Friday, November 22, 2024

దక్షిణాది నదుల అనుసంధానంపై చర్చ

  • రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవడమే లక్ష్యం
  • అభ్యంతరాలు వెలిబుచ్చుతే వివరణ ఇవ్వడానికి కేంద్రం సిద్ధం

నదుల అనుసంధానం గురించి ఇటీవలే కేంద్రం ప్రకటించింది. మహానది,గోదావరి, కృష్ణ, పెన్నా,కావేరి నదులను ఆ జాబితాలో చేర్చింది. ఈ దిశగా అడుగులు వేయడం ఆరంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు దిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ( ఎన్ డబ్లూ డి ఏ ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదటగా ప్రకటించినప్పుడు పై ఐదు నదులను ప్రస్తావించింది.

Also read: ఉక్రెయిన్ పై రష్యా దూకుడు

గోదావరి-కావేరి అనుసంధానం

తాజాగా ఏర్పాటుచేసిన సమావేశంలో గోదావరి – కావేరి నదుల అనుసంధానమే చర్చలోకి వచ్చింది. దీనిని ప్రాధమిక సమావేశంగానే భావించాలి. సంబంధిత రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవడమే ప్రధానంగా ఈ సమావేశం ముగిసింది. నదుల అనుసంధానం పట్ల అన్ని రాష్ట్రాలు సుముఖంగానే ఉన్నప్పటికీ, ఆలోచనలు వేరు వేరుగా ఉన్నాయి. కేంద్రం – రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపు, అనుసంధానానికి అవసరమైన భూసేకరణ, ఏ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు అనుసంధానం చేయవచ్చు, ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అనే వాటిపై చర్చ జరిగింది. బహుశా తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా, రాష్ట్రాల మధ్య ఐకమత్యం కుదరడం, కేంద్ర- రాష్ట్రాల మధ్య సమతుల్యతను సాధించడం కీలకం. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాలు ఒక కొలిక్కి రాలేదు. ‘నీరు -నిధులు -నియామకాలు’ ఆశించిన మేరకు, రావాల్సిన మేరకు ఆచరణకు నోచుకోలేదు. గోదావరిలో నీటి లభ్యత ఎంత మేరకు ఉంటుంది, ట్రిబ్యునల్స్ కేటాయించిన నీరు కాకుండా అదనపు జలాలు ఎంత మేరకు ఉంటాయి, వాటిని ఏ మేరకు ఉపయోగించుకోవచ్చనే వాటిపై కేంద్ర ప్రభుత్వ వైఖరిలో స్పష్టత తెలియాల్సి ఉందని తెలంగాణ అధికారులు అంటున్నారు. అధ్యయనం జరగాలని వారు కోరుకుంటున్నారు.

Also read: మోదీకి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం

గోదావరి జలాల తరలింపుపై అభ్యంతరం లేదు

అదే సమయంలో, గోదావరి మిగులు జలాలను తరలించడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ అధికారులు చెప్పినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టును ప్రాతిపదికగా తీసుకొని అక్కడ నుంచే గోదావరి- కావేరి అనుసంధానం ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది.   గోదావరి మిగుల జలాలను తరలించడం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసినట్లు సమాచారం. తమకు నేరుగా జరిగే లబ్ధి ఎంతవరకూ ఉంటుంది, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనే వాటిపై కర్ణాటక స్పష్టతను కోరుకుంటోంది. ఐదు రాష్ట్రాలు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి, వచ్చే సమావేశంలో గోదావరి – కావేరి అనుసంధానంపై డిపిఆర్ లో మార్పులు, కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. నదుల అనుసంధానం అనేది గొప్ప ప్రాజెక్టు. పాత వివాదాలకు ముగింపు పలుకుతూ, కొత్త వివాదాలను సృష్టించుకోకుండా, రాజకీయాలకు అతీతంగా, సర్వప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని రాష్ట్రాలు – కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళితే దేశ సౌభాగ్యం మరింత పెరుగుతుంది. దక్షిణాదిలో గోదావరి, కావేరి చాలా ముఖ్యమైన నదులు. అనుసంధానం అంతే కీలకమైంది. నీటి లభ్యత మొదలు వినియోగం వరకూ రాష్ట్రాలు ఎటువంటి సందేహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తాయో  అనే భయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెలరేగిన వివాదాలు, యుద్ధాలే ఈ భయాలకు తార్కాణంగా వారు చెబుతున్నారు.  జాతీయ ప్రాజెక్టులు చేపట్టడానికి సంబంధించిన విషయంలో కేంద్రం తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నిర్మాణ వ్యయంలో కేవలం 60శాతం మాత్రమే కేంద్రం  ఇవ్వనుంది. 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి వస్తోంది. గతంలో ఈ నిష్పత్తి 90%-10% గా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో అనుసంధానం ప్రాజెక్టులు ముందుకు వెళ్ళాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో  అనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు, అందునా ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ఆర్ధిక పరిపుష్టి చాలా తక్కువ. కేంద్రం పెద్ద స్థాయిలో సహకరిస్తే తప్ప ఏ నీటి ప్రాజెక్టూ ముందుకు వెళ్ళలేదు. ఇటువంటి అనేక ఇబ్బందులకు, సమస్యలకు ముందుగా పరిష్కారం లభించాలి. ఆ దిశగా కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాగాలి. నదుల అనుసంధానం అనే గొప్ప సంకల్పం సత్వరమే ఆచారణాత్మకం కావాలని ఆకాంక్షిద్దాం.

Also read: ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles