ప్లస్ ఆరోమా, వాహ్ చార్మినార్!
పొద్దున్నే తాజాగా ఉంది. పైగా రాత్రంతా కురిసిన వానకి మబ్బులు తేలికపడి పరుగులు తీస్తున్నాయ్. చెట్టూ చేమా దుమ్ము దులుపుకొని ఆకులు కొమ్మలు రెమ్మలు వర్షంలో శుభ్రపడి పొద్దున గాలికి ఊగుతూ ఉల్లాసంగా కనిపిస్తున్నాయి. తెల్లార్లూ కురిసిన వానని వాగుల్లో వంకల్లో వార్తల్లో చూస్తూ తెగ ఆశ్చర్యపోవడం వేడివేడిగా చాయ్ చప్పరించడం మనమంతా చేసేపని. సీజన్ లో వానకురవడం ప్రాణికోటికి ఆనందదాయకం. ‘‘నీళ్లు చెరువులనిండా ఉంటే తెలయదుగాని చెరువు ఎండితే నీళ్ళ విలువ తెలుస్తుంది’’ అంటారు పెద్దలు. ఈసారి ఎవరి చలవో తెలియదు, ఏ రూష్యశృంగపాదం తెలుగునేలన తిరుగుతోందో గాని కావల్సినంత వాన! పాదాలు దాటి, మోకాళ్లు మీరి గుండెలదాకా నీళ్లు. మహానగరం పుక్కిలింతలు అవుతోంది. మేడల్లోకి మిద్దెల మీదికి నీళ్లు. రానున్న రెండేళ్లదాకా జంట నగరాలకి నీళ్ల భరోసా ఇస్తున్నారు. తాగినన్ని తాగండి, రోజూ ఓసారి స్నానం కూడా చేసుకోండి, ఇదంతా మా ప్రయోజకత్వమే అంటున్నారు నోరున్న నేతలు. కార్పోరేషన్ ఎన్నికల ముందు ఇది వానజల్లు కాదు నేతలకి వరాలజల్లు అంటున్నారు. ఎప్పుడూ నిండని రిజర్వాయర్లు తొణికిసలాడుతున్నయి. అంతేనా అవిగాక నగర వీధులు కాలవల్లా ప్రవహిస్తున్నాయి.
సామాన్యుణ్ణి ఒక ప్రశ్న వేధిస్తుంది. రాజకీయ నాయకులు మైకు దొరికినప్పుడల్లా నీటి విలువ గురించి మన గూబలు వాయించి, చివరకు ‘‘రాలే ప్రతి వానచినుకుని వొడిసిపట్టండి. వదలకండి. ఎవరి గుంట వారు తవ్వుకోండి. జల మట్టం పెంచండి’’ అంటూ నినదిస్తారు. సొంతగుంటల వాన సేద్యం అలా ఉంచితే, గడచిన ఈ వారం రోజుల్లో హీనపక్షం పది నుంచి పన్నెండు లక్షల క్యూసెక్కుల నీళ్లని ఉప్పు సముద్రం పాలుచేశాం. నీళ్లని దాచే చోటు లేదు. గోదావరి, కృష్ణ, పెన్న అన్నీ సముద్రంవైపే చేస్తున్నాయి. ఎన్ని నీటిబొట్లు ఒడిసిపడితే లక్ష క్యూసెక్కులు అయ్యేను? ప్రకాశం బ్యారేజి దిగువన రెండో మూడో అడ్డుగోడలు కడతామంటున్నారు. శుభసూచకం. నాయకులు కాదు. కావల్సింది ఆలోచనలున్న ఒకేఒక్క మోక్షగుండం విశ్వేశ్వరయ్య! ‘‘ఇంకో గరం చాయ్ స్ట్రాంగ్’’ అంటూ అరిచాను.