సుభానీ చిత్రించిన లేపాక్షి నంది
ఆకాశవాణి లో నాగసూరీయం – 13
లేపాక్షి నందిని పోలిన రెండు అడుగుల ఎత్తు ఉన్న నంది రాతి విగ్రహం! నాలుగడుగుల దిమ్మె పైన ఉందీ నంది. ఆ నందికి ఇటు డా. పి.రమేష్ నారాయణ, అటు నేను! ! ఫేస్ బుక్ మెమరీగా 1994 ఫోటో దర్శనమిచ్చింది. బక్కపలచగా, నశ్యం రంగు సఫారీలో నేను. ఇంకా పలుచని రమేష్ నారాయణ నవ్వుతూ… నిజానికి అప్పుడు మంచి ఎండ… నా కళ్ళలో ఆ వేడి కనబడుతోంది జాగ్రత్తగా ఫోటో చూస్తే. కొన్నేళ్ళ క్రితం రమేష్ నారాయణ గారు ఈ ఫోటోను వాట్సాప్ లో పంపారు. ఇంకేం ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాం. ఆ ఫోటోలో ఆగస్టు 5, 1994 అని తేది కూడా ఉంది! నంది గురించి ఓ విషయం చెప్పుకోవాలి.
Also read: విజయదశమి కనకదుర్గ తెప్పోత్సవం
నాలుగు మాసాలు లెక్చరర్ గా ఉద్యోగం
ఎమ్మెస్సి అయ్యాక, ఆకాశవాణిలో చేరక ముందు, హిందూపురం సరిహద్దు ఇప్పుడు, కన్నడ ప్రాంతం కోలారు జిల్లా బాగేపల్లి నేషనల్ కాలేజీలో మూడు, నాలుగు నెలలు పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశాను. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎస్ డి జి యస్ కాలేజి హిందూపురం లో నెలకి రు. 600 ఇస్తుండగా, కర్నాటకలో రు. 1,980 (అవును 20 కలిపితే 2000) నెలకిచ్చేవారు. ఎందుకో ఈ తేడా? అప్పుడు నేను స్టడీ చేయలేదు. డబ్బులకు కటకట కనుక, రోజూ నలభై కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేసి, ఒకటిన్నర కిలో మీటరు నడిచి, ఆ కళాశాలలో తాత్కాలిక అధ్యాపకోద్యోగం చేశాను. నిజానికి 1988లో ఆకాశవాణి (గోవా)లో చేరినపుడు మొత్తం నెలకు జీతం రెండువేలు దాటలేదు, ఇంకా చెప్పాలంటే రు. 1,980 కంటే తక్కువ!
Also read: అనంతపురం పల్లెకళల దిగంతం!!
అలా బాగేపల్లికి జి.ఎమ్.ఎస్. అనే బస్సులో వెళ్ళేవాడిని. ప్రతి పల్లెలో ఆగుతూ, ప్యాసెంజర్లతో, లగేజితో కిటకిట లాడుతూ పోయేది. లేపాక్షి గుడి కుడివైపున రోడ్డుకు ఉంటే, నంది విగ్రహం ఎడమ వైపున (హిందూపురం నుంచి కొడికొండ చెక్ పోస్టు వెళ్తున్నప్పుడు) వస్తుంది. ఆ నందిని బస్సులో వెళ్తూ చాలాసార్లు చూశా. శ్రావణబెళగొళ గోమటేశ్వరుని విగ్రహం కానీ – ఆ మాటకు వస్తే ఏ పెద్దరాతి విగ్రహాన్ని చూసినా – నాకు మనిషి సాధించగల నైపుణ్యానికీ, వెచ్చించగల సామర్ధ్యానికి ప్రతీకలుగా అనిపిస్తాయి. వీటిలో లేపాక్షి నంది నాకు మరీ ప్రత్యేకం! ఎందుకు? మా కొనతట్టుపల్లికి పన్నెండు, పదమూడ మైళ్ళ దూరంలో ఉందని కాదు. నంది మన వ్యవసాయానికీ, రైతుకూ, పంటలకూ, మన ఆహారానికీ చిహ్నం అనే భావన నాకుంది. ఈశ్వరుడు, వాహనం అని పురాణాలు గురించి చెప్పే విషయాలు కాకుండా, భారతీయ రైతుకు ఎద్దు ఇచ్చే తోడ్పాటు వెలలేనిది!
Also read: జంట ప్రసంగాల కదంబం – బొమ్మా, బొరుసా
అడవి బాపిరాజు పాట
ఇక లేపాక్షి నంది గురించి చెప్పాలంటే అడవి బాపిరాజును సంప్రదించాలి. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య..’అనే అద్భుతమైన పాటను వారు రాశారు. ఏ పుస్తకంలో చదివానో గుర్తు లేదు కానీ లేపాక్షి నంది తనకెందుకు నచ్చిందో అందులో బాపిరాజు అందులో పేర్కొన్నారు. చరిత్ర పరిశోధకులు దిగవల్లి శివరావు కుమారుడు వెంకటరత్నం రాసిన ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య’ అనే వ్యాసం 2014లో ఎన్.వి.రమణయ్య వెలువరించిన పన్నెండు వందల పుటల పుస్తకం ‘పరిశోధన’లో నాకు కనబడింది. బందరు జాతీయ కళాశాల పనిచేసే కాలంలో అడవి బాపిరాజు ఈ పాట రాశారని, ఈ వ్యాసంలో ఆ సందర్భం గురించి వివరించారు.శివరావుగారింట్లో విశ్వనాథ సత్యనారాయణ, చెరుకుపల్లి వెంకటప్పయ్య గార్ల సమక్షంలో ఈ పాటను బాపిరాజు అప్పటికప్పుడు ఆలపిస్తూ, నృత్యం చేశారని వివరించారు. గోదావరి జిల్లా అడవి బాపిరాజుకు కరువు జిల్లా అనంతపురం లేపాక్షి నంది ఎందుకు నచ్చింది? మరో ప్రఖ్యాతమైన రెండు, మూడు పెద్ద నంది విగ్రహాలను పోలుస్తూ – లేపాక్షి కోడె వయసులో , ఉత్సాహంగా ఉందని చెప్పారు; అలాగే మిగతానందులు రెండు కాళ్ళు చాపుకుని రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉంటే, లేపాక్షి నంది కుడికాలు గిట్టలు నేలకానించి పర్యటనకు వెడదాం అని సంసిద్ధంగా ఉన్నట్టు కనబడుతుందని బాపిరాజు రాశారు. వారు కవి, చిత్రకారుడు, గేయకర్త, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు (8 అక్టోబర్1895 -1952) కనుక ఆ దృష్టి వేరుగా ఉంటుంది. అందుకే, అంత చక్కని పాట రాశారు!
Also read: చిరస్మరణీయమైన ‘వెలుగుజాడ’ ధారావాహిక!
కార్యక్రమాల రూపకల్పన, సమన్వయం
నేను ఆకాశవాణి కేంద్రం ప్రారంభం కావడానికి ఓ యాభై రోజులు ముందు బదిలీ మీద వచ్చి 1991 ఏప్రిల్ లో అనంతపురంలో చేరాను. రికార్డింగు స్టూడియో వగైరా అప్పటికే ప్లాను ప్రకారం నిర్మాణమై సిద్ధమయ్యాయి. ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎవరి సమన్వయంతో వాటిని రక్తి కట్టించాలి – అనేది ముఖ్యమైన పార్శ్వం. తామున్న ఆఫీసు గదిలో వస్తువుల అమరిక, కార్యాలయం వెలుపలా, కాంపౌండు బయట ఎలా వుండాలి అనే విషయాలు గురించి ప్రతి ఉద్యోగి శ్రద్ధ తీసుకోవచ్చు, మెరుగు చేసుకోవచ్చు, వాటిని కళాత్మకంగా మార్చుకోవచ్చు!
డా. అనంత పద్మనాభరావు రెండు సంవత్సరాల తర్వాత కడప కేంద్రానికి బదిలీ కాగా, మిగిలిన ఇద్దరు ముగ్గురు ఉన్నత అధికారులలో నేను ఒకడిని. కార్యక్రమాలు చేయడం, రక్తి కట్టించడంతో ఎంతోమంది స్వచ్ఛందంగా ఆకాశవాణికి ఏదైనా తోడ్పాటునిస్తామని చెప్పేవారు. ఒకసారి గవర్మమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు శ్రమదానం చేసి కాంపౌండ్ చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్త తెలిసి గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ తమ ఎన్నెస్సెస్ విద్యార్థినులు ఉత్సాహపడుతున్నారని చెప్పారు. అది సెప్టెంబరు నెల చివరి వారం. కనుక గాంధీ జయంతి రోజున ఆకాశవాణి లో మొత్తం చెట్లకు నీళ్ళు పోయమని అభ్యర్థించాను. ఈ విషయం తెలుసుకుని అనంతపురం రైల్వేస్టేషన్ మాస్టర్, రంగస్థలనటుడు మిత్రుడు బాబయ్యనాయుడు స్వచ్ఛందంగా ఈ విద్యార్థులందరికి అరటిపళ్ళను ఫలహారంగా తీసుకువచ్చారు. మా కార్యాలయం ముందు పోస్ట్ డబ్బాను మిత్రులు, రచయిత, జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ సి హెచ్ వి బృందావనరావు సాయంతో ఏర్పాటు చేయించాను.
Also read: అన్నమయ్య పదగోపురం
ఈ కార్యక్రమాలు జరగడానికి ముందు మరో సంఘటన సంభవించింది. అదే వీటికి స్ఫూర్తి! లేపాక్షి నంది వ్యవసాయానికి ఒక చిహ్నం, అలాగే అనంతపురం కళాభిరుచికి పెద్ద ప్రతీక కూడా! ఇప్పుడు సాహిత్య రచనలు, అనువాదాలు విరివిగా చేస్తున్న డా. పి. రమేష్ నారాయణ ఒకప్పుడు సైన్స్ రచనలు విస్తృతంగా చేశారు. మా ఇద్దరిదీ పాపులర్ సైన్స్ అనుబంధం! వారు లోకల్ గా పరపతి బాగా ఉన్నవారు కూడా. ఎంతో అభిమానంతో వారు నన్ను కలిసేవారు. లేపాక్షి నందిని పోలిన విగ్రహాన్ని – బుల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని వారితో ప్రతిపాదించాను.
పిట్స్ బర్గ్ శిల్పితో నల్ల నంది విగ్రహం
అంతే, దాన్ని లిటిల్ ఫ్లవర్ స్కూలు ఆంజనేయులు తోడ్పాటుతో సాధించారు వారు. పిట్స్ బర్గ్ లో ఉండే వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చెక్కిన శిల్పి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నివాసి. మరో కవిమిత్రుడు పి.రాజారామ్ ద్వారా ఆ శిల్పితో నల్లరాతి నంది విగ్రహం తయారు చేయించాం. అది 1994 ఆగష్టు 5న ఆకాశవాణి అనంతపురం కేంద్రం లో కార్యాలయం ఎదుట, తోట మధ్యలో సిద్ధమైంది చక్కగా. ఆ రోజు డా.పి.రమేష్ నారాయణ, నేను కలిసి తీయించుకున్న ఫోటో గురించి ఈ వ్యాసం ప్రారంభంలో పేర్కొన్నాను.
Also read: ఉత్సవరథానికి ఉజ్వల సందర్భం
నిజానికి 1994 సంవత్సరం అనంతపురం ఆకాశవాణిలో నా వరకు మహత్తరమైన సందర్భం. కార్యక్రమాల గురించి మాత్రమే కాక , ప్రాంగణపు పరిసరాలను అందంగా, అర్థవంతంగా మలచుకోవడానికి దృష్టి పెట్టాను. బళ్ళారి రాఘవ, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ, శ్రీకృష్ణదేవరాయలు (కలంకారి చిత్రాలు) లేపాక్షి ఎంపోరియం ద్వారా మిత్రులు నాగభూషణం సాయంతో తయారు చేయించాం. ఆఫీసులోకి వెళ్ళగానే కుడివైపు తల ఎత్తగానే కనబడేలా ఈ చిత్రాలు ఏర్పాటు చేయించాం.
ఉదయపు సంచికా కార్యక్రమం ‘లేపాక్షి’
కళాకారులు లోపలికి రాగానే తొలుత మెట్లు ఎక్కి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ లను కలుస్తారు. మధ్యలో మలుపు తిరిగే చోట ఆరడుగులు చదరపు వైశాల్యం ఉండో స్థలంలో అనంతపురం జిల్లా – రాయలసీమ జిల్లాల్తో కర్నాటక ప్రాంతాలు కూడా ఉండేలా మ్యాపు చేయించగలిగాం. ఈ మ్యాపు చూస్తుంటే కార్యక్రమాల పరంగా బోలెడు ఆలోచనలు స్ఫురించేవి. దీనికి అప్పటి స్టేషన్ ఇంజనీరు కె.ఎస్.శాస్త్రి చేసిన దోహదం కూడా బహుదొడ్డది!
మళ్ళీ 2002-2004 మధ్యకాలంలో అనంతపురం ఆకాశవాణిలో పనిచేశాను. యాంత్రోపాలజి, హిస్టరి, సోషల్ వర్క్ ఇష్టపడే ఎస్.హెచ్. అంజనప్ప అసిస్టెంట్ డైరెక్టరుగా ఉండేవారు. కనుకనే జిల్లా చారిత్రక స్థలాలైన రత్నగిరి, హేమావతి వంటి పేర్లను రైతుల కార్యక్రమానికి, ఉదయపు సంచికా కార్యక్రమానికి నామకరణం చేయగలిగాం. ఇంకో సందర్భంలో మధ్యాహ్నం 12.40కు ఓ అరగంట తెలుగు కార్యక్రమం ప్రారంభించినపుడు దానికి ‘లేపాక్షి’ అని నామకరణం చేసి, విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ఆ పాటను తెప్పించి పల్లవిని సిగ్నేచర్ ట్యూన్ గా వాడటం మొదలుపెట్టాం!
ఇదీ మా…. లేచి వచ్చిన లేపాక్షి బసవడి కథా, కమామిషు!
Also read: వెళ్ళలేనిచోటే లేని రెక్కల గుర్రం!
—డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్: 9440732392