Sunday, December 22, 2024

ఉక్రెయిన్ కార్చిచ్చులో కర్ణాటక యువకుడి బలి

  • రష్యా-ఉక్రెయన్ పోరులో భారత్ మూల్యం
  • వరుసగా విఫలమౌతున్న శాంతి చర్చలు
  • భారతీయుల రక్షణ కోసం విశ్వప్రయత్నం

కావాలని యుద్ధాన్ని ఎవ్వరూ కోరుకోరు,శాంతినే కామిస్తారు. కానీ, కొన్ని సందర్భాల్లో పోరు అనివార్యమవుతుంది. ఈ క్రీడలో శత్రువులతో పాటు తటస్థులకు,శాంతికాముకులకు కూడా నష్టం జరుగుతుంది. రష్యా -ఉక్రెయిన్ సమరంలో భారత్ మూల్యం చెల్లించుకోవడం అటువంటిదే. బలహీనులను లోబరుచుకుంటూ తన బలాన్ని పెంచుకోవడం అనే ఆట సాగుతూనే ఉంటుంది. ‘శాంతి చర్చలు’ అనే మాట వినపడుతూనే ఉంటుంది. పేద దేశాల పట్ల ప్రపంచ మానవాళికి సానుభూతి కాస్త ఎక్కువగానే ఉంటుంది. మొత్తంగా రష్యా – ఉక్రెయిన్ పోరు మధ్యలో భారత్ పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’ మాదిరిగా తయారైంది. దేని గురించి మనం భయపడుతున్నామో అదే జరిగింది. ఈ దాడుల్లో మన విద్యార్థిని, ఎంతో ఉజ్వలమైన భవిత ఉన్న యువకుడిని కోల్పోయాం. కర్ణాటకలోని హవెరీ జిల్లాకు చెందిన నవీన్ గా భారత విదేశాంగ శాఖ గుర్తించింది. ఖార్కివ్ లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా బాంబు దాడులకు పాల్పడింది. అవి గురి తప్పి నవీన్ నివసిస్తున్న భవనంపై పడడంతో అతను ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు. నవీన్ అక్కడ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా తెలుస్తోంది.

Also read: ఉక్రెయిన్ పై రష్యా దూకుడు

నిరాయుధులైన పౌరులపై పోరాటం దారుణం

యుద్ధం ఇరుదేశాల మధ్య సైనికులపై, ఆ కేంద్రాలు, క్షేత్రాలపై కాక, సాధారణ పౌరులు నివసించే ప్రాంతాలపై కూడా జరుగుతుండడం దారుణం. ఉక్రెయిన్ లో తమని తాము రక్షించుకోడానికి ప్రతిమనిషీ ఒక సైనికుడు వలె యుద్ధభూమిలోకి వస్తున్నాడు. ఈ పరిణామాలతో చాలా నష్టం జరుగుతోంది. ఆ ప్రభావం అక్కడ నివసిస్తున్న భారతీయులపైనా పడుతోంది. మనవారు ప్రాణాలు అరచేత్తో పట్టుకొని బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏదో ఒక ప్రయాణ సాధనాన్ని, సౌకర్యాన్ని అందిపుచ్చుకొని సరిహద్దులకు చేరుకోండి.. అక్కడ నుంచి మన దేశానికి క్షేమంగా తెస్తామని మన ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. అటు రష్యా – ఇటు ఉక్రెయిన్ ప్రభుత్వాలతోనూ మన ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. మనవాళ్ళందరినీ క్షేమంగా మన దేశానికి రప్పించడంలో మన ప్రభుత్వాలు చేస్తున్న కృషిని మనం తప్పుపట్టలేము. ఆ రెండు దేశాల మధ్య చర్చలు వరుసగా విఫలమవుతూనే ఉన్నాయి. శాంతి ప్రవచనాలు పలుకుతూనే ఇరు దేశాలు పోరాటాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నాయి. గత అనుభవాలు, అనుబంధాలు, మనకున్న అవసరాలు, భావి పరిణామాల దృష్ట్యా మనం తటస్థంగానే ఉంటున్నాము. విదేశాంగ వ్యవహారాల నిపుణులు కూడా మన వైఖరిని సమర్థిస్తున్నారు. అగ్రరాజ్యాల మధ్య పోరుస్థాయి క్షణం క్షణం పెరిగిపోతోంది.  దీని పర్యవసానాలు ఆయా దేశాల సంబంధాలను బట్టి అనుభవించాల్సి ఉంటుంది.

Also read: ఉక్రేన్ కీ, నాటోకీ రష్యా బలప్రదర్శన

భారత దౌత్యనీతికి అగ్నిపరీక్ష

ఆ సత్యం ఎరిగే మనం మనదైన తీరులో సాగుతున్నాం ముఖ్యంగా అమెరికా – చైనా మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయే పరిణామాలు, శకునాలు కనిపిస్తూనే ఉన్నాయి. రష్యా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని చూస్తోంది. ఇది మూడో కోణం. త్వరితంగా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. యూరప్ దేశాల అండతో తనను తాను నిలబెట్టుకోవాలని, రష్యా పెత్తనానికి  ముగింపు పలకాలని ఉక్రెయిన్ చూస్తోంది. ఇన్నింట నడుమ భారత్ కు సవాళ్లు పెరుగుతున్నాయి. అటు అమెరికా – ఇటు రష్యాతో సత్ సంబంధాలను కాపాడుకోవడం మొదటి సవాల్ . చైనా నుంచి ప్రమాదాలు రాకుండా కాచుకోవడం రెండో సవాల్. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఉక్రెయిన్ లో ఉన్న మనవారిని రక్షించుకోవడం తక్షణ సవాల్. ఇప్పటికే ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నాం. ఇక మీదట ఒక్క ప్రాణాన్ని కూడా కోల్పోరాదు. ఉక్రెయిన్ కు ఆశించిన సాయం మనం చేయడం లేదని, రష్యా పట్ల కఠినంగా వ్యవహరించక పోగా, రష్యాకు మద్దతుగా నిలుస్తున్నామనే కోపం ఉక్రెయిన్ కు రోజురోజుకూ పెరుగుతోంది. అమెరికాకు కూడా ఇటువంటి అభిప్రాయాలే పుట్టుకొస్తున్నా, ప్రస్తుతానికి ఎక్కడా బయటపడడం లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితులు మన దౌత్యరీతికి, రాజనీతికి పెద్ద పరీక్షగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో,త్వరలో వార్ (యుద్ధం) ముగిసి పీస్ (శాంతి) స్థాపన జరగడమే అన్ని దేశాలకు శ్రేయస్కరం. అట్లు జరుగనేని.. ప్రపంచ దేశాల మధ్య జరుగబోయే విపరీత, విపత్కర పరిణామాలను ఊహించుకుంటూనే భయం వేస్తోంది. ప్రస్తుతం యుద్ధంలో తలపడుతున్న రష్యా- ఉక్రెయిన్ ఇక నుంచైనా యుద్ధనీతిని పాటిస్తాయని ఆశిద్దాం.

Also read: ఉక్రెయిన్ పై ‘తగ్గేదే లే’ అంటున్న రష్యా

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles