుతెరలను చీల్చుకుంటూ వెళ్లి ఆగింది డెన్ ముంగిట్లో. కారు ఆగీఆగగానే ఒక్క ఉదుటున బయటకు దూకాడు సూర్య. డెన్ లో పిల్లల కేరింతలు కొడుతున్నారు. శ్రీకర్ పిల్లలు చేసే ఆక్టివిటీస్ చూసి వస్తాను అంటూ సూర్య వెనకాలే వెళతాడు. అక్కడ ఉన్న బెంచి పై కూర్చుని స్రవంతి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటుంది.

ఒక అమ్మాయి తన కారులో నుంచి దిగి టెంట్ వేయడం చూస్తుంది సుమతి. ఆమె ఎవరి సహాయము లేకుండా చకచకా టెంట్ వేయడము చూసి ఆనందిస్తుంది సుమతి. ఇంతలో దేనికోసమో ఆమె వెతుకుతున్నట్లు చూస్తుంది సుమతి. ఏదైనా సాయం చేద్దాము అనుకుని సాయం కావాలా అని పలకరిస్తుంది సుమతి ఆమెను. సుమతి ప్రశ్నకు వద్దు అని సూటిగా చూస్తూ చెబుతోంది ఆమె. ఆమె చూపు సుమతి మనసును ఆకర్షించింది. చాలాసేపటి తరవాత ఆమెనే స్వయంగా వచ్చి నా పేరు కేథరిన్ అని పలకరించింది సుమతిని. ‘టెంట్ వేయడానికి శేఖర్ రాలేదు చీకటి పడిపోతుంది’ అంటుంది సుమతి. పిల్లలతో కలసి వెళ్లి వుంటారు. నేను సాయం చేస్తాను అంటుంది కేథరిన్ సుమతితో. చూద్దాము మా వారు రాకపోతే తప్పకుండా మీ సాయం కావాలి నాకు అని నవ్వుతుంది సుమతి. సుమతి మాట్లాడుతున్నదే కానీ .. ఆమె చూపులు ఎవరికోసమో వెతుకుతున్నాయి. కేథరిన్ మళ్లీ కలుద్దాం అంటూ వెళుతూ ‘ఇంతకీ ఎవరికోసం చూస్తున్నాయి నీ కొంటె కళ్ళు’ అన్న కేథరిన్ ప్రశ్నకు ఉలిక్కిపడుతుంది సుమతి. నేను జెస్సికా అనే అమ్మాయి కోసం చూస్తున్నాను. తానూ కనపడలేదు. అనగానే ‘ఓహ్ నా వైఫ్ కోసమా … నేను వచ్చాను. తాను రాదు?’ అంటూ వెళ్ళిపోతుంది కేథరిన్ … సుమతి తాను విన్న మాటలు నిజమా కలయా అన్న భ్రమలో ఉండి పోతుంది. శ్రీకర్ వచ్చి టెంట్ వేశాడు. . పద పదా అక్కడ ఫైర్ వేసి పిల్లలు అందరు ఏవో స్కిట్స్ చేస్తారు అట చూద్దామని శ్రీకర్ పిలుస్తాడు సుమతిని. శ్రీకర్ మాటలకు తిరిగి సుమతి బదులివ్వలేదు. ‘సుమతి ఏమైంది?’ అని అడుగుతాడు శ్రీకర్. ఏమీ లేదు, మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది శ్రీకర్ ని. ‘నేను వచ్చి టెంట్ వేశాను. మళ్లీ వచ్చి తిండి తిందాం అంటాడు శ్రీకర్. సరే అక్కడకే స్నాక్స్ తెస్తాను’ అంటూ సుమతి ఇంటి నుండి తాను చేసి తీసుకు వచ్చిన స్నాక్స్, అక్కడ ఫైర్ వేసే స్థలములో కూర్చోడానికి కుర్చీలను తీసుకుని వెళ్ళింది.

నెమ్మదిగా మంచు పడుతూ వుంది.  అందరు పిల్లలు అక్కడ రకరకాలుగా తమ టేలెంటులను ప్రదర్శిస్తున్నారు. సుమతి ఇది అంతా తన కెమెరాలో బంధిస్తున్నది. కాసేపటికి సుమతి కారు దగ్గరకు వెళ్లి డిన్నర్ చేద్దాము అని చెప్పింది శ్రీకర్ కి. శ్రీకర్ పిల్లలను తీసుకుని టెంట్ దగ్గరకు వెళ్ళాడు. భోజనాలు ముగిసిన పిదప సుమతి సర్దుకుంటూ ఉంటుంది. శ్రీకర్ మళ్లీ పిల్లలను తీసుకుని ఫైర్ వేసిన స్థలం దగ్గరకు వెళ్ళాడు. కేథరిన్ తన టెంట్ దగ్గర తన కొడుకుకి అన్నం పెట్టడము చూస్తుంది సుమతి. సుమతి వెళ్లి హాయ్ అంటుంది కేథరిన్ తో. కేథరిన్ హే అంటుంది. ‘నేను జెస్సిక కోసం తనకు ఇష్టమని చెబితే ఒక వంట చేసి తెచ్చాను. అందుకే తనకోసం ఇందాకా చూస్తున్నాను’ అని సుమతి కేథరిన్ తో అంది. ‘ఓకే మరి. తాను ఇంటి దగ్గరే వుంది. నేను ఒక్కడినే వచ్చాను. నేను తినలేను ఏమి అనుకోవద్దు’ అని చెప్పింది కేథరిన్ సుమతితో. అర్థరాత్రి రెండుగంటలు అందరు నెమ్మదిగా తమ తలలకు కట్టుకున్న టార్చులనుండి వచ్చే కాంతిలో దట్టమైన ఆ డెన్ లో నడుచుకుంటూ వెళుతున్నారు తమ తమ టెంటుల దగ్గరకు. నిశ్శబ్దపురాగంలో…సునాయాసంగానే అందరు నిద్రాదేవిని ఆహ్వానించారు. తెల్లవారగానే స్కౌట్స్ కెప్టెన్ ప్రణాళిక ప్రకారం ట్రెక్ కి వెళ్లారు పిల్లలు అందరు. పిల్లలు ముందు వడివడిగా నడుస్తున్నారు.

‘నేను విన్నది నిజమేనా’ అన్నది కేథరిన్ కళ్ళలోకి చూస్తూ సుమతి. కేథరిన్ ఏమిటి అన్నట్లుగా మళ్ళీ సూటిగా చూస్తుంది సుమతి వైపు. ‘పుస్తకాల్లో చదివాను. కానీ ఇలా చూడటం నాకు కొత్తగా ఉంది’ అన్నది సుమతి కే థరిన్ తో. ఈసారి కేథరిన్ మౌనంగా నడవడం తన ప్రశ్న కేథరిన్ కి అర్ధం అయిందని సుమతికి తెలిసింది. ‘క్షమించు కేథరిన్ నీ మనసును బాధపెడితే’ అన్నది సుమతి.  ‘ఆలా ఏమీ లేదు, ఇది నాకు మామూలే’ అన్నది కేథరిన్. ‘నిన్ను కొన్ని అడగాలని ఉంది’ అన్న సుమతి ప్రశ్నకు ‘తప్పకుండా అడుగు సుమతి’ అన్నది కేథరిన్. మీరు ఎందుకు జెస్సికాను వైఫ్ అంటున్నారు? అన్న సుమతి ప్రశ్నకు కేథరిన్ నవ్వుతు ఆమె నా వైఫ్ కాబట్టి అన్న కేథరిన్ సమాధానం పూర్తి చేస్తూ ఉండగానే… సుమతి ‘అదే ఎందుకు? మీరు ఒక అమ్మాయే కదా ..!! అందునా ఎంత అందంగా ఉన్నావు. మరో అందమైన అబ్బాయిని ఎందుకు వివాహం ఆడలేదు? నిన్ను ఏ అబ్బాయి ఇష్టపడలేదా?’ అని సుమతి అంటుంది. ‘నీకో సీక్రెట్ చెప్పాలి. నేనే అబ్బాయిల్ని చూస్తే మోహించనోయ్. నిజం చెప్పమంటావా సుమతి?’ అంటూ కండ్లలోకి గుచ్చి చూస్తూ సూటిగా అడిగింది కెథరిన్. ‘ఏమిటి?’ అంటూ సుమతి తన రెండుకండ్లను విప్పార్చి అడిగింది. ‘హుమ్ నేనే చెప్తాలే .. నీలాంటి అయోమయానికి ఏంచేస్తాను’ అంది కేథరిన్. ‘నేను నీ ఎత్తైన పర్వతాలనుండి జాలువారే వయాసిస్సును చూసి ఆస్వాదిస్తాను. నా చిలిపి మనసు ఆ పక్కనే ఉన్న పిల్ల కాలువలను తడమాలని కూడా అనుకుంటుంది. అంతే గాని వేరొక మార్జాలానికి చిక్కాలనుకొనే గుండె నాదగ్గర లేదు’ అన్న కేథరిన్ మాటలు వింటున్నది నేనేనా అనుకుంటూ సుమతి నెమ్మదిగా నడుచుకుంటూ తన టెంట్ వైపుకు వెళుతుంది.

ఇంటికొచ్చిందే కానీ సుమతికి కెథరిన్ ఆలోచనా తీరు అర్థంకాలేదు. అదే విషయం తన భర్త శ్రీకర్ తో చెబుతుంది సుమతి. శ్రీకర్ ఒక నిట్టూర్పు విడుస్తాడు. కెథరిన్ తన కొడుకు పీటర్ పుట్టిన రోజు పండుగకు ఆహ్వానం పంపింది సుమతికి. సుమతికి ఇష్టం లేకున్నా పిల్లల సంతోషాన్ని పాడుచేయడం ఎందుకు అని తన మనసుకు సర్ది చెప్పుకుని పిల్లలను తీసుకు వెళ్ళింది. పార్టీలో పిల్లలు అందరు ఆడుకుంటున్నారు. సుమతి భుజం పై వెనకనుంచి ఎవరో హత్తుకున్నారు. సుమతి ఉలిక్కిపడి చూస్తుంది. ‘ఆ రోజు ఇదే చేయి స్పర్శేనా నా నడుమును తాకింది’ అని అనుకుంటుంది సుమతి తనలో తాను. నేనే అంటూ కేథరిన్ నవ్వుతుంది సుమతి కేసి చూస్తూ… ‘ఏంటి నీ సందేహాలన్నీ తీరినట్టేనా?’ అని అన్న కేథరిన్ కేసి చూస్తూ సుమతి మీరిరువురు అమ్మాయిలు కదా మరి పీటర్ ఎలా అని సందేహంగా అడుగుతుంది. ‘ఏముంది డార్లింగ్ మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. వివాహం చేసుకున్నాం. కలిసిఉంటున్నాం. ఇక జెస్సికాకు ప్రెగ్నెనెంట్ కావడానికి ఓ డోనర్ ని వెతికాను. డాక్టర్ సహాయంతో నేను తండ్రిని జెస్సికా తల్లి అయింది. ఇప్పుడు జెస్సికా మల్లి మదర్ అయింది. అందుకే మొన్న ఇంటిదగ్గర తాను రెస్ట్ తీసుకున్నది’ అని కేథరిన్ బదులిస్తుంది. ‘మరి ఈ పిల్లల బాధ్యత ఎవరు చూసుకోవాలి?’ అన్న సుమతి ప్రశ్నకు కెథరిన్ చెప్పిన ఇంకో విషయం విని సుమతి పెదవి నుండి మాట రాలేదు. ‘జెస్సికా నా సెకండ్ వైఫ్. నేను మొదట మేరీని వివాహం ఆడాను. కానీ మేరీ నాకు తెలియకుండా తన వర్క్ ప్లేస్లో తనకు పరిచయమేర్పడిన డోనాల్డ్ తో ప్రేమ పెంచుకున్నది. అందువల్ల మేము డివోర్స్ తీసుకున్నాం. నాకు మేరీకి పుట్టినవాడే రాబర్ట్. తాను ఇప్పుడు హైస్కూల్లో చదువుతున్నాడు. వీరు నా పిల్లలే నాదే బాధ్యత’ అని కేథరిన్ చెప్పింది.

రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు అనుష్క బడి నుంచి ఇంటికి వచ్చి మాట్లాడకుండా గదిలోకెళ్ళి తలుపేసుకుని పడుకుంది. కూతురు ఆలా ఎప్పుడు పడుకోలేదు. ఏమిటని దగ్గరకెళ్ళి బుజ్జగించి అడుగుతుంది సుమతి. ‘ఏమి లేదమ్మా నేను సండే నా ఫ్రెండ్స్ తో కలిసి మూవీ చూడొచ్చా థియేటర్ లో’ అని అడిగింది. ‘తప్పకుండా మరి ఎందుకు ఈ టైంలో పడుకున్నావు?’ అని అడిగింది సుమతి కూతురు అనుష్కని. ‘ఏమీ లేదు నా ఫ్రెండ్ గ్రేస్ కి అమ్మాయిలంటేనే ఇష్టమట’ అని అను చెప్పిన మాటవిని సుమతికి నోటా మాట పెగలలేదు. సుమతి కాసేపటికి తేరుకుని మళ్ళీ తానే అడిగింది అనుని ‘ఇలా.. సరే మరి చెప్పు ఎం జరిగింది? నేను నీ స్నేహితురాలిని కదా’ అన్న అమ్మ మాటకు ‘అవును అమ్మ’ అంటూ అనుష్క తన అమ్మను కావలించుకుని బావురుమంటుంది.. ‘గ్రేస్ తన ఫీలింగ్స్ నాతొ షేర్ చేసుకుంది. ఇన్నాళ్ల మా స్నేహాన్ని తాను వేరేలా మార్చడానికి ప్రయత్నించింది. ఎందుకు ఇలా జరుగుతుంది తెలియడం లేదు’ అని అనుష్క తన ఆవేదనను తన తల్లి సుమతితో పంచుకుంటుంది. ‘మరి నీకు అలాగే అనిపిస్తుందా?’ అని సుమతి అడిగిన ప్రశ్నకు అను ‘ఉహూ ..’ అని అంది. ఆ రోజు రాత్రి ‘ఈ దేశం వల్లనే నా కూతురికి ఇన్ని బాధలు’  అంది సుమతి శ్రీకర్ తో. ‘కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఈ సమస్య ఒక దేశానిది కాదు.  ఈ నాటిది కాదు. మనస్సుకు సంబంధించింది. తెలివి గా ఆలోచించు,’ అన్నాడు శ్రీకర్ సుమతితో.

సుమతి తన ఆలోచనలలో నలిగిపోయింది ఆ రాత్రంతా. గతం తాలూకు పేజీని నెమరు వేసుకున్నది. సుమతి తన చాల చిన్న వయసులో తమ ఎదురింట్లో ఆడుకుంటున్నది. ఆ సమయములో రేణుక అనే అమ్మాయి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సుమతికి. రేణుక తనకన్నా వయసులో కాస్త పెద్దదే. తనకు ‘ఆడ పిల్లలతో కలసి చనువుగా ఉండటం అంటే ఇష్టం’ అని సుమతితో చెప్పింది. సుమతికి రేణుక చెప్పిందేమిటో అప్పుడు తెలిసి రాలేదు. కొంత కాలం తరవాత తెలిసింది. సుమతి డిగ్రీ చదువుతున్న రోజులవి. వేసవి సెలవులకు తమ అమ్మగారింటికి వెళ్లింది సుమతి. అక్కడకు వచ్చిన తన కజిన్ పరిమళ సుమతితో స్నేహంగా మసిలేది. ఒకరోజు పెద్దవాళ్ళు అందరు కలసి షాపింగ్ కెళ్లారు. పరిమళ సుమతితో నువ్వంటే నాకిష్టము అని చెబుతోంది. అలాగా నువ్వంటే కూడా నాకు అభిమానమని సుమతి పరిమళతో చెబుతోంది. వెంటనే సుమతిపై చేయివేసి పరిమళ ఓరగా చూస్తుంది. సుమతి టక్కున దూరంగా జరుగుతుంది. ఏమైంది అని పరిమళ అడుగుతుంది సుమతిని. ‘నాకు నీపై ఉన్న అభిమానానికి నీవు తలచే ఆలోచనలకూ చాల వ్యత్యాసం ఉంది పరిమళ. నాకు నీ చేయి స్పర్శ నాలో మత్తును పరుస్తుంది. ఆ మత్తు చూపే దారి నాకొద్దు. నా విజ్ఞత నాకు మరో దారిని కూడా చూపుతుంది. నీలో ఈ విభిన్నతకు గల కారణాలు నాకు ఇప్పుడు తెలియదు. కానీ నేను నడిచే దారి వేరు’ అంటూ అక్కడి నుండి సుమతి వెళ్లిపోయింది.

రోజులు గడుస్తున్నా అనుష్క తన గది దాటి బయటి ప్రపంచానికి రావడానికి ఇష్టపడలేదు. అనుష్కను సుమతి ఎంత పిలిచినా అను తన అడుగు కడపలేదు. ఓనాడు సుమతి నెమ్మదిగా అనుష్కను ఓదారుస్తూ ఇలా చెబుతుంది: ‘మన ప్రయాణంలో ఎందరో తోడవుతారు. ఎవరు ఎవరితో చివరిదాకా నడవలేరు. ఎవరితో ఏ దారిలో నడవాలి అనేది మనమే నిర్ణయం తీసుకోవాలి. నా గతానుభవం నీ భవిష్యత్తుకు దారి చూపిస్తే ధైర్యంగా ముందుకు నడువు.’  అని అనుష్కతో అంటుంది. తన అమ్మ మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించి తన అడుగుగులు కదిపి గది దాటి బయటకి వస్తుంది అనుష్క.

Radhika Phani Vangara
Radhika Phani Vangara
అమెరికాలో కేటీ నగరంలో నివాసం. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. గార్డెనింగ్, కథానికలు రాయడం ఇష్టం. రేడియోకోసం ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. పిల్లలు అంటే ఇష్టం.

Related Articles

5 COMMENTS

  1. Your comment is awaiting moderation
    కథ చాల బాగుంది చివరి వరకు చదివేల మధ్యలో జెసిక కాధరిన్ పాత్రల మధ్య రిలేషన్ చాల బాగ చూపించారు. నా నిజ జీవితంలో కూడ మా ఊరిలో ఇదరమాయిల మధ్య ఇలాంటి రిలేషన్ చూశాను తప్పులేదు. ఇలాంటివి అక్కడక్కడ జరుగుతుంటాయి

  2. Your comment is awaiting moderation
    కథ చాల బాగుంది చివరి వరకు చదివేల మధ్యలో జెసిక కాధరిన్ పాత్రల మధ్య రిలేషన్ చాల బాగ చూపించారు. నా నిజ జీవితంలో కూడ మా ఊరిలో ఇదరమాయిల మధ్య ఇలాంటి రిలేషన్ చూశాను తప్పులేదు. ఇలాంటివి అక్కడక్కడ జరుగుతుంటాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles