Sunday, November 24, 2024

ప్రతి ప్రయత్నం ఒక వియత్నాం

తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 6వ భాగం

మ‌నిషి సంఘ‌జీవి! అంతేకాదు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం మీద బ‌తికే మ‌నిషి తోటివారి అభ్యుద‌యం కోరుకుంటూ అందుకు త‌న‌వంతు ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించ‌డం క‌నీస బాధ్య‌త‌గా భావించాలి.

ఇది కుటుంబాల‌లో కావ‌చ్చు, ప‌నిచేసే ప్ర‌దేశాల‌లో కావ‌చ్చు! న‌లుగురూ బాగున్న‌ప్పుడే స‌మాజం బాగుంటుంది. దేశం అభ్యుద‌య ప‌థంవైపు ప‌య‌నిస్తుంది అన్న‌ది కొత్త‌గా చెప్పే సూక్తి హితోక్తి కాదు! అయితే ఆ దిశ‌గా ఎంత ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్న ప్ర‌శ్న వేసుకున్న‌ప్పుడు సంతృప్తిక‌ర‌మైన జ‌వాబు ల‌భిస్తోందా అన్న‌ది ప్ర‌శ్న‌గానే ఉంటుంది అన్న‌ది నిజం.

కానీ ‘‘ప్ర‌తి ప్ర‌య‌త్నం వియ‌త్నాం’’ కావాలి అని ఓ అభ్యుద‌య క‌వి ఆశించిన‌ట్టు ప్ర‌గ‌తి కోసం చేసే ప్ర‌య‌త్నంలో లోటు, లోపం ఉండ‌కూడ‌దు. అందుకోసం పోరాటాలు, ఉద్య‌మాలు, ఘ‌ర్ష‌ణ‌లు, సంఘ‌ర్ష‌ణ‌లు, రాజీప‌డ‌ని సిద్ధంతాల‌తో ఫ‌లితం వ‌చ్చేదాకా నిత్య స‌మ‌రం సాగించ‌వ‌ల‌సిందే! శ్ర‌మ దోపిడీ చేస్తూ గ‌జ‌దంత గోపురాలో (ఐవ‌రీ ట‌వ‌ర్స్‌) సంప‌ద‌ను అనుభ‌విస్తున్న దొర‌ల‌ను ఎదుర్కొన్న‌నాడే, ప్ర‌గ‌తి సాధ్యం!

Also read: పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’

మ‌రో కార్మిక చిత్రం ప్రాణమిత్రులు

కార్మికుల స‌మ‌స్య‌ను ఇతివృత్తంగా తీసుకున్నా స్నేహ‌బంధం అనే మాన‌వీయ కోణంలోని ఇతివృత్తం  ఉన్న చ‌క్క‌ని క‌థా చిత్రం ప్రాణ మిత్రులు.

అంత‌స్తుల అంత‌రాలు లేకుండా ఓ ధ‌న‌వంతుడైన యువ‌కుడు, అత‌న్ని ప్రాణ స‌మానంగా చూసుకునే సేవ‌కుడు అయిన మ‌రో యువ‌కుని మ‌ధ్య ఉన్న స్నేహానుబంధాన్ని తెలియ‌చేసే చిత్రం ప్రాణ‌మిత్రులు!

ధ‌న‌వంతుని నీడ‌లో ఉన్న యువ‌కుడికి, క‌థానుసారంగా కొంత‌కాలం కార్మికుల స‌మ‌స్య‌లు తెలియ‌వు. నిజానికి త‌నూ ఓ కార్మికుడే. అయితే త‌ను బంగ‌ళాలో ప‌నిచేసే వాడ‌యితే మిగ‌తా వారు ఆ ధ‌న‌వంతుని ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే కార్మికులు. య‌జ‌మాని త‌న పాలిట దైవం, మంచివాడు, అత‌ని కోసం త‌న ప్రాణం ఇచ్చినా త‌ప్పులేదు అని భావించే యువ‌కుడు. కొన్ని సంఘ‌ట‌న‌ల త‌రువాత త‌న అభిప్రాయాల‌ను మార్చుకోవాల్సి వ‌స్తుంది!

అక్క‌డే ప్రాణమిత్రులు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ మొద‌ల‌వుతుంది. అయితే ఓ ప‌క్క స్నేహానికున్న విలువ‌ను గౌర‌విస్తూనే కార్మికుల నిజాయితీని వారు వారి హ‌క్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని స‌మ‌ర్ధించ‌డం, వారికి న్యాయం జ‌ర‌గాల‌న్న ఆకాంక్ష‌తో య‌జ‌మానికి దూర‌మ‌వ‌డానికి కూడా సందేహించ‌ని అభ్యుద‌య భావాల‌ను ఆక‌ళింపు చేసుకుని, అర్థం చేసుకున్న యువ‌కుని ఆద‌ర్శ క‌థ “ప్రాణ‌మిత్రులు“లో స‌హ‌జంగా చిత్రీక‌రించ‌డం జ‌రిగింది.

Prana Mithrulu - Wikipedia

కార్మిక స‌మ‌స్య‌ల‌లోని లోతుపాతుల‌ను చూపుతూ బాధ్య‌త‌గా ప‌నిచేసే కార్మికులు, వారి హక్కుల కోసం ఎలా సంఘ‌టిత‌మ‌య్యారు, అందుకు దారితీసిన ప‌రిస్ధితులు, సంఘ‌ట‌న‌లు వివ‌రంగా స‌హేతుకంగా, స‌హ‌జంగా ఈ చిత్రంలో చూప‌డం జ‌రిగింది. చిత్ర‌క‌థ‌కు మూల‌బిందువు స్నేహం అయినా కార్మిక స‌మ‌స్య‌లు ఆ స్నేహ‌బంధాన్ని ఏ విధంగా ప్ర‌భావితం చేశాయో అన్న విష‌యాన్ని స‌మ‌ర్ధంగా చెప్ప‌డంతో చిత్రం విజ‌య‌ప‌థంలో న‌డిచింది.

కార్మిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే స‌మ‌యంలో ఆ దిశ‌గా సాగే ప్ర‌గ‌తిశీల వాదుల‌కు ఎన్నో అవాంత‌రాలు, ఆటంకాలు ఎదుర‌వుతాయి. ముఖ్యంగా య‌జ‌మాని తాలూకు వ్య‌క్తి, త‌మ (కార్మికుల) పోరాటంలో భాగ‌స్వామ్యం అవుతాడంటే అత‌ని నిజాయితీని, నిబ‌ద్ధ‌త‌ను శంకిస్తారు కార్మికులు. అది స‌హ‌జం కూడా! అయితే ప్ర‌గ‌తివాదుల‌కుండే బ‌ల‌మే నిజాయితీ! నిస్వార్ధ‌త‌! అవే వారిని వారి ప్ర‌గ‌తి ల‌క్ష్యం వైపు న‌డిపిస్తాయి.

య‌జ‌మాని ప్రాణ‌స్నేహితుడ‌యినా త‌ను అత‌ని సాహ‌చ‌ర్యంలో ఉన్నా కార్మికుల ప‌ట్ల య‌జ‌మాని చేస్తున్న అన్యాయాన్ని ప్ర‌తిఘ‌టించ‌డంలో త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహాన్ని కూడా ఫ‌ణంగా పెట్ట‌డంతో కార్మిక స‌మ‌స్య‌కు మ‌రింత ప్రాధాన్య‌త వ‌చ్చింది. కార్మికుల‌లో నూత‌న ఉత్సాహం రావ‌డానికి, ప్ర‌గ‌తిభావ బాట‌ను ఎన్నుకున్న క‌థానాయ‌కుడి నిజాయితీ తోడ్ప‌డింది.

Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం

ఇంత‌కాలం త‌న వెంట ఉంటూ, త‌న నీడ‌లో నీడ‌గా ఉన్న ప్రాణ‌మిత్రుడు ధ‌ర్మం, న్యాయం, హ‌క్కులు అంటూ కార్మిక వ‌ర్గం వైపు వెళ్ళ‌డం జీర్ణించుకోలేని య‌జ‌మాని, చివ‌ర‌కు కార్మిక‌వ‌ర్గ ఐక్య‌త‌కు, వారి సంఘ‌టిత శ‌క్త‌కి త‌ల‌వంచాల్సి వ‌స్తుంది. వారి న్యాయ‌మైన పోరాటానికి, ఎదురుతిరిగే శ‌క్తి లేకుండా పోతుంది. అది కార్మిక విజ‌యానికి దారితీస్తుంది. ప్ర‌గ‌తి బావుటా రెప‌రెప‌లాడుతుంది. అభ్యుద‌య శ‌క్తుల‌కు ఆశించిన ఫ‌లితం ల‌భిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే న్యాయ‌బ‌ద్ధంగా హ‌క్కుల కోసం పోరాటం చేసే కార్మిక వ‌ర్గానిదే అంతిమ విజ‌యం అని రుజువు అవుతుంది!

Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’

ప్ర‌గ‌తిభావ చిత్రాలు పలురకాలు

ఇంత‌వ‌ర‌కు ‘‘ప్ర‌గ‌తి’’కి అద్దంప‌ట్టే కొన్ని సాంఘిక చిత్రాల‌ను, కార్మిక ప్ర‌గ‌తిని ల‌క్ష్యం చేసుకున్న చిత్రాల‌ను కొంత‌మేర‌కు సోదాహ‌ర‌ణంగా విశ్లేషించ‌డం జ‌రిగింది. అయితే ప్ర‌గ‌తిశీల భావ‌జాలం ఉన్న చిత్రాల‌ను కొన్ని వ‌ర్గాలుగా విభ‌జించిన‌ప్పుడు మ‌రిన్ని విష‌యాలు తెలుస్తాయి. అవి ఇలా ఉంటాయి:

1. రైతు స‌మ‌స్య‌లున్న “ప్ర‌గ‌తి“ భావ క‌థాచిత్రాలు.

2. కార్మిక “ప్ర‌గ‌తి“ ఇతివృత్తంగా గ‌ల చిత్రాలు.

3. కుటుంబ స‌మ‌స్య‌ల‌లో ప్ర‌గ‌తి ఆద‌ర్శం గ‌ల క‌థాచిత్రాలు

4. యువ‌త‌రంలో “ప్ర‌గ‌తి“ భావ క‌థా క‌థ‌నాల‌తో స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల క‌థాచిత్రాలు

5. వ‌ర్ణాంత‌ర వివాహాల క‌థాచిత్రాల్లోని “ప్ర‌గ‌తి“ భావ‌న‌.

6. ద‌ళిత‌, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల జీవితాల‌ను ప్ర‌తిబింబిస్తున్న “ప్ర‌గ‌తిశీల‌“ క‌థాచిత్రాలు

ఇలా వ‌ర్గీక‌రించుకుని ఆ చిత్రాల విశేషాలు, విశ్లేష‌ణ త‌దిత‌ర వివ‌రాలు తెలుసుకుంటే ఒక స‌మ‌గ్ర‌తా భావం, కొంత వ‌ర‌కు సంపూర్ణ స్వ‌రూపం అవ‌గాహ‌న‌కు రావ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంది.

Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు

అంతేకాదు, కాల‌క్ర‌మంలో జీవ‌న విధానాల్లో వ‌చ్చిన మార్పుల వ‌ల్ల కూడా అనేక స‌మ‌స్య‌ల‌లో ఈ ప్ర‌గ‌తి భావ‌న స‌మాజం ముంద‌డుగు వేయ‌డానికి ఎలా తోడ్ప‌డుతుందో కూడా అర్ధం చేసుకోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

“ప్ర‌గ‌తి“ అనేది మూడ‌క్ష‌రాలు

“జ‌గ‌తి“ అనేది మూడ‌క్ష‌రాలే!

అయితే ఈ రెండిటి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర బంధం అనివార్యం!

రైతు స‌మ‌స్య‌లున్న మ‌రికొన్ని చిత్రాల గురించి: అభ్యుద‌య భావాల‌తో ప్ర‌గ‌తి బాట‌లో స‌మాజాన్ని చైత‌న్య‌ప‌ర‌చాల‌నే అభిప్రాయంతో, ఆలోచ‌న‌ల‌తో కొంద‌రు ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల చిత్రాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ప్రేక్ష‌కుల‌లో ఆలోచ‌న రేకెత్తించే చిత్రాలే!

ముందే చెప్పుకున్న‌ట్టు భార‌త‌దేశం ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయ‌క దేశం. అందుచేత రైతు స‌మ‌స్య‌లు అనేవి ఎన్ని ప్ర‌భుత్వాలు వ‌చ్చినా, ఎన్ని చ‌ట్టాలు చేసినా అవి అప‌రిష్కృతంగానే ఉంటున్నాయి. దానికి కార‌ణం కోసం పెద్ద‌గా ఆలోచించ‌క్క‌ర్లేదు.

భూస్వాముల పెత్తందారీత‌నం, ద‌ళారుల దోపిడీ, అక్ష‌రాస్య‌త‌కు దూర‌మైన రైతు కుటుంబాలు, షావుకార్ల (వ‌డ్డీ వ్యాపారులు) మోసాలు, ఇవ‌న్నీ క‌లిసి రైతు జీవితాల‌ని అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా చేస్తున్నాయి. అందుకే రైతు స‌మ‌స్య‌ల కోసం ఎప్పుడు ఎవ‌రెంత‌గా ప‌రిష్కార మార్గం క‌నుక్కోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా అవి కొంత‌వ‌ర‌కే ఫ‌ల‌వంత‌మ‌వుతున్నాయి. అయితే, ఉన్న స‌మ‌స్య‌ల కోణం నుంచి చూస్తే ఆ శాతం బ‌హు త‌క్కువ అన‌డం నిర్వివాదాంశం! అయినా ఆ దిశ‌గా పోరాటాలు – ఉద్య‌మాలు సాగుతున్నాయి. సాగాలి అంటూ చైత‌న్య‌ప‌రుస్తున్న చిత్రాలు వ‌స్తున్నాయి. ఇక ముందూ వ‌స్తాయి!

గ‌తంలో రైతు స‌మ‌స్య‌ల మీద వ‌చ్చిన ఒక‌టి రెండు చిత్రాల గురించి చెప్పుకుంటే ఇప్పుడు మ‌రికొన్ని చిత్రాల గురించి స్థూలంగా తెలుసుకుందాము.

ముందుగా 1950 ద‌శ‌కంలో వ‌చ్చిన అన్న‌దాత‌ చిత్రంలో కొన్ని రైతు స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింది. “అక్కినేని, అంజ‌లి, రంగారావు“ వంటి ప్ర‌తిభావంతులు న‌టించిన ఈ చిత్రానికి నాటి ప్ర‌సిద్ధ ద‌ర్శ‌కుడు వేదాంతం రాఘ‌వ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషంగా చెప్పుకోవాలి!

అన్నదాతా సుఖీభవ

Annadata Sukhibhava Songs Download: Annadata Sukhibhava MP3 Telugu Songs  Online Free on Gaana.com

చిత్ర క‌థ‌, క‌థ‌నాలు ప‌రిశీలిస్తే – రైతు జీవితాల్లోని దైన్యం – నిస్స‌హాయ స్థితి – కామందుల దౌర్జ‌న్యాన్ని ఎదిరించ‌లేని బ‌ల‌హీన ప‌రిస్ధితులు, ఇవ‌న్నీ రైతు స‌మ‌స్య‌ల‌ని ప్ర‌తిబింబించే చిత్రంగా అన్న‌దాత‌ రూపుదిద్దుకుంది. అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల చిత్రం ఆశించినంత విజ‌యం సాధించ‌లేక‌పోయింది. కానీ రైతు స‌మ‌స్య‌ల‌ని దృశ్య‌మానం చేసిన చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది అని చెప్పాలి. ఆ త‌రువాత ఇటువంటి (రైతు) ధోర‌ణితో వ‌చ్చిన చిత్రాలు భూమి కోసంకొల్లేటి కాపురం, మాభూమి, భూపోరాటం, రైతు పోరాటం, తాజాగా వ‌చ్చిన అన్న‌దాతా సుఖీభ‌వ‌ మొద‌లైన‌వి.

వీటిలో ప్ర‌ముఖంగా  చెప్పుకోవ‌ల‌సింది అన్న‌దాతా సుఖీభ‌వ‌ చిత్రం గురించి. కార‌ణం ఏమిటంటే ప్ర‌గ‌తి భావాల‌ను, అభ్యుద‌య భావ‌జాలాన్ని త‌న చిత్ర‌క‌థ‌ల్లో ప్ర‌తిబింబించే చిత్రాల‌నే నిర్మిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ, ప్ర‌ధాన పాత్ర పోషిస్తూ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక ముద్ర‌ను సొంతం చేసుకున్న చిత్ర‌రంగ నిరంత‌ర శ్రామికుడు ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి సార‌థ్యంలో వ‌చ్చిన అన్న‌దాతా సుఖీభ‌వ‌ చిత్రాన్ని ప‌రిశీలిస్తే – నాటి రైతుబిడ్డ‌ నుంచి, ఈనాటి ఈ చిత్రం వ‌ర‌కూ రైతు స‌మ‌స్య‌లు, అలాగే ఉన్నందుకు ఆశ్చ‌ర్యంగానూ, ఆవేద‌న‌గానూ ఉంటుంది.

Also read: తెలుగు చ‌ల‌న‌చిత్రాల‌లో ప్ర‌గ‌తి కిర‌ణాలు!

ద‌ర్శ‌క నిర్మాత, న‌టుడు ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి చిత్రాల‌లో స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల‌పైనా వ‌ర్త‌మాన స‌మాజ స్థితిగ‌తుల‌ను నిజాయితీగా చూపించే క‌థా క‌థ‌నాలుండ‌టం ఒక ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకోవాలి.  ముఖ్యంగా ఈ అన్న‌దాతా సుఖీభ‌వ‌ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కు చేర్చ‌డానికి, కొన్ని క‌ష్ట న‌ష్టాల‌కోర్చి రెండుసార్లు విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. అస‌లు దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మ‌హ‌త్య‌లు ఎందుకు చేసుకోవాల్సి వ‌స్తోంది, దీనికి కార‌ణం పాలించే పాల‌కుల అల‌స‌త్వ‌మా – రైతుల‌కు, వ్యాపారుల‌కు మ‌ధ్య అడ్డుగోడ‌లా ఉండే మ‌ధ్య‌వ‌ర్తులా, మ‌ద్ద‌తు ధ‌ర దొర‌క‌ని ప‌రిస్ధితులా – ఇలా ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెబుతూ ఓ ప‌రిష్కార మార్గం చూపిన చిత్రంగా అన్న‌దాతా సుఖీభ‌వ‌ చిత్రం గురించి చెప్పుకోవాలి.

నాడు రైతు ఆత్మహత్యలు ఉండేవి కావు

గ‌త ముప్ప‌య్యేళ్ల క్రితం రైతు ఆత్మ‌హ‌త్య‌లు ఉండేవి కావు. ఉన్నా ఎక్క‌డో చెదురుమ‌దురుగా ఉండేవి. కానీ రెండు ద‌శాబ్దాలుగా కార‌ణాలు ఏమైనా, రైతు ఆత్మ‌హ‌త్య‌లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగాయి. ఇంకా వివ‌రంగా చెప్పాలంటే వార్తాప‌త్రిక‌ల‌లో రైతు ఆత్మ‌హ‌త్య లేని రోజు ఉండ‌దు. ఇంత‌గా రైతు బ‌తుకు చితికిపోవ‌డానికి కార‌ణం ఎవ‌రు, ఏమిటి అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌రి అయిన స‌మాధానం తెలుసుకుని, ఆ ప్ర‌శ్న‌ను నిజాయితీగా ప‌రిష్క‌రించాల్సిన క‌నీస బాధ్య‌త పాల‌కుల మీద ఉంది. రైతు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌నంత కాలం రైతు క్ర‌మంగా వ్య‌వ‌సాయానికి దూరం అయ్యే ప‌రిస్ధితి ఏర్ప‌డుతుంది. క‌రువు కాట‌కాలు, ప్ర‌కృతి శాపాల‌యితే, ఇలాంటి ప‌రిస్ధితి ‘పాల‌కులు’ పెట్టిన శాపం అవుతుంది. ఇది స‌మాజానికి, దేశానికి అన‌ర్ధం క‌లిగించే సంఘ‌ట‌న‌, సంద‌ర్భం అవుతుంది.

Also read: యడవల్లి రచన: తెలుగు సినిమాలలో ప్రగతి కిరణాలు

Yadavalli
Yadavalli
Yadavalli is a versatile writer in Telugu. He has been writing lyrics, script, screenplay for South Indian films and also directed a few of them.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles