Sunday, December 22, 2024

భారత్ పై అమెరికా ఆంక్షల భారమా?

  • అధ్యక్షులు మారినా అమెరికా భారత సానుకూల వైఖరి మారలేదు
  • చైనాతో సాగుతున్న ఆధిపత్యపోరులో అమెరికాకు భారత్ అండ అవసరం
  • రష్యా ఆయుధాలు కొన్నందుకు టర్కీపై ఆంక్షలు విధించినట్టు భారత్ పై విధించరు

ఉక్రెయిన్ – రష్యా మధ్య సాగుతున్న యుద్ధ నేపథ్యంలో, భారత వైఖరిని తప్పుపడుతూ అమెరికా మనపై ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. నిజంగా బైడెన్ ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదని టాప్ రిపబ్లికన్ సెనెటర్లు తప్పు పడుతున్నారు.

Also read: మహిళా సబలగా వర్థిల్లు!

భారత్ తటస్థ వైఖరి

ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, భద్రతామండలిలో ఓటింగ్ జరిగినప్పుడు భారతదేశం అందులో పాల్గొనలేదు. ఆ సందర్భంలో అటు అధికార  డెమోక్రాట్స్ – ఇటు ప్రతిపక్ష రిపబ్లికన్స్ కూడా భారత్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనితో భారతదేశంపైన కూడా అమెరికా ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించే ఆలోచనలు చేస్తున్నట్లు అంతర్జాతీయ సమాజాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో, రిపబ్లికన్ సెనెటర్ ట్రెడ్ క్రూజ్ భారత్ కు మద్దతు పలుకుతూ వ్యాఖ్యలు చేశారు. భారత్ -అమెరికా సంబంధాలు జో బైడెన్ పాలనలో తిరోగమనం పట్టాయని ఆయన అన్నారు. విపక్ష వర్గానికి చెందిన క్రూజ్ వ్యాఖ్యల్లో కొంత రాజకీయం ఉన్నపటికీ, ప్రపంచ వ్యాప్తంగా భారత్ – అమెరికా వ్యవహారాలపై చర్చ జరుగుతోందన్నది వాస్తవం. అమెరికా ‘క్యాట్సా’చట్టం భారత్ పై కూడా ప్రయోగిస్తుందా  అనే అనుమానాలు అలుముకుంటున్నాయి. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆంక్షల ద్వారా అమెరికా శత్రుదేశాలను ఎదుర్కొనే చట్టమే ‘క్యాట్సా’. రష్యా నుంచి రక్షణ పరికరాలను (హార్డ్ వేర్ ) కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా ఈ చట్టాన్ని ప్రయోగిస్తోంది. ఎస్ -400 కొనుగోలు చేసిన టర్కీ కూడా ఈ ఆంక్షలను ఎదుర్కొన్నది. భారతదేశం కూడా రష్యా నుంచి ఎస్ -400 క్షిపణులను కొనుగోలు చేస్తోంది. ఈ దిశగా 2018లోనే రష్యా -భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేకసార్లు భారత్ ను నిలువరించే ప్రయత్నం చేశాడు. ఐనప్పటికీ, అమెరికా వత్తిళ్లకు భారత్ లొంగలేదు. రష్యాతో ఒప్పందానికి తగినట్లుగా  వ్యవహరిస్తూనే ఉంది. భారతదేశంతో కుదిరిన రక్షణ ఒప్పందాలకు కట్టుబడే ఉన్నామని తాజాగా మరోమారు రష్యా సైతం స్పష్టం చేసింది. చైనా, పాకిస్తాన్ మొదలైన దేశాల నుంచి మనకు ముప్పు పొంచే వుంది. మనకుండే అవసరాలను దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి మనకు కావాల్సిన రక్షణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నాం. అమెరికాతో ఎలా ఉన్నా  రష్యాతో మన బంధాలు, ఒప్పందాలు కొత్తవి కావు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, వాజ్ పెయి మొదలు నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకూ అదే సంప్రదాయం కొనసాగుతోంది.

Also read: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం

చైనాతో పెరిగిన రష్యా సామీప్యత

చైనా అధ్యక్షుడుగా జిన్ పింగ్ వచ్చినప్పటి నుంచీ రష్యాతో భారత్ సంబంధాలను తెగ్గొట్టాడానికి వీర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో, పుతిన్ –షీ జిన్ పింగ్ మధ్య బాంధవ్యాలు పెరుగుతూ వచ్చాయి. చైనాకు రష్యా మరింత చేరువయ్యింది. ఇదివరకున్నంత గొప్ప సంబంధాలు లేకపోయినా  భారత్ -రష్యా మధ్య సంబంధాలు చెడిపోలేదు. తాజాగా  ఉక్రెయిన్ -రష్యా యుద్ధ నేపథ్యంలో, భారత్ తీసుకున్న తటస్థ వైఖరి పట్ల రష్యా హర్షం వ్యక్తం చేసింది. మనకు మరింత చేరువగా రావడానికి మార్గం సుగమమవుతోంది. పీవీ నరసింహారావు అవలంబించిన విదేశాంగ విధానం వల్ల అమెరికా – భారత్  మధ్య స్నేహబంధాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. కొన్ని అభ్యంతరాలను మినహాయిస్తే, ఈ మధ్య కాలంలో ఎందరు అధ్యక్షులు మారినా, రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినలేదు. పైగా, జో బైడెన్ మొదటి నుంచీ భారత పక్షపాతిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. చైనాతో ఉండే అధిపత్య పోరులో భారతదేశంతో అమెరికాకు ఎంతో అవసరం ఉంది. భారత్ పెద్ద మార్కెట్ కావున  ఆర్ధిక స్వార్ధాలు ఉన్నాయి. అణ్వాయుధాల విషయంలో భారత్ ఎప్పుడూ అమెరికాకు తలొగ్గలేదు. “మీరు అమెరికా పక్షమా? సోవియట్ యూనియన్ పక్షమా?” అని గతంలో ఒక విలేఖరి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ప్రశ్నించాడు.” నేను భారత్ పక్షం” అంటూ ఇందిరాగాంధీ గడుసుగా సమాధానం చెప్పారు. మన ప్రధానులందరూ స్వదేశీ పక్షపాతులే, దేశభక్తులే.  రాజనీతి, యుద్ధనీతులతో వ్యవహరిస్తూ, ‘ఆత్మరక్షణ’ మంత్రం ప్రయోగించి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే జరగాలి. ఒకప్పుడు పీవీనరసింహారావు ‘లుక్ ఈస్ట్’ అన్నారు. తర్వాత వాజ్ పెయి,ఇప్పుడు నరేంద్రమోదీ ‘యాక్ట్ ఈస్ట్’ అన్నారు. పదబంధాల్లో తేడా తప్ప, మాట ఒకటే, విధానం ఒకటే. మిగిలిన దేశాల గొడవలు ఎలా ఉన్నా, రాజకీయాలు ఎట్లా ఉన్నా, భారత్ విషయంలో అమెరికన్ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ స్నేహభావంతోనే ఉంటారని విశ్వసిద్దాం. ప్రస్తుతం మనం ఎంచుకున్న తటస్థ వైఖరిని కొందరు తప్పుపట్టినా, దేశ శ్రేయస్సు, భావి రక్షణ దృష్టిలో పెట్టుకుంటే మన విధానమే సరియైందని ఎక్కువ భాగం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సమర్థిస్తున్నారు. అదే సమయంలో, భారత్ శాంతికాముక దేశం. ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధం ఆగిపోవాలని,శాంతి విరాజిల్లాలని, నరమేధం అంతమవ్వాలని కోరుకొనే దేశాల్లో భారత్ దే అగ్రస్థానం. అన్ని అంశాలను క్రొడీకరించుకుంటే, భారత్ పై అమెరికా ఎటువంటి ఆంక్షలు విధించదని విశ్వసిద్దాం. కాలం అన్నింటి కంటే గొప్పది. ధర్మమేవ జయతే.

Also read: ఉక్రెయిన్ కార్చిచ్చులో కర్ణాటక యువకుడి బలి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles