Sunday, November 24, 2024

ఉక్రెయిన్ పై రష్యా దూకుడు

  • చర్చలకు సిద్ధమంటూనే సైనిక చర్యలు
  • ఉక్రెయిన్ తిరుగుబాటుదారులకు రష్యా మద్దతు
  • రష్యాను నియంత్రించేందుకు అమెరికా సన్నాహాలు
  • 18వేల మంది భారత విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం

ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధ మేఘాలు ఇంకా కమ్ముకొనే ఉన్నాయి. అక్కడున్న భారత పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ సుమారు 18వేలమంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారని సమాచారం. రష్యా ఏ సమయంలోనైనా దాడి చేసే అవకాశాలు బలంగానే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందనీ హెచ్చరించారు. అటువంటి సమయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోనేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. బలగాల ఉపసంహరణ మొదలు పెట్టామని, చర్చల ద్వారా పరిష్కారాలు కనుక్కొంటామని చెబుతున్న రష్యా మాటలపై పశ్చిమ దేశాలు అపనమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాయి. 

Also read: మోదీకి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం

ఒకవైపు శాంతిమంత్రి, ఇంకోవైపు యుద్ధతంత్రం

Russian Armed Volunteers Prepare for Action in Eastern Ukraine - The Moscow  Times
దాడికి సంసిద్ధంగా ఉన్న రష్యా సైనికులు

తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ‘నాటో’ కూటమిలో చేరాలన్న ఉక్రెయిన్ ప్రయత్నాలపై శాంతియుతమైన చర్చలను మాత్రమే కోరుకుంటున్నట్లు ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో సైనిక విన్యాసాల్లో పాల్గొన్న తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీనితో ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ  క్షేత్ర వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. రష్యా బలగాల ఉపసంహరణపై ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాలు లేవని నాటో అధిపతి జనరల్ జెన్స్ స్టాల్టెన్ బెర్గ్ సైతం అంటున్నారు. ఐరోపాలో మధ్యంతర శ్రేణి క్షిపణుల మోహరింపుపై పరిమితులు, సైనిక విన్యాసాల్లో పారదర్శకత, విశ్వాసం పాదుగొల్పే చర్యలపై చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని అంటూనే, ఉక్రెయిన్ చుట్టూ రష్యా యుద్ధ వాతావరణాన్ని కలిపిస్తోంది. పశ్చిమ దేశాల ముందు అనేక డిమాండ్లను ఉంచుతోంది. అవన్నీ నెరవేర్చి తీరాలనే బలంగా అంటోంది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరితే తమకు పెద్ద ముప్పు ఉంటుందని రష్యా ప్రధానంగా భావిస్తోంది. ఉక్రెయిన్ -రష్యా మధ్య పరిస్థితులను అమెరికా చాలా నిశితంగా పర్యవేక్షిస్తోంది. సంబంధిత వర్గాలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇదంతా రష్యాకు తలనొప్పి పెంచుతోంది. తమ కూటమిలో ఉక్రెయిన్ ఇప్పుడప్పుడే చేరబోదని పశ్చిమ దేశాలు చెబుతున్నా, ఆ హామీలను విశ్వసించే పరిస్థితిలో రష్యా లేదు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, శాంతి చర్చలు అని రష్యా చెబుతున్న మాటల పట్ల ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా పెదవి విరిస్తున్నారు. ఉక్రెయిన్ ను దురాక్రమించాలనే ఏకైక లక్ష్యంతో రష్యా ఉన్నట్లు ప్రపంచంలోని ఎక్కువ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. సరిహద్దుల్లో సైనిక విన్యాసాలతో పాటు ఉక్రెయిన్ పై సైబర్ దాడులు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, ప్రధాన బ్యాంకులు లక్ష్యంగా మంగళవారం నాడు సైబర్ దాడి జరిగింది. రక్షణ, విదేశీ, సాంస్కృతిక శాఖలకు సంబంధించిన వెబ్ సైట్స్ మొరాయించాయి. బ్యాంకుల్లో ఆన్ లైన్ చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తూర్పు ఉక్రెయిన్ లో గురువారం నాడు కాల్పులు మార్మోగాయి. రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదులు -ఉక్రెయిన్ సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఇలా ప్రతిరోజూ ఏదో మూలన ఇదే తంతు కొనసాగుతోంది. మొత్తంగా, రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనే ఉన్నప్పటికీ, రష్యా అధ్యక్షుడు తాజాగా వ్యూహం మార్చారని, దాని వెనకాల జర్ననీ ఉందని విదేశీ వ్యవహారాల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also read: ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ

రష్యాకు మిత్రదేశం జర్మనీ

ఉక్రేన్ లో రష్యా వ్యతిరేక ప్రదర్శనలు

రష్యాకు జర్మనీ కీలక భాగస్వామి.రష్యా ఆర్ధిక వ్యవస్థలో కీలకమైన కొన్ని గ్యాస్ పైప్ లైన్స్ జర్మనీకి చేరుతాయి. ఉక్రెయిన్ పై దాడి చేస్తే ఈ ప్రాజెక్టులపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఉక్రెయిన్ చేరుకొని చర్చలు ప్రారంభించారు. దీనితో రష్యా కాస్త మెత్తబడింది. మెత్తబడిందా? మెత్తబడినట్లు నటిస్తోందా? సమీప భవిష్యత్తులోనే తేలిపోతుంది. దౌత్య పరిష్కార మార్గాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది.  చర్చలకు సిద్ధమేనని ప్రకటించింది. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఉక్రెయిన్ కూడా రాజీకి సిద్ధమేనని సంకేతాలు పంపింది. ఆర్ధిక స్వార్ధాలు,గతంలో సోవియట్ యూనియన్ – ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణ సమయంలో చవిచూచిన చేదు అనుభవాలు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని రష్యా కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. రష్యా దూకుడుకు కళ్లెం వేయాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో రష్యాకు సమస్యలు సృష్టించాలని చూస్తోంది. “ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చింది” అన్న చందాన, ఉక్రెయిన్ ఆక్రమణ వ్యవహారం కొత్త రూపు తీసుకుంటోంది. రష్యాకు కొత్త తలనొప్పులు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ ముప్పుకు ‘ఇంటర్వెల్ కార్డ్ ‘ పడుతుందేమో చూద్దాం.

Also read: సంజీవయ్య – ఒక సజీవ స్మృతి!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles