Sunday, November 24, 2024

కొత్త కూటమికోసం కేసీఆర్ సమాలోచనలు

  • అన్ని ప్రతిపక్షాల అభిప్రాయాలూ సేకరించాక కాంగ్రెస్ పై నిర్ణయం
  • కాంగ్రెస్ జాన్తానై అంటున్న మమతా, అఖిలేష్
  • పంజాబ్, ఉత్తరాఖండ్ లో గెలిస్తే కాంగ్రెస్ కు ఊపు

జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త కూటమిని నిర్మించడం దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దూకుడు పెంచుతున్నారు. వరుసగా విపక్షనేతలను కలుస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగిన కాలంలో తమకు మద్దతుగా నిలిచి వాణి వినిపించినవారితోనూ భేటీ అవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాల కోసం గతంలో ఉద్యమం చేసిన నేతలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అధినేతలతోనూ సమావేశమవుతున్నారు.

Also read: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం

బీజేపీ పొడగిట్టనివారితో సమాలోచనలు

దేశ రాజధాని సరిహద్దుల్లో భీకరంగా రైతు ఉద్యమం నిర్వహించి, వాడవాడలా బిజెపికి వ్యతిరేకంగా నినదించిన రైతు సంఘాల నేతలు తికాయిత్ వంటివారితో పాటు స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించే బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి వంటివారితోనూ మంతనాలు జరుపుతున్నారు. ఆ మధ్య చెన్నై వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశారు. ఇటీవలే ముంబయికి అతిధిగా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్ సి పి అధినేత శరద్ పవార్ తో విడివిడిగా సమావేశం జరిపి, వారితో విడివిడిగా మీడియా సమావేశాలు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి గత రెండుమూడు రోజుల నుంచి దిల్లీలో మకాం వేశారు. తాజాగా దిల్లీ నుంచి రాంచీ వెళ్లి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ తో సమావేశమై, దేశంలో ప్రత్యమ్నాయంపై త్వరలో నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఇవ్వన్నీ చూస్తుంటే  కెసిఆర్ బిజెపికి వ్యతిరేకంగా దూకుడు పెంచుతున్నారని కొందరు అంటుంటే.. దూకుడు లేదు ఏమీ లేదు వట్టిమాటలు, హడావిడి తప్ప ఏముండదని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ తరహా కెసిఆర్ వైనం కొత్తేమీ కాదని మరికొందరు కొట్టి పారేస్తున్నారు. గతంలో వివిధ పార్టీలతో ఆయన చేసిన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఈ 10వ తేదీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత అన్ని పార్టీల అసలు రంగు బయటపడుతుందని  అర్థం చేసుకోవాలి. ఆ మధ్య హడావిడి చేసి, కొంతకాలం నిశ్శబ్దంగా ఉండి, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు రాక మునుపే  కెసిఆర్ మళ్ళీ ఆట మొదలు పెట్టడం వెనకాల ఏదో మర్మం, ఏవో వ్యూహాలు ఉన్నాయని రాజకీయ క్షేత్రంలో బాగా వినపడుతున్న మాటలు. గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ముఖ్యమంత్రిగా దాదాపు 9 ఏళ్ళ నుంచి పదవిలో ఉన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఉద్యమ సంస్థను రాజకీయ పార్టీగా మలచి వరుసగా రెండు సార్లు విజయాలను సొంతం చేసుకున్న ఘనత, దశాబ్దాల నుంచి ఉన్న ప్రత్యేక రాష్ట్రమనే ఆశయాన్ని సాధించిన చరిత్ర కెసిఆర్ కు ఉన్నాయి. అనర్గళంగా తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడగలిగిన చతురత, రాజకీయ వ్యూహప్రతివ్యూహాలను అల్లగలిగిన ప్రావీణ్యత ఆయనకు ఉన్నాయి.

Also read: ఉక్రెయిన్ కార్చిచ్చులో కర్ణాటక యువకుడి బలి

జాతీయ స్థాయిలో దక్షిణాది నాయకుడు చక్రం తిప్పగలరా?

కాకపోతే, రాష్ట్ర రాజకీయాలు వేరు, జాతీయ రాజకీయాలు వేరు. అందునా దక్షిణాది నుంచి వెళ్లి దిల్లీ రాజకీయలను శాసించడం,చక్రం తిప్పడం అసాధ్యమైన అంశమే. బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విపక్షాలన్నీ ఉవ్విళ్లూరడంలో ఆశ్చర్యమేమీ లేదు. కెసిఆర్ వెంట నడవడానికి ఏ మేరకు ముందుకు వస్తాయన్నది అనుమానమే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందునా జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఏ కూటమి మనలేదన్నది చరిత్ర విదితమే. ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా కూటమిని ఏర్పాటు చేయాలనుకోవడం ఏ మాత్రం ఆచరణ యోగ్యమైన అంశం కాదని ఎక్కువమంది అభిప్రాయం. మమతా బెనర్జీ, అఖిలేష్, కెసిఆర్ తప్ప మిగిలిన విపక్ష నేతలెవ్వరూ కాంగ్రెస్ ను దూరంగా పెట్టడానికి ఇష్టపడడంలేదు. నరేంద్ర మోదీని దించడానికి ఎవరితో కలవడానికైనా కూడా తాను సిద్ధమేనని మమతా బెనర్జీ  ఒకటి రెండు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆ మధ్య సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలోనూ ఆమె పాల్గొన్నారు. శరద్ పవార్, స్టాలిన్ మొదటి నుంచీ కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని కోరుతూనే ఉన్నారు. ఉద్దవ్ ఠాక్రే కూడా కాంగ్రెస్ ను పూర్తిగా వ్యతిరేకించలేదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి కూడా. ఒక్క అఖిలేష్ యాదవ్ మాత్రమే పెద్దగా సుముఖత చూపించడం లేదు. కెసిఆర్ కూడా కాంగ్రెస్ రహిత కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా, ఆయన పూర్తిగా ఆ మాటకే కట్టుబడినట్లు చెప్పలేం. అస్సాం సిఎం హిమంత్ బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల విషయంలో రాహుల్ గాంధీకి వత్తాసు పలుకుతూ కెసిఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ను కలుపుకోవాలా? లేదా? అనే అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాల బట్టి నిర్ణయం తీసుకుంటామని మొన్న ముంబయిలో కెసిఆర్ వివరించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కెసిఆర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన మమతా బెనర్జీకి కూడా వ్యూహకర్తగా కొనసాగుతున్నారు. సునీల్ అనే వ్యూహకర్తతో రాహుల్ గాంధీ ఒప్పందం చేసుకున్నారని వినపడుతోంది.

Also read: ఉక్రెయిన్ కీ, నాటోకీ రష్యా బలప్రదర్శన

మార్చి పదో తేదీ ఫలితాలు దిశానిర్దేశం చేస్తాయి

కాంగ్రెస్ విశిష్టత, బలాలతో పాటు రాహుల్ గాంధీ నాయకత్వ పటిమను చాటిచెప్పే దిశగా సునీల్ బృందం వ్యూహ రచనలు చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ 10వ తేదీన విడుదలయ్యే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకం. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఫలితాలు మరింత కీలకం. పంజాబ్ లో మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధిస్తే  ఆట వేరే రూపు తీసుకుంటుంది. అదే జరిగితే, ప్రత్యమ్నాయ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్యం తప్పనిసరి అయ్యే పరిస్థితులు ఉంటాయని సీనియర్ పాత్రికేయులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఫలితాలను బట్టి బిజెపి -సమాజ్ వాదీ దూకుడును అర్ధం చేసుకోవచ్చు. ఈ సమయానికి…నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపి బలంగానే ఉంది. కాంగ్రెస్ బలహీనంగానే ఉంది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తటస్థంగానే ఉన్నారు. నవీన్ పట్నాయక్ సంగతి ఎలా ఉన్నా, తనను ఎంతో ఇబ్బందుల పాలుచేసిన కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చెయ్యడానికి వైసిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ మాత్రం సుముఖత చూపించరనే భావించాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయన సయోధ్యగానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ మద్దతు పలికారు. బిజెపిపై వాగ్బాణాలు ఎక్కుపెట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కేంద్రం ప్రకటించిన చాలా బిల్లులకు ఓటేశారు. మరి కొన్ని నెలల్లో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఇంకా అధికార,విపక్షాల నుంచి అభ్యర్థుల ప్రకటన జరుగలేదు. గులాం నబీ ఆజాద్ పేరు వినపడుతోంది. అధికార పార్టీ బిజెపి  ఆజాద్ పేరును ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి. బిజెపికి ప్రత్యామ్నాయంగా రాబోయే కూటమిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఎవరి పాత్ర ఏమిటి? ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ ఉంటుందా? ఇవ్వన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే.

Also read: మరో వైరస్ ప్రమాదం: బిల్ గేట్స్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles