తనను పిలవకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంపైన గవర్నర్ విమర్శ
గవర్నర్ నిర్ణయాలపైనా, ప్రసంగాలపైనా ప్రభుత్వ వర్గాల విమర్శల వెల్లువ
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌదరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా గవర్నర్ మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని అధికార వర్గాలు అన్యాపదేశంగా గవర్నర్ కు హితవు చెప్పాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించాలనుకోవడం విపరీత చర్య అనీ, దీనిని ప్రజలు గమనించాలనీ తమిళ్ సై వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం లేకపోతే సభ్యులకు చర్చించే హక్కు లేకుండా చేయడమేనని ఆమె అన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని స్వాగతిస్తున్నామని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గవర్నర్ మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలనీ, రిపబ్లిక్ దినోత్సవం ప్రభుత్వం రాసిపంపిన ప్రసంగం కాకుండా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, ఆమె ఘర్షణ వైఖరి అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వ అజ్ఞాత ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
తెలంగాణ సర్కారు తీరుపై గవర్నర్ అసంతృప్తి
శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో సర్కారు తీరుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే ఇలా చేశామని బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ను ఆహ్వానిస్తేనే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి హరీష్ రావులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అందుకు భిన్నంగా గవర్నర్ ఓ ప్రకటన ద్వారా ఈ అంశంపై స్పందించటం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించాలన్న ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలించాలని ప్రజలకు సూచించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా చేస్తే సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనని అన్నారు.
సాంకేతికంగా గవర్నర్ ప్రసంగం తప్పనిసరి కాకపోవచ్చని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోయినప్పటికీ బడ్జెట్ సమర్పణను స్వాగతిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం శనివారం ఓ పత్రిక ప్రకటన విడుడల చేసింది. ఆర్దిక బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిఫారసు కోరిందని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందుకు ఓకే చెప్పినట్లు వెల్లడించారు. ఆర్ధిక బిల్లు సిఫారసుకు సమయం తీసుకునే స్వేచ్చ తనకు ఉందని..అయినా ప్రజా శ్రేయస్సు ను పరిగణనలోకి తీసుకుని ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమావేశాలు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి. అయితే ఈ సమావేశాలు గత సభకు కొనసాగింపుగానే సాగుతున్నందున సాంకేతిక అంశాలను చూపించిన సర్కారు గవర్నర్ ప్రసంగం లేకుండా చేసింది.
గవర్నర్ మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం కీలకం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రికమండ్ చేస్తున్నట్టు చెప్తూ… మీడియాకు ఓ సుధీర్ఘ ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమయ్యింది. సాధారణంగా గవర్నర్లతో, రాజ్యాంగ బద్ద సంస్థలకు అత్యంత విలువ, గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గవర్నర్ తమిళసైకి ఎక్కడ తేడా వచ్చిందనేదానిపై అనేక విధాల చర్చలున్నాయి. రాష్ట్ర గవర్నర్‌గా తమిళసై వచ్చిన తర్వాత ఉన్నత మర్యాదలను ప్రదర్శించిన రాష్ట్ర ప్రభుత్వంతో హఠాత్తుగా గవర్నర్ కయ్యం పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నపుడు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు కేసీఆర్‌తో విభేదించారు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనే గవర్నర్‌గా కొనసాగారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది. అనేక రాజ్యాంగపరమైన సంక్షోభాలు తప్పవని తొలుత అందరూ భావించినా.. గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర పాలనా యంత్రాంగానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. కేసీఆర్ కూడా గవర్నర్ వ్యవస్థకు తగిన గౌరవం ఇచ్చారు. రెండు వ్యవస్థల మద్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేది. ఇప్పుడది లోపించడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.
విభేదాలకు దారితీసిన పరిణామాలు ఇవీ…
తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళసై.. గవర్నర్‌గా తెలంగాణకు వచ్చినప్పటికీ తన పాత వాసనలు పోగొట్టుకోలేదన్న వాదనలు టి. ఆర్. ఎస్ వర్గాలు చేస్తున్నాయి. గవర్నర్ ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వ కాళ్లలో కట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కొన్ని ఉదాహారణలు…
1. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను గవర్నర్ ఆమోదించలేదు.. అలా అని తిరస్కరించలేదు. చాలా కాలం తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రభుత్వ వర్గాలు కౌశిక్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఆమోదించాలని కోరినపుడు.. కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయని చెప్పారు. అలా గవర్నర్ భావించినపుడు దాన్ని రిజక్ట్ చేయాలని చెప్పినా ఆమె చేయలేదు. కేసులున్నాయి సరే.. కన్విక్షన్ (శిక్ష) పడలేదు కదా అని ప్రభుత్వ వర్గాలు గవర్నర్‌తో చెప్పాయి. కానీ, గవర్నర్ పట్టించుకోలేదు. ప్రభుత్వ మాటకు విలువ ఇవ్వలేదు. కన్విక్షన్ పడినపుడు మాత్రమే అనర్హుడు అని అనవచ్చు. కానీ, గవర్నర్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును తొక్కిపెట్టారన్న వాదన రాజకీయ వర్గాల్లో ప్రబలంగా ఉన్నది.
2. ఇక శాసనమండలికి ప్రొటెం ఛైర్మన్ గా ఎంఐఎం సభ్యులు, సీనియర్ జర్నలిస్టు అమీనుల్ జాఫ్రీని రికమండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్‌ను గవర్నర్‌కు పంపించింది. అయితే, గవర్నర్ దీనిపై నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత దోరణితో వ్యవహరించారు. ప్రొటెం ఛైర్మన్ ఎందుకు డైరెక్ట్‌గా చైర్మన్ ఎన్నిక పెట్టండి అని గవర్నర్ ఉచిత సలహాను ప్రభుత్వానికి ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 13 నెలలపాటు ప్రొటెం ఛైర్మనే ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ గవర్నర్ బెట్టు చేశారు. చివరకు దేశంలో ఏ ఏ రాష్ట్రాలు ప్రొటెం ఛైర్మన్లుగా ఎన్నినెలలు, ఎంత కాలం ఉంచిందన్న సమాచారాన్ని సేకరించి గవర్నర్‌కు ప్రభుత్వం అందజేసింది. దీంతోపాటు రాజ్యాంగం ఏం చెప్తున్నదో కూడా చెప్పింది. చివరకు జాఫ్రీని ప్రొటెం ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
3. గవర్నర్ శాసన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినా.. 26 జనవరి నాడు జెండా ఎగురవేసి మాట్లాడినా ప్రభుత్వం (మంత్రి మండలి) ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే చదవాలి. సొంతంగా ప్రసంగాలు చేయడానికి వీల్లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు. ఈసారి జనవరి 26న గవర్నర్ ప్రసంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదు. అయినప్పటికీ గవర్నర్ తన ప్రసంగాన్నే చదివారు. వాస్తవానికి జనవరి 26వ తేదీ ప్రసంగానికి సంబంధించి ప్రభుత్వం గవర్నర్‌తో చర్చలు జరిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలాగూ బహిరంగ సభ లేదు కాబట్టి ఏలాంటి ప్రసంగాలు వద్దనుకున్నారు. కానీ, గవర్నర్ అనూహ్యంగా 26 జనవరి నాడు ప్రసంగించారు. ఇది ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యగానే రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.
4. 2021-2022 గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించని కొన్ని పేరాలను సొంతంగా చదివారు. అప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిగణించలేదు.
5. దేశంలో, మన రాష్ట్రంలో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఘర్షణాత్మక వైఖరి తలెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో రాంలాల్ గవర్నర్‌గా ఉన్నపుడు నాటి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన ఆ తర్వాత చాలా అవమానకరంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. గవర్నర్ గా కుముద్ బెన్ జోషీ ఉన్నప్పుడు ఆమెకూ, నాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావుకూ పడేది కాదు. ఆ తర్వాత క్రిష్ణకాంత్ గవర్నర్‌గా ఉన్నపుడు కూడా ఇలాగే జరిగింది. నిన్నమొన్న మహారాష్ట్ర గవర్నర్ తన అతివల్ల శాసనసభలో అవమానకరంగా సభ జరుగుతుండగానే నిష్క్రమించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, రాజ్యాంగ బద్దంగా నడుచుకునే ధోరణి గవర్నర్లకు ముఖ్యం. ఇలా కాకుండా కేంద్ర ప్రభుత్వాలకు కీలుబొమ్మలుగా మారిన ఏ గవర్నర్ కూడా ఎక్కువ కాలం రాష్ట్రాల్లో పనిచేయలేకపోయారు. అయినా.. ఇప్పటికీ తెలంగాణాలో తమిళిసై పరిస్థితి ఇంకా చేయిదాటిపోలేదు. సవరించుకుంటేనే మంచిదన్న అభిప్రాయం రాజ్యాంగ, రాజకీయ ప్రముఖులు అబిప్రాయపడుతున్నారు.