వోలేటి దివాకర్
రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక సుబ్రహ్మణ్యమైదానంలో బహిరంగ సభలు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కు రాజకీయంగా కలిసి వచ్చాయనే చెప్పవచ్చు. సుబ్రహ్మణ్యమైదానంలో జరిగే సభల్లో ప్రసంగించడం ఉండవల్లికి ఇష్టమైన వ్యాపకంగా ఉండేది. కాంగ్రెస్ నాయకుడిగా ఆయన సుబ్రహ్మణ్యమైదానంలో పలుసార్లు ఆయన బహిరంగ సభలు నిర్వహించారు. ఆతరువాత ఎంపిగా పదేళ్ల పాటు ప్రతీ ఏటా పార్లమెంటు సభ్యుడిగా తన పనితీరును, నియోజకవర్గ ప్రగతిని వివరించేందుకు బహిరంగ సభలు నిర్వహించి, మల్టీమీడియా ద్వారా ప్రోగ్రెస్ కార్డులు సమర్పించారు.
రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటులో జరిగిన పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిరష్కరణ తదితర కారణాల వల్ల ఉండవల్లి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సుమారు ఏడేళ్ల తరువాత ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ సభ పేరిట వామపక్ష ఉద్యోగ సంఘాలు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈసభలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు .
హిందుత్వం, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ బిజెపి దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ విధానాలన్నారు. పెట్టుబడిదారీ పార్టీ అయిన బిజెపి లాభాల్లో నడుస్తున్న ఎల్బీసి సహా దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే మళ్లీ బ్రిటీష్ తరహా పాలన వస్తుందని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి తన రాజకీయ స్వార్థం కోసం ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ బతికుంటే ఆయనను కూడా తన పార్టీలో చేర్చుకుని సిఎం పదవి కట్టబెట్టేదని ఎద్దేవా చేశారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్ కు అప్పగించండి
వ్యాపారం, ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ ప్రభుత్వ విధానం కాదని బిజెపి భావిస్తుందని చెప్పారు. అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోందన్నారు. అలాంటప్పుడు ప్రజాప్రతినిధులు, పార్లమెంటు ఎందుకని, స్థానిక సంస్థల సహా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ లాభాల్లో నడుస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు అప్పగించవచ్చు కదా అని ఉండవల్లి నిలదీశారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 ను రద్దు చేసినా బిజెపి అనుకూల అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తలు కాశ్మీర్ ఒక్క రూపాయి కూడా ఎందుకు పెట్టుబడులు పెట్టలేదని ప్రశ్నించారు.
లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. దీనిపై బిజెపి ప్రభుత్వం స్పష్టమైన, సంతృప్తికరమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగలో సోషలిస్టు విధానం అని రాశారని, రాజ్యాంగాన్ని సవరించిన తరువాతే ప్రైవేటీకరణ విధానాలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి తొత్తులుగా ఉన్నాయన్నారు. బిజెపి ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకునేందుకు పంజాబ్ రైతు ఉద్యమం లాంటి ఉద్యమాలు రావాలని ఉండవల్లి పిలుపునిచ్చారు.