- ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యం
- ‘నాటో’ లో చేరాలనే ఉక్రెయిన్ ఉబలాటానికి చెక్ పెట్టడమే ఉద్దేశం
- ఇంతటితో రష్యా పోరాటం నిలిపివేస్తే ఉత్తమం
- యుద్ధం ఎప్పుడైనా అరిష్టమే, నష్టదాయకమే
ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన దండయాత్ర ‘నాటో’ను ఉద్దేశిస్తూ చేసిన పెద్దహెచ్చరికగానే భావించాలని అంతర్జాతీయ వ్యవహారాల పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాను అతిగా నమ్ముకున్నందుకు ఉక్రెయిన్ మూల్యం చెల్లిస్తోందని వారు అంటున్నారు. తమ తడాఖా ఏంటో ప్రపంచానికి చూపించాలనే తహతహ రష్యా అధినేత పుతిన్ కు ఎప్పటి నుంచో ఉంది. నేటి పరిణామాలను అవకాశంగా తీసుకొని తమ బలప్రదర్శన మొదలు పెట్టారు.
Also read: ప్రాతఃస్మరణీయుడు అన్నమయ్య
బలం పుంజుకున్నరష్యా
ఆకాంక్ష ఉన్నప్పటికీ శక్తి లేకపోతే ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు.గతంతో పోల్చుకుంటే రష్యాకు ఆర్థిక సామర్ధ్యం పెరిగింది, మీదు మిక్కిలిగా శక్తివంతమైన చైనా అండదండలు పుష్కలంగా లభించాయి. భారతదేశం ఎట్లాగూ తటస్థంగానే ఉంటుందని తెలుసు. నాటోపై ఉన్న కసి, భయాలు, అమెరికాపై ఉండే ఆగ్రహం, తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం, రష్యాను విస్తరించాలనే ‘నయాసామ్రాజ్య కాంక్ష’ మొదలైన అంశాలన్నింటి నేపథ్యంలో ఉక్రెయిన్ పై పుతిన్ ఉగ్రరూపం ఎత్తారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా అధినేత హెచ్చరికలు కూడా చేశారు. ఇవి నాటోతో పాటు మిగిలినవారికి సంధించిన హెచ్చరికగానే భావించాలి. ఉక్రెయిన్ పై సాగుతున్న ఈ విధ్వంసక్రీడను రష్యా ‘సైనికచర్య’ గా అభివర్ణిస్తోంది. భయభ్రాంతులను సృష్టిస్తూనే శాంతి వచనాలు పలుకుతోంది. నాటోలో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ బలంగా కోరుతూ ఉండడమే విషయాన్ని ఇక్కడాకా తెచ్చింది. ఉక్రెయిన్ ‘నాటో’లో చేరితే నాటో దళాలు ప్రయోగించే యుద్ధ రాకెట్లు కేవలం ఐదు నిముషాల వ్యవధిలోనే మాస్కోకు చేరుతాయి. రష్యా నుంచి యూరప్ వెళ్ళాలంటే ఉక్రెయిన్ మీదుగానే వెళ్ళాలి. మొత్తంగా ఉక్రెయిన్ ఇటు రష్యాకు – అటు యూరప్ కు కీలకమైన ప్రాంతం. అందుకనే రష్యా అంత పట్టుదలగా ఉంది. నాటోలో చేరకుండా ఉంటే ఉక్రెయిన్ వంటరిగా మిగిలిపోయి బలహీనమైన దేశంగానే ఉండిపోతుంది. ఆ దేశంపై తమ ఆధిపత్యం చూపించడానికి సౌకర్యంగా ఉంటుంది. అందుకే, అక్కడ ఏర్పాటువాదులను పెంచి పోషిస్తోంది.
Also read: ఉక్రెయిన్ పై ‘తగ్గేదే లే’ అంటున్న రష్యా
నాటో విస్తరణ వాగ్దాన ఉల్లంఘన
ఈ వ్యూహాలన్నీ రష్యాకు ఇప్పుడు అక్కరకు వచ్చాయి. గత చరిత్ర ఎలాగూ ఉంది. సోవియట్ యూనియన్ పతనానికి ముందు అప్పటి నాయకుడు గోర్బచెవ్ కు ఇచ్చిన మాటను అమెరికా నిలబెట్టుకోలేదు. నాటో కూటమిని యదేచ్ఛగా విస్తరించుకుంటూనే పోయింది. సరే, సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత రష్యా అన్నిరకాలుగా కుదేలైపోయింది. పుతిన్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి క్రమంగా శక్తిని పెంచుకుంటూ వచ్చింది. బలమైన చైనాతో స్నేహం బలపడిన మీదట ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమైంది. ఏ సమయంలోనైనా అమెరికా పెత్తనంతో నాటో నుంచి పెద్దదెబ్బ తినాల్సి వస్తుందని భావిస్తూ వచ్చిన రష్యా ఈరోజు తన ప్రతాపాన్ని ఉక్రెయిన్ పై యుద్ధం రూపంలో నాటోకు -అమెరికాకు చూపిస్తోంది. న్యాయం, ధర్మం తన వైపే ఉన్నాయని రష్యా వాదిస్తోంది. ఒక దేశం తనను తాను రక్షించుకోవడానికి చేపట్టే చర్యలను ఎవరూ అభ్యంతర పెట్టరు. స్వతంత్ర దేశమైన ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలనుకోవడం, యుద్ధానికి దిగడం, మారణకాండను సృష్టించడాన్ని ఏ సభ్య సమాజం అంగీకరించదు. దానిని దుశ్చర్యగానే లోకం భావిస్తుంది. చివరకు వచ్చేసరికి అమెరికా నుంచి నాటో నుంచి అందాల్సిన సహకారం ఉక్రెయిన్ కు అందలేదు. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో గుణపాఠాలు నేర్చుకున్న అమెరికా ఆచితూచి అడుగువేస్తోంది. కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే ఉంది. ఇటు ఉక్రెయిన్ తో -అటు రష్యాతో భారత్ కు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ ప్రభావం వల్ల భారత్ -రష్యా సంబంధాలు సన్నగిల్లినా, బంధాలు తెగిపోలేదు. అమెరికాను నమ్ముకొని రష్యాకు దూరం కావడం ఏ మాత్రం వివేకం కాదు. అందుకే భారత్ వ్యవహరిస్తున్న తటస్థ వైఖరి సమర్ధనీయమే. అమెరికా – చైనా ఆధిపత్య పోరు ఎలాగూ కొనసాగుతూనే ఉంది. ఆమెరికాకు భారత్ బాగా దగ్గరయ్యిందనే గుర్రు చైనాకు ఎలాగూ ఉంది. అది విద్వేషంగా మారింది. సరిహద్దుల్లో అలజడులను సృష్టిస్తూనే ఉంది.ఇటువంటి సవాళ్లను భారత్ ఎదుర్కొంటోంది. సోవియట్ యూనియన్ పతనమై, స్వతంత్ర దేశంగా ఉక్రెయిన్ ప్రకటించినప్పుడు ఆ దేశాన్ని మొట్టమొదటగా గుర్తించింది భారతదేశమే.
Also read: మరో వైరస్ ప్రమాదం: బిల్ గేట్స్
ఉక్రెయిన్ భారత్ కు మిత్రదేశమే
ఆ దేశానికి భారత్ ఆర్ధికంగానూ అండదండలు అందించింది. మనం శాంతికాముకులం. అందుకే మిగిలిన దేశాల వలె సామ్రాజ్య కాంక్షతో ఊగిపోతూ, యుద్ధానికి మద్దతు పలకం. అవసరమైన సందర్భాల్లో వీరత్వాన్ని ప్రదర్శిస్తూనే వచ్చాం. ఉక్రెయిన్ తో కూడా భారత్ కు సత్ సంబంధాలు ఉన్నాయి. మన విద్యార్థులు కొన్ని వేలమంది అక్కడ చదువకుంటున్నారు. ఈ యుద్ధ వాతావరణంలో వారందరినీ రక్షించుకోవడం మన బాధ్యత. క్షేమంగా మన దేశానికి తెప్పించుకోవడం మన తక్షణ కర్తవ్యం.ఆ దిశగా ప్రభుత్వం బలమైన అడుగులు వెయ్యాలి. ఎవరి లక్ష్యాలు, స్వార్ధాలు ఎలా ఉన్నప్పటికీ యుద్ధం పేరుతో మారణహోమం జరుగరాదు. శాంతి స్థాపనే ఏకైక ఆశయం కావాలి. సంబంధిత దేశాలు, సమాజాల మధ్య శాంతి చర్చలు జరగాలి. ఈ ఘోరకలిని ఆపాలి. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చూసుకోవాలి.
Also read: ముంబయ్ లో మరో ప్రత్యామ్నాయ ప్రయత్నం