వచనం: అని యి/ట్లురగ/పతుల/నెల్ల స్తు/తియించి
అందు సి/తాసిత/తంతు సం/తాన ప/టంబు న/నువయిం/చు చున్న/వారి ని/ద్దర స్త్రీ/లను ద్వా/దశార/చక్రంబుం
పరివ/ర్తించుచు/న్న వారి/నార్వుర/కుమారు/ల నతి/ప్రమాణ/తురంగం/బు నెక్కి/
న వాని/మహా తే/జస్వి నొ/క్క దివ్య/ పురుషుం/గని వి/పులార్థ/వంతంబు/లైన మం/త్రంబుల/నతి భ/క్తి యుక్తుండై/స్తుతియిం/చినం ప్ర/సన్నుండై/అద్దివ్య/పురుషుం/డయ్యుదం/కున కి/ట్లనియె:
కందం:
మితవచన నీ యథార్థ
స్తుతుల కతి ప్రీత మానసుడ నైతి ననిం
దత చరిత! నీకు అభివాం
ఛిత మెయ్యది దాని చెపుమ
చేయుదు ననినన్!
నన్నయ భట్టారకుడు
పాతాళ లోకానికి వెళ్ళి ఉదంకుడు నాగస్తుతి గావిస్తాడు. అక్కడ అతనికొక దృశ్యం కనిపిస్తుంది. తెల్లని, నల్లని దారాలతో కూడిన వస్త్రాలను నేత నేస్తున్న ఇద్దరు స్త్రీలను, పండ్రెండు ఆకులు గల ఒక చక్రాన్ని త్రిప్పుతున్న ఆరుగురు యువకులను, ఉన్నతమైన అశ్వరాజాన్ని అధిరోహించిన ఒక అద్భుత తేజస్విని ఉదంకుడు చూస్తాడు. తేజస్వి యైన ఆ దేవతాపురుషుణ్ణి ఉదంకమహాముని పరమార్థవంతమైన మంత్రాలతో స్తుతిస్తాడు. ఉదంకుడు భక్తితో గావించిన స్తోత్రపాఠానికి దివ్యపురుషుడు ప్రసన్నుడై అనుగ్రహంతో ఇట్లా అంటాడు: “మహామునీ! నీ స్తోత్రాలచే నేను పరమ సంతుష్టుడనైనాను. నీ కోరిక ఏమిటో చెప్పు. నేను నెరవేరుస్తాను. ఉదంకుడా మాటకు సంతోషపడి ఈ నాగకులమంతా నాకు వశమయ్యేటట్లు అనుగ్రహింపమని అడుగుతాడు. అప్పుడా దివ్యపురుషుడు ఇట్టా అంటాడు: “అట్లైతే ఈ గుఱ్ఱం కర్ణ రంధ్రంలో ఊదు!”. ఉదంకముని గుఱ్ఱం చెవిలో ఊదగానే, దాని సర్వేంద్రియాలనుండి భయంకరమైన బడబానలజ్వాలలు రేగి, పన్నగలోకంలో భీతి పుట్టిస్తాయి. అప్పుడు తక్షకుడు మిగుల భీతి చెంది తాను తస్కరించిన కర్ణాభరణాలను ఉదంకమునికి తిరిగి యిస్తాడు. అప్పటికే ఉదంకుడు ఆశ్రమం నుండి బయలుదేరి నాలుగు దినాలు. వేగంగా తీసుకుని రమ్మని గురుపత్ని ఆజ్ఞ. అతని సందేహాన్ని తెలుసుకొని ఆ దివ్యపురుషుడు అంటాడు: “నా గుఱ్ఱాన్ని అధిరోహించి వెళ్ళు! ఇది వాయువేగ మనోవేగాలతో నిన్ను గమ్యం చేర్చగలదు”. ఆ గుఱ్ఱంపై ఉదంకుడు వెంటనే ఆశ్రమం చేరుకొని కర్ణాభరణాలను గురుపత్నికి అందజేస్తాడు.
Also read: మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి
మాటల సందర్బంలో ఉదంకముని తన గురువైన పైలమహర్షికి తాను చూచిన అద్భుత దృశ్యాలన్నీ ఏకరువు పెడతాడు. దానికి గురువు పైలమహర్షి ఇచ్చిన సమాధానమిది:
“అప్పురుషుండింద్రు డయ్యక్ష మైరావ
తంబు, గోమయ మమృతంబు, నాగ
భువనంబులో గన్న పొలతులిద్దరు ధాత
యును, విధాతయు, వారి యనువయించు
సితకృష్ణతంతురాజిత తంత్రమది అహో
రాత్రంబు, ద్వాదశారములు గలుగు
చక్రంబు మాసాత్మ సంవత్స రంబు, కు
వారలయ్యార్వురు మహిత ఋతువు”
“లత్తురంగ మగ్ని యప్పు రుషుండు ప
ర్జన్యుడింద్ర సఖుడు సన్మునీంద్ర!
యాది నింద్రు గాంచి అమృతాశి వగుట నీ
కభిమతార్థ సిద్ధి యయ్యె నయ్య!”
ఈ పద్య తాత్పర్యమిది: “ఉదంకా! నీవు ప్రయాణమై బయలుదేరి పోతున్నప్నుడు అరణ్యమార్గాన ఎద్దు వాహనంగా కనిపించిన పురుషుడు ఇంద్రుడు. అతడు అధిరోహించిన వృషభం ఐరావతం ఇంద్రుని ఆజ్ఞచే నీవు తిన్న ఆవుపేడ అమృతం. నాగలోకంలో బట్టను నేస్తూ కనపడ్డ స్త్రీలు ధాత, విధాత, అనే వారు. వారు నేస్తున్న తెల్లని, నల్లని వస్త్రాలు దివారాత్రులు. పండ్రెండు ఆకుల చక్రం మన్నెండు మాసాలు కలిగిన సంవత్సరం. ఆ చక్రాన్ని తిప్పే ఆరుగురు యువకులు, ఒకదాన్ని ఒకటి అనుసరించి వచ్చే ఆరు ఋతువులు. ఆ గుఱ్ఱం అగ్ని. దాన్ని అధిరోహించిన దివ్యపురుషుడు ఇంద్రసఖుడైన పర్జన్యుడు. నీవు మొట్ట మొదటే ఇంద్రుణ్ణి చూచి అమృతం తినడంచే నీకు అభిమతార్థ సిధ్ధి కలిగింది.”
Also read: మహాభారతం – ఆదిపర్వము : ఉదంకోపాఖ్యానము
“నీ వంటే నాకు పరమప్రీతి కలిగింది. నీవు గురు ప్రయోజనాన్ని నెరవేర్చి ఋణవిముక్తుడవైనావు. ఇక నీ ఇచ్చ వచ్చినట్టు ఉండవచ్చును!”.
ప్రతీకాత్మకమైన దృశ్యాలు
పైలమహర్షి వ్యాస మహామునిచే నియంత్రితుడై ఋగ్వేదాన్ని విభజించి, పరిష్కరించిన వాడు. ఋగ్వేదం ప్రతీకాత్మకమైనది. పైలమహర్షి శిష్యుడైన ఉదంకునికి నాగలోకంలో కనబడిన దృశ్యం కూడా ప్రతీకాత్మకమైనదే. ఐనప్పటికి, ఉదంకుడు భౌతికమైన దృశ్యాన్ని చూస్తాడు గానీ దానిలోని అంతరార్థం గ్రహింపలేడు. గురువైన పైలమహర్షి చెప్పేవరకు కట్టెదుట కనపడిన దృశ్యపు పరమార్ధం ఉదంకుడు గ్రహింపలేడు. అనగా ఉదంకుడు సాధన చేసి అవగతం చేసుకున్న బ్రహ్మజ్ఞానం అసంపూర్ణమైనది.
దివ్యపురుషుడు జలసంబంధమైన పర్జన్యుడైతే అతని వాహనమైన గుఱ్ఱం అగ్ని. సృష్టిలో తొలుత అగ్ని, వాయువు పుట్టినవని, తర్వాతనే జలం పుట్టిందనీ బృహదారణ్యకోననిషత్తు పేర్కొంటున్నది. అగ్ని కారకుడైన సూర్యుడు పృథ్వికి వెలుగు ప్రసాదిస్తే, భూతల జీవజాలం ఏర్పడడానికి, అగ్నితో బాటు నీరు కూడా అవసరం. సౌరకుటుంబంలోని సప్తగ్రహాలపై లేని జీవజాలం కేవలం భూగోళంపై మాత్రమే ఉన్నది.
“అన్నాత్ భవంతి భూతాని
పర్జన్యాత్ అన్న సంభవ”
అని భగవద్గీత పేర్కొంటున్నది.
ప్రాణవాయువు అగ్నికి కారణం. ప్రాణవాయువు (ఆక్సీజన్) ఒకపాలు, ఆమ్లజని (హైడ్రోజన్) రెండు పాళ్లు కలిసి నీరు ఏర్పడుతున్నది. భూమిపై నీరు అంతరించిన నాడు, సమస్తజీవజాలం, సూర్యుని ప్రచండ తేజస్సుకు ఆహుతై అంతరించి పోగలదు.
Also read: మహాభారతంలో శునకాల ప్రసక్తి
అగ్ని అశ్వం. అగ్నిని నియంత్రించే నీరు ఆశ్వికుడు. ప్రపంచము కర్తవ్యపాలకులు క్షత్రియులు. మార్గదర్శకులై ఆ కర్తవ్యపాలనను నియంత్రించేవారు విప్రులు. అగ్నికి, పర్జన్యానికి గల అనుబంధం, అశ్వానికి, అశ్వారూఢునికీ గల పరస్పర సంబంధం వంటిది.
జాతక చక్రంలో క్షత్రియులవి అగ్నిరాశులైన మేషం, సింహం, ధనస్సు. విప్రులవి జలరాశులైన కర్కాటకం, వృశ్చికం, మీనం. ఇరురాశులకు అధిపతులోకరే. కుజుడు అగ్నిరాశియైన మేషానికి అధిపతి. జలరాశికి కూడా కుజుడే అధిపతి. రవి/చంద్రుడు, ఒకే వెలుగుకు రెండు అంచులు. అగ్నిరాశి యైన సింహరాశికి సూర్యుడు అధిపతి. జలరాశియైన కర్కాటకానికి చంద్రుడు అధిపతి. అగ్నిరాశి ధనస్సుకు బృహస్పతి అధిపతి. జలరాశి మీనానికి కూడా బృహస్పతియే అధిపతి. ఈ వర్ణవిభజనలు “గుణం” ద్వారా ఏర్పడినవని, పుట్టుక ద్వారా కాదని లగ్నకుండలిలోని ద్వాదశరాశుల పరస్పరా నుబంధం తెలుపుతుంది.
ఉదంకునికి దృగ్గోచరమైన ఆరుగురు యువకులు, ఆరు మంది ఋతురాజులు. వీరందరూ ఒకేవొక కాల పురుషునికి సంకేతం. రాత్రిని, పగలును, క్రమబధ్ధం చేసే ఇరువురు స్త్రీలు ఒకే ప్రకృతికి ఇరుపార్శ్వాలు.
సమస్తషృష్టిలో వృశ్చికములు, సర్పరాజములే, విషాగ్నిని వెలిగ్రక్కుతాయి. ఈ సర్పరాజులే అఖండ సృజనాత్మకతకు, అమోఘమైన కుండలినీ శక్తికి ప్రతీకలు. అనంతుని సహస్రఫణి సముదాయంపై భూభారం మోపబడింది. ఇదే అనంతుణ్ణి నిజతల్పంగా చేసుకొని విష్ణుమూర్తి తన దుస్సహభారంతో అణగద్రొక్కుతున్నాడు. అనంతునివలె అపారశక్తి శాలి వాసుకి. వాసుకిని సైతం మహేశుడు కంఠాభరణంగా చేసుకొని తన కనుసన్నలలోనే త్రిప్పుకుంటున్నాడు. కారణం? నియంత్రణకు లోబడని మహా శక్తిశాలి ఏదో ఒక రోజు సమస్త సృష్టినీ నాశనం చేయగలడు.
బహుశా ఈ కారణంచేతనే సర్పకోటి జనాభాను, ప్రాబల్యాన్ని, నియంత్రించడానికి విధి నిర్ఢయించి వుంటుంది. దీనికై ఉదంకమహాముని సేవలను విధి వినియోగించి వుంటుంది. సృష్టి పరమార్ధం గ్రహింపలేని ఉదంకమునికీ విషయం తెలిసి వుండే అవకాశం లేదు.
పైలమహర్షి పత్ని పౌష్యమహాదేవి కర్ణాభరణాలు కోరడం ఈ ప్రణాళికకు నాంది. తక్షకునికి ఆ కర్ణాభరణాలు తస్కరించాలనే కోరిక కల్గడం విధి వ్యూహంలో భాగం. చివరికి ఉదంకమహాముని జనమేజయుణ్ణి సర్పయాగానికి ప్రేరేపించడం వరకు కథ వెళ్లింది. అదే విధి ఉదంకమహామునిని సంతాన హీనుడవు కమ్మని శపించి, భూమిపై అతని వారసులు లేకుండా చేసింది.
సర్పకోటి సంహారకుడుగా ఉదంకుడు
ఇంద్రుని ప్రేరణచే ఎద్దుపేడ అనుకొని పీయూషం తినడం ద్వారా ఉదంకమునికి విధి అమృతత్వం ప్రసాదించింది. ఉదంకుడు విష్ణు, మహేశ్వరుల నుండి అనేక వరాలు కూడా పొందగల్గిన వాడు. విషజీవులైన సర్పకోటి సంహారానికి ప్రేరకునిగా ఉదంకుని పేరు చరిత్రలో స్థిరపడి పోయింది.
Also read: మహాభారత శోభ
ఇంద్రుని వాహనం ఎద్దు, పర్జన్యుని వాహనం గుఱ్ఱం. మానవకోటి తన ప్రయోజనాల కోసం మచ్చిక చేసుకొని వాడుకున్న జంతువులివి. గుఱ్ఱం ఆర్యుల నాగరకతా సంకేతం. ఎద్దు సింధూ నాగరకతా చిహ్నం. మొహంజదారో హరప్పా త్రవ్వకాలలో వృషభం బొమ్మ కలిగిన పలు నాణేలు వెలుగులోకి వచ్చినవి. ఈ వృషభాలను ఒకప్పుడు యుద్ధాలలో వాడేవారని, వృషభాలు అఖండ శౌర్యానికి, పౌరుషానికి ప్రతీకలనీ, జూలియస్ సీజర్ కాలంలో వాటిని అథ్రాస్ (athras) అని పిలిచేవారనీ ఒక వ్యాసంలో చదివినాను.
నాగరాజు మానవుడు మచ్చిక చేసుకోలేక పోయిన స్వతంత్ర జీవి. ఇదే సర్పాన్ని దేవతగా ఆదిమ మానవుడు ఆరాధించేవాడని తెలిపే అనేక ఆనవాళ్ళు తెలుగు గడ్డపై వున్నాయి.
నేటి నన్నయ గారి వచనంలో సుందర వృత్యనుప్రాసా శోభితమైన పంక్తులు మనసును ఆహ్లాదపరుస్తాయి. వృత్తంలో గణం ఒక ప్రాధమిక విభాగంగా వాడుకున్న వాగనుశాశనుడు వచనంలోనూ గణాన్ని మౌలిక విభాగంగా వాడుకున్నట్లు భావన కలిగి నేటి వచనాన్ని గణవిభజన చేసినాను.
తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణం తప్ప తక్కిన ప్రాచీనాంధ్ర కావ్యాలన్నీ చంపూపద్ధతిలో రచింపబడినవే. అనగా పద్యాలతో బాటు గద్యాలు కూడా కావ్యంలో అంతర్భాగాలు.
చంపూకావ్య పద్ధతికి తెలుగులో శ్రీకారం చుట్టినవాడు నన్నయభట్టారకుడు. ఛందోమార్గానికి మార్గదర్శకుడైనట్లే, వచనకవితా పద్ధతిలోనూ ఆదికవియే మార్గదర్శి. ట్రెండ్ సెట్టర్.
నన్నయ వచనంలో పలుచోట్ల పద్యభాగాలు దొరలుతాయని, ముఖ్యంగా నలోపాఖ్యానంలో సీసపద్యపాదాలు గోచరిస్తాయనీ కవిపండితులు సూర్యదేవర రవికుమార్ గారు సిద్ధాంతీకరించినారు. నేటి వచనంలోనూ సీసపద్యపు ధోరణిని వారు ఎత్తి చూపించినారు. సూర్యకుమార్ గారు గావించిన ఈ క్రింది సీసపద్య విభజన గమనింపగలరు:
“అని యిట్లు నాగకులంబు నెల్ల స్తుతించి
యందు సితాసిత తంతు సం
తానపటంబు (ను) ననువయించుచు నున్న
వారి నిద్దరు స్త్రీల ద్వాదశార
చక్రంబు (ను) బరివర్తింపించు (చు) న్న వా
రిని నార్వుర కుమారు లనతి
విపులార్థ వంతంబులైన మంత్రంబుల
నతి భక్థి యుక్తుడై …
నన్నయభట్టారకుని పద్యశైలితో బాటు వచనశైలిని కూడా కూలంకషంగా అధ్యయనం చేయవలసిన చారిత్రకావసరం ఎంతైనా వుంది. రానురాను “అనేక మెలకువలు” నన్నయ వచనశైలిలో చోటు చేసుకోవడం మనం చూస్తాము.
Also read: మహాభారతం అవతారిక
నివర్తి మోహన్ కుమార్