కపిల్ దేవ్ రికార్డును అధిగమించిన రిషభ్ పంత్
అశ్విన్ బౌలింగ్ లో మరో ముందడుగు
ఐదు రోజులు ఆడవలసిన ఆటను మూడు రోజుల్లోనే ముగించి మూడు టెస్టుల సిరీస్ ని కైవసం చేసుకున్నారు మనవాళ్ళు. శ్రీలంక వరుసగా రెండు టెస్టులూ ఓడిపోయింది. దీనితో భారత్ కు 2-0 విజయం లభించింది. రెండు టెస్టులలోనూ ఉద్విగ్న దృశ్యాలు ఏమీ లేవు. అన్ని విభాగాలలోనూ భారత్ ఆధిక్యం స్పష్టంగా నిరూపించారు.
రెండో టెస్టు మూడో రోజు ఆట సమయం మిగిలి ఉండగానే శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 208 పరుగులతో ముగిసింది. భారత్ 238 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. మొదటి టెస్టు కూడా మూడు రోజులలోనే ముగిసింది. ఇన్నింగ్స్ తేడాతో శ్రీలంక ఓడిపోయింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శ్రీలకం జట్టు నాయకుడు దిముత్ కరునరత్నే సెంచరీ చేసి జట్టుకు కొంత సంతృప్తి మిగిల్చాడు. రెండో టెస్టులోని రెండు ఇన్నింగ్స్ లోనూ భారత బౌలర్ బూమ్రా శ్రీలంక బ్యాటర్లతో ఆడుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మరో పక్క రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసుకొని ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసుకున్నవారి జాబితాలో ఎనిమిదో స్థానానికి ఎదిగాడు. ఈ జాబితాలో అందరికంటే ముందుండే పేరు శ్రీలంక అఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్. ముత్తయ్య మొత్తం 800 వికెట్లు తీసుకొని మొనగాడని పించుకున్నాడు. అతడిని కొట్టినవాడు లేడు. ఉండడు కూడా. ఆ తర్వాత స్థానంలో మొన్న మరణించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ ఉన్నాడు. అతడు 709 వికెట్లు తీసుకొని ఆటనుంచి విరమించుకున్నాడు.
ఈ రోజు మైదానంలో అందరికంటే సంతోషంగా ఉన్నవాడు రోహిత్ శర్మ. అతని నాయకత్వంలో మొదటి టెస్టు సిరీస్ ను అవలీలగా గెలుచుకున్నాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా వేగంగా బ్యాటింగ్ చేయడంలో కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు.
అంతకు ముందు అశ్విన్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. అశ్విన్ పడగొట్టిన శ్రీలంక ఆల్ రౌండర్ ధనంజయ వికెట్టు అతని 440వ వికెట్టు. దానితో డేల్ స్టేన్ ను తోసిరాజని జాబితాలో ఎనిమిదోస్థానానికి ఎగబాకాడు.